Sunday, April 30, 2017

తెలుగులో భజగోవిందం -1


తెలుగులో భజగోవిందం -1




సాహితీమిత్రులారా!



శ్రీ అలంకారం కోటంరాజుగారు
ఆంధ్రీకరించిన భజగోవిందం
చూడండి-
భజగోవిందం శ్లోకాలకు
మోహమగద్గరం
అనే పేరు కూడ ఉంది.


చావు దరిగొన్న సమయాన చాకునే, డు
కృఙ్కరణ సూత్రమింత ధరిత్రిలోన
మూఢ! గోవిందు భజింపు మోయి నిన్ను
వాడె రక్షించు జగతి నవార్యగతిని - 1

మనసునం గోరికలు మాను మాన్యబుద్ధి
ధనమునందాస వీడుము ధాత్రిలోన
నీదు నిజకర్మలభ్యమ్మదేది యగునొ!
దానదనరుము మూఢ! విధాన మదియ  - 2

మనసునందున చింతించి దినముదినము
పడతి చనుదోయియును నాభిపద్మమరసి
మోహపడబోకు, వానికై దేహమందు
కల్గు మాంసంపు ముద్దలుగావె తెలియ!  - 3

ఔర! నలినీదళంబుపై నీరమట్లు
బ్రదుకుచంచలమై కడు పరిఢవిల్లు
లోకమంతయు నెంతయో రోగశోక
మోహములతోడ నిండారు మూఢ! వినుమ  - 4

విత్త సముపార్జనా సక్త చిత్త వృత్తి
కలుగు తఱి నిన్ను నీవారు పలుకరింత్రు
జర్జరితమౌచు దేహమ్ముసాగు నపుడు
ఎవరు గేహాన నిను పల్కరింతు రెరుగ?  - 5


దేహమందున ప్రాణమ్ము తేజరిల్ల
యెన్న క్షేమమ్ము నరసెద రింటిలోన
దేహ మందున ప్రాణమ్ము తీరువెన్క
భార్యయే భీతి పడు కళేబరము జూచి    - 6

బంధురమ్ము క్రీడాసక్తి బాల్యమందు
వనితలన్న యాసక్తి యౌవ్వనమునందు
వృద్ధుడైన చింతాసక్తి వృద్ధియగును
బ్రహ్మమన్న నిరాసక్తి బరపు గాదె!            - 7


ఎవరు నీ భార్య?  నీపుత్రుడెవరు జెపుమ?
చిత్రమైనది సంసార జీవనంబు
ఎవ్వడవు నీవు? నీరాక యెచటనుండి
తమ్ముడా! యిపుడు సల్పు యదార్థ చింత!   - 8

సజ్జన స్నేహకలన నిస్సంగమమరు
పుడమి నిస్సంగమునను నిర్మోహమమరు
రహిని నిర్మోహమున నిశ్చలత్వమమరు
నిశ్చలతయె జీవన్ముక్తి నిచ్చు నెపుడు   - 9

కరుగ వయసును కామవికారమేది?
నీరు యెండిన తఱిని కాసారమేది?
ధనము నశియింప యెవరు బాంధవులు జూడ
జ్ఞానియౌ వాని కేది సంసారమరయ!        - 10


ధనము జనమును జూచి యౌవ్వనము జూచి
గర్వపడకు, యొకనిమేష కాలమందు
అన్ని నశియించు, మాయా మయంబటంచు
నెఱిగి సద్భ్రహ్మ పదవి వరింపుమీవు       - 11






No comments:

Post a Comment