Thursday, June 2, 2016

శ్రీవాణీ గిరిజాశ్చిరాయ....


శ్రీవాణీ గిరిజాశ్చిరాయ....


సాహితీమిత్రులారా!

శ్రీమహాభారతాన్ని తెనిగించు సమయంలో నన్నయకు ముందేతెలుసో
లేక యాదృశ్చికంగా జరిగిందో మంగళ శ్లోకంలో
ముగ్గురిని ప్రార్థించడం జరిగింది.
దీన్ని గురించిన అభిప్రాయాలు అనేకరకాలుగా ఉన్నాయి.
మొదట శ్లోకం చూద్దాం.

శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాఙ్గేషు యే
లోకానాం స్థితిమావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవామ్,
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషాస్సంపూజితా వ స్సురై
ర్భూయాసు: పురుషోత్త మామ్హుజభవ శ్రీకన్ధరా శ్శ్రేయసే

ఇక్కడ మరో ప్రశ్న తెనుగుభారతానికి
సంస్కృతంలో ప్రారంభశ్లోకమా? అని నన్నయను అడిగారట.
దానికి నన్నయ ఇదేకాదు దీనికి ముందు "ఆంధ్రశబ్దచింతామణి"
తెనుగు వ్యాకరణం అది అంతా
సంస్కృతంలోనే ఉంది - అన్నారట.


(ఏ విష్ణువు బ్రహ్మ శంకరులు చిరకాలం నుండి రొమ్మునందు,
ముఖమునందు, దేహమునందు లక్ష్మీ సరస్వతి పార్వతులను
ధరిస్తున్నవారై,  స్త్రీపురుషల సంయోగంవలన పుట్టిన లోకాల స్థిరత్వాన్ని
అవిచ్ఛిన్నంగా కలిగిస్తున్నారో, మూడువేదాలరూపం కలవారున్నూ,
దేవతలచే పూజింపబడుచున్నవారున్నూ అయిన
విష్ణు బ్రహ్మ శంకరు లనబడే త్రిమూర్తులు మీకు శ్రేయస్సును కలిగించే వారౌ తారుగాక!)

ఇక్కడ వేదత్రమూర్తలు అనటం గృహస్థాశ్రమ
ధర్మానికి ప్రతీకగా చెప్పడం జరుగుతోంది.
నన్నయ ఋషితుల్యుడు. అతనినోట త్రిమూర్తులు అనే పదం
రావడంచేత లోకాల స్థితిని త్రిమూర్తులు కొనసాగిస్తున్నట్లు "ఆంధ్రమహాభారతా"న్నికూడా
త్రిమూర్తితుల్యులయిన ముగ్గురు కవులు రచించి పూర్తి చేస్తారనే సూచన
అప్రయత్నంగా కలిగిందని కొందరంటారు.
నన్నయ పదం నారాయణ శబ్దభవం, తిక్కన కవిబ్రహ్మ,
ఎఱ్ఱన శంభుదాసుడు అందుచేత కవిత్రయం
వారు త్రిమూర్తులవంటివారు అనటం సమంజసంగానే ఉంది.


No comments:

Post a Comment