Sunday, October 21, 2018

మా నాన్న నాకేమిచ్చారు?


మా నాన్న నాకేమిచ్చారు?
సాహితీమిత్రులారా!

ఈ కథ ఒకనాటి యువ లోనిది. దీన్ని ఈమాటలో పునర్మిద్రించారు
మరి ఎలాంటిదో ఆ కథ ఆస్వాదించండిక్కడ..............

ఫిఫ్తు ఫారం మొదలు బియ్యస్సీ దాకా ఒకేచోట కలసి చదువుకొని బ్రతుకుతెరువు కోసం ఎవరిమటుకు వాళ్లు విడిపోయినా రవణమూర్తీ రామ్మూర్తుల మనస్సులు మాత్రం ఎప్పుడూ కలుసుకుని కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాయి. అందుకనే ఒక మూర్తి ఈ లోకం నుంచి తప్పుకున్నా రెండవ మూర్తి లోకంలో మాత్రం ఆ మూర్తి స్ఫూర్తి ఎప్పటికీ కళకళలాడుతూనే ఉంటుంది. అలాంటి ఒక సందర్భంలో రవణమూర్తి ఓసారి స్నేహితుడి కొడుకుని చూడ్డానికి వచ్చాడు.

“ఇదిగో, అలా నువ్వు కంట తడి పెడితే నేను రాకనే పోదును. మామూలు రకం పరామర్శలకయితే రోజులు దాటకుండానే వచ్చి ఉందును; మూడు నెలలు దాటాక రావడమెందుకూ?”

రవణమూర్తి గోపాలం చెయ్యి మొహంనించి బలవంతంగా అడ్డు తీసేశాడు. గోపాలం రెండు కళ్లల్లోంచీ కన్నీళ్ళు కాలవలుగట్టేయి. “ఓహో అంటే ఓహో అనుకునే స్నేహితులు వందలకొద్దీ ఉన్నా మనస్సు విప్పి చెప్పుకునేవారు ఏ ఒకరో యిద్దరో ఉంటారు. నెల్లాళ్లకి ఒకమారయినా మీ గురించి వింటేనేగాని నాన్నగారికి తోచేది గాదు బాబాయిగారూ! మిమ్మల్ని చూస్తుంటే నాన్నగారు జ్ఞాపకం వచ్చి నా మనసు మరీ కెలికేసినట్లు అవుతోంది.”

“అబ్బే, అదేవిఁటి బాబూ బొత్తిగా చిన్నపిల్లాడిలా!”

“లేదు. నేను చిన్న పిల్లాడిని అనుకునే వారింకెవరూ లేరు. చీరలూ నగలూ యిచ్చే మొగుణ్ణి మా ఆవిడకి నేనున్నాను. బిచకత్తులూ పిప్పరమెంతు బిల్లలూ తెచ్చే నాన్నని మా పిల్లలకి నేనున్నాను. నాకెవరున్నారు? మనమల్ని ఎత్తగల వయస్సున్న కొడుకయినా సరిగ్గా తింటాడో లేదో అని భోజనం దగ్గర విసనకర్రతో ప్రత్యక్షమయ్యే తల్లి నాకు ఏనాడో కరవయింది. కొండంత నీడ, ఆకాశమంత అండ మా నాన్న కూడా నాకు లేకుండా పోయాడు… ఇంక నాకెవరున్నారు?”

గోపాలం వెక్కి వెక్కి ఏడ్వనారంభించాడు. విడదీసినకొద్దీ దెబ్బలాట ఎక్కువైనట్టు, తవ్వినకొద్దీ గొయ్యి పెద్దదైనట్టు అనునయించిన కొద్దీ విచారం ఎక్కువౌతుంది. అందుకనే అనుభవం గల రవణమూర్తి గదిలోకి వెళ్లి పుస్తకాలన్నీ వెతికి ‘హేమ్లెట్’ పట్టుకొచ్చాడు. పుస్తకం అటూయిటూ తిప్పి ఒక పేజీ దగ్గర ఆగేడు. “ఇది నువ్వు చదివావుగా బాబూ! తండ్రిని కోల్పోయి సర్వస్వాన్నే కోల్పోయినట్టు బాధపడే హేమ్లెట్‌కి చెప్పినట్టు చెబుతూ షేక్స్పియరు మానవాళికి అందించిన మహత్తర వాక్యాలు చూడు…”

గోపాలం ఆశ్చర్యంగా ఆ వాక్యాలు చదివేడు. సద్గ్రంథాలకీ జీవితాలకీ అంత సామీప్యం ఉంటుందని అతనెప్పుడూ అనుకోలేదు.

ఆ వాక్యాల సారాంశం యిది- ‘ఇందులో కొత్తదనం గాని విచారించవలసింది గాని ఏముందీ? నీ తండ్రి తన తండ్రినీ, ఆయన వాళ్ల తండ్రినీ… అలా ఎందరో వాళ్ల తండ్రుల్ని కోల్పోయారు. నువ్వీనాడు నీ తండ్రిని కోల్పోవడం అతి సహజం. ఇందులో వింతేమున్నది? చింతేమున్నది? ప్రకృతి సూత్రం అంతేనన్నది!’

గోపాలం పుస్తకాన్ని ఆ పేజీ దగ్గర విరచి అలాగే టేబిలు మీద పెట్టేడు. ఆ మధ్య మొహం పెట్టి కళ్లు మూసుకున్నాడు.

గోపాలం యింకా ఇంటికి రాలేదు. రవణమూర్తి ఒక్కడూ గదిలో అటూయిటూ పచారు చేస్తున్నాడు. అతను ఆ ఇంట్లో చూసిన రామ్మూర్తి తాలూకు వస్తువులు- పొడుంకాయ, టైరుజోడు, రోల్డ్‌గోల్డ్‌ ఫ్రేం కళ్లజోడు, చిన్న వివేకానందుడి ఫోటో- ఇలాంటివాటికన్నా అతని జ్ఞాపకాలు- ముఖ్యంగా నిర్లిప్తత, సంతృప్తి, హాస్యం మేళవించిన అతని చమత్కార సంభాషణలు రవణమూర్తిని కదిలించాయి.

‘వెధవ పిల్లి, పాలన్నీ ఎలా పారబోసిందో!’

‘బాగుంది. గిన్నెలోనే ఉండి వేడిగా ఉంటే అదెలా తాగగలదు మరీ? అన్ని పాలూ మనమే ఊనబడితే దాని కడుపు నిండేది ఎలా? అయినా నేడో రేపో ఈనేట్టుంది కూడాను.’

‘అదేవిఁటీ, దేవుడికి లేకుండా ఆ పువ్వులన్నీ ఊరూ వాడా పంచిపెట్టేస్తున్నారా, ఏం మనుషులమ్మా!’

‘బాగుంది. మూడొంతుల మంది దేవుళ్లు పువ్వుల్లో పుట్టినవాళ్లే… వాళ్లకి మళ్లీ అవే యిస్తే బాగుంటుందా మరీ?’

‘రామం, మొన్న బస్సులో వస్తూంటే నీ పర్సు పోయిందిట పాపం?’

‘బాగుంది. అందులో ఉన్నదెంతగనక? పాపం ఓ పూట ఓ కుటుంబానికయినా కడుపు నిండేనో లేదో… అయినా నాలాంటి అజాగ్రత్తపరుల్నందర్నీ ముందు జైల్లో పెడితే దేశంలో దొంగతనాలు తగ్గునేమో!’

‘ఏవండీ చూశారా, నల్లెలా అంటబొడిచేసిందో… ఎంత దద్దురెక్కిపోయిందో!’

‘బాగుంది. జడ్జీగారి కూతుర్ని నల్లి పిల్ల కుట్టటమే! అంత బొత్తిగా భయం భక్తీ లేకుండా పోయిందా? దొంగ రాస్కెల్‌, ఈమారు కనబడనీ కనుక్కుందాం!’

‘పాపం, కోడలు ఇంటికి వచ్చేవరకైనా మీ ఆవిడ బతకలేకపోయింది…’

‘బాగుంది… కోడలు ఇంటికి వచ్చేక సుఖంగా బతికిన అత్తగారు ఎవరు గనక? ఒకవేళ మాయావిడ సుఖంగా బతికితే ఆ కోడలు జీవించేది ఎన్నాళ్లు గనక?’

‘ఇంటింటా తిరుగుతూ యిలా కబుర్లు చెబుతూ ఎన్నాళ్లని తిరగ్గలవు తాతయ్యా?’

‘బాగుంది. పిలుపు వచ్చేవరకూ ఆగకేం చేస్తాం? ఇంకా మా అమ్మకి దయ కలిగినట్టు లేదు మరి!’

బాగుంది… జీవితం యింత బాగున్న వాళ్లకి మరణం కూడా మరింత బాగుండకేం చేస్తుంది? కలిగి ఉన్నా కళ్లు కలగని మనిషికి- మంచం మీద ఉన్నా మంచి ముత్యంలా గడిపిన మనిషికి- పంకంలో ఉన్నా పద్మంలా వికసించిన మనిషికి- ఆఖరి కాలం కూడా అందంగా ఉండకేంజేస్తుంది? సూర్యాస్తమయంలో కూడా సుందరంగా ఉండడంలో వింత ఏముంది? అన్నీ సర్దుకుని సరిదిద్దుకుని రైలు ప్రయాణానికి వెళ్ళినంత ఉత్సాహంగా వెళ్ళిపోయాడు రామ్మూర్తి.

