స్వేచ్ఛా విహంగము
సాహితీమిత్రులారా!
శ్రీశ్రీ - 'ప్రభవ'లోని పద్యకవిత ఈ 'స్వేచ్ఛా విహంగము' చూడండి.
ఉచ్పలమాల-
నీవు నభో వికటంమున నిర్మల పాండు పయోద మాలికల్
త్రోవ యొసంగ పక్షముల దూయుచు హాయిగ సంచరించు స్వే
చ్ఛా విలసద్విహంగమవు స్వామి! క్షుధావిలమైన చూడ్కులన్
నీ విహరించు మార్గమున నిల్పి కనుగొనుచుందు నే నిటన్
ఉత్పలమాల-
ఏ రుచిరాను రాగముల నీనెడు దూర దిశా నిశాంతమున్
చేరెదవో నినున్ కనక నేనిట గాసిల, ఏ ప్రపుల్ల క
ల్హార సుమావళీ పరిమళమ్ములు మూగు సురాపగా సుధా
తీరములో చరించెదవొ దీనత నాకిట సంఘటించగన్
ఉత్పలమాల-
నూతన పారిజాత సుమనో రమణీయములైన భావముల్
పూతలు పూచునా యెద, విముక్త మహాశుగ మట్లు దాటుచున్
ద్యోతలమున్ విహార పరిధూత గరుస్మృదుకాంతివాహినీ
స్నాత మనోహరమ్మగ నొనర్చు నినున్ కనునంత వింతగన్
ఉత్పలమాల -
కోమల పల్లవమ్ము లయి కోర్కులు క్రొందనమున్ వహించగా
నామదియే ప్రసూన నవనందనమై వికసించు, అంత నో
స్వామి! వియత్పథాల దిగి వచ్చెద వీవు నిగూఢ వీధికా
ధామములన్ త్యజించుచు నితాంతము నిందె నివాసమొందగన్
రచన - 1930 జనవరి 30
ముద్రణ - ఆంధ్రపత్రిక ప్రమోదూత సంవత్సరాది సంచిక 1930-31
చక్కని బ్లాగును పరిచయం చేసిన శ్రీ కంది శంకరయ్య గారికి ధన్యవాదములు....బ్లాగును నడుపుచున్న రమణ రాజుగారికి అభినందనలు.
ReplyDeleteగోలి హనుమచ్చాస్త్రిగారికి నమస్కారం,
ReplyDeleteమీరు మాబ్లాగును సందర్శించి వ్యాఖ్య వ్రాసినందుకు మీకు ధన్యవాదాలు.
మీ వ్యాఖ్వలు మాకు సదా అవసరం కావున మీరు మాకు సరైన వ్యాఖ్యలతోటి సూచనలు సలహాలు మాబ్లాగుకు అందించి శోభ కూర్చండి.