Thursday, June 23, 2016

కరికరణీగుణంబులు మొగంబునఁ దాల్చి ........


కరికరణీగుణంబులు మొగంబునఁ దాల్చి ........


సాహితీమిత్రులారా!

ఇదొక అరుదైన వింత గణపతి ప్రార్థన చూడండి.

అరుదుగ వామభాగలలనాకలనాచలనాత్ముఁడైన యా 
హరుగురుఁగాంచి తానును దదాకృతియౌగతి నేకదంతుఁడై
కరికరణీగుణంబులు మొగంబునఁ దాల్చి జగంబు లేలు నాం
తరకరుణాననాథు గణనాథు మరిద్గణనాథుఁ గొల్చెదన్
                                                            (కావ్యాలంకారసంగ్రహము -1-6)

తన తండ్రి అయిన ఈశ్వరుడు అర్థనారీశ్వరుడు
అంటే సగం పురుషభాగము సగం స్త్రీ భాగము కలవాడు.
అలాగే నేను కూడ  అర్థనారీశ్వరుడని ఈ రూపం ధరించాడట గణపతి.
అంటే గణపతి స్వరూపంలో ఒక భాగంలో దంతం ఉంటుంది
మరో భాగంలో దంతం ఉండదు అందుకే ఆయన్ను ఏకదంతుడంటారు.
ఏనుగుల విషయానికొస్తే దంతాలున్నది మగ ఏనుగు దాన్ని కరి అంటారు.
దంతాలు లేని దాన్ని కరణి(ఆడ ఏనుగు) అంటారు.
అందు వల్ల గణపతి ముఖంలో ధంతం ఉండేభాగం పురుషభాగం
అలాగే దంతంలేని భాగం స్త్రీభాగం.
కావున గణపతి కూడ అర్థనారీశ్వర తత్వం కలవాడే.
కావున తన తండ్రి ఈశ్వరునితో సమానుడు.
అటువంటి గణనాథుని నేను కొలుస్తానంటున్నాడు
మన కావ్యాలంకారసంగ్రహము(నరసభూపాలీయము)లో
భట్టుమూర్తి(రామరాజభూషణుడు)
.
ఈ భావన ఈయనకు ఎలావచ్చిందంటే ఈయనకు 8 శతాబ్దాల
ముందు ఉన్న మహాపండితుడు శివభక్తుడు అయిన
హలాయుధుడు అనే ఆయన కూర్చిన హలాయుధస్తవములో
ఇలాంటి భావన ఉన్న శ్లోకం ఉందట.
ఆ శ్లోకం

విఘ్నం నిఘ్నన్ ద్విరదవదన:  ప్రీతయేవో2స్తు నిత్యం
వామేకుంఠత్ ప్రకటిత బృహదక్షిణేస్థూల దంత:
య: శ్రీకంఠం పితరమునుయాశ్లిష్ట వామార్థదేహం
దృష్ట్వానూనం స్వయమపి దధావర్థనారీశ్వరత్వం

ఈ విషయం "గణపతి-తెలుగు సాహిత్యం" అనే వ్యాసంలో
నిడుదవోలు వెంకట్రావుగారు
భారతి మాసపత్రికలో వివరించారు.

No comments:

Post a Comment