Tuesday, February 28, 2017

ఈ కాలంలో దీన్ని పాటించేవారున్నారా!


ఈ కాలంలో దీన్ని పాటించేవారున్నారా!

సాహితీమిత్రులారా!


అంపశయ్యమీదున్న భీష్ముడు
ధర్మరాజుకు చేసిన హితోపదేశాలలో
ధననిరసన ఒకటి-
ఇవి శాంతిపర్యంలో 4-33నుండి
38 వరకు ఉన్నాయి.
అవి-

ధనము కలిమియు లే్మియుఁ ద్రాసునందు
నిలిపి యెత్తంగ ములుపూపె నిర్ధనత్వ
మెక్కుడు దాని దిక్కున నెట్టు లన్న
మినుము గుణదోషముల భంగి విస్తరింతు

(ధనము కలిగిఉండటాన్ని ధనం లేకపోవటాన్ని
రెండింటిని తెచ్చి తక్కెడలో రెండుప్రక్కల ఉంచి
పైకి ఎత్తగా ధనం లేకపోవడమే ఎక్కువ బరువు కలిగి
ఉండుటవలన దానివైపే ముల్లు సూపి నిర్ధనత్వఘనతనే
సూచించినది. అలా ఎందుకు సూచించినది అంటావా
సారవంతమైన దెప్పుడు బరువుగను నిస్సారమైనది తేలికగా
ఉండటం లోకంలో సహజమైన విషయమే కదా
గుణదోషాలు వివరిస్తాను, ఆలకించు...)

ధనముగలవాఁడు మృత్యు వ
దనమున నున్నట్లు భయము దన చిత్తమునన్
దనుకఁగ నుల్లల నుడుకును
విను శిఖిచోరాదిముఖ్యవిషయాపదకున్
(ధనముగలవాడు మరణదేవత నోటిలో ఉన్నట్లుగా

నిత్యమూ తన చిత్తమునందు భయం పీడించగా
 దుఃఖపడుతూ ఉంటాడు. అెంతమాత్రమేకాదు
 సంపాదించిన ధనమంతా ఏ అగ్ని ప్రమాదమువల్లనో
 బూడిద కావచ్చు లేదా దొంగలు దోచుకొనిపోవచ్చు.
ఇత్యాదిగా ఊహించుకొనే ముఖ్యసంఘటనల(విషయ)
 ఆపదకి ఆ మనిషి మనస్సు కుతకుత ఉడికి పోతూ ఉంటుంది)

కోపంబును లోభంబును
నేపారి మనంబు గలఁపనెప్పుడుఁజింతా
తాపంబునొందు సధనుం
డాపదగా కవ్విధము సుఖావహ మగునే

(ధనం వల్ల దుఃఖం కలగడానికి కారణాలు ఇంకా మరికొన్ని ఉన్నాయి.
అవన్నీ ధనవంతుని చుట్టుముట్టి అతడిని సుఖం నుండి దూరం చేస్తాయి.
 అవేమంటే - తన వద్దనున్న ధనాన్ని ఆశించి యాచకులు తన వద్దకు
 వస్తారేమోనని భయంతో వారు తన దగ్గరకేరాకుండా
కోపాన్ని వహించి ఉంటాడు. అంతేకాక ఆర్జించిన ధనంతో
 సంతృప్తి పడకుండా ఇంకా ఇంకా సంపాదించాలని
 పేరాశ(లోభము)కలిగి ఉంటాడు. ఈ రెండు గుణాలూ
 ఎప్పుడూ జంటగానే కలిసిపోయే వచ్చి నిరంతరం
 మనస్సును కలచివేస్తూ ఉంటాయి. ఆ విధంగా ధనవంతుడు
 ఎల్లప్పుడూ దుఃఖాన్ని దిగులును పొందుతూ ఉంటాడు
ధనవంతుని ఆ దుఃఖస్థితి బాధాకరంగాక ఆనందదాయకమవుతుందా)

ఎచ్చోటనైన నధనుఁడు
విచ్చవిడి నుండు, లేదు వెఱపించుకయున్,
బొచ్చెపుఁ జందం బొల్లఁడు
మెచ్చరె సురలైనఁ బలుకు మృదువైయుండున్

(ధనంలోనివాడు ఎక్కడైనా భయంలేనివాడై
 స్వేచ్ఛగా ఉండగలడు,ధనం ఉండటం వలన కలిగే అనర్థాల
భయం ఏమాత్రం అతనికి ఉండదు. కాబట్టి అతడు
జీవితంలో కపటపూరిత విధనాన్ని ఇష్టపడడు. అంతే కాదు
 ఇతరుల్ని ఈసడించి పలికే నోటి దురుతనం నిర్ధనుడిలో
 ఉండదు. అతడి మాట ఎప్పుడూ చాల ప్రియంగా ఉంటుంది.
 ప్రియభాషిని దేవతలుసైతం మెచ్చుకుండ ఉండగలరా)

లోకము చందముఁగనుఁగొని
యీ కానఁగ నగు ధనాదు లెల్లనుఁగాల
వ్యాకులతఁ బొందఁగలయవి
గాకుండమి యెఱిఁగి విడుపు గడుఁజదు రెందున్

(లోకరీతిని బాగా తెలుసుకొని కంటికి స్పష్టంగా
 కనబడే ఈ ధనకనక వస్తువాహమాదులు అన్నీకూడ
 కాలప్రభావంచేత నాశనం చెందకుండా శాశ్వతంగా
 ఉండజాలవు అనే స్థతిని గ్రహించి ఆ ధనాదులను
 విడిచి పెట్టుట ఎప్పుడయినా ఎక్కడైనా ఎవరికైనా
 కడుంగడు నేర్పరితనం కాగలదు.)

ధనవత్త్వము దుఃఖకరం
బని కని తత్కాంక్ష విడుచునతని కధనతా
జనితాత్మాధీనత్వం
బనుపమసౌఖ్యంబు సేయు నక్షీణముగన్

(ధనం కలిగియుండటం చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది
 అని తెలిసికొని అటువంటి ధనం మీద కోరికను విడిచిపెట్టినవాడికి
 కలిగే సఖం ఏమిటో చెబుతున్నాడు. ధనం లేకపోవడం
 వలన మనిషి తన మనస్సును అధీనంలో ఉంచుకోగలుగుతాడు.
 ఆ ప్రకారంగా కలిగిన అధీనతా గుణం అతడికి సాటిలేని ఆనందాన్ని-
 సుఖాన్ని అత్యధికంగా కలిగిస్తుంది)
అని చెప్పాడు.

ఇందంతా బాగుంది కాని ఈ కాలంలో దీన్ని పాటించేవారున్నారా
ధనం లేకపోతే నిద్రపట్టనివారు ఎందరున్నారో
ధనం పోయిందంటే గుండె ఆగి పోయే వారులేరా?
మరి అలాంటిదాన్ని వదిలివేయగలమా?
అది ద్వాపరయుగం కాబట్టి ఆయన విన్నాడేమో కాని
 ఇప్పుడైతే వినరుగాక వినరు. మరి మీ అభిప్రాయమేమో చూడండి.

No comments:

Post a Comment