తెల్లవారను గడుసరి గొల్లవారు
సాహితీమిత్రులారా!
అది భారతస్వాతంత్య్రసంగ్రామం జరుగుతున్నరోజులు.
అతివాదయుగమని చరిత్రకారులు చెప్పుకొనే రోజులు.
ఆ ఉద్యమంలో లాల్(లాలాలజపతిరాయ్), బాల్(బాలగంగాధర తిలక్),
పాల్ (బిపిన్ చంద్రపాల్), ఘోష్ (అరవిందఘోష్) ల ప్రభావంతో
ఉద్యమం జరుగచున్నరోజులు.
1907 సంవత్సరంలో రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ ఆంగ్లోపన్యాసానికి
తెలుగు అనువాదం చేయటానికి చిలకమర్తి లక్ష్మీనరసిహంగారు పూనుకొన్నారు.
సభ పూర్తిఅయి ముగిసే సమయంలో చిలకమర్తివారు ఈ పద్యం చెప్పారు.
భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుతున్నారు మూతులు బిగియగట్టి
ఈ పద్యం కష్టమైన పదాలు లేకుండా సరళంగా ఉండటంమూలాన
నాటి దేశదుస్థితిని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తున్నందున
ప్రేక్షకులను ఏంతగానో ఆకట్టుకుంది.
మిన్నుమార్మోగేలా కరతాళ ధ్వనులు చెలరేగాయి.
సభకాగానే ఎందరో దగ్గరకు వచ్చి
ఆ పద్యాన్ని మళ్ళీమళ్ళీ చదివించుకొని కంఠస్థం చేశారు.
ఆ నాటి పత్రికలన్నీ ఈ పద్యాన్ని ప్రచురించాయి.
ఊళ్ళోగోడల మీది కెక్కింది ఈ పద్యం. అయితే
నాటిప్రభత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని
పోలీసువారు చర్యకు పూనుకొన్నారు.
ఆ సమయంలో భోగరాజు పట్టాభిసీతారామయ్యగారు
తెల్లవారను - అంటే తెల్లవారఁగా అని అర్థం చెప్పి
ప్రభుత్వాన్ని శాంతింపచేశారు.
చూడండి
ఈ పద్యం ఎంత ప్రభంజనం సృష్టించిందో!
నేటికీ మరువని పద్యమైందికదా!
No comments:
Post a Comment