Monday, November 28, 2016

తారుణ్యాతిగ చూతనూత్న ఫలము


తారుణ్యాతిగ చూతనూత్న ఫలము




సాహితీమిత్రులారా!



ఆముక్తమాల్యదలో వేసవికాలంలో విష్ణుచిత్తుడు
అతిథులకు ఎలాంటి భోజనం వడ్డిచాడో చూచాం.
అదే తరుణంలో మాంసాహారుల వేసవి భోజనం
ఎలా ఉండేదో కూడ శ్రీకృష్ణదేవరాయలవారు
వర్ణించారు ఆ పద్యం చూడండి-

తారుణ్యాతిగ చూతనూత్న ఫలము క్తైలాభిఘార స్వన
ద్ధారా ధూపిత శుష్కదంబుహృత మాత్స్యచ్ఛేద పాకోద్గతో
ద్గారపుంగన రార్చు భోగులకు  సంధ్యావేళలం గేళికాం
తారాభ్యంతర వాలుకా స్థి హిమాంత ర్నారికే ళాంబువుల్
                                                                        (ఆముక్తమాల్యద - 2- 68)


ఆ వేసవి యందు సంపన్నమైనవారు (భోగులు) మధ్యాహ్నమున
దోరమామిడి ముక్కలతో చుయ్యని శబ్దం వస్తూండగా నూనెపోత
తాలింపు వేసి నీటితడి ఇగురగానే తీసిన చేప బద్దలయిగురుతో
తింటారు. ఆ చేపల కూర తిన్నాక సాయంకాలమున తిన్న
భోజనము జీర్ణమయేప్పుడు ఆ చేపల కసరుతో త్రేన్పులు
వస్తూండేవి. వాటిని  తగ్గించటానికి ఇసుకలో పూడ్చి పెట్టిన
కొబ్బరికాయలను అప్పుడే తీసి వాటిని పగులగొట్టి వాటినీరు
త్రాగితే అవి(ఆ త్రేనుపులు) శాంతించేవి - అని భావం.

No comments:

Post a Comment