Sunday, May 29, 2016

పద్యాలమాల - హృద్యశుభాలహేల


పద్యాలమాల - హృద్యశుభాలహేల


సాహితీమిత్రులారా!
కడపజిల్లా, కమలాపురం మండలం, రామాపురం గ్రామంలో
నిత్యకళ్యాణదేవతామూర్తులు శ్రీమహాలక్ష్మీసమేత మోక్షనారాయణస్వామి,
శ్రీవల్లీదేవసేన సమేతద్వికందర షణ్ముఖసుబ్రహ్మణ్యస్వామి
బ్రహ్మోత్సవములు
19-05-2016 నుండి 23-05-2016 వరకు జరిగినవి.
ఈ సందర్భముగా 22-05-2016 సాయంకాలం 5గం.లకు
 "రాయలసీమ స్థాయి కవిసమ్మేళనం" జరిగింది.
అందులో పాల్గొన్న శ్రీయుతులు విద్వాన్ వి.యమ్.భాస్కరరాజుగారి
"పద్యాలమాల - హృద్యశుభాలహేల" ఇది.

అతిపురాతనమునై అద్భుతవిగ్రహాల్ 
         హ్లాదమై, జనుల మోదపఱచు
మోక్షనారాయణ మోహిత షణ్ముఖ
          స్వాములు ప్రజల ప్రస్నపఱచు
వైశాఖమాసాన వైభవోపేతమై
         శుద్ధత్రయోదశీ శుభము గూర్చు
దేవేర్ల, దేవుళ్ళ దివ్యకళ్యాణాలు
         భక్తాళి హృదయాల రక్తిపేర్చు
ఏమి యోగమో! భోగమో! ఎఱుగ నౌనె
మోక్షగాములై జనులు సమీక్ష చేసి
సతత సంతోష వారాశి సాగుచుంద్రు
పుణ్యక్షేత్ర మన- నిదె ఇభ్భువిని జూడ

మహి మహోజ్జ్వల క్షేత్రమై మహిమగలిగి
నిత్యకళ్యాణమూర్తుల నిలయమగుచు
మానవాళికి మోక్షసామ్రాజ్యమగుచు
అలరు "రామాపురక్షేత్ర" మతులకీర్తి

భక్తజనంబులు రక్తిమై కొలువంగ
       వరముల రక్షించి వరలు నెద్ది
ఎట్టిపాపములైన ఇట్టె పోగొట్టెడు
        పావన క్షేత్రమై ప్రబలునెద్ది
విస్తృత విఖ్యాతి విశ్వాన వెలుగంగ
        విమల విశిష్ఠత వెలయునెద్ది
ఉభయబ్రహ్మోత్సవాలుర్విలో చెలగంగ
        దైవద్వయ కృపేక్ష తనరునెద్ది
అదియె "రామాపురక్షేత్ర" మవనిలోన
భక్తకోటికి పసిడియై వరలు చుండు
దివ్యక్షేత్రము - భువనైక భవ్యస్థలము
మోక్ష సిద్ధికి మూలమై భువివెలుంగు

ఎల్లవేళల స్వాముల ఉల్లమలర
చూసి, సేవించి, తరియించి - శుభములలర
మెలగవలె నోయి జనులార మృదులభక్తి
జీవితానంద మదియె - ఈ జీవితాన

సతము "పుణ్యభూమి ఛారిటబుల్ ట్రస్టు"
క్షేత్రవైభవము విశిష్ఠ పఱుప
దివ్యభక్తి సాంస్కృతిక కార్యములనెల్ల
జరిపి - ధన్యమయ్యె - వరసుకీర్తి

No comments:

Post a Comment