రవణమూర్తి పై తుండుతో కళ్లనీళ్లు తుడుచుకున్నాడు. క్రిందటేడు తను రామ్మూర్తిని చూడ్డానికి యీ ప్రాంతాలకి వచ్చినపుడు ఒకమారు ఏం జరిగిందనీ…

తియ్యని మాటలేకాక తియ్యని మాత్రలు కూడా యివ్వడం వాడికి అలవాటు. ఇంట్లోవాళ్ళకీ తెలిసిన వీధిలో వాళ్ళకీ ఎరిగిన ఊళ్ళోవాళ్ళకీ సాయం చెయ్యడంలో పెద్ద ఆశ్చర్యమేవీఁ లేదు. ఆ రోజు తనూ రామ్మూర్తీ ఇలా గుమ్మం దిగి వీధిలో అడుగు పెట్టేరో లేదో…’ఏం బాబు బత్తాయి పళ్ళు మంచివున్నాయి. ఏవైఁనా పడతాయా యేటి?’ అంటూ పళ్ళమ్మి ఎదురొచ్చింది. దాని నెత్తిన ఉన్న పళ్ళ గంపకన్నా అది చంకనెత్తిన గయ్యాళిగంపే రామ్మూర్తిని ఎక్కువగా ఆకర్షించింది.

“ఈ గుంటని తీసుకెడితే యింక నువ్వు పళ్ళు అమ్ముకున్నట్టే. నీ కేక కన్న దాని ఏడుపే బాగా వినిపిస్తోందేఁవేఁ?”

“ఎందుకేటి బాబూ, నాల్రోలమట్టి బొట్టి మూసిన కన్నెరగదు. ముండ నన్నొగ్గదు, నోరు కట్టదూ… నానేటి సెయ్యను సొప్పండి?”

“చెబుతా… ముందా గేటు తలుపు వేసి లోపలికి రా.”

రవణమూర్తి అడ్డుబడ్డాడు.

“ఒరే, మనం రైలుకి వెళ్దామనుకున్నాంగా… మధ్యని ఈ పేటపని ఏవిఁటీ?” రామ్మూర్తి మాట వినిపించుకుంటేగా… లోపలికి వెళ్ళి పొట్లాలు కట్టి తీసుకొచ్చాడు.

“చూడూ, ఈ మాత్రలు దీన్చేత మింగించు. ఈ ఎఱ్ఱ పొట్లం చీకటి పడ్డాకా, ఓ రాత్రివేళ ఈ తెల్ల పొట్లమూ… ఈ విధంగా మింగించు.”

“గొప్పోళ్ళు… గొప్ప మనసు గలోళ్ళు. కొత్త కొత్త కోడళ్ళు కలిగి, గొప్ప గొప్ప లోగిళ్ళు కలిగి…”

“ఆఁ అలాగలాగేలే. ఈ రెండ్రోజులూ తిరుగుళ్ళు ఆపు. ఏణ్ణర్ధం దాటని వెర్రిముండని ఎండలో తెగ తిప్పి బరికిందని బజాయించకు. ఈ బియ్యమూ, ఈ పావలా డబ్బులూ పటికెళ్లి రేపూ ఎల్లుండీ కాలక్షేపం చెయ్యి. రెండ్రోజులపాటు ఇంటిపట్టున ఉంటేనేగాని మళ్ళీ నీ బుల్లి నీది కాదు, తెలిసిందా?”

“మా అమ్మే! నా బాబే… ఎంత సల్లని యేల ఎంత సల్లని తల్లి నిన్నీ బూ మాలచ్చికిచ్చిందో… బాబ్బాబు సెమించాల. ఎంచుబడి కాయలన్నీ అమ్మేసుకున్నాను. దిక్కుమాలిన ముండని నాకాడేం లేదు. ఈ కాయలుంచు బాబో…”

“అలాగే పిల్లదానికి తొనలు తీసి తినిపించు. నేనే తీసుకుందును గాని ఇంట్లో చెట్టే వుందిలే. అడ్డులే… అవతల నాకు పనుంది. పదరా రవణీ, దీనొక్కర్తితో కూచుంటే అయిపోతుందా యేవిఁటీ?”

