Wednesday, May 25, 2016

నానాసూన వితానవాసనల నానందిచు సారంగమే

నానాసూన వితానవాసనల నానందిచు సారంగమే


సాహితీమిత్రులారా!

ముక్కుతిమ్మన ముక్కమీద ఒక పద్యం చెప్పి ఒకరికి ఇవ్వగా
ఆపద్యం నచ్చి రామరాజభూషణుడు(భట్టుమూర్తి) అది కొని
తన వసుచరిత్రలో రాసుకున్నాడని ఒక కథ ప్రచారంలో ఉంది.
కానీ ఇది నిజంకాదని అది వేరొక పద్యమై ఉంటుందని పండితులు,
పరిశోధకులు భావిస్తున్నారు.
ఆ ముక్కుమీద చెప్పిన పద్యం
ఇదని ప్రచారం చూడండి.

నానాసూన వితానవాసనల నానందించు సారంగ మే
లా నన్నొల్ల దఁటంచు గంధఫలి బల్కాలం దపం బంది యో
షా నాసాకృతిఁ దాల్చి సర్వసుమనస్సౌరభ్యసంవాసి యై
పూనెం బ్రేక్షణమాలికా మధుకర పుంజంబు లిర్వంకలన్

ఈ పద్యాన్ని నాలుగువేల వరహాలిచ్చి
రామరాజభూషణుడు కొన్నాడని ప్రతీతి.
ఇది ఎంతమాత్రం సరైనదికాదు.
ఇది కవులను గూర్చి మనవారు కల్పించే కల్పనాకథ మాత్రమే.
అయినా నంది తిమ్మన కాలంలో రామరాజభూషణుడు లేడు.
ఒకవేళ ఉన్నా వసుచరిత్ర అంతటి కావ్యం రాయగల వానికి ముక్కుపై
ఇంత కల్పన చేయలేకపోయాడనడం పరిహాసాస్పదం అన్నాడు - వీరేశలింగంగారు.
ఈ ఐతిహ్యము అంత విశ్వాసపాత్రంగాలేదని - డా. దివాకర్ల వేంకటావధాని అన్నారు.
ఆఁడుదాని అంగప్రత్యంగములు వర్ణనము చేయుట వసుచరిత్రకారుని లక్షణము.
ఈ లక్షణము తిమ్మన పారిజాతాపహరణములో మచ్చుకైనా కనబడదు.
అట్టి వర్ణనలు చేయుట తిమ్మనగారి స్వభావములో లేదు.
కావున నిస్సందేహంగా ఇది రామరాజభూషణునిదే కాని తిమ్మన కృతికాదు.


ఓరుగల్లును పాలించిన  ప్రతాపరుద్రుని
ఆస్థానంలో ఉండిన విద్యానాథుని(అగస్త్యుని)
"నలకీర్తికౌముది" అనే సంస్కృతకావ్యంలో
ఈ క్రింది శ్లోకం ఉన్నది.

భృంగానవాస్తి ప్రతిపన్నఖేదా
కృత్వాననే గంధఫలీ తప:ఫలమ్
తన్నాసికా భూ దనుభూతగంధా
స్వపార్శ్వనేత్రీకృతభృంగసేవ్యా

ఈ శ్లోకం భావం గ్రహించి రామరాజభూషణుడు
"నానాసూన వితానవాసనల" -   అనే పద్యం రచించి
ఉండవచ్చని టేకుమళ్ల అచ్యుతరావుగారి అభిప్రాయం.
(ఆంధ్రవాఙ్మయచరిత్రము పుట. 206 - టేకుమళ్ల అచ్యుతరావు)

No comments:

Post a Comment