సగరుముమ్మనుమండు తపము గైకొనినచోటు
సాహితీమిత్రులారా!
పెద్గనగారి ప్రవరుడు హిమవత్పర్వత
ప్రాంతంలో తిరుగుతూ చూస్తూ వెళుతూ
ఈ విధంగా ఊహించుకున్నాడట -
నిడుదపెన్నెఱిగుంపు జడగట్ట సగరుము
మ్మనుమండు తపము గైకొనినచోటు
జరఠకచ్ఛపకులేశ్వరువెన్ను గాన రా
జగతికి మిన్నేఱు దిగిన చోటు
పుచ్చడీకతనంబు పోఁబెట్టి గిరికన్య
పతిఁగొల్వ నాయాసపడినచోటు
వలరాచరాచవారలికాక్షుకనువెచ్చఁ
గరఁగిన యలకనికరపుఁజోటు
తపసియిల్లాండ్రచెలువంబుఁ దలఁచి తలఁచి
మున్ను ముచ్చిచ్చును విరాళి గొన్నచోటు
కనుపపులు వేల్పుఁబడవాలుఁ గన్నచోటు
హర్షమునఁ జూచి ప్రవరాఖ్యుఁడాత్మలోన
(మనుచరిత్ర - 2 - 9)
నిడుదపెన్నెఱిగుంపు జడగట్ట సగరుము
మ్మనుమండు తపము గైకొనినచోటు
సగర చక్రవర్తి ముని మనుమడు భగీరథుడు తన పొడవైన
వెండ్రుకలు అట్టలు కట్టగా తపము ఆచరించిన చోటు.
జరఠకచ్ఛపకులేశ్వరువెన్ను గాన రా
జగతికి మిన్నేఱు దిగిన చోటు
పాతాళములోని ఆదికూర్మము వీపు కనబడేవిధంగా
(అంత లోతుగా) ఆకాశగంగ భూమిని దిగిన చోటు.
పుచ్చడీకతనంబు పోఁబెట్టి గిరికన్య
పతిఁగొల్వ నాయాసపడినచోటు
పార్వతీదేవి పతిగా పరమేశ్వరుని పొందటానికి
తెగించి తపమాచరించిన చోటు
వలరాచరాచవారలికాక్షుకనువెచ్చఁ
గరఁగిన యలకనికరపుఁజోటు
మన్మథుడు శివుని కంటి మంటచే
బూదియైన దయనీయమైన చోటు
తపసియిల్లాండ్రచెలువంబుఁ దలఁచి తలఁచి
మున్ను ముచ్చిచ్చును విరాళి గొన్నచోటు
సప్తర్షు భార్యల అందాన్ని తలచి తలచి అగ్నిదేవుడు
మోహము పొందిన చోటు
కనుపపులు వేల్పుఁబడవాలుఁ గన్నచోటు
దేవతల సేనాని కుమారస్వామిని గన్న ఱెల్లు గడ్డి ఉన్నచోటు
హర్షమునఁ జూచి ప్రవరాఖ్యుఁడాత్మలోన
వీటినన్నిటిని మనసులో అనుకొంటూ ఉన్నాడు ప్రవరుడు.
No comments:
Post a Comment