అవును… విశ్వమానవ సౌహార్ద్రమూ విశాల దృక్పథమూ ఉన్నవాళ్ళకి ఒక్కరితో కూచుంటే అయిపోతుందా? ఒక్క ‘పని’తో సరిపోతుందా? అందుకే ఆ వయస్సు అయీ అవగానే పదవీ విరమణ చేస్తే అందరికీ ఆశ్చర్యం కలిగింది.

“అదేవిఁటీ, మీరు విశ్రమిస్తామంటే మాత్రం మేం ఒప్పుకుంటామా ఏవిఁటీ? మీలాంటి సిన్సియర్‌ వర్కరూ, కేపబుల్‌ హేండూ మళ్ళీ మాకు దొరకద్దూ? ఏదో రూలు కోసం రిటైరు అవడానికింత వయసని ఏర్పరచారు గాని రెండు సార్లు రిటైరు అవడానికి సరిపోయిన వయసుతో ఎంతమంది ఉద్యోగాలు చెయ్యడంలేదు? అసలు ఓ చెంప నెరవడమే ఈ దేశంలో నాయకత్వానికి కావలసిన క్వాలిఫికేషను గదా…” అని చెప్పి చూశాడు పై యజమాని.

“అందుకని చచ్చేదాకా డబ్బు సంపాదించడమే పరమావధిగా పెట్టుకోమంటారా? భవిష్యత్తు మీద గంపెడాశతో ఉద్యోగం కోసం భర్తని పంపించి వీధిలో అతని కోసం ఎదురుచూసే పచ్చని పడుచు కడుపులో చిచ్చు పెట్టమంటారా? వద్దు బాబూ వద్దు. డబ్బు ఇచ్చే సుఖం కన్నా అది అరాయించుకోడంలో కలిగే అజీర్తే ఎక్కువ.”

ఆఫీసర్లనీ ఆడిటర్లనీ మేపడాలూ పన్నుల ఎగవేతలూ ఎకౌంటు సర్దుబాట్లూ వీటితో కొట్టుకుపోతూ కంటి మీద కునుకు ఎరగని పాపిష్టి పనులతో రామ్మూర్తిలాంటి వారికెలా ఉంటుంది యింకా యింకా ముడి? పువ్వులతో మేలుకొని పిల్లలతో ఆడుకుని పక్షులతో పడుకునే ఆయనకి జీవితంలో అందనిదంటూ ఏముంటుంది? పొద్దుటే ఆయన లేవడం చూసుకుని సూర్యుడు ఉదయించేవాడేమో… ఆయన పనిమనిషికీ పాలవాడికీ జీతాలు యిచ్చేరోజున అది ఒకో తారీకని అందరూ గుర్తుపెట్టుకొనేవారేమో… ఆయన ఏదైనా జవాబు రాస్తుంటే అంతకు ముందు అరగంటై ఆయనకి ఆ ఎడ్రసు నుంచి ఉత్తరం వచ్చి ఉండాలని తెలుసుకునేవారేమో…

మొగాళ్ళయితే జబ్బలనూ ఆడాళ్ళయితే చీరలనూ ప్రతిక్షణం చూసుకుని మురిసిపోతూ ఉంటారు. అసలు అద్దాల ముందు అతుక్కుపోడానికే ఎక్కడలేని టైమూ చాలదు. ఇంకా ఏమైనా టైమ్ మిగులితే తనకన్న అన్నివిధాలా తక్కువ వాళ్ళని చూసి తమ గొప్పలను చెప్పుకుంటూ ఉంటారు. ‘ఏవంటావు, నేను చెప్పింది సరైనదవునా కాదా?’ అని అడుగుతూ వుంటారు. ‘మీరు సెలవియ్యడం, మరోలా జరగడమూనా?’ అనిపించుకుంటూ వుంటారు. వారానికి మూడు సార్లు తలంటుకొనే అత్తగారికయినా, ‘అయ్యో, ఇంత శ్రద్ధ లేకపోతే ఎలాగమ్మా మీకూ? నెలయిందిగదా తలంటుకుని… పదండి, యీ పాటికి యింత నూనిచుక్క పెడతాను.’ అనే కోడలు కావాలి. రెండు వారాలకి గాని ఒక జత బట్ట మార్చని ఆఫీసరుకయినా, ‘అదేవిఁటో, మీ దగ్గరకి వస్తే యిదీ అని వర్ణించడానికి వీల్లేని పరిమళమూ నిర్మలత్వమూ వెల్లివిరుస్తాయి సుమండీ, చెప్పకేం…’ అనే అసిస్టెంటు కావాలి. ఊళ్ళో అమ్మిన గైడ్సూ ఎవరో చెప్పిన నోట్సూ దగ్గిర పెట్టుకోందే పాఠం చెప్పలేని టీచరుకయినా ‘అరిటిపండు ఒలిచి చేతులో పెట్టడం అనడం వినడమేగాని అనుభవించలేదు. ఇదే కాబోలు.’ అనే శిష్యుడు కావాలి.

