తపోభంగ యత్నం - 1
సాహితీమిత్రులారా!
భారవి కిరాతార్జునీయంలో
అర్జునుడు ఇంద్రకీలాద్రిపై
తపస్సు చేస్తుండగా దాన్ని
భగ్నం చేయడానికి అప్సరసలు
చేసిన యత్నం ఇక్కడ గమనిద్దాం-
శ్రుతిసుఖముపవీణితం సహాయై
రవిరలలాంఛనహారిణశ్చ కాలాః
అవిహితహరిసూనువిక్రియాణి
త్రిదశవధూషు మనోభవం వితేనుః (10-38)
అప్సరసలకు సహాయంగా వచ్చిన
గంధర్వుల వీణాగానం, ఋతువుల
ఫలపుష్పాదుల విజృంభణ అర్జునుణ్ణి
ఏ మాత్రం చలింపచేయలేదు. కాగా
ఆ అప్సరసల మనస్సుల్లో మన్మథుని
ప్రవేశపెట్టి కలచినవి అనగా తన
ఆయుధం శత్రువుపై గాక తనకే చేటు
చేసినట్లుందని భావం.
న దలతి నిచయే తథోత్పలానాం
న విషమచ్ఛదగుచ్ఛయూథికాసు
అభిరతిముపలేభిరే యథాసాం
హరిత నయావయవేషు లోచనాని (10-39)
అప్సరసల నేత్రాలు అర్జునుని అంగప్రత్యంగాల్లోనే
నిమగ్నమయ్యాయి. వికసించిన మల్లె మొదలైన
పూగుత్తులు వారిని ఆకర్షించలేక పోయాయి. దీని
ద్వారా వారి చక్షుః ప్రీతి అనే మన్మథ వికారం
చెప్పాడు కవి.
మునిమభిముఖతాం నినీషవో యాః
సముపయయుః కమనీయతాగుణేన
మదనముపదధే స ఏవ తాసాం
దురధిగమా హి గతిః ప్రయోజనానామ్ (10-40)
అప్సరసలు తమ అందంతో అర్జునుణ్ణి
వశం చేసుకోతలచారు. కాని అర్జునుడే
వారిలో మన్మథ భావాల్ని కలుగజేశాడు
నిజంగా మన ప్రయోజనాల పరిణామం
ఎట్లా ఉంటుందో తెలుసుకోవటం కష్టమే.
అర్జునుని వశం చేసుకోవటానికి బదులు
తామే అతని వశమైనారని భావం.
No comments:
Post a Comment