తలుపుల రసీదు
సాహితీమిత్రులారా!
ఈ కథను ఆస్వాదించండి............
బొబ్బిలిలో యూనివర్సిటీ పెట్టే విషయంలో పెద్దగొడవ జరిగింది. గొడవ బొబ్బిలి వాళ్ళకి విజయనగరం వాళ్ళకి మధ్య కాదు. బొబ్బిల్లో ఉన్న బొబ్బిలి వాళ్ళ మధ్యే. యూనివర్సిటీ పేరు పెట్టడంలో పేచి వచ్చింది. కొందరు వీరబొబ్బిలి యూనివర్సిటి అనాలని, కొందరు “కాదహే…. రెండొందల ఏబైమంది ఇక్కడ మిగలకుండా చచ్చిపోతే ఈరత్వం ఏడంటుంది? ఉప్పుడు మనం అంతా కేవిస్ కాబట్టి వి బిల్ కాదు కెవిబిల్ ఊనివర్సిటి అని పేరు పెట్టాలి” అని. ఇదీ గొడవ. కేవి అని పెడితే కులం తీసుకొచ్చినట్లవుతుందని కొందరు వాదించారు. యూనివర్సిటీ అత్యున్నత అధికారులను కులపతి, ఉపకులపతి అని అంటారు కదా అని వెంఠనే మరొకరన్నారు. కులపతి అంటే ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ అని బోధపరిచి ఎలాగో ఒకలాగా అందరిని ఒక కొలిక్కి తీసుకొచ్చాను.
బోష్టన్ యూనివర్సిటిని బియు అంటారు. బ్రౌన్ యూనివర్సిటి ఉంది. బర్మింగ్ హమ్ యూనివర్సిటీ ఉంది. ఇలా చాలా బితో మొదలయ్యే యూనివర్సిటీలు ఉన్నాయి. మనం కూడా బొబ్బిలి యూనివర్సిటి అని పేరు పెడితే బియు ఆఫ్ ఇండియా అంటారు. వాళ్ళంతా మనతో కలిసి బొబ్బిలి యూనివర్సిటీని అభివృద్ధి చేస్తారు అని రాత్రి పగలు కష్టపడి అందరిని బొబ్బిలి యూనివర్సిటీ అన్న పేరుకు ఒప్పించాను.
అందరిని ఒప్పించేను కాబట్టి వీళ్ళతో కలిసి పనిచేసి యూనివర్సిటిని నిలిపి నాలుగు డిగ్రీలు ఇచ్చి పదిమందికీ పనికి వచ్చేలా ఓ రూపకల్పన చెయ్యమన్నారు. దేశంలో వేల వందల యూనివర్సిటీలు కావాలని అందరూ అంటున్నారు. కాని వాటిని నడపడానికి, పాఠాలు చెప్పడానికి, మంచి రిసెర్చి చెయ్యడానికి కావల్సినంత మంది మనుషులు లేరు. ఇంజినీరింగ్ కాలేజీలకే దిక్కు లేకుండాపోతున్నాది మరి యూనివర్సిటీ అంటే మాటలా. మీరు ఇక్కడ ఉండి ముఖ్యమైన వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకొని అప్పుడు కాని మీరు వెళ్ళండి అన్నారు.
బొబ్బిలి యూనివర్సిటి నడపడానికి అర్హులైన వాళ్ళు అన్ని రకాల ఉద్యోగాలకి కావలెను అని ప్రపంచవ్యాప్తంగా నెట్ ప్రకటన ఒకటి ఇచ్చాం. వచ్చినవాళ్ళకి ఇవాళ ఇంటర్వ్యూలు చేస్తున్నాం. ఇప్పటికే ఓ ఇరవై మందిని ఎడ్మినిస్ట్రేషన్ లో ఒక ముఖ్యమైన ఉద్యోగానికి ఇంటర్వ్యూ చేసాం. దేశదేశాల నుండి వచ్చిన తెలుగు వాళ్ళున్నారు. ఇంకా మరో పది మందిని ఇంటర్వ్యూచెయ్యాలి. ఒక్క పదినిముషాల విరామం తరువాత మొదలుపెడ్తాం అని అనుకొన్నాం.
నేను ఎలక్ట్రానిక్ పేపరు రెండు చేతుల మధ్య పట్టుకొని చదువుతున్నాను. ఈ ‘ఈ-పేపరు’ పూర్వం అచ్చం పేపరు చదివినట్లే విప్పి రెండు చేతులతో పట్టుకొని చదువుకోవచ్చు. పూర్వం లేప్‌టాప్ లాంటి స్క్రీన్ లో చక్కగా అన్ని రంగులు అచ్చం కాగితం మీద కనిపించినట్లు కనిపిస్తాయి. సేటిలైట్ ద్వారా వచ్చే సంకేతాలతో మొత్తం పేపరంతా చదవచ్చు. ఈ పరికరంలో ఏ పేపర్ కావాలంటే ఆ పేపరు, ఇంగ్లీషు, తెలుగు ఏభాష కావాలంటే ఆ భాషలో చదవచ్చు. తెలుగు పేపరుని ఇంగ్లీషులో, లేమాంద్ అన్న ఫ్రెంచి పేపరుని తెలుగులో చదవచ్చు. అంతా గూగుల్ టెక్నాలజీ మహిమ.
సరిగ్గా అలాంటపుడు ‘మే ఐ కమిన్… నేను రావచ్చా?’ అని రెండు భాషలలో అంటూ పొడవైన ఒక అభ్యర్థి లోపలికి వచ్చాడు. అంటే విరామ సమయం అయిపోయిందన్నమాట అని అనుకొన్నాను, ఈపేపర్ ని చుట్టి జేబులో పెన్నులా పెట్టుకొంటూ!
అతన్ని ఎక్కడో చూసాను సుమా అని అనుకొన్నాను. అచ్చం మా కనకప్రసాద్ లాంటి మొహం. కళ్ళద్దాలు కూడా అలాగే అనిపించాయి. వయస్సు 55 దాటి ఉంటుంది. ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎవరూ కళ్ళద్దాలు పెట్టుకోవడం లేదు. కళ్ళకి కావలసిన సర్జరీలు చేయించేసుకొంటున్నారు. ఇదుగో ఇలా ఏభైలు దాటిన వాళ్ళే అలవాటు కొద్ది కళ్ళజోళ్ళు పెట్టుకొంటున్నారు.
“మీపేరు” అని అడిగాను.
“తలుపుల రసీదు” అన్నాడు తెలుగు కొత్తగా నేర్చుకున్నవాడిలా.
“తలుపుల ఇంటిపేరు అయ్యుండాలి, రైట్!” అన్నాను నవ్వుతూ.
“అవునండి. మాదికూడా బొబ్బిలే” అదో క్వాలిఫికేషన్ లా అన్నాడు.
“కాని ఈ రసీదు అన్న పేరే ఆశ్చర్యంగా…”
“నా అసలు పేరు రషీద్ అండీ. చాలామంది సరిగ్గా పిలవలేక చివరికి రసీద్, రసీదు అయిపోయిందండి” అన్నాడు కొద్దిగా సిగ్గుపడుతూ.
“సరే. మీరేం చదువుకొన్నారు…” అని బటన్ నొక్కి నా అరచేతిలో ఉన్న గూగుల్ ఆర్గనైజర్లో అతని పేరుతో ఉన్న బయోడేటాని వెతుక్కోవలసి వచ్చింది. ఎక్కడా డిగ్రీ కనిపించలేదు. మిస్సయ్యేనేమోనని మరొకసారి చూసాను. లేదు. మీకు ఏ డిగ్రీ లేదా? అన్నాను ఆశ్చర్యంగా.
“లేదండి…” అన్నాడు వినయంగా
“మరి ఇంటర్వ్యూలోకి ఎవరు రానిచ్చేరు” అని గట్టిగా అరిచాడు ఇంటర్వ్యూ చేసే మరో కమిటి సభ్యుడు.
“నన్ను పిలవలేదండి. కానీ ఉద్యోగం తప్పక ఇస్తారన్న ఆశతో నా అంతట నేనే లోపలికి తలుపు తోసుకొచ్చానండి” అని ఓ క్షణం ఆగి “క్షమించండి” అన్నాడు.
“క్షమించేం. వెళ్ళండి. పెద్ద పెద్ద క్వాలిఫికేషన్లతో ఎంతోమంది బయట వెయిట్ చేస్తున్నారు” అన్నాను చిరాగ్గా.
“నా బేక్ గ్రౌండ్…”
“రిజర్వేషన్లంటే లాభం లేదండి. రిజర్వేషన్లు పోయి చాలా ఏళ్ళు అయ్యింది. మీరు ముస్లిం అయినా మరేదయినా నో యూజ్” అన్నాను వెళ్ళమని చెయ్యి చూపిస్తూ.
“నా ఎక్స్పీరియన్స్…”
“ఏంటి మీ ఎక్స్పీరియన్స్…” ఒక కమిటీ సభ్యుడు మర్యాదగా అడిగాడు.
“అమెరికాలో…”
“అమెరికాలో ఎక్స్పీరియన్స్ ఎవడికి కావాలండి…” అన్నాడు ఇంకో కమిటీ మెంబరు.
“అమెరికాలో నేను ఒక పెద్ద సంస్థ నడిపానండి.” అన్నాడు ఒక పెద్ద ఫైల్ తీసి టేబుల్ మీద పెడుతూ.
“ఆ సంస్థ ఏం చేసేది.”
“కంప్యూటర్ల ఆపరేషన్ సిస్టమ్స్, ప్రోగ్రామ్ లు…”
“సరే మరి అవన్ని మీరు మాకు పంపారా?”
“పంపానండి”
“మరి మా గూగుల్ ఫోన్ ఆర్గనైజర్ డేటాబేస్ లో లేవే!” అన్నాం అందరం గబగబ మరోసారి వెతికి.
“బహుశా ఫార్మాట్ ప్రాబ్లమ్ అయింటుందండి… నేను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2010లో పంపానండి.”
“అలా చెప్పండి గూగుల్ డాక్స్ లోనే గత పదేళ్ళుగా ప్రపంచం ఉంటే మీరు ఇంకా ఎప్పుడో పాత మైక్రోసాఫ్ట్ పట్టుకు వేలాడితే ఎలా?” అతను చెప్తున్న ప్రతి మాటని నేను గూగుల్ ‘బ్రెయిన్’ లోకి పంపుతున్నాను. కంప్యూటర్లు పోయి లేప్‌టాప్‌లు, లేప్‌టాప్‌లు పోయి గూగుల్ బ్రెయిన్‌లు వచ్చేసాయి. నానో టెక్నాలజీ, బయోమెటీరియల్ సైన్సులు బాగా డెవలప్ అయి టెరాబైట్ కంప్యూటర్లు చిన్న క్రెడిట్ కార్డు సైజుకి దిగిపోయాయి. దాన్ని కూడా అతి పల్చగా తయారు చేస్తున్నారు. దాన్ని విడిగా పట్టుకొని తిరగడం కష్టం కాబట్టి కావాలనుకొన్న కొంతమంది తలపై భాగంలో ఓ చిన్న సర్జరీతో అమరుస్తారు. దానిని మనుషులు ఆలోచనతో నడుపుతారు. ఆలోచనల తీరు, జోరు, ఆ గూగుల్ బ్రెయిన్ కనిపెట్టి అడిగిన వివరాలను అందిస్తుంది. దానికి కావలసిన విషయాల కొన్ని దానిలో పొందు పరిచినా అపారమైన విజ్ఞానాన్ని, విశేషాలని, వివరాలని సేటిలైట్ ద్వారా నానో సెకన్ల లో తీసుకొంటుంది. మౌఖికం పోయి తాళపత్రాలు, తాళపత్రాలు పోయి అచ్చుపుస్తకాలు, అచ్చుపుస్తకాలు పోయి కంప్యూటర్లు, కంప్యూటర్లు పోయి గూగుల్ బ్రెయిన్ వచ్చేసింది.
సాధారణంగా మాలాంటి వాళ్ళంతా గూగుల్ బ్రెయిన్ తో పని చేస్తున్నాం చాలా మట్టుకి. అప్పుడప్పుడు మాత్రమే స్వంత బ్రెయిన్ వాడేది. అది కూడా ఏదో అమ్మాయితో, ప్రేమగా కబుర్లు చెప్పడానికి మాత్రమే. అనుభూతులు ఇంకా గూగుల్ బ్రెయిన్ పరిధిలోకి రాలేదు. అనుభవాలని మాత్రం దాస్తున్నది.
మిగిలిన కమిటీ సభ్యులు అతనిని రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. అతను తాపీగా సమాధానాలు చెప్తున్నారు. నేను కళ్ళు మూసుకొని అతని సమాధానాలని నా గూగుల్ బ్రెయిన్ లోకి పంపుతున్నాను. గూగుల్ బ్రెయిన్‌ని ఈ సమాధానాలని అన్నింటి శోధించి అతని గురించిన అసలు వివరాలని ఇమ్మని ఆజ్ఞ ఇచ్చాను. అది ఇచ్చిన సమాధానం విని ఆశ్చర్యంతో లేచి నిలుచున్నాను. నోటమాట రాలేదు. ఏమైయిందో తెలియక నాతో పాటే అందరూ నిలుచున్నారు. నేను కొద్దిసేపటికి తేరుకొని…
“మీరు బిల్ గేట్సా?” అన్నాను ఒక్కొక్క అక్షరం వత్తి పలుకుతూ.
“అవును. చిన్నప్పుడే అమెరికా వెళ్ళిపోయాను మా కుటుంబంతో. అసలు పేరు మీద మమకారంతో తలుపుల రసీదు పేరుని బిల్ గేట్స్ గా మార్చుకొన్నాను”, అన్నాడు చిర్నవ్వుతో!
-----------------------------------------------------------
రచన: కలశపూడి శ్రీనివాసరావు,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment