ఎదుటివారి సొమ్ము లెల్ల వారికి తీపి
సాహితీమిత్రులారా!
వేమన పద్యాలు విననితెలుగువారు
లేరనడం అతిశయోక్తి కాదనుకుంటాను.
వేమన పద్యాలలో ఆయన భావాలను
కొన్నిటిని ఇక్కడ గమనిద్దాం-
భక్తిని గురించి వేమన భావం-
భక్తి ఉన్న చోట పరమేశ్వరుండుండు
భక్తిలేని చోట పాపముండు
భక్తి కలుగు వాడు పరమాత్ముడగునయా
విశ్వదాభిరామ! వినురవేమ!
ముక్తులు అంటే ఎవరు? -
చదువులందు పాడి మొదవులందును స్త్రీల
పెదవులందు రాజ్యపదవులందు
ఆశ లుడిగినట్టి అయ్యలు ముక్తులు
విశ్వదాభిరామ! వినురవేమ!
బంగరు పొడగన్న భామల పొడగన్న
చిత్తమునను చింత సేయడేని
వాడె పరమయోగి వర్ణింప జగమందు
విశ్వదాభిరామ! వినురవేమ!
బ్రహ్మ మనగ నెటనొ పరదేశమునలేదు
బ్రహ్మ మనగ తానె బట్ట బయలు
తన్ను తానెరిగిన తానె పో బ్రహ్మంబు
విశ్వదాభిరామ! వినురవేమ!
లోభివాణ్ని చంపే ఉపాయం-
లోభివాని చంప లోకంబులోపల
మందు వలదు వేరె మతము గలదు
పైక మడిగి నంత భగ్గు పడి చచ్చు
విశ్వదాభిరామ! వినురవేమ!
సులభంగా ముక్తి దొరికే మార్గం-
ఇది వ్యంగ్యంగా చెప్పినది
గుహలలోన చొచ్చి గురువుల వెతకంగ
క్రూర మృగ మొకండు తారసిలిన
ముక్తి మార్గమదియె ముందుగా చూపురా!
విశ్వదాభిరామ! వినురవేమ!
పరులసొమ్మంటే వద్దనేదెవరు
పాల సాగరమున పవ్వళించిన వాడు
గొల్ల ఇండ్ల పాలు కోరనేల
ఎదుటివారి సొమ్మ లెల్ల వారికి తీపి
విశ్వదాభిరామ! వినురవేమ!
No comments:
Post a Comment