Sunday, October 7, 2018

అవధాని మావయ్య


అవధాని మావయ్య
సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి..................

“మావిడికాయ పప్పు మహా అద్భుతం గా కుదిరిందోయ్‌ కాపోతే..కందిపప్పు కాస్తంత వేయించి వుంటేనా.., వర్సాగ్గా ముగ్గురూ కనబడే వారు, ఇంద్రుడి తో సహా.” అన్నాడు శ్రీరాం, చెయ్యి కడుక్కుంటూ.

“పెట్టారా, ఇంకా ఏ వంకా పెట్టలేదేమిటా అని చూస్తున్నా, ఎక్కడికి పోతాయి, అన్నీ మావ గారి పోలికలు”

అంది మైథిలి వెక్కిరిస్తూ.

“వంకకాదండీ వనితా మణి గారూ, వచ్చే సారన్నా వేయించి వేస్తే, ఏదో ఆ ముగ్గిరినీ చూడాలన్న ముచ్చట తీరుతుంది కదా అని, అల్లా ఒగ్గావన్నమాట, అర్థం చేసుకోరూ.. ఇంతకీ మాంగారి పోలికన్నావు, మీ మాంగారా, మా మాంగారా?” నవ్వుతూ అడిగాడు.

” డౌటే లేదు, మా మావ గారే, పాపం మీ మావగారిని అనకండి, ఆయన అసలే నోట్లో నాలుక లేని మనిషి”

” మీ ఇంట్లో ఎగస్పార్టీ స్ట్రాంగు కాబట్టి మా మాంగారు అలా ఉన్నారు కానీ, లేకపోతేనా, చెడుగుడాడేసే కెపాసిటీ ఉన్న కాండిడేటు,తెలుసా?” అన్నాడు ఉడికిస్తూ.

” మా అమ్మని అంటే ఛంపుతా. అయినా అందరు ఆడవాళ్ళూ మా అత్తగారిలా మెత్తగా ఉండబట్టే, మీ లాంటి పెంకి ఘటాలు తయారై, మాలాంటి ఆడాళ్ళనెత్తి కెక్కుతున్నారు.” అంది మైథిలి నవ్వుతూ.

ఇద్దరూ హాల్లోకొచ్చారు. శ్రీరాం మంచినీళ్ళు తాగుతూ, రిమోట్‌ అందుకుంటూ అడిగాడు “సరేగానీ, ఎవరేనా ఫోను చేసారా ఇవాళ ?”

“అయ్యో మర్చేపోయాను చూశారా. ఇవాళ మధ్యానం పడుకున్నప్పుడు ఎవరో చేసారు. బాబిగాడున్నాడా? అని అడిగారు. లేరూ, ఆఫీసుకెళ్ళారు అని చెప్పాను. లంచికి రాడా, కారీరు పట్టుకుపోతాడా? అని అడిగారు. అవునన్నాను. అయితే వచ్చాకా వాణ్ణే చెయ్యమను అని నెంబరిచ్చారు.” అంది.

“ఇంతకీ ఎవరుట?” అడిగాడు శ్రీరాం.

“ఎవరో అవధానం మావయ్యట. నేన్నిన్నెరుగుదును గానీ నువ్వు నన్నెరగవులే, సరే మళ్ళీ మాట్టాడదాం అనేసి ఫోను పెట్టేసారు” అంది మైథిలి.

పేరు విన గానే ఒక్క సారి పొర పోయింది శ్రీరాం కి. తాగుతున్న మంచినీళ్ళ గ్లాసు పక్కన పెట్టి, “అవధానం మావయ్యా, మంత్రపుష్పం మావాయ్యా కాదు..అవధాని మావయ్య చేసుంటాడు. ఏదీ నెంబరియ్యి, మాట్టాడదాం..” అన్నాడు.

“ఎవరో
చెప్పండి ముందు” అంది మైథిలి.

