Wednesday, October 10, 2018

మూడు షరతులు


మూడు షరతులు





సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి............

కాస్త కాళ్లకి విశ్రాంతి ఇద్దామని చూస్తుంటే, రోడ్డు మూల మీద వేపర్‌పబ్ కనపడింది. లోపలికెళ్లాను. మూల మీదున్న టేబుల్ దగ్గిర నా హావర్‌సాక్‌ పడేసి, కౌంటర్ వైపుకు నడిచాను. ఒక బడ్‌వైజర్ కొనుక్కుని నా టేబుల్ దగ్గిరకి వచ్చి కుర్చీ లాక్కుని కూర్చున్నాను. జేబులోంచి పొగాకు పౌచ్ తీసి ఒక సిగరెట్‌ రోల్ చేసుకొని లైటర్‌తో అంటించుకున్నాను. చిటపటలాడుతూ నా పెదాల వైపు దూకింది నిప్పు పొగాకుని కాల్చేస్తూ. ఎర్రెర్రగా కనబడుతోంది వేపర్‌పబ్ లోని నీలి నియాన్ వెలుతురులో. బడ్‌వైజర్ ఒక పెద్ద గుక్క వేసి, గుండెలనిండా పొగ పీల్చుకుని నెమ్మదిగా వదిలాను. పైన కప్పులో ఉన్న వెంట్ లాగేసుకుంటుంటే, పాముల్లాగా మెలికలు తిరిగిపోతూ అందులోకి వెళ్ళిపోతోంది నా నిశ్వాస. కళ్ళు నెమ్మదిగా బరువుగా మూతలు పడుతున్నాయి. కాళ్లు టేబుల్ కిందికి వాటంటతవే సాగిపోయాయి. స్వర్గం అంటే ఇదే!

అప్పుడు వినపడింది. ఎవరో నన్నే అనుకుంటా పిలుస్తున్నారు. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాను. ముందుకు వంగి నెమ్మదిగా, “క్షమించండి, మిమ్మల్ని మీ ప్రశాంతతని భంగపరిచినందుకు. మీరేమి అనుకోకపోతే కాస్త నిప్పు ఇస్తారా?” అంటూ తన కుడిచేతి వేళ్ల మధ్య ఉన్న సిగరెట్‌ని చూపిస్తూ అడిగాడు. అదేదో చాలా నాసిరకం పొగాకుతో చేసిందనుకుంటా, వాసన ఘాటుగా ఉంది. పొగాకు వేడికి కాలి మాడిపోయిన నల్లని పెదవుల మధ్యనుంచి గారపట్టిన పళ్ళు! ఛీ!

అప్పుడు వచ్చింది ఆలోచన.

జేబులో ఎక్కువ డబ్బుల్లేవు. ఆఖరి అసైన్‌మెంట్ అయిపోయి రెండు గంటలై పోయింది. మళ్ళీ సంపాదనలో పడాలి. పడితే కాని కావల్సిన ఆక్సిజన్, ఆహారం, ఇతరమైన అవసరాలని ఫ్యూచర్ ప్రూఫ్ చేసుకునే పరిస్థితి లేదు.

అటువంటి సందర్భంలో ఆ గారపళ్ళవాడు నా ప్రశాంతతను భగ్నం చేస్తూ నా జీవితంలోకి చొరబడ్డాడు.

ఇక్కడ ‘నిప్పు’ని అమ్ముకోవచ్చు. సాహో! పాల్కురికి విరాట్ ప్రసాదరావు! సాహో! వాడికే వస్తాయి ఇలాంటి అద్భుతమైన ఆలోచనలు! పది నిముషాలో పావుగంటో! ఎంతో, కొంత! ఎంత సంపాదనైనా వచ్చినట్లే కదా?

“సరే ఇస్తాను. ఎంత ఇస్తావు?” అడిగాను.

నవ్వాడతను. ఆ నల్లగా మాడిపోయిన పెదవులు విచ్చుకున్నాయి. పొగాకుగారతో నిండిపోయిన పళ్ళ మధ్యనుండి వెలువడిన ఊపిరి! ఓ పెద్ద సముద్రపు కెరటంలాగా, ఆ దుర్గంధం నా ముఖం మీదకి వచ్చి, నా చుట్టు అలుముకుని, నన్ను అందులో ముంచేసింది. అప్పుడే తిరస్కరించాల్సింది. కాని, కాళ్లదగ్గిరకు వచ్చిన సంపాదనావకాశాన్ని పోగొట్టుకోవాలనిపించలేదు!

పాంట్ జేబులో నుంచి ఆక్సిజన్‌తో నింపిన మూడు కానిస్టర్లను బయటకు తీసి చూపించాడు. రోజుకి పది నిముషాల చొప్పున వాడినా, ఒక వారం రోజులకి సరిపోతాయి అవి!

