భక్తి అంటే ఏమిటి? - ముక్తి అంటే ఏమిటి?
సాహితీమిత్రులారా!
భక్తి అంటుంటాము కదా !
భక్తి అంటే ఏమిటి?
మనసా వాచా కర్మణా భగవంతుని
సేవించటాన్ని భక్తి అంటున్నారు పెద్దలు
నారదపాంచరాత్రమున ఈ శ్లోకం చెప్పబడింది-
అనన్య మమతా విష్ణౌ మమతా ప్రేమ సంగతా
భక్తిరిత్యుచ్యతే భీష్మ ప్రహ్లాదదోద్దవనారదైః
- అంటే నిరతిశయ ప్రేమభావముతో కూడిన ఉత్తమమతమే
భక్తి అని భీష్మ, ప్రహ్లాద, ఉద్దవ, నారదుల మతము(అభిప్రాయము)
ఆదిశంకరులు వివేకచూడామణిలో-
స్వస్వరూపనుసంధానం భక్తిరిత్యభిధీయతే - అన్నాడు
(తన ఆత్మస్వస్వరూపముతో ఐక్యం చెందడమే భక్తి)
మధ్వచార్యులు -
పునర్విశ్లేషభీరుత్వం పరమాభక్తిరుచ్యతే
(విడిచిపోవుటకు భయపడుట -
అంటే సర్వాధిక ప్రేమభావమే భక్తి)
భగవద్రామానుజాచార్యులు-
పరానురక్తీశ్వరే, సాత్వస్మిన్ పరమప్రేమరూపా
(ఎట్టి ప్రతిబంధకములైననూ
లొంగని నిరంతర ప్రేమ ప్రవాహమే భక్తి)
మరి ముక్తి అంటే ఏమిటి -
అవిద్యానిర్మగ్నుడైన మానవుడు సంసారచక్రములో
జరామరణశీలుడై నిరంతరం దుఃఖం అనుభవిస్తున్నాడు.
దాని నుండి శాశ్వత ఆనంద సంధాయక స్థితిని
పొందటాన్నే ముక్తి లేక మోక్షం అంటారు
ముక్తి అంటే ఆళ్వారుల మాటల్లో -
ప్రకృతి బంధవిముక్తుడై ఆనంద ప్రాప్తిని
అందటాన్నే మోక్షం. అలాంటి ఆనంద
ప్రాప్తిని పొందగల్గిన సాధకుడు మిక్కిలి ధన్యుడు
భగవద్రామానుజులు -
భక్తిరూపజ్ఞానమే మోక్షం - అంటున్నాడు.
కర్మ, జ్ఞాన, భక్తియోగములలో భక్తి ఉత్తమమని
అదే సులభమోక్షసాధకమని దానినే
మోక్షసాధన సామగ్ర్యాం భక్తిరేవగరీయసీ - అని వివేకచూడామణిలో శంకరభగవత్పాదులు బోధించారు.
వీటన్నిటిని బట్టి ముక్తికి మొదటి మెట్టు భక్తి
భక్తి మోక్షసాధకము
మరి భక్తి ఎట్లా సాధించటం అంటే
భక్తి తొమ్మిది రకాలు -
శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనమ్
అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మనివేదనమ్
(శ్రీమద్భాగవతమ్ 7-5-23)
1. శ్రవణం - భగవంతుని గూర్చి వింటూండం.
2. కీర్తనం - భగవంతుని కీర్తిస్తూండడం(పొగడుతూండడం)
3. స్మరణం - భగవంతుని స్మరిస్తూండడం
4. పాదసేవనం - మనసులో భగవంతిని పాదాలను
నిలుపుకొని సదా పాద ధ్యానంలో ఉండడం
5. అర్చనం - అర్చనానికి పర్యాయపదం పూజ. అంటే
పూజచేస్తూండడం
6. వందనం - దీనికే అభివాదనమని, స్తుతి అని పేరు.
భగవంతునికి నమస్కరించటం
7. దాస్యము - త్రికరణశుద్ధికల సేవే దాస్యము
8. సఖ్యము - స్నేహభావాన్నే సఖ్యం అంటారు
అర్జునుని భక్తి దీనికి ఉదాహరణ
9. ఆత్మనివేదనం - సంపూర్ణవిశ్వాసంతో భగవంతునికి
శరణాగతి చేయడమే ఆత్మనివేదన
వీటిలో దేనినైనా లేక కొన్నింటిని ఆచరించిన
ముక్తిని పొందవచ్చునంటారు పెద్దలు.
No comments:
Post a Comment