” మా అమ్మకి అన్నయ్య వరస. “బతికున్న” ఉరఫ్‌”నాకు పెళ్ళి కాని” రోజుల్లో, వాళ్ళమ్మాయి ని నాకిద్దావని ట్రై చేసి, జాతకాలు పడకపోవడంతో ఆ ప్రయత్నం వొదిలేసి, మరో అమెరికా అల్లుణ్ణి వెతుక్కున్నాడు. రామచంద్రపురం లో తెలుగు మేష్టారిలా పనిచేసి రెటైరయ్యాడు. మనవరాలు పుట్టిందని మొన్న ఇంటికి ఫోను చేసినప్పుడు అమ్మ

చెప్పింది. వచ్చి నాలుగు నెల్లైందిట.” అన్నాడు శ్రీరాం.

“మంచి మావయ్యే. నాలుగు నెల్లకైనా గుర్తొచ్చాం, సంతోషం. ఇంతకీ వాళ్ళమ్మాయి పేరేమిటి?”

“ఏదో వుండాలి, సుశీలో, సుభద్రో..” అన్నాడు.

” చూడ్డానికెలా వుంటుంది?” కొంచెం అసూయగా అడిగింది మైథిలి.

“వెట్‌గ్రైండరు లా వుంటుంది” అన్నాడు శ్రీరాం నవ్వుతూ. మైథిలి కూడా నవ్వాపుకోలేక పోయింది. నెంబరు తెచ్చి శ్రీరాం కి ఇచ్చింది. శ్రీరాం ఫోను చేశాడు.

“హలో..హూం డు యు వాంట్‌” అంది అవతలి కంఠం.

“హలో…నా పేరు శ్రీరాం అండీ. అట్లాంటా నించి చేస్తున్నాను. అవధాని మావయ్య ఉన్నారా..” అడిగాడు మెల్లిగా.

” యా. ఒక్క నిముషం. (షీలా, మావయ్య గారికి ఫోను)” ఫోనులో వినబడేట్టే పిలిచాడు. ఒక నిముషం తరవాత వినిపించింది.

“హలో…ఎవరూ, బాబీయే నా?”

“అవును మావయ్యా, నేనే. ఎలా వున్నావు? ఎప్పుడొచ్చావు అమెరికా?” అన్నాడు శ్రీరాం.

” బానే వున్నాంరా. వచ్చి నాలుగు నెల్లైంది. మీ అత్తయ్య కూడా వచ్చింది. మనవరాలు పుట్టింది కదా. అదీ విషయం. ఇంకో నెలలో మళ్ళీ వెళ్ళిపోతున్నాం. వచ్చేప్పుడు, అమ్మ నీ నెంబరు ఇచ్చింది, కానీ ఎక్కడో పారేసుకున్నాను. మళ్ళా మా అల్లుడు ప్రయత్నిస్తే, ఇదిగో ఇప్పటికి దొరికింది. ఇంతకీ నీ సంగతులేవిటి?

పిల్లలూ గట్రా అనుకుంటున్నారా, లేదా ?”

” ఇంకా లేదు మావయ్యా. అన్నట్టు ఉండు మైథిలి ని పరిచయం చేస్తాను” అని స్పీకరు ఫోను ఆన్‌చేసాడు.

“నమస్కారం పెదనాన్నగారూ, నా పేరు మైథిలి. బావున్నారా?” అడిగింది మైథిలి.

“ఆ, నమస్కారం నమస్కారం. ఏదో,బానే వున్నావమ్మా. అవునూ, మీది విశా పట్నం కదూ?”

“అవునండి, మా ఇంటి పేరు మంథా..”

“తెలుసునమ్మా, ఎరుగుదును. మీ అమ్మని “పెద్ద బుచ్చులు” అని కూడా పిలుస్తారు కదూ?”

కోడ్‌వర్డ్‌ వినేసరికి మైథిలి మొహం వెయ్యి వాట్ల బల్బులా వెలిగిపోయింది.

“అవును పెదనాన్నగారూ, అలానే పిలుస్తారు. మీకెల్లా తెలుసు?”

“ఎలాగంటే, ఇప్పుడూ..మీ రామం తాత చెల్లెలు మాకు పిన్నత్తగారి వరసన్నమాట.చిన్నపిల్లవి, నీ కర్థం కాదులే, మొత్తానికి నాకు రెండు వైపుల నించీ చుట్టరికం వుంది. యీ సారి మీ ఇంటికి ఫోను చేస్తే, అమ్మనీ నాన్ననీ అడిగానని చెప్పు.” అన్నాడు అవధాని మావయ్య.

