ప్రకటన (పరారీ అయిన వ్యక్తికోసం)
సాహితీమిత్రులారా!
ఇది దేవరకొండ బాలగంగాధర్ గారి
"అమృతంకురిసిన రాత్రి" లోనిది
ఎలావుందో చూడండి
ఈ కవిత.
స్టేషన్లో టికెట్లును జారీ చెయ్యకండి
ఎక్కడి రైళ్ళు అక్కడ ఆపివెయ్యండి
దేశదేశాలకు కేబుల్ గ్రమ్స్ పంపించండి
దేవాలయాల్లో నిత్యం పూజలు చేయండి
ఆకాశవాణిలో ఈ విషయం ప్రకటించండి
కాఫీహోటళ్ళలో క్లబ్బులలో కర్మాగారాల్లో
కాస్త జాగ్రత్తగా నిశితంగా పరిశీలించండి
సముద్ర తీరాలలో నదీజలాలలో వెదకండి
సాయుధ దళాల్ని దిక్కులలో నిబెట్టండి
రాకెట్లను అంగారకాది గ్రహాలకు పంపించండి
అడుగుజాడల్ని కూపీ తియ్యండి
వేలిముద్రల్ని పరీక్షించండి
ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు
కంగారులో భయంతో గుసగుసలాడుతున్నారు
విజ్ఞానవేత్తలు నాగరికత పైతోలు వొలుస్తున్నారు
మనుష్యభక్షకులు నేడు చంకలు కొట్టుకుంటున్నారు
కావ్యచర్చలు కళాలయాలు ఆకర్షించటం లేదు
రాజకీయవేత్తల ఉపన్యాసాలు ఎవరూ వినడం లేదు
సైంటిస్టులు ఒక్కొక్కరే ఆత్మహత్య చేసుకుంటున్నారు
స్వార్ధజీవనులు గభాలున రొమ్ములు బాదుకొంటున్నారు
సిద్ధాంతాలు చర్చలూ ఎవరూ చేయడం లేదు
సిరా యింకకుండానే ఎగ్రిమెంట్లు చింపేస్తున్నారు
అతృప్త అశాంత ప్రజా పారావార తరంగం
అంచుల్ని దాటి భీకరంగా విరుచుకు పడుతోంది
ఇంక చరిత్రలు రాయనక్కర లేదు
ఇంక రాజ్యాలు పాలించ నక్కరలేదు
అణుబాంబు యుగాంతాన్ని నిరూపిస్తున్నది
ఆ ముహూర్తం త్వరలోనే వస్తున్నది
కాబట్టి స్టాండ్ ఎటెన్షన్ - మన జాతిని మనం
కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం
వెతికి తీసుకురండి పరారీ అయిన వ్యక్తిని
వేరు దారిలేదు కదలండి కదలండి జై అని.
అపార కృపా తరంగితాలైన నయనాంచలాలు
ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరీమళాలు
సంస్కారపు కేశపాశంలో తురిమిన అనురాగపు గులాబి
సదా ప్రజా హితైషిణి సుభాషిణి గర్వంలేని రాణి
కల్లనీ క్రౌర్యాన్నీ కాలుష్యాన్నీ తిరస్కరిస్తుంది
తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది
చల్లని తల్లి చక్కని చెల్లి ఆమె పేరు శాంతి
1950లో రాయబడింది.
No comments:
Post a Comment