ఎంతసేపూ తన వర్ణనా, తన ఓర్పూ. ఇంతకు మించి ఆలోచించడానికి టైమేది? ఇంకా ఏమైనా మిగిల్తే సంసార తాపత్రయంలో మునిగి తేలడానికి ఒక్కొక్కరికీ రెండేసి జన్మలు చాలవు. అవతల వాళ్ల గురించి తన ఆలోచన ఎప్పుడూ ఉండదు. ఒకవేళ ఉంటే ఆ పద్ధతే వేరు.

‘ఏదో పనున్నట్టు మా గోడెక్కి ఊఁ అరవకపోతే ఒసే కాకీ, నీ పాండిత్యం ఎదురింటి రవణమ్మగారి దగ్గర వెలగబెట్టకూడదుటే?’ అనుకోనివాళ్ళూ, ‘పక్కింటి మోహనరావుగారి యింట్లోనే ఒక కట్టకి కట్ట ఉత్తరాలు దిగెయ్యకపోతే, నీకొచ్చిన యేళ్ళకి పక్షపాతపు బుద్ధి కాకపోతే, మా యింట్లో కూడా ఓ శుభరేఖ విసిరితే నీ నిక్షేపం తరిగిపోతుందా ఏమిటయ్యా పోస్టుమేనూ?’ అనుకోని వాళ్ళూ అరుదు. అందుకే ఆశ్రయింపులకే జీవితం అంకితం చేసి దేశంలో చరిత్రలో పెద్దపెద్ద స్థానాలు కల్పించుకునే వాళ్ళ రొదలో సరళ జీవనులైన సామాన్యుల కథ వినిపించడమూ వికసించడమూ అరుదే.

‘ఏవిఁటీ యీ ఆలోచనలు తాడూ బొంగరం లేకుండా?’ అనుకున్నాడు రవణమూర్తి. వెనక్కి తిరిగి చూశాడు. ఎంతసేపయిందో గాని గోపాలం వచ్చి కూచున్నాడు.

“ఏవఁయినా అదృష్టవంతుడవయ్యా గోపాలం నువ్వు. మీ నాన్న దేవుడు గాని మనిషి కాదు బాబూ. మీ నాన్న చివరికాలమంతా అందరికంటే ఎక్కువగా నీ దగ్గిరే గడిపేడు. ఇంతటి సత్సాంప్రదాయం ఊరికే పోదు బాబూ.”

“నేనూ అలాగే అనుకున్నాను కానీ ఆలస్యంగా పోల్చుకున్నాను. నేను అన్నివిధాలా అన్యాయమైపోయాను.”

రవణమూర్తి ఆశ్చర్యంగా గోపాలం వైపు చూశాడు.

“అవును. మీ ముందు నాకు దాపరికం లేదు. మనసు విప్పి చెప్పుకోడానికి కూడా మీకంటే నాకింకెవరూ లేరు. ఉన్న ఊరినీ కన్నవారినీ ఒదిలిపెట్టలేక స్కూలు ఫైనలు ప్యాసవగానే ట్రెయినింగు అయిపోయి ఈ ఊళ్ళోనే హైస్కూల్లో టీచరుగా స్థిరపడిపోయానని మీకు తెలుసు. నా సర్వీసంత వయస్సులేని మా పెద్ద కుర్రాడు ఎల్‌.సి.యీ ప్యాసై నూటయాభై తెస్తున్నాడు గాని నా జీతం నూరు దాటలేదు. అడిగిన వాడికి లేదనని మా నాన్న వచ్చే జీతంతో ఏదో పెద్ద ఆస్తి మిగులుస్తాడని నాకెప్పుడూ ఆశ లేదు. ఇంత డబ్బు నిలవ చేద్దామన్న ఆలోచన మీద ఆయనకి ధ్యాస ఉన్నట్టు నాకెప్పుడూ తోచలేదు. ఆయన స్నేహితుడొకడు చేయించిన యిరవై వేల లైఫ్‌ పోలసీ మీద మాత్రం అందరితోపాటు నా కళ్ళూ ఉండేవి. అది ఆయన మొదట్లో ఎవరికీ ఎసైన్‌ చెయ్యలేదు. ఇంటి పట్టున ఉన్న వాణ్ణి గనక, ఉన్నవాళ్ళలో పిల్లలు ఎక్కువా సంపాదన తక్కువా అన్నదాంట్లో ఫస్టు మార్కు నాది గనక, కనీసం అందులో పదివేలయినా నాకు ముట్టచెబుతారని ఆశించాను. కాని, జరిగిందేవిఁటో మీకు తెలుసుగా బాబాయ్‌గారూ?”

