Monday, February 27, 2017

దూత ఎలా ఉండాలి?

దూత ఎలా ఉండాలి?




సాహితీమిత్రులారా!



రామాయణంలోని శ్లోకం ఇది
26-02-17న ముఖపుస్తకంలో
అంబాళం పార్థసారథిగారు
ఉంచిన వ్యాఖ్యతో చూడండి-
అనురక్తః శుచిర్దక్షః స్మృతిమాన్ దేశకాలవిత్
వపుష్మాన్ వీతభీర్వాగ్మీ దూతో రాజ్ఙః ప్రశస్యతే
                                                                                        -- రామాయణం.
రాజు అంటే గౌరవంతో కూడిన ప్రేమ గలవాడు, 
అవినీతికి దూరంగా ఉండే వాడు, సమర్థత గలవాడు, 
జ్ఙానవంతుడు, దేశకాల తత్వం తెలిసిన వాడు, 
శరీర సౌష్టవం కలవాడు, భయం లేనివాడు, 
ధీటైన మాటలు నేర్చినవాడు మంచి దూతగా 
రాజు చేత ప్రశంసించబడుతాడు.

ఒక రాజ్యం తరపున, రాజు తరపున ఇంకొక 
రాజ్యానికి నియమింపబడిన వార్తాహరుడిని, 
దూత అంటారు. ఈ రోజుల్లో రాజులు లేరు, 
రాజ్యాలు లేవు కాబట్టి, సంస్థలలో పనిచేసే 
ఉద్యోగులకు ఎలాంటి అర్హతలుండాలో, 
రామాయణం లోని శ్లోకంలో చక్కగా 
వివరింపబడ్డాయి.

దూత అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది 
శ్రీరామ దూతయైన ఆంజనేయస్వామి. 
మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడి పక్షాన, 
రాక్షస చక్రవర్తి, రావణుడితో సంధి చేసుకోడానికి వెళ్తున్న 
దూత ఎలా ఉండాలి? ఈ శ్లోకంలో చెప్పిన అన్ని 
లక్షణాలు మూర్తీభవించిన హనుమంతుడి లాగా ఉండాలి
.
శ్రీరామదూతగా వెళ్లి సభలో రావణుడికి హితబోధ చేస్తూ, 
హనుమంతుడు పలికిన పలుకులు మహోన్నతమైనవి. 
ఆంజనేయస్వామి అసదృశమైన జ్ఙానం ఇక్కడ తెలిసిపోతుంది. 
చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పడం, ఉచితజ్ఙత పాటించి 
ఎదుటి వారితో మాట్లాడే విధానం, ఈ ఘట్టంలో కొనియాడబడే 
విధంగా ఉంటుంది.

వివిధ సంస్థలలో ఉద్యోగులుగా పని చేసే వారు, 
హనుమంతుడి లక్షణాలను ఆకళింపు చేసుకొనగలిగితే, 
ఆ సంస్థల గౌరవం ఇనుమడిస్తుంది. సంస్థల పుట్టు 
పూర్వోత్తరాలు క్షుణ్ణంగా తెలుసుకోవడం, పని చేస్తున్న 
సంస్థలపై మొక్కవోని గౌరవం, నిజాయితీ, స్వామి భక్తి, 
తయారు చేసిన వస్తువులను గుఱించి పూర్తి జ్ఙానము, 
ఆకర్షనీయమైన ఆకట్టుకునే రూపం, చక్కగా మాట్లాడే నిపుణత, 
ఈ లక్షణాలతో పనిచేసే ఉద్యోగులు, 
ఆ సంస్థలకు మూలస్తంభాల్లా, పెట్టని కోటలా ఉంటారు.

No comments:

Post a Comment