ఎవరి విషయం వారు సమర్థించుకోరా?
సాహితీమిత్రులారా!
శేషము వేంకటపతి కృత
శశాంకవిజయంలోని
ఈ పద్యాలు చూడండి-
తార శశాంకు(చంద్రు)ని తన మార్గంలోకి
తెచ్చుకోవడానికి ఇతరుల తప్పును పైకి
తెచ్చి ఈ విధంగా చెప్పింది -
బాళి మనంబునం దణఁచి, ప్రాయము వ్యర్థము చేసి, యూరకే
తూలిన నేమి పుణ్య? మని తోఁచెను, ము న్నల దారుకా వన
స్త్రీలు గిరీశునిన్ గలయరే? వ్రజ భామలు శౌరిఁ గూడరే?
యాలలనా శిరోమణుల కందున నిందున నేమి చెప్పుమా ?
మనసులో కోరికలను అణచి ప్రాయాన్ని వ్యర్థం చేసి
ఊరకే మరణిస్తే పుణ్యమవుతుందా
పూర్వం శివుడు దారుకావనంలోని స్త్రీలతో కూడలేదా
వ్రజ భామలను విష్ణువు కూడలేదా
ఆ స్త్రీలకు అందున ఇక్కడ నాకు ఏమిటో చెప్పు
కన్నకూఁతురటంచు నెన్నక భారతీ
తరుణిఁ గూడఁడె నీ పితామహుండు?
మేనత్త యను మేర మీఱి రాధికతోడ
నెనయఁడే నిన్న నీ యనుఁగు భావ?
వదినె యంచు నొకింత వావి లేకయె జ్యేష్ఠు
నెలతతోఁ బొందఁడె నీ గురుండు?
ముని పత్ని యన కహల్యను బట్టఁడే నీదు
సహపాఠి యౌ పాకశాసనుండు?
ఇట్టి మీవారి నడతలు కట్టిపెట్టి
మమ్మ నేఁజెల్ల న్యాయంబు లాడె దౌర!
కడకు నీ రంకు నీ వెఱుంగని వితాన
దూరెదవు నన్నుఁ, జలపోరి దోసకారి!
(శశాంకవిజయము - 3-80,81)
ఓ చంద్రా!
నీ పితామహుడు బ్రహ్మ కన్నకూతురని
కూడా చూడకుండా సరస్వతిని కలిశాడు.
మరి మీ బావో (కృష్ణుడు) మేనత్త అనే పరిధి
దాటి కూడలేదా?
మీ గురువుగారు (ఉతధ్యుని భార్య మమతను)వదినె అని
చూడకుండా బలవంతంగా పొందాడుకదా!
మీ సహపాఠి ఇంద్రుడు మునిపత్ని అని చూడకుండా
అహల్యను బట్టాడు కదా!
ఇలా మీవాళ్ళందరి నడతలను కట్టిపెట్టి
మమ్మనడం భావ్యమా ?
న్యాయం మాట్లాడుతున్నావా చివరకు
నీరంకు నీకు తెలియదా నన్నంటున్నావు.
ఈ విధంగా తార తన కోరికను
సమర్థించుకుంటూన్నది.
No comments:
Post a Comment