Wednesday, November 16, 2016

కలువల నిద్రలేపి, రతికాంతుని మాంద్యము వాపి


కలువల నిద్రలేపి, రతికాంతుని మాంద్యము వాపి




సాహితీమిత్రులారా!


బిల్హణీయమనే పేరుతో తెలుగులో 
పిండిపెద్ది కృష్ణస్వామి రచించారు. 
కానీ దీన్ని సింరాచార్యులవారు వ్రాసినట్లు 
పరిశోధకులు చెబుతున్నారు.
ఇది ఎవరువ్రాసినా ఇందులోని 
విషయం గురించి రెండు ముక్కలు-

బిల్హణుడు అనే సంస్కృతకవి ఉన్నాడు. 
అతని చరిత్ర అని కొందరి అభిప్రాయం. 
దీన్నే తెలుగులో యామినీపూర్ణతిలక అనే 
పేరుతో చెళ్ళపిళ్ళ నరసకవి రచించారు.


పాంచాలదేశానికి మదనాభిరాముడనే రాజు ఉండేవాడు. 
ఆయన కుమార్తె యామినీపూర్ణతిలక బహురూపవతి. 
ఆమెకు చిన్నతనంలోనే సంగీతం చెప్పించాడు.
తరువాత అలంకార సాహిత్యవిద్యలు నేర్పాలనుకున్నాడు.
అందుకుతగిన గురువును ఎంపిక చేశారు ఆయనే బిల్హణుడు 
ఈయనా అసాధారణరూపవంతుడు. వీరిద్దరినీ ఒక చోట చేరిస్తే 
ప్రమాదమని గుర్తించి రాజకుమార్తెకు గురువు గ్రుడ్డివాడని
(ఆమె గ్రుడ్డివారిని చూడదు) గురువుగారికి ఆమె కుష్టురోగని
(ఈయన కుష్టువారిని చూడడు) చెప్పి ఒక భవనంలో వారి మధ్య 
ఒకతెర ఏర్పాటుచేసి బోధనప్రారంభింపచేశాడు రాజు. 
రోజులు గడుస్తున్నాయి ఒకరోజు పౌర్ణమి ఆరోజు కవిగారు 
భోజనానంతరం చంద్రుని చూచి ఆనందంతో వర్ణించ 
మొదలు పెట్టాడు అందులోని కొన్ని పద్యాలను చూద్దాం-


ఇవి బిల్హణీయములోని ద్వితీయాశ్వాసంలోనివి-

కలువల నిద్రలేపి, రతి కాంతుని మాంద్యము వాపి, పుష్కర
స్థలిఁ దిమిరంబుఁ జోపి, రతిఁ జాలని బాలల నూపి, దేవతా
వళి కమృతంబుఁజేపి, వర వాసవ దిక్పతి కుండలంబునై,
కలువల ఱేని మండలము కాంతిలుచున్నది తూర్పు కొండపై   -52


ఇది గగనంబు గాదు, నుతియింప సుధా వనరాశి గాని, మేల్
వదలని తారకా నిచయ పంక్తులు గా, వివి ఫేన ఖండముల్,
గుదురుగఁ జుట్టుకొన్న వరకుండలిగా, కిది చంద్ర బింబమా?
యిదియును జిహ్వ గాదు, పవళించిన విష్ణుఁడు గాని చూడఁగన్  -53


అరయ నభ స్తలం బనెడి యందపు గంధపు సానపై, రుచిన్
బరఁగిన చంద్ర బింబ మను బాగగు చందన రాశి పై పయిన్,
వెఱయఁగ వాసనార్థమయి నించిన కస్తురిఁ బోలి యొప్పె, శ్రీ
కరముగ నీ కళంక మనఁగా ననువై విలసిల్లు నెంతయున్     -54


అరయఁగ జంద్ర నీ యుదర మందలి నల్పు పటం బటంచుఁ, జా
మర మృగ మంచుఁ బల్కుదురు మానుగఁ గొందఱు, నే వచించెదన్
గరి గమ నాధర స్థలులఁ గమ్మదనంబు ఘటింప దాత, ని
న్నొరసి సుధా రసంబుఁ గొనెనొ! యది జాలము నాఁటనుండియున్   -55


జలధి పంకమంచు మహి చాయముఁ, దిహ్నము లేడిపిల్ల, కం
దళిత సురేంద్ర నీల మణి ధామ, మటంచు వచింతు రంద, ఱీ
కలువల ఱేనియందుఁగల కిందును నే ననుకొందు, రాత్రియం
దలవడ మ్రింగినట్టి తమలోక సంస్థ మటంచు నెంతయున్   -56


చందురుఁడన్ మృగాధిపతి శౌర్య విజృంభణ వృత్తిఁ బూని, పౌ
రందర ది గ్ధరేంద్ర కుహరంబునుండి రుచుల్ సెలంగఁగా
మందల కేఁగుదెంచుచుఁ, దమ: కరి కుంభము సాంశు రేఖికా
బృంద నఖంబులం జిదుమ, వీడిన ముత్యము లయ్యెఁ దారకల్   -57

No comments:

Post a Comment