చుట్టరికమని తెలిసాకా ఇంకా ఉత్సాహంగా మాట్లాడేసింది మైథిలి. కాసేపాగి శ్రీరాం అన్నాడు “అవును మావయ్యా, మా వూరు రావా మరి? వస్తే చక్కగా బోల్డు చూపిస్తాను”

” రావాలనేరా ప్రయత్నం. వచ్చే వారాంతానికి నీకు ఖాళీ వుంటే వొద్దావని అనుకుంటున్నాము నేనూ, మీ అత్తయ్యా. అల్లుడు ఇక్కడ విమానవెక్కిస్తానన్నాడు. నువ్వొచ్చి దింపుకోవడవే, అదీ నీకు సెలవుంటేనే. మళ్ళా సోంవారం పొద్దున్నే తిరుగు ప్రయాణం. ఏమంటావు?”

అనడానికేమీమిగల్లేదు శ్రీరాంకి “వూ” అనడం తప్ప.

” తప్పకుండా..,అందరూ రండి, ఎంచక్కా బోల్డు కబుర్లు చెప్పుకోవచ్చు” అంది మైథిలి.

“పిల్లలకి వీలు పడదమ్మా, అల్లుడికి ఆఫీసు, పైగా, ఇంట్లో చిన్న పిల్ల వుంది కదా, వాళ్ళింకోసారొస్తారు, మీరంతా ఇక్కడే వుంటారు కాబట్టి కలుస్తూనే ఉండచ్చు, ఈసారికి మేమిద్దరం వస్తున్నాం, వుంటామరి..వుంటారా బాబీ…”

పడుకున్నాడే గానీ నిద్ర పట్టలేదు శ్రీరాం కి. ఏనాటి అవధాని మావయ్య. ఊరు పుట్టినప్పుడు పుట్టాడని పిస్తుంది. చుట్టాలిళ్ళల్లో ఎవరింట్లో శుభకార్యం జరిగినా మావయ్య వుండాల్సిందే. చిన్నప్పుడు తనకి అక్షరాభ్యాసం చేయించాడనీ, పనులన్నీ తెలిసిన మనిషనీ, వూళ్ళో అందరికీ తలలో నాలుకలా మెలిగేవాడని, అయితే వున్నదున్నట్టు మాట్టాడే తత్వం వల్లా, లౌక్యం ఎరిగిన మనిషి కాకపోవడం వల్లా ఎవ్వరూ మావయ్యకి సహాయం చేసే వారు కాదనీ, అంతా ఆయన్ని పనులకీ,అవసరాలకి వాడుకుని వొదిలేసారనీ అమ్మ చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి శ్రీరాం కి. మావయ్య వొస్తున్నాడంటే సంతోషమే అయినా, ఆయన ఏం మాట్లాడి ఎప్పుడు పీకమీదకి తెస్తాడో అనే భయం కూడా మొదలైంది శ్రీరాం లో. అసలే మైథిలికి కోనసీమ కబుర్లు కొత్త. అందులోనూ మావయ్య నిక్కచ్చిగా, నిష్కర్షగా చెప్పే అభిప్రాయాలూ, మాటలూ వింటే ఎల్లా రియాక్ట్‌అవుతుందో..అనుకో సాగాడు.

“ఏమిటీ ఇంకా పడుకోలేదా, ఎన్నా ఆలోచన?” అడిగింది మైథిలి. చెప్పాడు శ్రీరాం.

“ఓస్‌ ఇంతేనా, మరేం పరవాలేదు. వాళ్ళిక్కడుండేది రెండు రోజులు. ఇంతలోకీ ఏ కొంపా ములిగిపోదు లెండి. పోనీ, ఆయన అంతగా ఓ మాట అన్నా, తప్పులేదులెండి, పెద్ద వాళ్ళు కోప్పడినా దీవించినట్టే..ఎలా అన్నాను?” అడిగింది మైథిలి.

“బానే అన్నావు కానీ మాట మీదుండాలి మరి. “తూచ్చి” అంటే కుదరదు” అన్నాడు.

“సరే, అభయమిస్తున్నాం సామంతరాజు గారూ, ఇప్పుడు కప్పం కట్టి పడుక్కోండి” అంది మైథిలి చెయ్యి చాపుతూ.

“కప్పలూ, తాబేళ్ళూ తరవాత, ముందు లైటార్పేయ్‌ లిద్దలొస్తోల్ది” అన్నాడు ఆవులిస్తూ.

ఇద్దరూ నిద్దర్లోకి జారుకున్నారు. శుక్కురారం సాయంత్రం ఎయిర్‌పోర్టు కెళ్ళి మావయ్యనీ అత్తయ్యనీ ఇంటికి తీసుకొచ్చారు శ్రీరాం, మైథిలి. రాత్రి భోజనాలయ్యాయి.

“ఇంకా ఏవిటి విశేషాలు చెప్పు మావయ్యా, ఎలా ఉంది అమెరికా?” అడిగాడు శ్రీరాం.

” ఏవుందిరా, ఇక్కడ అన్ని వూళ్ళూ ఒఖ్ఖలాగే తగలడ్డాయి. ఎక్కడకెళ్ళినా అవే రోడ్లు, అవే కొట్లూ, అవే కార్లూ. అయితే దీంట్లో ఒక్క సుగుణం వుంది. ఒక ఊరు చూస్తే చాలు, అన్నీ చూసేసినట్టే. ఆట్టే తిరిగే పని లేదు. అక్కడికీ తాపత్రయం కొద్దీ అల్లుడు తీసికెళ్ళాడు నయాగరా అనీ, డిస్నీ అనీ ని, ఏదో ఇదో ప్రపంచం, వింత ప్రపంచం.”

మైథిలి అడిగింది “దొడ్డమ్మా, మరి మీకు నచ్చిందా అమెరికా?”

“ఏముందమ్మా, బానే వుంది, హాయిగా మారాజులల్లే కార్లూ, వుజ్జోగాలూ, ఇళ్ళూ, కష్టం తెలియని జీవితవనుకో, నడిచినన్నాళ్ళూ బానే వుంటుంది, పరవాలేదు.”

వెంటనే అవధాని మావయ్య అందుకుని “వుత్తదీ, దొంగ పీనుగ. అబద్ధం చెబుతోంది. పరవాలేదుట, పరవాలేదు, వొరేయ్‌ మీ అత్తయ్యకి ఇక్కడ తెగ నచ్చేసిందిరా, నేనే సాక్ష్యం. తెల్లవాడు ఉండనిస్తే ఇక్కడే సెటిలైపోదావనే దీని ఆలోచన. ఈవయసులో భోగాలు కావాల్సొచ్చాయి మీ అత్తయ్యకి”

” భోగవా పాడా, ఏదో పిల్లకి పురుడు పోద్దావని వొచ్చానే పిల్లా, పది సార్లు పోరగా పోరగా, కూడా వచ్చారు, లేకపోతే అగ్రహారం దాటి రారు మీ పెదనాన్న, గుడి పావేననుకో.” అంది దొడ్డమ్మమైథిలితో.

టాపిక్‌మారుద్దావనే వుద్దేశంతో అన్నాడు శ్రీరాం ” సరే మావయ్యా రేపు ఎక్కడికెడదాం?”

“వొరేయ్‌బాబీ, నువ్వేవనుకోపోతే ఒక్క మాట. నిన్నూ, పిల్లనీ చూసి పోదావని వొచ్చాం యీవూరు. మమ్మల్నెక్కడికీ తిప్పక. హాయిగా కడుపునిండా కబుర్లు చెప్పుకుని వెళిపోతాం. ఇంకెక్కడా తిరిగే వోపిక లేదురా, ఎప్పుడు దేశం పోతాంరా భగవంతుడా
అని ఎదురు చూస్తున్నాను” అన్నాదు మావయ్య.

తెల్లవారింది. పెందలాడే స్నానం చేసి దీపం పెట్టింది మైథిలి. మావయ్యకి తెగ నచ్చేసింది. పైకి చెప్పటంలేదు గానీ, చాలా సంతోషం గా ఉన్నాడు. అత్తయ్య లలితా సహస్రం చదివింది.

“కాస్సేపలా నడిచొద్దావేవిట్రా?” అడిగాడు మావయ్య.

“పద మావయ్యా, మాది చాలా పెద్ద కాంప్లెక్సు, పద చూద్దువు గాని” అంటూ బైటికి వచ్చాడు శ్రీరాం. ఇద్దరూ నడుస్తున్నారు.

” మైథిలి మంచి పిల్లరా ” అన్నాడు మావయ్య.

“ఎందుకుమావయ్యా అలాఅన్నావు?” ఆదిగాడు శ్రీరాం.

“అవునురా, తను వచ్చి మూడేళ్ళౌతోందా, ఇంకా జుట్టు, కట్టూ, బొట్టూ మారకపోవడం, నువ్వెంత అంటే నువ్వెంత అని నీమీద ఎగరక పోవడం ఇవన్నీ నాకు నచ్చాయిరా. యీ స్థల మహాత్యమో, లేక కొత్తగా వచ్చిన స్వాతంత్రమో..ఏదో మన వాళ్ళని చెడగొడుతోందిరా. నా కూతుర్నే చూడు. ఆఫీసులో అడుగుతారని బొట్టు తీసేసిందిట, అల్లుడికిష్టం లేదని జుత్తు కోసేసిందిట, చప్పుడు చేస్తున్నాయని మంగళ సూత్రాలు తీసి షోకేసులో

పెట్టింది. ”

మాటకి అడ్డం తగులుతూ అన్నాడు శ్రీరాం.

“నిజమే మావయ్యా, దేశ కాలాలని బట్టి నడుచుకోవాలి కదా. బొట్టు పెట్టు కుంటే సవా లక్ష ప్రశ్నలేస్తారు, నిజంగా తెలుసుకోవాలని కాదు, పనికిమాలిన ఆసక్తితో. జుట్టు వాళ్ళ స్వవిషయమనుక్కో. అయినా పెళ్ళాలు పెద్ద జడ వేసుకుని ఆఫీసులకి వెళ్ళడం చాలా మందికి మొగుళ్ళకి ఇష్టం వుండదు. దానికి వాళ్ళేం చేస్తారు చెప్పు. ఇంక నగలన్నావా, పండగలకీ పబ్బాలకీ ఇక్కడా వేసుకుంటూనే వుంటారు.”

“వొరేయ్‌ నువ్వు లక్ష చెప్పు. దేశాన్ని బట్టి మారాలిగానీ, పూర్తిగా మారిపోకూడదురా.ఇక్కడికొచ్చిన అన్ని దేశాలవాళ్ళూ ఇలానే వున్నారా? అంతెందుకు, మన దేశంవాళ్ళే,గుజరాతీలని చూడు
,పిల్లలకి విధిగా వాళ్ళ మాతృభాషనేర్పుతారట.మొన్నో అరవ పిల్ల టాంపా గుళ్ళో కూచిపూడి చేసిందిరా, చూడ్డానికి రెండు కళ్ళూ చాలవనుకో, అంత అద్భుతంగా చేసింది. హార్వర్డ్‌లో చదువుతోందిట, తమిళం చక్కగా మాట్లాడుతుందని చెప్పుకున్నారు. ఎటొచ్చీ, మన వాళ్ళకే వచ్చిందిరా ..మనది అన్నదాన్ని ఎంత తొందరగా వదులుకుంటే అంత మంచిది అనేవిధంగా ప్రవర్తిస్తున్నారు ఆడా, మగా కూడా. ముందు అమ్మనీ, నాన్ననీ, దేశాన్నీ వదిలొచ్చేశారు. ఇప్పుడు మెల్లిగా తెలుగుదనాన్నీ, తెలుగు భాషనీ కూడా వదిలేస్తున్నారు.

