Wednesday, May 17, 2017

భారవి వసంతర్తువు


భారవి వసంతర్తువు




సాహితీమిత్రులారా!


భారవి కిరాతార్జునీయమ్ లో
అర్జునుడు పాశుపతం కోసం ఇంద్రకీలాద్రిపై
తపస్సు చేసుకొనే సమయంలో
వసంతర్తు వర్ణన చూడండి-
దశమసర్గలో 31వ శ్లోకం నుండి
35వ శ్లోకం వరకు.


కుసుమనగవనాన్యుపైతు కామా
కిసలయినీమవలంబ్య చూతయష్టిమ్
క్వణఁదలికులనూపురా నిరాసే
నలినవనేషు పదం వసంతలక్ష్మీ - 31

పుష్పవనాలను చేరాలనే కోరికతో
వసంతలక్ష్మి చిగిర్చిన మామిడి
కొమ్మను పట్టుకొని తుమ్మెద రొద
అందెల ధ్వనికాగా పద్మవనాలను
వదలిపెట్టింది.

వికసితకుసుమాధరం హసంతీం
కురవక రాజీవధూం విలోకయంతమ్
దదృశురివ సురాంగనా నిషణ్ణం
సశరమనంగమశాకపల్లవేషు   -32

వికసించిన పువ్వులనే పెదవి
కదిలిస్తున్న గోరింట చెట్లనే
వధువును చూస్తూ కొత్తగా చిగిర్చిన
అశోక చెట్లపై బాణం ధరించిన మన్మథుణ్ణి
చూచినట్లు అప్సరాంగనలు చూచినట్టు భావించారు.

ముహురనుపతతా విధూయమానం
విరచితసంహతి దక్షిణానిలేన
అలికులమలకాకృతిం ప్రపేదే
నలినముఖాంతవిసర్పిపంకజిన్యాః  -33

మెల్లగా వీస్తున్న మలయానిలంతో
కదల్చబడిన తామరల ముఖాలనే
పద్మాలపై తుమ్మెదలు చేరి ముంగురుల
అందాన్ని కలిగించాయి.

శ్వసనచలితపల్లవాధరోష్ఠే
నవనిహితేర్ష్యమివావధూనయంతీ
మధుసురభిణి షట్పదేన పుష్పే
ముఖ ఇవ శాలలతావధూశ్చుంబే   -34

సాలవృక్షంకొమ్మ అనే వధువు పుష్పమనే ముఖాన్ని
చిగురు అనే పెదవిని, మకరందం అనే మధువును
కలదై గాలితో కదలుతుండగా కోపించినట్టుంది.
తుమ్మేద అనే ప్రియుడు మాటిమాటికి దాన్ని
సమీపించి కోపం తగ్గించేందుకు పుష్పాన్ని
మకరందం కోసం చేరటం ముద్దుపెట్టుకొన్నట్టు
భాసించింది.

ప్రభవతి న తదా పరో విజేతుం
భవతి జితేంద్రియతా యదాత్మరక్షా
అవజితభువనస్తథా హి లేభే
సితతురగే విజయం న పుష్పమాసః  - 35

జితేంద్రియత్వం ఎంతవరకు తనను రక్షిస్తుందో
అంతవరకు శత్రువు అతణ్ణి జయించలేడు.
ముల్లోకాలను జయించిన వసంతర్తువు
జితేంద్రియుడైన అర్జునుణ్ణి జయించలేకపోయింది.
వసంతర్తువు అర్జునుణ్ణి ఏ మాత్రం చలింపచేయలేదు.


ఈ విధంగా భారవి వసంతర్తువును వర్ణించాడు.

No comments:

Post a Comment