Sunday, January 22, 2017

చాణుక్యుడు ఎవరు?


చాణుక్యుడు ఎవరు?




సాహితీమిత్రులారా!



చాణుక్యుడు తెలియనివారు లేరు కదా!
చాణుక్యుడు ఎవరు అని ప్రశ్నించారేమిటి?
అని సందేహించ పనిలేదు ఆయన గురించి
వాస్తవ విషయాలలోకెళితే
మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి -
వాటిని ఇక్కడ చూద్దాం-

చాణుక్యుడు ఒక అద్భుతరాజనీతిజ్ఞుడు.
మగధదేశాన నందవంశ నిర్మూలన
మౌర్యసామ్రాజ్య స్థాపన చేసి రాజనీతి
విషయకమైన ఒక గొప్ప గ్రంధాన్ని
అర్థశాస్త్రం పేరున మనకు అందించినవాడు.
తన అర్థశాస్త్రం చివర తనను గురించి
ఈ విధంగా వ్రాసుకున్నాడు చూడండి-

యేన శాస్త్రం చ శస్త్రం చ నందరాజ చ భూః
అమర్షే ణోద్ధృతాన్యాశు తేన శాస్త్రం మిది కృతమ్
                                                           (కౌటిల్యుని అర్థశాస్త్రం - 15- 1 - 180)

(దుష్టులైన నందరాజుల చేతిలో చిక్కిన పృథివిని,
శస్త్రములను, శాస్త్రములను విడిచిన ఆచార్య
చాణుక్యుని ద్వారా ఈ గ్రంథం రచింపబడెను.)

హేమచంద్రుని అభిదాన చింతామణిలో ఈయనను
గురించి ఈయనకు ఈ క్రింది నామాంతరములు
ఉన్నట్లు పేర్కొన్నాడు-

1. వాత్సాయనుడు, 2. మల్లనాగుడు, 3. కుటిలుడు, 
4. చణకాత్మజుడు, 5. ద్రామిలుడు, 6. పక్షిస్వామి,
7. విష్ణుగుప్తుడు, 8. అంగులుడు
(అభిదాన చింతామణి 853, 854)

ఈయనకు ఇన్ని పేర్లున్నా తండ్రి పెట్టిన పేరు
విష్ణుగుప్తుడు. చణకుని కుమారుడు కావున లేదా
మిక్కిలి కుశాగ్రబుద్ధి కలవాడగుటచే అత్యంత
చతురుడనే అర్థం వచ్చే చాణుక్యుడు అనే పేరు
చెప్పబడుతున్నది. కౌటిలీయ అర్థశాస్త్రంలో
కౌటిలుడనే పేరు చాలా చోట్ల వాడబడింది
ఇది బహుశా గోత్రనామం కుటిల పేరుతో
కౌటిల్యుడు అనేపేరు వచ్చిందికాని కుటిల
స్వభావంతో కౌటిల్యుడు కాదు అని
మహామహోపాధ్యాయ గణపతి శాస్త్రిగారు పేర్కొన్నారు.

చాణుక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో
విద్యాభ్యాసం జరిగింది. ఆయన జన్మస్థలం
ఖచ్చితమైనది తెలియదు తక్షశిల పాకిస్తాన్
లోని పంజాబుకు సమీపంలోని ఝేలం గ్రామంలో
ఉన్నందున ఈయన కూడ ఆ ప్రాంతంలోనే జన్మించి
ఉంటాడని భావిస్తున్నారు.

ఈయన ఇంటిని విశాఖదత్తుడు ముద్రారాక్షసం(3-15)లో
ఈ విధంగా వర్ణించాడు -

ఉపలశకల మేతద్ భేదకం గోమయానాం
వటుభి రుపహృతానాం బర్హిషాం స్తోమ ఏషః
శరణమపి  నమిద్భిహిః శుష్యమాణాభిర్
వినమిత పటలాన్తం దృశ్యతే జీర్ణకుడ్యమ్ 

చాణుక్యుని పాకలో ఒకవైపు పిడకలను పగులగొట్టు ఱాయి,
మరొకచో శిష్యులు తెచ్చిన దర్భలు, కప్పుపైన ఎండుటకు
ఆరబెట్టిన సమిధలు ఉన్నాయి. ఆ సమిధల బరువుకు
ఇంటి కప్పు వంగి ఉంది. అలాంటి ఇంట్లో చాణుక్యుడు
ఉండేవాడు. ఒకమారు ఒక విదేశరాయబారి ఈ ఇంటిని చూచి
ఇంత పెద్ద రాజ్యానికి ప్రధానమంత్రి ఇటువంటి పాకలో ఉండటమా-
అని అనగా చాణుక్యుడది విని ఈ విధంగా అన్నాడట-

ఏ దేశంలో ప్రధానమంత్రి పాకలో ఉంటాడో
ఆ దేశవాసులు సుందర భవనాల్లో ఉంటారు.
ఏ దేశప్రధానమంత్రి ఆకాశాన్నంటే సౌధాల్లో
ఉంటాడో ఆ దేశ ప్రజలు గుడిసెల్లో మగ్గుతుంటారు.
అన్నాడట.

ఆంగ్లేయుల లెక్కప్రకారం క్రీ.పూ. 322 లేక 325
సంవత్సరాలకు పూర్వం మౌర్య చంద్రగుప్తుడు
ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ కాలంలోనే ఈయన
ఉన్నట్లు చెబుతారు.

ఈయన బ్రాహ్మణుడే కాని ప్రతిదినము లోభుల
ఇండ్లకు వెళ్ళి యాచించు బ్రాహ్మణుడు కాదు.
రాజ్యనాశము, రాజ్యనిర్మాణముచేయు బ్రాహ్మణడు
స్వాభిమానియైన తపస్వి, నల్లగా ఉండి కురూపిగా
ఉండటం వల్ల  ఒకమారు శ్రాద్ధక్రియకు పిలువబడి
తిరస్కృతుడై  పంక్తి నుండి బహిష్కృతుడై ఆ అవమానంతో
క్రుద్ధుడై నందుని రాజ్యభ్రష్టుని చేసి నందవంశాన్నే
సమూలంగా నాశనం మౌర్యసాంమ్రాజ్య స్థాపనము చేసినవాడు.

ఈయన కేవలము కౌటిలీయ అర్థశాస్త్రమేకాదు
మరి కొన్ని రచనలు చేశారు ఆ రచనలు-

1. వృద్ధచాణక్య -
   ఇందులో 8 అధ్యాయాలు, 108 శ్లోకాలున్నాయి.

2. చాణక్యనీతిశాస్త్రము-
   ఇందులో 108 శ్లోకాలున్నాయి

3. చాణక్యసారసంగ్రహము-
   దీనిలో 300 శ్లోకాలున్నాయి.

4. లఘుచాణక్య -
   ఇందులో 8 అధ్యాయాలు, 91 శ్లోకాలున్నాయి

5. చాణక్య రాజనీతిశాస్త్రము-
   ఇదే అర్థశాస్త్రమని పేరున్నది.
   దీనిలో 8 అధ్యాయాలు 512 శ్లోకాలున్నాయి

(ఇది చాణక్య నీతి దర్పణము
 జగదీశ్వరానంద్ తెలుగు అనువాదం
 నుండి సేకరించబడింది)





No comments:

Post a Comment