ఈ నాలుగు నెలలూ జైలులో ఉన్నట్టు గడిపాంరా. మా పక్కింటి తెల్లవాడికో కుక్క వుంది. వాడు పొద్దున్నే వెళుతూంటే మూలిగేది, రాత్రి వాడొచ్చాకా దానికి పట్టరాని సంతోషం. అలాగే వుండేది రా మా పరిస్థితి కూడా. ప్రతీ రోజూ సాయంత్రం ఎప్పుడౌతుందా, కూతురూ అల్లుడూ ఇంటికెప్పుడొస్తారా అని ఆ కిటికీలోంచి ఎదురుచూసే వాళ్ళం. వాళ్ళు రాగానే సంతోషం. తెల్లాడు కుక్కని కాసేపు బయట తిప్పినట్టే వీళ్ళు మమ్మల్నీ తిప్పేవాళ్ళు. మళ్ళా, తెల్లారుతుందంటే దిగులు..అదే వొంటరితనం,అదే జైలు, యీ వయసులో మాకెందుకురా ఇంత శిక్ష, మిమ్మల్ని కన్న నేరానికి కాకపోతే. ఈ బంగారు పంజరం లో వుండడం మా వల్ల కాదురా. వూరెళ్ళిపోవాలి. ఆ మట్టిలో పుట్టాం, అక్కడే పిలుపొచ్చేదాకా కాలక్షేపం చేసి, ఆఖరికి ఆ భీమేశ్వరుడిలో కలిసిపోవాలి, ఈ జన్మకి

అదే రా మోక్షం.

ఈ గాలిలో ఏవుందో గానీ, ఇది ఎవరినీ స్థిమితంగా నిలవనివ్వదురా. ఊపేస్తుంది. బతికున్నంత కాలం పరిగెడుతూనే వుండాలి. మావల్ల కాదురా
. పాపం మీ అత్తయ్యని చూడు. కని పెంచి నానా బాధలూ పడి పెద్ద చేసి, పెళ్ళి చేసి పంపింది చాలక, ఇంకా ఇప్పుడు మంత్రసాని సేవలు, ఇటుపై ఆయా సేవలు. దాని అరోగ్యవా అంతంత మాత్రం. నలుగురేసి ఆడపడుచులకీ, వాళ్ళ పిల్లలకీ కడిగీ కడిగీ, దాని ఓపిక కాస్తా హరించుకుపోయింది ఇన్నాళ్ళూ. ఇప్పుడు చాకిరీ చేయించుకోవడం పిల్లల వంతైంది. ఏంచేస్తుంది, కాదనలేదు, అల్లుడువాడడిగితే కాదనడం మర్యాద కాదు కదా? అందుకే బయలుదేరింది. సముద్రాలు దాటడానికి. సరే, ఈ అర్భకపు ప్రాణి ఎక్కడ ప్రాణాలమీదికి తెచ్చుకుంటుందో అని నేనుబయలుదేరాను. లేకపోతే నా కెందుకురా యీఅమెరికాలూ, ఆర్భాటాలూ?

“ఇహనో ఇప్పుడో” అనే వయసర్రా మాది. యీ వయసులో మమ్మల్ని
మీరుచూసుకోవలసింది పోయి, మాకు కొత్తగా మనవళ్ళ మనవరాళ్ళ సంరక్షణ బాధ్యతల్ని అంటగడుతున్నారు చూసారా, ఇంతకంటే దారుణం ఏం వుంటుందో నువ్వు చెప్పు? కనడానికి మమ్మల్ని పిలుస్తారు, కన్న ఏడాదికో రెండేళ్ళకో వాళ్ళని ఇండియా పంపించేస్తారు, మా నెత్తి మీదకి. అంతగాపిల్లల్ని పెంచే తీరిక లేని వాళ్ళు కనకుండానే వుండాలి. ప్రేమలకి పనికి రాకుండా పోయిన మేము, పనులకి మాత్రాం కావాలి ఇదేనట్రామీరు ఇక్కడ నేర్చుకున్న సంస్కృతి? ప్రతీదీ వ్యాపారమే? ” ఆయాసం తో మావయ్య సిమెంటు బల్ల మీద కూర్చున్నాడు. పక్కనే శ్రీరాం. ఎడతెగనిఆలోచనలో వున్నాడు.

