నీ పుణ్యంబు సామాన్యమే?
సాహితీమిత్రులారా!
కొమాండూరు కృష్ణమాచార్యులవారు 20వ శతాబ్ది ప్రథమార్థంలో
ఉన్న పండిత కవులు. గుంటూరు వాసులు.
వారొకనాడు మండు వేసవిలో వడగాడ్పుల మధ్య తమ పొలమున్న
గ్రామానికి పోతున్నారు. త్రోవలో విపరీతంగా దప్పికైంది.
అప్పుడొక గొల్లవాడు చల్లని మజ్జిగ ఇచ్చి దాహం తీర్చాడు.
వెంటనే అతనికి పద్యాన్నిలా
బహూకరించారు
ఆచార్యులవారు.
పురజిత్పాల మహోగ్రనేత్ర జనిత స్పూర్జన్మహాగ్నిచ్ఛటా
పరుష స్పూర్తి వహించి వీచెడు మహావాతంబు ప్రాణాంకురో
త్కరమున్ మ్లానము నొందజేయ - మము తక్రంబిచ్చి రక్షించితో
పురుష గ్రామణి! గోప మాత్రుండవె! నీ పుణ్యంబు సామాన్యమే?
అన్నాడట.
ఆ గోపాలునికి ఈ పద్యం అర్థంకాలేదు.
సంస్కృత పద సమాస బంధురమైన శైలి కొమాండూరి వారిది.
వారి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.
అది గ్రహించి అర్థం చెప్పారు కవిగారు.
"త్రిపురాలను తగలబెట్టిన రుద్రుడి మూడో కంటి మంటలాగా
ఎండకాస్తున్నది. వడగాడ్పు కొడుతున్నది.
ప్రాణం అలసిపోతున్నది. ఈ స్థితిలో మజ్జిగ ఇచ్చి కాపాడావు.
నీవు మామూలు గొల్లవు కాదు.
నీ పుణ్యం సామాన్యమైందికాదు."
అర్థం తెలిసిన తర్వాత
అంత గొప్ప పద్యం
తన మీద చెప్పినందుకు
ఎంతో కృతజ్ఞత ప్రకటించాడతను.
No comments:
Post a Comment