Friday, November 11, 2016

మొలకెత్తని విత్తనం


మొలకెత్తని విత్తనంసాహితీమిత్రులారా!ఇది పద్యప్రకాశం(పద్య సంకలనం)లోనిది.
ఇది చేగిరెడ్డి చంద్రశేఖరరెడ్డిగారి రచన.


ప్రముఖమై నిలిచిన ప్రాచీన చరితాన
నాగరికత వెలయ నాంది బల్కి
నాగలి గొనిన తొలినాగరీకుడనంగ
ఆదివృత్తిగురువు అతడె రైతు

సేద్యమొకటె జగతికి జీవనోపాధియౌ
ముఖ్యవృత్తిగాను మోదమలర,
దివ్యమైన యా నదీ లోయలను రైతు
బాగుచేసి పొలముసాగుచేసె

ఉప్పుదేలుచున్న ఊసరక్షేత్రాల
గుట్టపుట్టలన్ని కొట్టివేసి
చెరువు, కుంటలెన్నొ సేద్యంబునకు కట్టి
పారజేసె నీరు పసిడిపండ

పంటలన్నివేసి పండిచె మిన్నగా
పాడిపోషణమ్ము, పశుగణమ్ము
పెంచి, దేశమును సుభిక్షంబుగా జేసి
కర్షకుండు జనులు హర్షమొంద

రెక్కలాడకున్న డొక్కాడబోదంచు
హలముచేతబట్టి పొలముదున్ని
క్షామమెపుడు లేక సంక్షేమ మార్గాన
ఆర్థికాభివృద్ధినలరజేసె

కర్షకాళికి కష్టాల కాలమాయె,
మంచిరోజుల మనుగడ మాసిపోయె,
తిండిగింజలు కనరాని తిప్పలాయె,
పొలముపండింప కష్టమై పొగిలె రైతు

కలిసిరాకిట్లు కాలము కాటువేసె,
విధియె వికటించి తీరనివెతలద్రోసె,
ప్రకృతి యతివృష్ట్యనావృష్టిపాలుజేసె,
కరవు మృత్యువై రైతులను కాలరాచె

అధికధరలు మించి ఆకాశమంటెను,
నికర ఎరువు ధరలు నింగినంటె,
రైతు పంటల ధరపాతాళమంటెను,
కూలికైన రాక క్రుంగె రైతు

కారుకారున పైరుకు నీరులేక
వేతమన్నను పశువులమేతలేక
పట్టెడన్నము బిడ్డకు పెట్టలేక
వలసబోయెను రైతన్న బ్రతుకలేక

పస్తులుండలేక వస్తువులమ్మెను,
శిస్తుగట్టనాలి పుస్తెనమ్మె,
అప్పుతీర్చలేక ఆస్తినంతయునమ్మె,
అండలుడుగి రైతు గుండె పగిలె

పాటుపడిన పంటకు తగు ఫలములేదు,
శ్రమకోర్చి చేయుదమన్న జలములేదు,
హలము చేగొంద మన్నను అదునులేదు,
మెలకయెత్తని విత్తాయె మొండి రైతు

సకల సృష్టితనకు తాన జరుగుగాక
అన్నము సృజించువాడు రైతన్నగాదె
అట్టి సృష్టికర్త నిపుడన్నార్తుజేసి
పెద్దలందరు కూర్చుండ్రి గద్దెలెక్కి

కర్షకాళి లోకంబెల్ల హర్షమొంద,
హార్ది, కార్థిక సహకారమందజేసి
ఆధునిక పద్ధతి పనిముట్లమరజేసి
ప్రభుతరైతు నాదుకొన ప్రగతి గల్గు

కండలను పిండి తామండుటెండకోర్చి,
తనువు స్వేదమ్ము రక్తమ్ము ధారవోసి
జనులజీవమ్ము సర్వమ్ము సాగుకొరకు
త్యాగమొనరించు రైతన్న యోగిసుమ్ము

గుండెలదిరి పడె ఉరుములు
కొండలు కోనేర్లు పొంగ కురిసెన్వానల్,
నిండగ గాదెలు గరిసెలు
పండెను బంగారు రైతు పాలన యనగాన్

ప్రజ హర్షింపగ పంటలు
గజగజలాడంగ ప్రభుత గాదెలు నిండెన్,
రుజువుగ నిల్చి జగమ్మున
అజరామరు డయ్యె రైతు అన్నమునిడగాన్


ఈ కవిత రాసిన నాటినుండి 
కొన్ని మార్పలు మినహా రైతులస్థితిలో 
నాటికి నేటికి పెద్దతేడాలేదని గమనించవచ్చు.


No comments:

Post a Comment