ఇంట్లో మైథిలికీ ఇంచుమించు ఇదే పరిస్థితి. దొడ్డమ్మమాటల్లో ఎంతో వివేకం, ఎన్నో సంవత్సరాల అనుభవం కనిపించాయి మైథిలికి. ఆవిడ చెబుతూనే వుంది..
” ఆడవాళ్ళకి ఇక్కడ మొదట్లో బాగానే వుంటుందమ్మా. అత్తగారూ, మావగారూ, ఆడపడుచులూ,తోడికోడళ్ళూ, మరుదులూ..యీ పీకులాట లేవీ ఉండవుకదా..ఇష్టారాజ్యం భరతుడి పట్టం. కానీ అలా ఎన్నాళ్ళో సాగదు కదా. వీళ్ళూ పిల్లల్ని కనాలి. అప్పుడు మళ్ళీ
పెద్ద వాళ్ళ సేవలు కావాలి. పిల్లల్ని పెంచడం అనేది ఒక యజ్ఞం. నేను నాలుగు యజ్ఞాలు చేసి గట్టెక్కాను. ఒక్కళ్ళూ ఉండాలని కోరుకోవడం మీరంతా చేస్తున్న పెద్ద తప్పు. అందరూ కలిస్తేనే సంసారం. అందరూ కలిసుంటేనే పండగ. అల్లుడు ఇన్ని డబ్బులు పోసి తీసుకొచ్చి తిప్పుతున్నాడు కాబట్టి ఈ దేశం బావుందని అంటున్నానే గానీ, మనసులో మాట చెప్పమందువా, నాకిక్కడేమీ బాగోలేదే పిల్లా. హాయిగా మావూరు పోయి, మీ మావయ్యకి వేళకింత వండి వార్చి, నా పనులు నేను చేసుకుని, నా వాళ్ళకి కాస్త సాయం చెయ్యడంలో ఉన్న ఆనందం ఎన్ని అమెరికాలు తిరిగితే దక్కుతుంది చెప్పు?”

వారాంతం ఇట్టే గడిచిపోయింది. మైథిలిదొడ్డమ్మకి చీర పెట్టింది. శ్రీరాం అవధాని మావయ్యకి బంగారంపూతున్న
పెన్ను కొనిచ్చాడు. వెళిపోయేముందు మైథిలి ఇద్దరి కాళ్ళకీ దండం పెట్టింది, శ్రీరాం చేత పెట్టించింది. వాళ్ళు మనసారా ఆశీర్వదించారు. వాళ్ళని విమానమెక్కించిఇంటికొచ్చాకా అడిగాడు శ్రీరాం. వంటలూ గట్రా , ఇవన్నీ నే చెప్పినట్టే చేసావు, మరి దణ్ణం పెట్టమని ఎవరు చెప్పారు?

“కొంతమందిని చూస్తే దణ్ణం పెట్టాలనిపిస్తుంది,కదండీ?” అడిగింది మైథిలి.

“అవును..” అన్నాడు శ్రీరాం ఏదో అలోచిస్తూ.

వాళ్ళిద్దరూ చాలా సేపు అలా మౌనంగానే వుండిపోయారు. చాలా సేపటి తరవాత మైథిలి బెంగగా అడిగింది

” ఏవండీ, మనం ఎప్పుడూ ఇక్కడే వుండిపోతామా?”

శ్రీరాం చెప్పాడు ” లేదు, ఇండియా వెళిపోతాం”

“ఎప్పుడు ?” అమాయకంగా అడిగింది మైథిలి.

“ఇంకో నాలుగైదేళ్ళల్లో”. అలవాటైన ప్రశ్న, తెలిసున్న సమాధానం కావడంతో ఠక్కున చెప్పేశాడు శ్రీరాం.

కానీ ఆ సమాధానాన్ని ఇద్దరూ నమ్మరు. నమ్మినట్టు నటిస్తారు, పాపం వాళ్ళూ బతకాలి కదా…
----------------------------------------------------------
రచన: శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment