Friday, June 3, 2016

శత్రుహంత! శ్రీ హనుమంతా!


శత్రుహంత! శ్రీ హనుమంతా!


సాహితీమిత్రులారా!

ఇది  ఈమధ్య కాలంలో అంటే ఒక నూటయాబై సంవత్సరాలలోపు జరిగిన సంఘటన.
ముక్తి పెరుమాళ్ళయ్య అనే కవి ఆంజనేయ భక్తుడు.

హైదరాబాదు నిజాము ఒక పెద్ద గుర్రపు దండును
నిజాం ఆలీ నాయకత్వంలో దేవరకొండను దోచుకోవటానికి
వచ్చినపుడు దేవరకొండరాజావారి అభ్యర్థనమేరకు
పెరుమాళ్ళయ్య ఆంజనేయస్వామిని అర్చించి,
ఒక శతకం చెప్పాడట. ఏనుగులు, గుర్రాలతో లక్షలకొద్ది సైన్యంతో
వచ్చిన  తురకల దండును శిక్షించమని
హనుమంతుని ఇలా ప్రార్థించాడు!

ఇత్తరిని నిజామల్లీ
హత్తీలు గురాలు పటుతరాహవ బలముల్
మొత్తమ్మై వచ్చెను వి
చ్ఛిత్తుపడన్ శత్రుహంత! శ్రీహనుమంతా!

లక్షల తరబడి ఆవలి
పక్షంబున గుర్రములును బలములు వచ్చెన్
ఈ క్షణమున నీవె చని
శిక్షింపుము శత్రుహంత! శ్రీహనుమంతా!

ఆంజనేయుడు చిన్నతనంలో ఆకాశంలో ఉదయించిన
సూర్యుని చూసి పండు అనుకొని మింగబోయాడు.
ఆవిధంగానే  శత్రు సేనాపతిని మింగమని ఇలా అంటాడు.

భానుని మ్రింగిన పగిదిని
సేనాధిపు నాక్రమించి చీకాకుపడం
గా నొనరిచి రానీయకు
సేనల నో శత్రుహంత! శ్రీహనుమంతా!

పెరుమాళ్ళయ్య ఈ శతకం చెబుతూ ఉండగానే,
తురకల దండుమీద పిడుగులుపడి సైన్యం చెల్లాచెదరై
వెనుదిరిగి పోయింది.
ప్రమాదం తప్పిన తరువాత సంతోషంతో
భక్తకవి చెప్పిన పద్యం ఇది.

వాసి మహారాజ శ్రీ
దేశాయీగారి కార్య తేజం బెపుడున్
భాసిల్ల శత్రు లణగగ
చేసితివే శత్రుహంత! శ్రీహనుమంతా!

భక్తులు తపస్వులు అయిన కవుల వాక్కును
ఆశ్రయించి భావం సత్యసంధాయకమై ప్రవర్తిస్తుందనడానికి
ఇటువంటి వారి జీవిత ఘట్టాలు
ఉదాహరణగా కనిపిస్తాయి.

No comments:

Post a Comment