తనకోపమె తనశత్రువు (భావానుకరణ)
సాహితీమిత్రులారా!
మనకు సుమతీ శతకంలోని ఈ పద్యం
సుపరిచితమే దీనికంటే ముందే నన్నయ
భారతంలో ఇదే భావంతో పద్యం ఉండటం విశేషం.
ఆ పద్యం -
పరీక్షిన్మహారాజు వేటకు వెళ్ళినపుడు
వేటలో బాణపుదెబ్బతగిలిన లేడిని వెదుకుతూ
శమీక ముని ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న
మునిని ఆ లేడిని గురించి అడిగాడు
తపస్సమాధిలో ఉన్న ముని ఎంతకూ పలుకకపోగా
కోపించి అక్కడే దూరంగా చచ్చిపడిఉన్న పాముని తెచ్చి
ముని మెడలో వేసి వెళ్ళాడు. అతడు వెళ్ళిన తరువాత
ఆమునికిమారుడైన శృంగి వచ్చి తన తండ్రి మెడలో
పాముని చూచి కుపితుడై శపించాడు.
తండ్రి సమాధినుండి లేచిన తరువాత
శాపమిచ్చిన సంగతి తెలిపాడు.
అప్పుడా ముని కుమారునితో
తొందరపడ్డావునాయనా అని బాధపడి,
కొడుకుతో పలికిన మాటల్లోని ఈ పద్యం చూడండి-
క్రోధమ తపముం జెరచును
క్రోధమ యణిమాదులైన గుణముల బాపుం
గ్రోధమ ధర్మక్రియలకు
బాధ యగుం, గ్రోధిగా దపస్వికి జన్నే
కోపము తపస్సును చెడగొడుతుంది.
కోపమే అణి, గరిమ, లఘిమాది అష్టసిద్ధులను
పోగొడుతుంది. కోపమే ధర్మంతో కూడిన కార్యాలకు
బాధ కలిగిస్తుంది. కావిన తపస్సుచేసే మునికి
కోపము తగునా - అని భావం.
క్షమలేని తపసి తనమును
బ్రమత్తు సంపదయు ధర్మబాహ్య ప్రభురా
జ్యము భిన్నకుంభమున తో
యములట్టుల యధ్రువంబు లగు విని యెల్లన్
(శ్రీమదాంధ్రమహాభారతము -1-2-172,173)
ఓర్పులేని ముని తపస్సూ,
ప్రమాదపడేవాని ధనమూ,
ధర్మంనుండి తొలగిన రాజు రాజ్యమునూ,
ఇవన్నీ బద్దలయిన కుండలోని వలె
అస్థిరములవుతాయి - అని భావం
వినిలోని భావాన్ని తరువాతి కాలంలో
సుమతీశతకకారుడైన బద్దెనకు క్రింది పద్యానికి
ఒరవడి దిద్దనదని పండితుల అభిప్రాయం-
తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!
No comments:
Post a Comment