Tuesday, January 24, 2017

కుమారసంభవంలోని గ్రీష్మము -1


కుమారసంభవంలోని గ్రీష్మము -1




సాహితీమిత్రులారా!

నన్నెచోడుని కుమారసంభవంలో
6వ ఆశ్వాసం 134వ పద్యంతో
ప్రారంభమవుతుంది గ్రీష్మము-
ఇటువంటి దానిలో పార్వతీదేవి
తపస్సును వర్ణించాడు నన్నెచోడుడు-

స్పురదురుదావపావకము, శోషితసింధుచయోదకంబు, సం
హరితపతంగసంఘ, మసమర్థితమార్గిగణంబు, దప్తభూ
మిరుహకులంబు, వర్ధితసమీరవిదాహ, మశేషదగ్ధ భూ
ధరనికరంబునాఁ బటునిదాఘము పర్వె భయంకరాకృతిన్
                                                                                        (134)

బాగా పెరుగుతున్న గొప్ప దావాగ్ని కలిగినది,
ఎండింపబడిన నదీసమూహజలముగలది,
చంపబడిన పక్షులగుంపు గలది,
అశక్తులుగా చేయబడిన పాంథు(బాటసారు)ల గుంపుకలది,
తపింపచేయబడిన చెట్లసమూహముగలది,
వృద్ధిపొందిపబడిన గాలుల వేడిగలది,
దహింపబడిన యెల్ల పర్వతముల సమూహముగలది,
అనునట్లు తీక్షణమైన వేసవి భయంకరాకారముతో వ్యాపించినది.


తలఁచిన డెందము గందును
బలికిన నోరెల్లఁ బొక్కుఁ బ్రభ సూచిన రె
ప్పలు గమరు ననఁగఁ బటుతర
నిలయానలభాతి నెండ వేసవిఁ గాఁచెన్ (135)

అనుకుంటే హృదయం తపిస్తుంది,
మాట్లాడితే నోరంతా బొబ్బలెక్కతాయి,
వెలుతురు చూస్తే కనురెప్పలు కాల్తాయి-
అన్నంత తీవ్రతరమైన ప్రళయాగ్నివలె
ఎండ వేసవిలో తపిపచేసింది.

స్పురదారణ్యమహీధరోపరిసముద్భూతోగ్రదావానలో
త్కరవిస్పారశిఖాలిఁగూడి రవికాంతవ్రాతసంజాతదు
స్తరతీవ్రాగ్నిఁ బెనంగి వీచె వడ యాసంక్రుద్ధకాలాగ్ని రు
ద్రరయో చ్ఛ్వాససమేతమో యని జనవ్రాతంబు గంపింపఁగాన్(136)

ప్రకాశిస్తున్న అడవిలోని కొండలపై పుట్టిన కార్చిచ్చుల ప్రకాశముల
జ్వాలల వరుసతో కలిసి, సూర్యకాంతశిలలనుండి పుట్టిన దటడానికి
వీలుకాని తీక్ష్ణమైన అగ్నితో కూడి, మిక్కిలి కోపించిన ప్రళయాగ్ని
అనెడు రుద్రుని వేగవంతమైన ఉశ్చ్వాసముతో కూడినదా! అని
లోకులు కంపించే విధంగా వడగాల్పులు వీచాయి.

ఉరునిదాఘాతపాహతిఁ గరులతలలు
వ్రస్సి లోపల ముత్యముల్ వరుస విరిసి
మంగలములోని ప్రేలలభంగిఁదూలి
ప్రేలివడఁగాసెఁ గట్టెండ పిడువరించి (137)

ఇటువంటి ఎండ దెబ్బకు ఏనుగుల తలలు బద్గలై
వాటి తలల్లోని ముత్యాలు చెదిరి పెన్నంలో పడి
పేలాల వలె కదలుతూ పేలినట్లు తీక్ష్ణమైన ఎండ
పిడుగువలె అతిశయించి కాసింది.


No comments:

Post a Comment