Saturday, June 11, 2016

భారతామృతముఁ గర్ణపుటంబులనారఁ గ్రోలి


భారతామృతముఁ గర్ణపుటంబులనారఁ గ్రోలి


సాహితీమిత్రులారా!

నన్నయ మహాభారతంలో తన రచనను గురించి
ఈవిధంగా చెప్పుకున్నాడు.

సారమతిం గవీంద్రులు ప్రసన్న కథాకలితార్థ యుక్తిలో
నారసి మేలు నా నితరు లక్షరరమ్యత నాదరింప నా
నారుతార్థసూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా
భారతసంహితారచనబంధురుఁడయ్యె జగద్ధితంబుగాన్
                                                                                  (1-26)
(కవిపుంగవులు ప్రశస్తమైన బుద్ధితో ప్రసాదగుణంతో కూడిన కథలందును,
కవిత్వమందును గల మనోహరాలైన అర్థాలతోడి కూడికను లోపల
తరచి తరచి గ్రహించి బాగుబాగు అని ప్రశంసిచగా సామాన్యుల చెవులకు విందు
చేకూర్చే అక్షరాలకూర్పలోని సౌందర్యాన్ని మెచ్చుకోగా
హృద్యమైన అర్థాలతో అనేకవిధాలైన రమణీయార్థ
ప్రతిపాదకాలైన సుందరకవితాభివ్యక్తులకు నిధానమైన
నన్నయభట్టు లోకానికి శ్రేయస్సుకలిగేట్లు మహాభారతం
అనే వేదాన్ని రచించటంలో ఒప్పిదమైనాడు.)

మరి తిక్కన ఈ విధంగా తన కవిత్వం ఉంటుందని
విరాటపర్వం (1-30)లో చెప్పుకున్నాడు.

కావున భారతామృతముఁ గర్ణపుటంబులనారఁ గ్రోలి యాం
ధ్రావళి మోదముం బొరయునట్లుగ సాత్యవతేయ సంస్కృతి
శ్రీ విభవాస్పదం బయిన చిత్తముతోడ మహాకవిత్వ దీ
క్షావిధి నొంది పద్యముల గద్యములన్ రచియించెదన్ కృతుల్

(అందువలన - ఆంధ్రులందరూ మహాభారతమనే అమృతాన్ని
చెవులనే దొప్పలతో  తనివితీరా త్రాగి, ఆహ్లాదాన్ని పొందేట్లుగా -
వ్యాసమహర్షి భావనమనే సంపదయొక్క వైభవంతో నిండిన
మనస్సుతో భారతపర్వాలను మహాకావ్యంలో ఉండదగిన
ఉత్తమ కవిత్వంతో రచించవలెనన్న గొప్పదీక్షను పూని
నియమంతో పద్యాలలో గద్యాలలోనూ
(చంపూ రచనగా) రచిస్తాను.)

ఆ విధంగా దీక్షాకంకణబద్ధులై ఆకాలంలో కవిత్వం వ్రాసేవారు. 

No comments:

Post a Comment