గుహలు ప్రతిధ్వనుల్ గ్రుమ్మరింప
సాహితీమిత్రులారా!
అయ్యలరాజు రామభద్రకవి కృత
రామాభ్యుదయకావ్యంలో
హనుమంతుడు సీతాన్వేషణలో
సముద్రాన్ని లంఘించే సమయంలో
హనుమంతుడు గగనంలోకి ఎగిసే
సందర్భములోని ఈ పద్యం చూడండి-
అడుగు లొత్తిన పట్లఁ బిడుగు మొత్తినయట్ల
బహుమహోపలములు పగిలి పడగ
ద్రోఁక త్రిప్పరినపట్ల మూఁక విప్పినయట్ల
బలుగాన లిలఁగూలి బయలు గాఁగ
గేలఁ దట్టినపట్లఁ గోల గొట్టినయట్ల
గరికేసరాదులు గలఁగి పఱవ
రంతు చూపినపట్ల వంతు మోపినయట్ల
గుహలు ప్రతిధ్వనుల్ గ్రుమ్మరింపఁ
గంపితధరాధరాధిత్యకాఝరీత
రంగఘట లెల్లెడల నుప్పరంబు లెగసి
పడి తడిసిన కార్యదాహవిభ్రాంతకపుల
యుల్లములతో దవాగ్నుఁజల్లజేయ
సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమైన
హనుమంతుడు అడుగులు వేస్తుంటే
పిడుగులుపడి పెద్దపెద్ద రాళ్ళుపగిలి పడిపోతున్నాయి.
వేగంగా తోకను తిప్పినపుడు వచ్చిన గాలికి
పెద్ద అడవులే చెదరగొట్టబడినట్లు కూలిపోయి
బయళ్ళు ఏర్పడుతున్నాయి.
చేతితో చరచినపుడు కర్రతో కొట్టినట్లు ఏనుగులు,
సింహాలు మొదలైన క్రూరజంతువులు కూడా
కలతపడి పరుగులు పెడుతున్నాయి.
హనుమంతుడు ఆటాడుతున్నట్లు ధ్వని చేస్తే,
పోటీపడుతూ గుహలు ప్రతిధ్వనిస్తున్నాయి.
అవి రామకార్యం పూర్తి చేయాలనే ఆతృతతో
తపించిపోతున్న కోతులమనస్సుల్లోని
దావాగ్నిని చల్లార్చి వేస్తున్నాయి
- అని భావం.
No comments:
Post a Comment