ఇంక నెట్లు దీర్చెడు శ్రీపాద కృష్ణమూర్తి
సాహితీమిత్రులారా!
కొన్ని చరిత్రలో పునరావృతమౌతుంటాయనడానికి
శ్రీనాథుని జీవితం - శ్రీపాద కృష్ణమూర్తిగారి జీవితాలే
ఉదాహరణలు. వారి జీవితాలకు సరిపోల్చే పద్యాలను
చూడండి-
ఋణబాధలతో పరితపంచిన ఈ పద్యాలు-
శ్రీనాథుడు అవసానదశలో చెప్పినదీ పద్యం-
కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా!
పురవీధి నెదు రెండ బొగడదండ
సార్వభౌముని భుజాస్కంద మెక్కెను గదా!
నగరి వాకిట నుండు నల్లగుండు
వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేయి
వియ్యమందెను గదా! వెదురుగొడియ
ఆంధ్రనైషధ కర్త అంఘ్రి యుగ్మంబున
తగిలి యుండెను గదా! నిగళ యుగము
కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము
బిలబిలాక్షులు తినిపోయె తిలలు పెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
ఎట్లు చెల్లింతు టంకంబు లేడు నూర్లు?
ఇటువంటి ధోరణిలోనే శ్రీపాదవారు వాపోయారు చూడండి-
గౌతమీమాహత్మ్యకర్త కంఠము చుట్టు
కొనియుండెనేగదా! ఋణము చిలువ
కవిమిత్రు మేనెల్ల చివికించెనే గదా!
అప్పులవారి వాక్యాయుధములు
శ్రౌతిమాన్య క్షేత్రసమితి కుదువబెట్ట
బడెగదా! వృషల సంభవుని యొద్ద
అష్టశతావధానాఢ్యున కిప్పుడు
చేరియున్నది గదా! నీరసంబు
పేటలంకల పాట నీపాటు దెచ్చె
మాల పురుపుల పాలయ్యె మరి పొగాకు
అప్పు ముప్పది వేల రూప్యంబు లింక
నెట్లు దీర్చెడు? శ్రీపాద కృష్ణమూర్తి
No comments:
Post a Comment