తెలుగులో భజగోవిందం - 2
సాహితీమిత్రులారా!
(నిన్నటి తరువాయి)........
ఉదయ సాయంత్రములు రాత్రియును దినంబు
శిశిర వసంతములు తిరిగి చేరుచుండు
కాలమాడెడృి క్రీడ ప్రాణాలు పోవు
నరుడు వీడడు యత్యాశ స్థిరమటంచు - 12
ఏల చింతన కాంతాధనాల గూర్చి
నిన్ను నడిపించు దేవునినెఱుగలేవ?
జగతి సజ్జన సంగతి యగును సుమ్ము
భవజలధి దాయగా యాన పాత్రయగును - 13
బోడితలవాడు, జడలున్నవాడు, కాపు
లనుధరించినవాడు విమూఢులగుచు నవని
బహుకృతంబగు వేషాలు పరిఢవిల్ల
ఉదరపోషణ మాత్రకై యెదుటనున్న
దాని జూచి చూడని యటు తరలుచుంద్రు - 14
ములసిదాయె శరీరమ్ము, ముదిసె జుట్టు
దంతములూడి, చేతికి దండమబ్బి
నడువ సాగిన వృద్ధుడౌ నరుని గూడ
వదలునే కోరికల పిండు - వలలుబన్ను - 15
అగ్రమున అగ్ని, వెనుక అహస్కరుండు
చెక్కిలిని రేల మోకాలి జేర్చుసతము
కరమునను భిక్షవాసమ్ము తరుతలమ్ము
ఐన నరునకు వలలౌను ఆశలెలమి! - 16
గంగలోనను వార్థిమునుంగ నేమి
దానములొనర్ప వ్రతములు తనర జేయ
జ్ఞాన హీనున కెట్లు సుజ్ఞాన పథము
నూరుజన్మలకైన చేకూరబోదు - 17
గుడుల తరుమూలముల మెచ్చుకొన వసించి
అజినము ధరించి, భూతలమందు బండి
కడకు భోగాల నన్ని త్యాగమ్ము జేయ
ఏ సుఖము విరాగిని వరింప కుండు? - 18
యోగియైననను సురుచిర భోగియైన
సంగియైనను పరమ నిస్సంగియైన
ఎవడు బ్రహ్మమ్ముతోడ రమించుచుండు
వాడె యానంద స్వస్వరూపమ్ముగాంచు! - 19
కొంచెమైనను గీత పఠించియున్న
గాంగ జలకణ మొకటి త్రాగంగనైన
మది మురారిని సుంత సమర్చ చేయ
జగతి వానికి యమునితో చర్చలేదు - 20
జనన మరణాలు చర్విత చర్వణాలు
మాతృగర్భ నివాసంబు మరలమరల
జగతి తరియింప లేని సంసార జలధి
నో మురారి! కరుణ నన్నుర్వి బ్రోవు - 21
No comments:
Post a Comment