“తెలుసు. వాడు దాన్ని సంస్కృత పాఠశాలకు రాసిచ్చాడటగా?”

“మీకిది సబబుగానే తోచిందా?”

“… సరేలే, చెప్పు చెప్పు.”

“ఇంకేం చెప్పేది? చెట్టంత నాన్నతో పాటు కొండంత ఆశ కూడా నేలకూలిపోయింది. మా నాన్న నాకేమిచ్చారో మీకు తెలుసునా? చెప్పు దెబ్బలు!”

“చెప్పు దెబ్బలా?”

“అవును. నాలాంటి నిర్భాగ్యుడికి అంతకన్న లభించేవి ఏమున్నాయి? అప్పుడందరూ ఇంటికి వచ్చినప్పుడు ఎంతో దగ్గిరవాళ్లు కూడా ఎంతలేసి మాటలాడేరో మీరు ఊహించలేరు. ఆ రోజున ఎంచేతో నాకు జ్ఞాపకం లేదు, అదీ పిల్లలూ ఇంట్లో లేరు… అవాళ కొంచెం తలనొప్పిగా వుంది. మామూలు టైమ్‌ కన్నా ముందుగానే నేను ఇంటికొచ్చేశాను. నేను రావడం వాళ్లు చూసినట్టు లేరు. ఎవరో అంటున్నారు-

‘అలాంటి మహాత్ముడికి అన్నంపెట్టే అదృష్టం యింతమంది బలగంలో ఈ కోడలికే దక్కింది. ఇంతకీ ప్రాప్తం!’

‘ఆఁ, ముప్పై రూపాయలు పారేస్తే వంట మనిషి దొరక్కపోయిందా ఏవిఁటి గాని… అయినా నాకు తెలీక అడుగుతానూ, నెలకి మూడొందలు పెన్షను తెచ్చి యిల్లు నింపే మావఁగారు ఎవర్తికి చేదేఁ?’ అని జవాబు చెప్పింది మా పెద్దొదినగారు. ‘అయినా వెంటనే కాచుకుని పెద్ద డాక్టరు చేత వైద్యం చేయిస్తే నాన్న దక్కునమ్మా! ఆయన దగ్గర తినడమంటే అందరూ సిద్ధంగాని, పెట్టడమంటే అందరికీ కష్టం కదుటమ్మా!’ అని రాగాలు పెట్టింది మా చెల్లెలు.

‘ఎంత దానం చేసే మనిషయినా ఇంట గెలవక రచ్చ గెలిచేంత అవివేకి కాదు మా నాన్న. దగ్గిరుండి ఏళ్ల తరబడి తిన్నది చాలక ఈ గోపాలం గాడు ఏం ప్రాణం విసిగించాడో, ఆయనకి ఒళ్లు మండి అలా రాసిపారేశారు. మొత్తమ్మీద ఎవరికీ ఏం లేకుండా చేస్తేగాని వాడి కళ్లు చల్లబడ్డాయి కాదు.’ అన్నాడు మా చిన్న తమ్ముడు! మా దొడ్డమ్మ అందుకుంది. ‘అది కాదు గాని నా మాట కాస్త వినండి. మీరందరూ మహా పట్నాల్లో వందలకి వందలు తెచ్చుకుని మహా సుఖపడుతున్నారనే అక్కసు కొద్దీ అదే యింత పని చేయించి వుంటుంది. ఉన్నన్నాళ్లూ ఆ మహానుభావుడికి ఓ పూట పెట్టీ పెట్టకా ఆ జాణ పుట్టింటికీపాటికి ఎంత చేరేసుంటుందో! దానికి లెక్కా పద్దూ అంటూ ఉన్నాయా యేమి?’

“విన్నారా బాబాయి గారూ, నాకు మిగిలిందేవిఁటో… ఇందులో ఇంకోరు అసూయపడ్డానికి కూడా ఉందా? మానాన్న నాకేమిచ్చారు?”

రవణమూర్తి చిరునవ్వుతో గోపాలంవైపు చూశాడు. ఆ కళ్ళలో కాంతులు చూసి అతడు ఆశ్చర్యపోయాడు.

“ఇంతకన్న నీకు మీ నాన్న యింకేమివ్వాలి గోపాలం? ఎంతో పూర్వ పుణ్యం చేసుకున్న వాళ్ళకి గాని యిలాంటి ఆస్తి లభించదు. ఎవరో ఎందుకు, నీ సంపద చూసి నేనే అసూయపడుతున్నాను!”

“అదేవిఁటి? నాతో మీరు హాస్యమాడుతున్నారా?”

“లేదు. నీ ముందున్న చీకటిని తొలగించడానికే ప్రయత్నం చేస్తున్నాను. గట్టునే చూస్తే గంగలో నీళ్ళయినా కలకబారినట్టే కనిపిస్తాయి. పైపైన కొలిచి నిర్ధారణ చెయ్యడం న్యాయమా గోపాలం? మావాళ్ళంతా డబ్బుతోటే మనుషుల మంచిచెడ్డలు కొలిచే మర మనుషులయిపోయారు. అదే జీవనం అనుకున్నవాళ్ళు అదే లేకపోతే అసలు స్వరూపం బయటపడి- బయటపడ్డ చేపల్లా బాధపడిపోతారు. అందుకనే వాళ్ళు అలా విమర్శించడం చాలా సహజంగా ఉంది. కానీ డబ్బు సంపాదించినా దానివల్ల చెడిపోనివాడు కుటుంబం మొత్తంమ్మీద మీ నాన్న ఒక్కడే. ఆయన నీడలో మీ అన్నదమ్ములందరి కన్నా ఎక్కువకాలం నువ్వు గడిపేవు. నీ నుంచి మాత్రం యిలాంటి మాటలు నేను ఎక్స్‌పెక్టు చేయలేదు.”

“అదేవిఁటి…”

“అడ్డురాకు. నన్నలా చెప్పుకుపోనీ. నిన్న పొద్దుట కదూ నేను మీ ఇంటికి వచ్చాను… వస్తూనే నేను చూసిందేమిటో తెలుసా! నీ పిల్లలు అప్పటికే స్నానాలు కూడా చేసి చక్కగా తలలు దువ్వుకుని గడగడ చదువుకుంటున్నారు. మీ ఆవిడ కుంపటి దగ్గర కూచుని ఎడం చేత్తో ముక్కలు వేయిస్తూ కుడి చేత్తో ఒళ్ళో పెట్టుకున్న మడిచిన పేపర్ని అటూ యిటూ త్రిప్పుతూ చదువుకుంటోంది. నువ్వు గదిలో కూచుని కాంపోజిషను పుస్తకాలో ఏవో దిద్దుకుంటున్నావు. నేను వాచీ చూశాను. ఆరయింది! అవును… ఇందులో ఆశ్చర్యపోడానికేముంది? ఇది మన రామ్మూర్తి ఇల్లు మరీ, ఇంకోలా ఎలా ఉంటుందీ? అనుకున్నాను.

గోపాలం, సాధారణంగా కాలేజీలు పదింటికి తెరుస్తారని నీకు తెలుసుగా? అందరూ కాదుగాని చాలా మంది దినచర్య చెబుతా విను. ఏ తొమ్మిదిన్నరకో లేస్తారు. వెంటనే శుభ్రమైన యిస్త్రీ జత ఒకటి తొడిగేస్తారు. ఎడంచేత్తో పుస్తకాలూ కుడిచేత్తో పళ్లుదోము పుల్లా పట్టుకుని కాలేజీకి వచ్చేస్తారు. ఏ కాలేజీకయినా అతి దగ్గరలో ఒక కాఫీ హోటలూ మంగలిషాపూ తప్పవు. కావలిస్తే చూడు. ఏ కొళాయి దగ్గరో దంతధావనం అయిందనిపించి మంగలి షాపులో మేకప్‌ అవుతారు. హోటల్లో ‘లోడ్‌’ వేసుకుని యివతల పడేసరికి ఫస్టు బెల్‌ ఎలాగా అవుతుంది.

ఇదెందుకు చెబుతున్నానంటే దినదిన పతనమై కృత్రిమమై పోతున్న సాంఘిక వ్యవస్థను గమనించిన నా కళ్ళకి మీ యిల్లు చల్లని పందిరిలా కనిపించింది బాబూ.”

రవణమూర్తి ఒక్క నిముషం ఆగి మళ్ళీ మొదల్టెాడు.

