Saturday, December 10, 2016

కృష్ణుని సేవింప వచ్చిన శివుడా!


కృష్ణుని సేవింప వచ్చిన శివుడా!




సాహితీమిత్రులారా!


పింగళి సూరన కృత
ప్రభావతీ ప్రద్యుమ్నము నందలి
ఈ ఉత్ప్రేక్ష చూడండి-

ఇంద్రునికి ఆయన రథసారథి మాతలి ద్వారకా
పట్టణంలోని ఉద్యానవనం చూచి
తనఱేనికి ఈ విధంగా చెప్పుచున్నాడు-

కలధౌతకేళినగంబుగాఁ బోలును
         దనరుచున్నది శంభుతనువులీల
ఘనపుష్పచాంపేయ వనరాజి గాబోలు
         నేలుచున్నది పులితోలు సిరుల
హరినీల సోపానసరణి గాఁబోలును 
         బగటుచున్నది నల్లపాఁపపేరుఁ
బవడంపుటలవ సౌభాగ్యంబుగాఁబోలుఁ
         జాటుచున్నది జటాజూటరుచిని
సరసిగాఁబోలుఁ గ్రాలెడు సురనదిగతి
నోడగాఁబోలుఁ బోలెడునుడుపతికళ
ననిమిషాధిప చూచితే యల్లపసిడి
కోటనడిమి శృంగారపుఁదోఁటలోన
                                       (ప్రభావతీప్రద్యుమ్నము - 1- 63)

ఓ దేవతలరాజా! ఇంద్రా!
వెండి క్రీడా పర్వతము శివుని శరీరంగాను,
పచ్చని సంపెగ చెట్లచాలు పులితోలుగను,
నీలంపు మెట్లవరుస నల్లత్రాచుల హారంగాను,
పగడాల కంచె జటాజూటంగాను,
నడుమనున్న కొలను ఆకాశగంగగను,
ఆ కొలనిలోని నావ చంద్రకళగాను,
చెప్పి, ఉద్యానవనరూపమున శ్రీకృష్ణుని
సేవింపవచ్చియున్న శివుడు కాబోలు - అని
ఉత్ప్రేక్షించినాడు కవి.

No comments:

Post a Comment