శ్రీకరంబగు నాకమలాకరంబు
సాహితీమిత్రులారా!
ఒక సరస్సును నన్నెచోడు కుమారసంభవములో
స్త్రీవలె వర్ణించిన తీరు
ఈపద్యంలో ఎంత రమ్యంగా వర్ణించాడో
పరికించండి.
లోలాంబుజాలముల్ నీలాలకములుగా
బాలమృణాలముల్ కేలు గాఁగ
దళితాంబుజాతంబు దెలిమోముగా నుత్ప
లములు విశాలనేత్రములు గాఁగ
జక్కవకవ నిండుచనుఁగవగాఁ బులి
నస్థల మురుజఘనంబు గాఁగ
మొలచు లేఁదరఁగలు ముత్తరంగలు గాఁగ
శోభిల్లుసుడి నిమ్ననాభి గాఁగ
నబ్జవనలక్ష్మి శంభువీర్యమునఁ గొడుకుఁ
బడసి దివిజుల కీఁబూని పావకునకు
నొలసి తనరూపుచూపున ట్లొప్పు దోఁచె
శ్రీకరంబగు నా కమలాకరంబు
(10-29)
ఈ పద్యం శివుని వీర్యాన్ని శరవణమను సరస్సులో,
బ్రహ్మ ఆదేశానుసారం అగ్నిదేవుడు వదలడానికి
వెళ్ళే సమయంలో సరస్సును వర్ణించినది.
భావం-
శోభాకరమైన ఆ పద్మాకరము
చంచలములగు నీరుల సమూహములు నల్లని కురులుగను,
లేత తామరతూడులు చేతులుగను,
వికసించిన పద్మము నిర్మలమైన ముఖముగను,
కలువలు విశాలమైన నయనాలుగాను,
చక్రవాకద్వయము నిండు స్తనద్వయముగను,
ఇసుకతిన్నె గొప్ప కటిస్థలముగను,
అప్పుడే పుడుతున్న లేత అలలు పొట్టమీది ముడుతలు(త్రివళులు)గా,
ప్రకాశించే సుడి లోతైన నాబిగా
తామరతోపు అనెడి లక్ష్మి
శివుని వీర్యంచే కొడుకును పొంది
దేవతలకు ఇచ్చేందుకు పూని
అగ్నికి సమీపించి తనరూపును
చూపుచున్నదా!
అన్నట్లు ఒప్పినది.
No comments:
Post a Comment