Sunday, January 8, 2017

బుజ్జగించుచు మెల్లన సెజ్జఁజేర్చి


బుజ్జగించుచు మెల్లన సెజ్జఁజేర్చి
సాహితీమిత్రులారా!

శొంఠి భద్రాద్రిరామశాస్త్రి గారి
శంతనూపాఖ్యానములోని
ఈ పద్యం చూడండి
చెలికత్తెలు నాయికకు మొదటిరోజు
రాత్రి భర్తదగ్గర ఎలా మెలగాలో చెబుతున్న పద్యం-

ధవుఁడు డగ్గఱిలంగ దవ్వేఁగెదవు సుమ్మ
          భీరుత్వమింతుల తీరటంచు
సరసోక్తులాడంగ సంశయించెదు సుమ్మ
          మితభాషణము దగు మెలఁత కనుచుఁ
జేఁతకు మరుచేఁతఁ జేయకుండెడు సుమ్మ
          మార్ధవంబు చితంబు మగువ కనుచుఁ
జెలరేఁగి పైఁబ్రక్కఁజేరఁ గొంకెడు సుమ్మ
          వ్రీడ యలంకృతి వెలఁది కనుచు
నతఁడు మృదుశీలుఁడౌట నిన్నలయఁజేయఁ
డటులఁగాకున్న మమ్మపు డందు గాక
రమ్మనుచు నేర్పు మీఱఁగరమ్ముఁబట్టి
బుజ్జగించుచు మెల్లన సెజ్జఁజేర్చి
                                                       (శంతనూపాఖ్యానము - 3 - 175)


భర్త దగ్గరకు వస్తే
నీవు పిరికితనం స్త్రీలకు సహజం
అనుకొని దూరంగా వెళ్ళిపోయేవు సుమా!
అలా వెళ్ళిపోకూడదు.

భర్త ప్రేమవచనాలు మాట్లాడుతాడు
నీవు స్త్రీకి మితభాణము తగినది అని
మాట్లాడటానికి సందేహపడతావేమో
సందేహపడకూడదు. మాట్లాడాలి సుమా!

భర్త ఏదైనా ఒక చిలిపిచేష్ట చేస్తాడు.
స్త్రీలకు మెత్తగా ఉండటమే తగినదనుకొని
దానికి స్పందించకుండా ఉంటావేమో
అలా ఉండకూడదు.
స్పందించి మరుచేత చేయాలి సుమా!

భర్త విజృంభించి మంచం మీద నీ ప్రక్కకు
చేరాడనుకో. అపుడు స్త్రీకి సిగ్గే అలంకారమనుకొని
సంశయించేవు సుమీ. ప్రతి స్పందించాలి సుమా!

అతని స్వభావం చాలా మెత్తనిది నిన్ను శ్రమపెట్టడు.
అలా కాకపోతే మమ్మల్ని రేపు అందువుగానీలే - రా
అంటూ మంచి నేర్పుగా నాయిక చెయ్యి పట్టుకొని
బుజ్జగిస్తూ మంచంమీదకు చేర్చారు.

ఎంత మంచి చెలికత్తెలండీ వీరు

No comments:

Post a Comment