గతిమధ్యస్తన కుంతల స్తబక............
సాహితీమిత్రులారా!
తెనాలిరామకృష్ణుని పాండురంగమహాత్మ్యంలోని
నిగమశర్మోపాఖ్యానములోని ఈ పద్యం చూడండి-
ఒక కాపుకోడలి వర్ణన-
గతిమధ్యస్తన కుంతలస్తబకవీక్షాగర్వదుర్వార యీ
సతిచే మానమె యూనమయ్యె నిఁక నిస్సారంపుఁ బ్రాణంబు దా
ల్చు తగుల్ గాదని రోసి యావృషలివాలుందూపుఁగ్రొమ్మంట కా
హుతియౌ బర్హిమృగేంద్రకుంభిచమరీయూధంబు నేణంబులున్
(పాండురంగమాహాత్మ్యము -3- 86)
నడక, నడుము, కుచములు, జుట్టు, చూపులు - అనువానిచే
కలిగిన గర్వము వారింపరానిదగు ఈ స్త్రీ వలన మన మర్యాదయే
తగ్గిపోయినది సారములేని జీవితము ధరించాలనుకోవడం తగదు
అని ఏవగించుకొని నెమలి, సింహము, ఏనుగు, చమరీమృగముల
గుంపు జింకలును ఆ శూద్రస్త్రీ యొక్క వాడియైన బాణముల వలని
అగ్నిజ్వాలలకు కాలి చనిపోవును - అని భావం.
ఆమె నడక నెమలి నడకలు, నడుము సింహమునడుము,
స్తనములు కరికుంభములు, జుట్టు చమరీమృగవాలము,
చూపులు ఏణము(జింక)ల చూపులు అని కవి వర్ణిస్తున్నాడు.
ఆమె వాటినన్నిటిని వేటాడుచున్నదని భావము.
No comments:
Post a Comment