Thursday, December 29, 2016

ఇట్టి దివ్యాన్నములుమెచ్చునే శివుండు


ఇట్టి దివ్యాన్నములుమెచ్చునే శివుండు




సాహితీమిత్రులారా!


శ్రీనాథుని హరవిలాసంలో హిమవంతుడు
శివుని ఆకారాన్ని వెక్కిరిస్తూ పార్వతికి
చెప్పిన చమత్కార పద్యం -

తలమీద చదలేటి దరిమీల దినజేరు 
        కొంగలు చెలగి కొంకొంగురనగ
మెడదన్ను పునుకుల నిడుపేరు లొండొంటి
        బొరిబొరి దాకి బొణ్బొణుగురనగ
గట్టిన పులితోలు కడకొంగు సోకి యా
        బోతు తత్తడి చిఱ్ఱుబొఱ్ఱుమనగ
గడియంపు బాములు కకపాలలో నున్న
        భూతి మై జిలికిన బుస్సురనగ
దమ్మిపూజూలి పునుక కంచమ్ము సాచి
దిట్ట తనమున బిచ్చము దేహి యనుచు
వాడవాడల భిక్షించు కూడుగాని
యిట్టి దివ్యాన్నములుమెచ్చునే శివుండు

శివుడు బిక్షకు వెళ్ళే సమయంలో ఎంత గోలగోలగా
ఉంటుందో వర్ణించిన పద్యం ఇది-


తలమీద చదలేటి దరిమీల దినజేరు 
        కొంగలు చెలగి కొంకొంగురనగ

తలమీది ఆకాశగంగలో ఉన్న దరిమీనులనే
చేపలను తినడానికి  కొంగుకొంగుమనే శబ్దం చేస్తూ
కొంగలు మూగి ఉన్నాయి.

మెడదన్ను పునుకుల నిడుపేరు లొండొంటి
        బొరిబొరి దాకి బొణ్బొణుగురనగ

మెడలోని పుఱ్ఱెలమాల, శివుడు కదులుతూంటే
ఒకదానికొకటి తగులుకొని
బొణుగూ బొణుగూ అనే శబ్దం చేస్తున్నాయి.

గట్టిన పులితోలు కడకొంగు సోకి యా
        బోతు తత్తడి చిఱ్ఱుబొఱ్ఱుమనగ
కట్టుకున్న పులితోలుకొంగు చివర, శివుడు ఎక్కిన
నందిని తాకుతూ ఉంటే అది చిఱ్ఱుబుఱ్ఱు లాడుతూంది.

గడియంపు బాములు కకపాలలో నున్న
        భూతి మై జిలికిన బుస్సురనగ
చేతికి కడియాల్లా కట్టుకున్నపాములు
చేతిలో ఉన్న బ్రహ్మకపాలంలోని విభూది
తుళ్ళి పడినపుడల్లా బుస్సుబుస్సు మంటున్నాయి.

దమ్మిపూజూలి పునుక కంచమ్ము సాచి
దిట్ట తనమున బిచ్చము దేహి యనుచు
వాడవాడల భిక్షించు కూడుగాని

బ్రహ్మకపాలం చేత పట్టుకొని
వీధివీధి తిరిగి  బిచ్చమెత్తుకుంటాడు

యిట్టి దివ్యాన్నములుమెచ్చునే శివుండు
అటువంటి శివుడికి ముష్టెత్తుకున్నకూడు తప్ప
మనం పెట్టే దివ్యాన్నాలు రుచిస్తాయా - అని భావం.


ఈ పద్యం లో ఎక్కువపాలు
తెలుగు పదాలే వాడాడు శ్రీనాథుడు
అదేకాక ధ్వన్యనుకరణ
నాలుగుపాదాల్లో కనిపిస్తుంది
ఎంత చమత్కారంగా
ఎంత వ్యంగ్యంగా వర్ణించాడో కదా!

No comments:

Post a Comment