Saturday, June 4, 2016

భ్రాంతి పడియెట్లు పెండ్లాడె పార్వతమ్మ


భ్రాంతి పడియెట్లు పెండ్లాడె పార్వతమ్మ


సాహితీమిత్రులారా!

అయ్యనవోలి రామన్న కవి ఈశ్వరునిమీద చతురోక్తి చూడండి.

పూయ గంధము లేదు భూతి పూతేగాని యెక్క గుర్రములేదు ఎద్దె గాని
త్రాగ కంచము లేదు తల పుర్రెయేగాని మణుల సొమ్ములులేవు ఫణులె గాని
కొండమీదనెగాని ఉండ చోటులేదు తలను పూవులు లేవు జడలె గాని
గజ చర్మమే కాని కట్ట వస్త్రము లేదు జోగి రూపే కాని సొగసులేదు
ఇట్టి నిరుపేద నౌట ని న్నెరిగి యెరిగి
భ్రాంతి పడియెట్లు పెండ్లాడె పార్వతమ్మ
యైన నీ భాగ్య మేమని యనగవచ్చు
భక్తజనసంగ మగితేల ముక్తిలింగ

పెళ్ళి అయిన తరువాత శివపార్వతులు ద్యూతక్రీడకు కూర్చున్నారు.
చెలికత్తెలు పార్వతిని ప్రోత్సహిస్తున్నారు. పందెం పెడుతున్నారు.
శివుడు తన శిరోభూషణమైన బాలచంద్రుణ్ణి పందెం యొడ్డినాడు.
పార్వతీ సఖులకు ఉత్సాహంగా ఉంది. ఎలాగైనా గెలవాలి.
ఈ హృదయంగమమైన భావ చమత్కారాన్ని
చూపే పద్యం  చూడండి ఇది.

మనము గారామున బెంచిన యట్టి చకోరికా శిశువు లాకొనకయుండ
మన గొజ్జగుల తోట మహి నిందు కాంతంపు పాదులలో నీళ్ళు పాయకుండ
మన కేళికావన మధ్య దీర్ఘికలోని తొగ లొక యప్పుడు మొగడకుండ
మన సరోజనిలోని మరగిన జక్కవదోయి నీ చనుదోయి దొరకుండ
ఉండుగాని సదాశివుం డొడ్డినాడు 
మొలక చందురు గెలుపు మీ పలక ననుచు
అగజ చెలులాడు మాటల కలరు శివుడు
మనల కరుణా విధేయుడై మనుచు గాక

మనం పెంచిన చకోరికా శిశువుల ఆకలి పోవాలంటే,
తోటలోని చంద్రకాంతపు పాదులలో నీళ్ళు నిలిచి ఉండాలంటే,
దిగుడు బావిలోని కలువపూలు ముడుచుకోకుండా ఉండాలంటే
సరస్సులోని జక్కవలు నీ స్తనాలతో పోటీపడకుండా ఉండాలంటే
నీవు చంద్రుణ్ణి గెలుచుకోవాలి.
ఆవిధంగా పార్వతీదేవి చెలులు పలికే మాటలకు అలరెడి
శివుడు మనలను కరుణా విధేయుడై మనుచుగాక!
-  అని పై పద్యం భావం

ఎంత రమణీయమైన భావనతో ఈ పద్యాల కూర్చాడో ఆ రామన్నకవి.

No comments:

Post a Comment