Wednesday, May 25, 2016

"రా" - కొట్టుట


"రా" - కొట్టుట 


సాహితీమిత్రులారా!

అడిదము సూరకవి ఒకసారి విజయనగర ప్రభువు విజయరామరాజు
మీద ఏకవచన ప్రయోగంతో ఒక "రా" వచ్చేట్టు పద్యం చెప్పాడు.
రాజుగారు ఏమీ అనలేదుగానీ రాజ బంధువు సీతారామరాజుకు
కోపం వచ్చి ఆక్షేపించాడు. అప్పుడు సూరకవి ఆవిధంగా
చెప్పటంలోని ఔచిత్యాన్ని, అందాన్ని
ఇలా సమర్థించుకున్నారట.

చిన్నప్పుడు రతికేళిక
నున్నప్పుడు కవితలోన  యుద్ఝములోనన్
వన్నె సుమీ "రా"-కొట్టుట 
చెన్నుగనో పూసపాటి సీతారామా!

(చిన్నప్పుడు "రా" -  అనడం సహజమే.
రతిక్రీడలో స్త్రీపురుషులు పరస్పరం "రా" అనుకోవటం
భోగాతిశయాన్ని సూచిస్తుంది.
కవిత్వంలోనూ, యుద్ధంలోనూ అనవచ్చు.
అనవచ్చుమాత్రమేకాదు అంటే వన్నె సుమా!)

అందుకే అతని చాతుర్యాన్ని చూసి ఇలా అన్నారు.

అంతా సుకవులు గారా?
అంతింతో పద్య చయము నల్లగలేరా!
దంతివి నీతో సమమా?
కాంతా సుమబాణ! సూరకవి నెరజాణా!


"రా" -  కొట్టటాన్ని గురించి మరోకవి పద్యం ఇది.

కవులు పొగడువేళ కాంతలు రతివేళ
సుతులు మద్దువేళ  శూరవరులు
రణము సేయువేళ రా కొట్టి పిలుతురు
పాడి యదియు మిగుల భజనకెక్కు

ఏకవచనం ప్రయోగించటాన్ని గురించి సంస్కృతంలో
ఒక శ్లోకం ఉంది
తెలుగులోని పద్యాలన్నీ దాని అనుసరణలే.
ఆ శ్లోకం.......

బాల్యే సుతానాం సురతేంగనానాం
స్తుతే కవీనాం సమరే భటానాం
త్వంకార యుక్తాహి గిర: ప్రశస్తా:
కస్తే ప్రభో! మోహతరస్మరతం.

No comments:

Post a Comment