ఎక్కువ బేరం చెయ్యకుండా, “సరే. కానీ నా అమ్మకం షరతులకి ఒప్పుకుంటేనే,” అన్నాను. అవేమిటన్నట్టు నా వంక ప్రశ్నార్థకంగా చూశాడు.

మొదటి షరతు: నా సిగరెట్ నిప్పుతో అతను, తన సిగరెట్‌ని ఒకసారి మాత్రమే వెలిగించుకొవడానికి అవకాశం ఇస్తున్నాను.

రెండవ షరతు: నేను అతనికి విధించిన షరతు ప్రకారం అతను నా నిప్పుతో ఇతరులవెవరివీ, ఏవీ, అంటించకూడదు.

మూడవ షరతు: నా నిప్పు ఇంకొకరికి అరువు ఇవ్వకూడదు, అమ్మకూడదు. ఉచితంగా కూడా ఇవ్వరాదు.

దానిమీద సర్వ హక్కులు నావే! అది నా ‘నిప్పు’. మళ్ళీ తన సిగరెట్ అంటించుకున్న వెంటనే వెనక్కి నాకు ఇచ్చెయ్యాలి.

“అర్థమయ్యిందా?” అడిగాను.

“అర్థమయ్యింది,” అన్నాడు.

“నా షరతులు అంగీకరిస్తున్నావా?” అడిగాను.

“అంగీకరిస్తున్నాను,” అన్నాడు.

“ఆమోదిస్తున్నావా?” అడిగాను.

“ఆమోదిస్తున్నాను,” అన్నాడు.

నాకర్థం అయ్యింది. నన్ను పిచ్చివాడని అనుకుంటున్నాడు. పాపం, పిచ్చోడు!

పాల్కురికి విరాట్ ప్రసాదరావు షరతులా! మజాకా!

నా సిగరెట్ దమ్ము బలంగా లాగాను. పొగ ఊపిరి తిత్తులలోని ప్రతి కణంలోకి ప్రవేశించింది. దాన్ని నెమ్మదిగా బైటకు వదిలాను. శరీరమంతా గాలిలో తేలిపోతోన్న భావన. నా వేళ్ళ మధ్యనున్న సిగరెట్‌ని అతనికి అందించాను.

అతను అందుకున్నాడు. తన సిగరెట్‌ని ముట్టించుకుంటున్నాడు.

నా కళ్లు మూతలు పడుతున్నాయి. అసలే అలసిపోయి ఉన్నానేమో, గాఢమైన మత్తులోకి జారుకుంటున్నాను. తల విదిల్చాను. బలవంతంగా కళ్ళు తెరిచి చూశాను.

అతని పక్కనే ఉన్న మరొకడు, గారపళ్లవాడిని అడిగినట్టున్నాడు. వీడు వాడికి, తను అంటించుకున్న సిగరెట్టు ఇచ్చాడు. నాకు కోపం వచ్చింది. నేను అనుజ్ఞ ఇచ్చింది, వాడికి తన సిగరెట్టు అంటించుకునేందుకు మాత్రమే! వాడింకెవరికీ ఇవ్వకూడదు.

అతని వైపు దూకుడుగా వెళ్ళాను. “ఏమిటి ఇదంతా?”

నేను అటు వెళ్ళేలోపు, ఆ రెండో వాడు తన పక్కనున్న వాడికి తను అంటించుకున్న సిగరెట్టు ఇచ్చాడు! వాడు ఇంకొకడికి ఇచ్చాడు.

మొత్తం పబ్‌లోని అందరి నోట్లో సిగరెట్లు వెలుగుతున్నై. అందరూ నేను ఇచ్చిన నా ‘నిప్పు’ తోనే సిగరెట్స్ అంటించుకున్నారు.

నా ‘నిప్పు’కి విలువ కట్టకుండా, నేనిచ్చిన ‘నిప్పు’తో వాళ్లందరూ సిగరెట్లు అంటించుకోవడానికి ఎంత ధైర్యం!

నాకు కోపం వచ్చింది. ఆవేశంతో దొరికినవాడిని దొరికినట్టు చితకబాదడానికి రెడీ అయ్యాను. మొదలుపెట్టాను బాదడం.

“నా ‘నిప్పు’కి విలువ కట్టండి! నాకు ఇవ్వాల్సింది ఇవ్వండి!” అని అరిచాను. వాళ్ళ నోట్లో సిగరెట్లు లాగేశాను. కిందపడేసి నా కాలిజోడుతో నలిపి, ఆర్పెయ్యడం మొదలుపెట్టాను.

నాకు ఈ రోజుకి కూడా అర్థం కావడం లేదు! ఆ వేప‌ర్‌పబ్‌ బౌన్సర్లు నన్ను ఎందుకు లాగి బయట పుట్‌పాత్ మీదకి విసిరేశారో అని!

నా ‘నిప్పు’ అది! అది నా సొత్తు, ఆస్తి! దాని మీద సర్వ హక్కులు నావే కదా?
----------------------------------------------------------
రచన: అనిల్ అట్లూరి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment