Saturday, May 28, 2016

స్వర్ణపుష్పాలతో పాదపూజ


స్వర్ణపుష్పాలతో పాదపూజ


సాహితీమిత్రులారా!

1948 జనవరి 18వ తేదీన విజయవాడలో ఆంధ్ర నాటక కళా పరిషత్ వార్షిక సమావేశంలో
విశ్వనాథ సత్యనారాయణ వారు తమ "శశిదూత" మనే ఖండకావ్యమును
"బందా కనకలింగేశ్వరరావు" గారికి అంకితం చేశారు.
ఈయన ప్రముఖ రంగస్థల నటుడు.
కనకలింగేశ్వరరావుగారు విశ్వనాథవారికి 5 స్వర్ణ పుష్పాలను బహూకరించారు.
ఆ సభలో ఆసీనులై ఉన్న తమ గురువు చెళ్ళపిళ్ళ వారికి
ఆ స్వర్ణపుష్పాలతో విశ్వనాథవారు పాదపూజ చేస్తూ,
చంపకోత్పల ఛందస్సులో అయిదుసార్లు నమస్సులు సమర్పించారు.
వాటిని చూడండి.

ప్రవిమలమైన చెళ్ళపిళ్ళ వంగసమన్ నునుపాలవెల్లి కా
లుపకను చందమామ కవిలోక మహాగురవే నమోనమ:

(పరిశుద్ధమైన చెళ్ళపిళ్ళ వంశమనే పాలసముద్రంలో
పుట్టిన చందమామా కవిలోక మహాగురూ నమస్కారం.)

తొలి తుదిరేక మెత్తనలు దూసిన సోగ తెనుంగులో పదా
లు వెలలు తేనెవాక కవిలోక మహాగురవే నమోనమ:

(ఆద్యంత మృదుమధురరాలైన తెనుగు పదాలు తొణికసలాడే
మధుర ప్రవాహమా కవిలోకపు గొప్ప గురువా నమస్కారం.)

తొలి కవులెల్ల కష్టపడి తూచిన యెల్ల పదార్థముల్ కడున్
సులభము గాగ చూరగొను శుద్ధ మహామతయే నమోనమ:

(ఆదికవులు కష్టపడి తూచిన మహా పదార్థాలను ఏమాత్రమూ
కష్టం లేకుండా ఎంతో సులభంగా దోచుకొన్న నిర్మల
మహాబుద్ధికి నమస్కారం.)

తలచిన యెల్ల శబ్దమును తానును మెత్తని రూపమూని మం
జులమయి సేవ చేసెడు విశుద్ధ మహావచసే నమోనమ:

(తలచిన ప్రతి శబ్దమూ మృదులాకృతి దాల్చి
సేవచేసే నిర్మల మహావాక్కుగల వానికి నమస్కారం.)

కోనలలోన మిన్నొలయు కొండలలోన హిమాంబుదాళిలో
కానలలో వినిర్భరముగా ప్రవహించెడు నాంధ్ర శారదా
నూనసురాపగన్ మృదుల నూతన సాధు సమప్రసార ధా
రానతరేఖ దీర్చిన ధురా ప్రతిభానిధయే నమోనమ:

(కొండల్లో, కోనల్లో, కానల్లో పారుతున్న ఆంధ్ర శారదాగంగను
నూతన సాధు సమతలంలో ప్రవహింపజేసిన మహా ప్రతిభానిధికి నమస్కారం.
క్షీణప్రబంధ యుగంలో క్షుద్ర కావ్య నిర్మాణాల గందరగోళాల మధ్య
 కొట్టుమిట్టాడుతున్న తెలుగు కవిత్వాన్ని కొత్తమలుపు తిప్పి
నూతన యుగస్రష్టయైన మహాకవికి నమస్కారం.)

నమస్కారానికి ఒక స్వర్ణపుష్పం
చొప్పున గురువుగారి పాదాలముందు ఉంచాడు.

No comments:

Post a Comment