“మధ్యాహ్నం ఓమారు పడుకుని లేచేసరికల్లా మరో మనోహర దృశ్యం నాకంటపడింది. మీ అమ్మాయి, పెద్దది కాబోలు, బిందెతో నీళ్ళు తీసుకొస్తోంది. వెనకాల అబ్బాయి రాగిచెంబుతో నీళ్ళు తెస్తున్నాడు. నన్ను పులకింపచేసింది ఇవేవీ కావు. వీళ్ళ వెనుక మీ చంటిది ఎఱ్ఱటి లక్క పిడత నిండా నీళ్ళుపోసి తలమీద పెట్టుకుని రెండు చేతులూ పైకెత్తి అతి పొందికగా, ఒక్క చుక్క నీళ్లు పడిపోకుండా తీసుకొస్తోంది.

‘ఇదెక్కడ్నించేవ్‌ గొల్లభామా!’ అని నేను పలకరిస్తే ఆ ఆరిందా అంటూందీ…

‘బాంది… ఎవలింట్లో నీల్లు వాల్లు తెచ్చుకోలూ?’

మీ పెద్దమ్మాయి చెప్పింది, అవాళ మీ ఇంట్లో దాసీది రాలేదుట. దాసీదంటే జ్ఞాపకమొచ్చింది. పరాధీనతలో పతాకనందుకున్న మా కుటుంబం మాటే చెప్పాలి. మా ఇంట్లో దాసీదీ మొక్కలకు నీళ్లు పోసేదీ మంచినీళ్ళు పోసేదీ పక్కలు ఎత్తేదీ బజారుకెళ్ళేదీ- ఇన్నిటికీ ఇంత మంది నౌకర్లూ వున్నారు. నీతో చెప్పకేం, మా ఇంట్లో ప్రతి ఒక్కరికీ కనుక్కోడానికి ఒకరూ, పొగడ్డానికి ఒకరూ కనీసం యిద్దరేసి మనుషులు కావాలి. ఏ ఒక్క మనిషి లేకపోయినా అయిదు నిముషాలు జరగదు. ఇంత మంది నౌకర్లలో ప్రతిరోజూ ఎవరో ఒకరు మానెయ్యకా మానరు. ఇక వేగుతున్న పేలాల్లా మా ఇంట్లో ప్రతి ఒకరూ ఎగిరెగిరి పడతారు. చూసి తీరవలసిందే! బాబూ, డబ్బువల్ల మేం పొందుతున్న సుఖం యిదీ. నెలకి నూటయాభై సంపాదించిన నాడూ మేం అందులో ఇమడలేకపోయాం. ఇప్పుడు పదిహేను వందలు తెస్తున్నా యిమడలేక చెప్పలేని బాధ పడిపోతున్నాం…

మీ నాన్న క్రమశిక్షణలో సంతృప్తితో, స్వయంసహాయంతో సంతోషంగా బతకడం నేర్చుకున్న మీ కుటుంబానికి ఏం తక్కువయ్యా? ఇప్పుడు చెప్పు గోపాలం, మీ నాన్న నీకేం ఇవ్వలేదుటయ్యా?

చూడు గోపాలం, మీరందరూ పుట్టక పూర్వం సుమారు ఏభై ఏళ్ళ క్రిందట… వెన్నెల రాత్రిలో ఏటి ఒడ్డున యిసకలో నేనూ రామ్మూర్తీ ఒకరినొకరు అలసిపోయేదాకా తరుముకొనే మధుర స్మృతులు నాకు మరొక చోట జ్ఞాపకం రావు సుమీ. ఇంతటి చల్లని వాతావరణం యిది. క్రమబద్ధమైన మీ జీవితంలో నీ భార్య కూడా భాగస్వామి కాగలిగిందంటే నీ అదృష్టాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నా మనసుకెప్పుడైనా కష్టం కలిగితే విశ్రాంతి కోసం మీ యింటికే వచ్చి తలుపు తడతాను. అవును మరి, రామ్మూర్తి యిల్లు యిది! నిష్కామమైన వాడి జీవితంలో శతాంశం యిక్కడ ప్రతిఫలించినా యింతకన్న విలువైన ఆస్తి ఉంటుందా? గోపాలం, తలెత్తి నా కళ్లల్లోకి చూస్తూ చెప్పు- మీ నాన్న నీకేం యివ్వలేదా?”

గోపాలం భక్తి కృతజ్ఞతలతో కన్నీళ్లతో నిండిన కళ్లతో ఆయన వైపు చూశాడు. అంతకంటే బాగా ఎత్తున ఉన్న తండ్రి ఫోటో వైపు చూశాడు. హైస్కూలు మేస్టరీ చేసినా అందరూ మనుషులే… అది గుర్తించడం కన్న ఆనందాన్ని అందించేది ఏమున్నది?
-----------------------------------------------------------
రచన: అవసరాల రామకృష్ణారావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment