Monday, October 22, 2018

నువ్వేం చేస్తున్నావ్?


నువ్వేం చేస్తున్నావ్?
సాహితీమిత్రులారా!

తెలుగులో జ్ఞానపీఠఅవార్డు పొందిన రావూరి భరద్వాజగారి
ఈ కథను ఆస్వాదించండి..............................

పడుకున్నాడన్న మాటేగానీ మాధవరావుకు బొత్తిగా నిద్ర రావటం లేదు. కనీసం వచ్చే సూచనలు కూడా లేవు. అప్పటికప్పుడే సుజాత చంటివాణ్ని పక్కన వేసుకొని నిద్రపోయింది. గోపీ తనను కావలించుకొని ఆదమరచి నిద్రపోతున్నాడు.

పెద్దకొడుక్కేసి ఓ క్షణకాలం చూసి సన్నగా తనలో తనే నవ్వుకున్నాడు మాధవరావు. ఆ క్షణాన అతనికి మానవ జీవితమంతా పెద్ద ‘మాయ’లాగా కనిపించింది. ఎందుకో కారణం చెప్పుకోలేని విధంగా ఓ తల్లి కడుపున పుట్టటం, మలమూత్రాదుల్లో ఏహ్యమనేది లేకుండా పొర్లాడటం, పెరగటం, చదువుకోవటం, పని చేసుకోవటం, పొట్ట నింపుకోవటం, పెళ్ళాడటం, సంసారం చెయ్యటం, పిల్లల్ని కనటం, వాళ్ళకోసం పాకులాడటం, వాళ్ళను పెంచటం, చదివించటం, పెళ్ళిళ్ళు చేయటం, ఆఖరుకు నశించటం- ఇదీ జీవితచక్రం…

దురదృష్టవశాత్తూ మన సమాజంలో కట్టుకుపోయినంత కుళ్ళు పేరుకుపోయి ఉంది. దారిద్ర్యం, అనారోగ్యం, అసహనం, ఈర్ష్య, ద్వేషం, కాపీనం వగైరా వగైరా శతకోటి దుర్లక్షణాలు మానవ సమాజాన్ని విషక్రిముల్లా పట్టి పీడిస్తున్నాయి. ఈ రోగాలనుండి మానవజాతి ఎప్పటికి తరిస్తుందో తెలీదు. అంతకన్నా ముఖ్యం, ఈ రోగ క్రిములకు మానవుడే కారణమేమో కూడా తనకు తెలీదు.

ఎందుకంటే, భాగ్యవంతుల ఇంట పుట్టడమూ ఎక్కువ కులంవారింట పుట్టటమూ ఏ వ్యక్తి చేతుల్లోనూ లేదు. కొందరు ఆగర్భ శ్రీమంతుల ఇంట పుడతారు. మరికొంతమంది పుట్టు దరిద్రుల ఇంట పుడతారు. అంతమాత్రాన దరిద్రులకు బ్రతికే హక్కు లేదనడం అమానుషం; కానీ పరిస్థితులు వారికా హక్కును లేకుండా చేస్తున్నాయి మరి.

అసలిదంతా తనకు జ్ఞాపకం రావడానికి ‘రమణి’ కారణం. తను పని చేస్తున్న ఆఫీసులో ఒక్కటంటే ఒక్కటే ఉద్యోగం ఖాళీ వచ్చింది. అదైనా టైపిస్టు ఉద్యోగం. ఆ ఉద్యోగం కోసం రమారమిగా రెండువందల పైచిలుకు అప్లికేషన్‌లు వచ్చాయి. వీటిల్లో చాలామంది బాగా చదువుకొన్నవాళ్ళు పెట్టినవి. స్కూలు ఫైనల్ లగాయితు ఎమ్మే చదువుతూ మానేసిన వారిదాకా ఈ ఉద్యోగం కోసం అప్లికేషన్‌లు పెట్టారు. ఇంతమందిలోనూ తను ఒక్కరిని మాత్రమే ఎన్నిక చేసుకోవాలి. ఈ సమస్యతో రెండురోజుల్నుంచీ దుంపతెగిపోతూవుంది.

ఉద్యోగం దొరకటమనేది, అదెంత చిన్నదైనా ఫర్వాలేదు, ఎంత అదృష్టమో వారిని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. బోలెడంత డబ్బుపోసి, బోలెడంత ఆరోగ్యాన్ని ధ్వంసం చేసుకొని, చచ్చేట్టు చదివి సంపాదించిన డిగ్రీ అరవై రూపాయల ఉద్యోగం కోసమే అయితే ఈ చదువులకన్నా అధ్వాన్నమైన వాటిని తనూహించలేడు. నిన్నా ఇవ్వాళా వచ్చినవాళ్ళను తను మాటాడించి చూశాడు. బ్రతుకంటే భయపడటంకన్న ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళొక్కళ్ళూ తనకు కనిపించలేదు. అంటే డబ్బు, ఆరోగ్యాలతో బాటుగా ఆత్మవిశ్వాసాన్ని కూడా ఈ చదువు హరించి పారేస్తోందన్నమాట.

ఒక్కోవ్యక్తి చెబుతున్న మాటలు వింటుంటే గుండెలు చెరువులయిపోతాయి. తనకే అధికారముంటే వీళ్ళందరి కళ్ళనుండి కన్నీటిని తుడిచి పారేసి ఉండేవాడు. చిరునవ్వును అతికించి ఉండేవాడు. తనకా అదృష్టమూ లేదు; ఉన్నవారా చెయ్యరు.

మాధవరావు చిరాగ్గా మంచం మీద లేచి కూచున్నాడు. సుజాత చంటివాణ్ని మరింత డొక్కలోకి పొదువుకొని ముడుచుకు పడుకొంది. గోపీ వెల్లికిలా తిరిగాడు. కుడి సెలవి నుంచి కారుతున్న చొంగ బుగ్గమీదుగా జారి మెడ ముడతలలోంచి పరుపులోకి ఇంకిపోతోంది. సాయంత్రం సుజాత పెట్టిన చాదుబొట్టు చెమటకు తడిసి కుడి కనుబొమ్మ మీదికి సాగింది. మాధవరావు ఆప్యాయంగా గోపీని పక్కకు తిప్పి పడుకోబెట్టాడు. కుచ్చెళ్ళ చెంగుతో చొంగ తుడిచి మెడదాకా దుప్పటి కప్పాడు. అతని మనస్సంతా గిజాటుగా ఉంది. మెదడులో సన్నని పోటు ప్రారంభమయింది. కిటికీ తెరచి వంటినిండుగా గాలి పీల్చుకున్నాడు. సిగరెట్ వెలిగించి గుండె నిండుగా పొగ పీల్చాడు. దూరంగా ఎక్కడో గడియారం పదకొండు గంటలు కొట్టింది. స్టేషన్‌లో రైలింజన్ షంటింగ్ చేస్తోంది.

‘రమణి, రమణి’ అనుకొన్నాడు మాధవరావు. ఆమె రూపం అతని ముందు మరోసారి ప్రత్యక్షమయింది. రమణి ఎదురుగా ఉన్నట్టు భావించి, కళ్ళు టపటపలాడించాడు మాధవరావు-

“నీ పేరేమిటి?” అన్నాడు మాధవరావు.

“రమణి.” అన్నదావిడ.

“నువ్వేం చదువుకొన్నావ్?” అన్నాడు మాధవరావు.

“మెట్రిక్ పాసయ్యాను. టైప్‌రైటింగ్ ఫస్టుక్లాసులో పాసయ్యాను.” అన్నది రమణి.

“ఇదివరకెక్కడన్నా పనిచేశావా?” అన్నాడు మాధవరావు.

“లేదు.” అన్నది రమణి.

“ఎంచేత?” అన్నాడు మాధవరావు.

రమణి ఏదో అనబోయింది; కానీ అనలేదు. ఓసారి మాధవరావుకేసి చూసి తలవంచుకుంది.

“నీకన్నా చదువుకొన్నవాళ్ళు, అనుభవమున్నవాళ్ళు ఉండగా, నీకీ ఉద్యోగం ఎందుకిస్తారనుకొన్నావ్?” అన్నాడు మాధవరావు.

ఈసారీ రమణి మాట్లాడలేదు. కానీ కుర్చీలో బాధగా కదిలింది. ఆవేశాన్ని అణచుకోవడానికి రెండుమూడుసార్లు గుటకలు మింగింది.

“ఈ ఉద్యోగం నీకిస్తే- ఆఁహ… ఇస్తారని గ్యారంటీ లేదు; ఇవ్వడం జరిగితే జాగర్తగా పనిచేస్తావా? పై ఆఫీసరు మాటను మన్నిస్తావా?” అన్నాడు మాధవరావు.

రమణిలోకి ఎక్కడలేని చైతన్యమూ వచ్చి దూకినట్లయింది. ఓసారి తలెత్తి మాధవరావు ముఖంలోకి చూసింది. సన్నగా నవ్వింది. నవ్వినప్పుడు మల్లెమొగ్గల్లా తీర్చినట్టున్న ఆమె పలువరుసను చూసి మాధవరావు చిత్తయిపోయాడు.

‘కోలినాస్’ చిరునవ్వు అనుకొన్నాడు మాధవరావు.

“తప్పకుండానండీ. కొద్దిరోజులు చూడండి. నా సర్వీసు మీకు తృప్తికరంగా లేకపోతే ఏ క్షణాన్నయినా నన్ను తీసేసే హక్కు మీకు ఉండనే ఉంటుంది.” అన్నది రమణి.

“మంచిది.” అన్నాడు మాధవరావు, ఇహ వెళ్ళమన్న ధోరణిలో.

కానీ రమణి కుర్చీలోంచి కదలలేదు.

“నన్నెప్పుడు కనిపించమంటారూ?” అన్నది రమణి, కింది పెదవిని సుతారంగా మునిపంట కొరుకుతూ.

ఆ రూపం మాధవరావును ముగ్ధుణ్ని చేసింది. ‘అంతలా ఆరోగ్యకరమైన వయస్సును చూసి ఎంతకాలమయిందో’ ననుకున్నాడు.

“చెప్పరూ?” అన్నది రమణి దాదాపుగా అతన్ని లాలిస్తున్న ధోరణిలో.

చటుక్కున మాధవరావుకు పది సంవత్సరాల కిందటి సంగతి జ్ఞప్తికొచ్చింది. సంక్రాంతి పండక్కు అతను అత్తవారింటికెళ్ళాడు. వారం రోజులపాటు సుఖంగా ఉన్నాడు. సుజాత ఆ వారం రోజులూ అతని మడిమలు తొక్కుతూనే ఉంది. ఇహ రేపు ఉదయం వెడతాడనగా సుజాత ముఖంలో విచారం కమ్ముకొంది. ఆ రాత్రల్లా ఆవిడ బెక్కుతూనే గడిపింది. బయలుదేరబోతూ సుజాతకేసి చూశాడు. ఆవిడ చూపులు తనను పిలుస్తున్నట్లుగా ఉన్నాయి. ఏదో మరచిపోయిన వాడిలాగా జేబులు తడుముకుంటూ మాధవరావు గదిలోకొచ్చాడు. “కలంగానీ మరచిపోయారా?” అంటూ సుజాత కూడా గదిలోకొచ్చింది. వస్తూనే అతన్ని గాఢంగా కావలించుకొంది. వెర్రెత్తినదానిలా అతని చెంపలు ముద్దెట్టుకొంది. జుత్తులోకి వేళ్ళు జొనిపి చిందరవందర చేసి తన చెంపను అతని పెదవులకానించింది. మాధవరావు ఆమె చెంప వాసన చూశాడు. సున్నితంగా చెంపలమీది వెంట్రుకలు చెవుల ప్రక్కకు సర్దాడు. రాత్రి నలిగిన బంతిపూలు రేకులుగా విడివడి కిందికి రాలాయి.

“మళ్ళా వస్తాను.” అన్నాడు మాధవరావు అనలేక అనలేక బాధపడుతూ.

“ఎప్పుడొస్తారు?” అన్నది సుజాత అతని గుండీలు తిప్పుతూ.

మాధవరావు మెరిసిపోతున్న భార్య కళ్ళకేసి చూశాడు. ఎప్పుడొచ్చేదీ చెప్పలేదు. ఆ చూపుల అర్థం సుజాతకు తెలుసు. అటువంటి చూపుల అనంతరం జరిగే సంఘటన ఊహించి నిలువునా ఉప్పొంగిపోయింది. సిగ్గుతో ముఖాన్ని మాధవరావు గుండెలకేసి అదుముతూ “చెప్పరూ?” అన్నది సుజాత.

మాధవరావు ఏదో చెప్పాడు. సుజాతను విడిపించుకొని వచ్చేశాడు.

ఈ సంగతులన్నీ జ్ఞాపకం వచ్చాయి మాధవరావుకు. ఆ రోజున సుజాత అన్నట్లుగానే ఇప్పుడు రమణి కూడా ‘చెప్పరూ?’ అన్నది. సుజాతకు అప్పుడు అతనేదో చెప్పాడు. ఏం చెప్పిందీ అతనికిప్పుడు జ్ఞాపకం లేదు.

రమణి మరోసారి అతనికేసి కళ్ళింత చేసుకొని నవ్వింది.

“ఏమిటాలోచిస్తున్నారు? చెప్పరు కదూ?” అన్నది మూతిని కొద్దిగా కుంచించి.

మాధవరావు పొయ్యని చెమటను ఒకసారి తుడుచుకొన్నాడు. పెదవులు తడుపుకొన్నాడు.

“నువ్వు రానవసరం లేదు. ఎడ్రస్సివ్వు, కబురుచేస్తాను.” అన్నాడు మాధవరావు.

రమణి ఎడ్రస్ రాసిచ్చింది.

“మీరు కబురుచేసినా సరే, వచ్చినా సరే! నేనెక్కడికీ వెళ్ళను. మా నాన్నగారు పక్షవాతం రోగి, మంచంలోంచి కదల్లేరు. తమ్ముడు స్కూలుకెడతాడు.” అన్నది రమణి కుర్చీలోంచి లేస్తూ. “మరి నాకు సెలవిప్పించండి, వెడతాను.”

“మంచిది.” అన్నాడు మాధవరావు.

రమణి పోతూపోతూ ఓ సారి వెనక్కి తిరిగింది.

“మరచిపోరుగదూ?” అన్నది, కళ్ళనిండా ఆశల్ని నింపుకొంటూ.

“నెవ్వర్.” అన్నాడు మాధవరావు.

రమణి వెళ్ళిపోయింది.

పోయిన చాలాసేపటిదాకా అతను మామూలు స్థితికి రాలేకపోయాడు. ఆ తరువాత వచ్చిన కాండిడేట్లను ఆట్టే అడగలేదు. అడిగినవాటికైనా వారేమి సమాధానం చెప్పినదీ అతను వినిపించుకోలేదు. మనస్సంతా కల్లోలంగా ఉంది. అందుకనే క్లబ్బుక్కూడా పోకుండా సరాసరి ఇంటికొచ్చాడు.

“అప్పుడే వచ్చారేం?” అన్నది సుజాత భర్త వాలకాన్ని కనిపెట్టి.

“నాన్నా! నాన్నా!” అంటూ గోపీ కాళ్ళకు చుట్టేసుకొన్నాడు.

మాధవరావు కొడుకును ఎత్తుకొని అమాంతంగా గాలిలోకి ఎగరేసి పట్టుకున్నాడు. వాడి బుగ్గలు గాట్లుపడేలాగా కొరికాడు.

“అందగాడైతే అసలే కిందకు దింపరనుకుంటాను.” అన్నది సుజాత మురిసిపోతూ.

“మనవాడి కళ్ళు చూసే ఏ ఆడదైనా వెంటపడుతుందే.” అన్నాడు మాధవరావు.

సుజాత ఫక్కున నవ్వింది.

మాధవరావు కళ్ళు అందంగా వుంటాయి. ఆ అందాన్ని గురించి సుజాతే చాలాసార్లు ప్రస్తావించింది.

“ఆ కళ్ళను చూసే ఏ ఆడదైనా మీ బుట్టలో పడుతుందండీ!” అనేది సుజాత.

ఆ మాట ఇప్పుడు ఇద్దరికీ జ్ఞాపకం వచ్చింది. ఇద్దరూ నవ్వుకొన్నారు.

ఇవన్నీ ఒకదాని తరువాత మరొకటి మాధవరావు కళ్ళముందు మెదలసాగాయి. సిగిరెట్ పారేసి, లైట్ వేశాడు. వంకెనున్న అద్దం తీసి, కుచ్చెళ్ళ చెంగుతో దాని మీద దుమ్మూ దూగరా తుడిచి చూసుకొన్నాడు. అద్దంలో అతని కళ్ళు తళతళలాడుతూ కనిపించాయి. చాలాసేపు అలా చూస్తూనే కూర్చున్నాడు. సుజాత లేచిన సంగతి కూడా అతనికి తెలీదు.

“మీరింకా నిద్రపోలా!” అన్నది సుజాత.

మాధవరావు ఉలిక్కిపడ్డాడు.

“అద్దంలో చూసుకుంటున్నారేమిటీ?” అన్నది సుజాత అయోమయంగా.

“కన్ను నొప్పి పెడుతోంది.” అన్నాడు మాధవరావు, అద్దాన్ని వంకెకు తగిలిస్తూ.

సుజాత ఎడంకన్ను పరీక్షించి చూసింది. ఏమీ లేదు.

“ఒకవేళ ‘సుల్లగొండి కురుపు’గానీ లేస్తున్నదేమో! రేపు జ్ఞాపకం చేయండి. ఓ చిన్నుల్లి రెబ్బ చిదిమి పెడతాను. ఇట్టే సమసిపోతుంది.” అన్నది సుజాత.

లైటార్పేసి మాధవరావు మంచంమీద వెల్లకితలా పడుకున్నాడు. సుజాత చన్నీటితో ముఖం కడుక్కొంది. బాగా ఇన్ని నీళ్ళు పుక్కిలించింది. గోపీని తీసి తమ్ముడిదగ్గర పడుకోబెట్టింది. పిల్లలు పడకుండా ఉండేందుకు అటూ ఇటూ దిళ్ళు అమర్చింది. ఆ తరువాత మాధవరావు పక్కనే అతన్ని వొరుసుకొని పడుకుంది.

“నిద్రా?” అన్నది సుజాత.

మాధవరావు పలకలేదు.

“అమ్మ దొంగా!” అన్నది మెల్లగా.

ఈసారీ మాధవరావు పలకలేదు.

సుజాత సన్నగా నిట్టూర్చింది.

అదేసమయంలో మాధవరావు రమణిని గురించి కలలుగంటున్నాడు. తన ప్రక్కనే ఉన్నది రమణి అయినట్టూ తనను ‘దొంగా’ అని పిలుస్తూన్నట్టు భావన చేస్తున్నాడు. అతని శరీరంలో మెరుపు మెరిసినట్లయింది. కళ్ళు మూసుకొనే సుజాతను దగ్గరగా తీసుకొని, గాఢంగా ఆమెను ఆక్రమించేశాడు.

2
ఆట్టే శ్రమలేకుండానే రమణి ఇంటిని కనుక్కొన్నాడు మాధవరావు. ఆ సమయానికి రఘు వాకిట్లో ఆడుకొంటున్నాడు. మాధవరావును చూస్తూనే వాడు ఆట మానేశాడు.

“అక్కా! ఎవరో వచ్చారే!” అని ఇంట్లోకి కేకపెట్టాడు రఘు.

“ఎవరో కనుక్కోరాదుట్రా!” అన్నది లోపల్నుంచి అక్క.

“గీరల కోటూ నల్లరంగు బూట్లూ వేసుకున్నారే!” అన్నాడు రఘు.

మాధవరావు అప్రయత్నంగా తన కోటుకేసీ బూట్లకేసీ చూసుకున్నాడు.

“వస్తున్నా,” అంటూనే రమణి వచ్చింది. మాధవరావును చూస్తూనే ఆశ్చర్యపడి అంతలోనే తేరుకొని విండుగా నవ్వింది రమణి.

లోపలకు వెడుతున్నప్పుడు వసారాలో పడుకున్న ముసలాయన్ను చూశాడు మాధవరావు.

“మా నాన్న!” అన్నది రమణి. “కూచోండి, క్షణంలో కాఫీ పెడతాను.”

“అవసరంలేదు. తాగే బయలుదేరాను.” అన్నాడు మాధవరావు.

“అవునుగానీ దీనికి మీరేమాత్రం అద్దె ఇస్తున్నారు?”

“ఇరవై రెండు.” అన్నది రమణి.

“పైగా రెండెందుకూ? ఇరవయ్యో ఇరవయ్యయిదో చెయ్యకూడదూ?” అన్నాడు మాధవరావు నవ్వుతూ.

రమణి కూడా అనాసక్తంగా నవ్వింది.

“అద్దె ఇరవయ్యే అనుకోండీ, మిగతా రెండురూపాయలూ కరెంటు చార్జీలన్నమాట.”

“ఓహో!” అన్నాడు మాధవరావు.

“ఎవరే అమ్మాయ్ వచ్చిందీ?” అన్నాడు ముసలాయన వసారాలోంచి.

“మొన్న అప్లికేషను పెట్టానని చెప్పలేదూ, ఆ ఆఫీసు మేనేజరుగారు నాన్నా! నేనే రమ్మని పిలిచాను. చాలా మంచివారు.” అన్నది రమణి.

ముసలాయన మరేమీ పలకలేదు.

“మరోలా అనుకోకుండా ఉంటానంటే, అందాకా ఈ పత్రికలు చూస్తూ ఉండండి. పది నిమిషాల్లో తల దువ్వుకొని బట్టలు మార్చుకొని వచ్చేస్తాను.” అన్నది రమణి.

“ఓ యస్, దానికేం!” అన్నాడు మాధవరావు.

రమణి గూట్లోంచి నూనె సీసా తీసి చేతిలోకి వొంపుకొంది. నూనె రెండు చేతులకు పట్టించి వెంట్రుకలకు పాముతోంది. నూనె పాముతున్నపుడు భుజాలమధ్య విరిసిన సౌందర్యంకేసి మాధవరావు విముఖుడు కాలేకపోయాడు. రమణి అది గమనించిందో లేదో తెలీదుగానీ, గమనించనట్లే ప్రవర్తించింది. కాళ్ళు బారజాపి, అద్దాన్ని కాళ్ళ మధ్యగా ఉంచి ముఖం కనపడటానికి రవంత కిందుగా వొంగినప్పుడు పొట్టమీద ఏర్పడిన సన్నని ముడతలు వెండితీగల్లా తళుక్కున మెరిశాయి. తల దువ్వుకొంటున్నంతసేపూ రమణి ఏవో కబుర్లు చెబుతూనే ఉంది.

జడను మెలితిప్పి ముడివేసుకొంటూ “మీరు పేపరు చూడటం లేదు.” అన్నది రమణి.

మాధవరావు ఉలిక్కిపడ్డాడు. నిజంగా అతను పేపరు చూడటం లేదు; రమణికేసి చూస్తున్నాడు.

“మరే!” అన్నాడు మాధవరావు.

“చప్పున స్నానంచేసి వస్తాను. కనీసం ఇప్పుడైనా పేపరు చూడండి!” అంటూనే రమణి వెళ్ళిపోయింది.

మాధరావు ఈసారి మనస్ఫూర్తిగా పేపరు విప్పాడు. కానీ చదవబుద్ధి కాలేదు. జాకెట్ విప్పేసి పమిటను భుజాలనిండా కప్పుకొని ఓ చేత్తో బకెట్టు పుచ్చుకొని, ఆ బరువుకు వంగుతూ బాత్‌రూం లోకెడుతున్న రమణి రూపం అతని మనస్సును ఉడుకులెత్తించింది. ఆ నాలుగ్గోడలమధ్యా ఏ ఆచ్ఛాదనా లేని రమణి శరీరాన్ని తలచుకొని అతను ఉద్రిక్తుడయ్యాడు. ఆ అందాన్నంతా కళ్ళతో త్రాగి త్రేన్చాలనిపించింది. తాను వెళ్ళి నిలబడినప్పుడు సిగ్గుతో ముడుచుకుపోయే రమణి శరీరాన్ని చేతులనిండా పొదువుకోవాలనిపించింది. ఈ రకమైన ఊహలు అతన్ని మరింత కకావికలం చేశాయి, పిచ్చివాణ్ని చేశాయి. వేళ్ళు విరుచుకొని, జారగిలపడిపోయాడు మాధవరావు.

పావుగంట లోపలగానే రమణి తయారయింది. సన్నని చీరె అలవోకగా కట్టుకొంది. నీలపు రంగు జాకెట్టు వేసుకొంది. రేఖల్లాగా కాటుక దిద్దుకొంది. పావలా కాసంత కుంకుమబొట్టు పెట్టుకొంది. పమిట చెంగుతో ఓసారి ముఖం తుడుచుకొంటూ మూలనున్న పాత కుర్చీని అతనికి దగ్గరగా లాగి కూచుంది రమణి.

ఏం మాట్లాడటానికీ మాధవరావుకు పాలుపోలేదు. వాకిట్లో రఘు మరో నలుగురు పిల్లల్ని చేర్చి బిళ్ళంగోడు ఆడుతున్నాడు.

“మీరొస్తారనుకోలేదు సుమండీ!” అన్నది రమణి వీధిలోకి చూస్తూ.

“అదేం?” అన్నాడు మాధవరావు.

“ఎందుకో తెలీదు. అలా అనుకున్నాను. రేపు నేనే ఓసారి మీ దగ్గరకొద్దామని కూడా అనుకొన్నాను.” అన్నది రమణి.

“ఎందుకూ?” అన్నాడు మాధవరావు ఆసక్తిగా.

“మీకోసమని,” అన్నది రమణి. “మరి మీరు ఏ సంగతీ తేల్చలేదుగా, అదేదో కనుక్కుందుకు వద్దామనుకొంటున్నాను.”

“అందుకే నేనూ వచ్చాను.” అన్నాడు మాధవరావు, ‘అందుకే’ అన్న మాటను నొక్కి పలుకుతూ.

రమణి మాట్లాడలేదు. ఓ క్షణం మౌనంగా ఉండిపోయింది. అతని కళ్ళలోకి చూస్తూ “ఇప్పుడేం చేద్దామంటారూ?” అన్నది రమణి.

“ఎక్కడికన్నా పోదాం… పోనీ సినిమాకెడదాం, పార్కుకెడదాం. ఏం?” అన్నాడు మాధవరావు.

“ముందు పార్కుకెడదాం. ఆ తరువాత సినిమాకెడదాం.” అన్నది రమణి.

“అప్పటికి మొదటి ఆట అందదనుకొంటాను.” అన్నాడు మాధవరావు.

“పోనీ, రెండో ఆటకెడదాం.” అన్నది రమణి ఏదయితేనేమన్న ధోరణిలో.

“వచ్చేటప్పటికి పొద్దుపోదూ?”

“పోతుంది. పోతేనే నయం. అందరు నిద్రల్లో ఉంటారు. మనల్ని గమనించే వారుండరు. మీకు అభ్యంతరం లేకపోతే…”

రమణి ఏమనదలచిందో తెలియదు. అంతలోనే రఘు దూకుడుగా లోపలికొచ్చాడు.

“బాబూ! శారదగారింటికెళ్ళి నేనీపూట ప్రయివేటుకు రానని చెప్పిరా. నేను వచ్చేదాకా రాధమ్మ పిన్నిగారింట్లో కూచో, సరేనా? వచ్చేటప్పుడు నీకు మిఠాయీలు తెస్తాను.” అన్నది రమణి, తమ్ముడ్ని దగ్గరకు తీసి బుజ్జగిస్తూ.

“మరి నాకు బూట్లో?” అన్నాడు రఘు.

రమణి ముఖం ముడుచుకుపోయింది.

“రేపో ఎల్లుండో తెచ్చిపెడతాను బాబూ! మా నాయనవిగదూ, ఉంటావుగా?” అని గోముచేసింది రమణి.

“నువ్వసలు మంచిదానివి కాదక్కా! అన్నీ అబద్ధాలు చెబుతావు. ఏప్రిల్ నుంచీ బూట్లు కొంటానంటున్నావు, మరి కొనవేం?” అన్నాడు రఘు గునుస్తూ.

“ఈసారి తప్పకుండా కొంటానమ్మా. నాకు ఉద్యోగం అయింది. ఇకనుంచీ నీకు కావలసిన బూట్లు…” అన్నది రమణి.

రఘు ‘ఉద్యోగం’ అన్నమాట వినగానే మాధవరావుకేసి చూశాడు. మాధవరావు ఎందుకోగాని తలొంచుకున్నాడు.

“అయితే అవల్‌రైటుగా ఉంటానక్కాయ్!” అన్నాడు వాడు, ఛంగున వీధిలోకి గెంతుతూ. మెట్టుమీద దూకువేగాన్ని తట్టుకొని నిలబడుతూ వెనక్కు తిరిగాడు.

“ఏమిట్రా?” అన్నది రమణి.

“నాకు ఇలాంటి నల్ల బూట్లు కావాలి, తెలిసిందా?”

“చెప్పావుగా! నేను తెస్తాను చూడరాదా?” అన్నది రమణి.

రఘు వెళ్ళిపోయాడు. వసారాలోంచి ముసలాయన గొణుగుడు క్రమంగా సద్దుమణిగిపోయింది. ఈ వాతావరణంలోంచి బయటపడుతున్న దానిలాగా రమణి ఒక్కసారి శరీరాన్ని విదిలించుకొంది.

మాధవరావు మళ్ళా మామూలు స్థితిలోకొచ్చాడు.

“నిజంగా ఎక్కడికన్నా వెళ్ళాలని ఉన్నదా?” అన్నాడు మాధవరావు, రమణికేసి కన్నార్పకుండా చూస్తూ.

“ఇంతలోకే మనసు మార్చుకొన్నారేం!” అన్నది రమణి, సన్నగా నవ్వుతో. “వెళ్ళాలని లేదు. మీరంటే నేనూ ‘సరే’ అన్నాను. పోనీ ఇక్కడే గడిపేద్దాం.”

మాధవరావు ఏమీ మాట్లాడలేదు.

“రఘు ఇంతలో రాడులెండి. మా నాన్నగారి సంగతి చెప్పానుగా,” అన్నది రమణి లేచి నిలబడుతూ.

మాధవరావు కూడా అప్రయత్నంగా లేచి నిలుచున్నాడు.

“ఇన్నిటికీ అద్దె సంగతి అడిగారు గానీ ఇల్లేపాటిదో మీరు చూశారు కాదు… రండి చూదురు గాని.”

మాధవరావు మాటాపలుకూ లేకుండా ఆమెతో నడిచాడు.

“ఇది వంటగది, ఇక్కడ సామాన్లు అవీ పడేస్తుంటాను. ఈ టిక్కీలో రఘు పడుకొంటాడు. ఇదిగో, ఈ గది మాత్రం నాది.” అంటూ రమణి తన గదిని చూపెడుతూ అతన్ని లోపలికి తీసుకొచ్చింది.

మాధవరావు గుండె దడదడలాడింది. చేతులు వణికాయి. కణతలు నొక్కుకుపోతున్నట్టుగా ఫీలయ్యాడు. వొంటరితనం, ఎదురుగా రమణి, ఆమె చొరవ- ఇవన్నీ కలిసి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరోమాట లేకుండా దగ్గరగా జరిగి ఆమెను కావలించుకొన్నాడు. రమణి కూడా గువ్వలా అతని చేతుల్లో ఇమిడిపోయింది. మాధవరావు ఆమె ముఖాన్ని తనకేసి తిప్పుకొని__

బాంబు పడినట్టుగా ఉలిక్కిపడ్డాడు మాధవరావు. రమణిని విడిచి ఎడంగా వచ్చాడు. గది బయట ఎవరివో అడుగుల చప్పుడు వినిపించింది.

“ఎవరది?” అంటూ రమణి చప్పున గది బయటికొచ్చింది.

మాధవరావు తలుపు వెనక నించున్నాడు.

పది నిముషాలకల్లా రమణి తిరిగివచ్చింది. అంతదాకా మాధవరావు గజగజలాడుతూనే ఉన్నాడు.

“ఎవరు?” అన్నాడు మాధవరావు వణికిపోతూ.

“ఎవ్వరూ లేరండీ!” అన్నది రమణి.

“కాదు, ఎవరో వచ్చారు. అడుగుల చప్పుడు నేను స్పష్టంగా విన్నాను.” అన్నాడు మాధవరావు.

రమణి పలకలేదు. నిజానికి ఆ చప్పుడు ఆమె కూడా విన్నది. కానీ తనకు తెలిసినంతవరకూ ఈ ఇంటికెవ్వరూ రారు. పిన్నిగారొచ్చినా, ఆవిడ రాకని అంతదూరంగా ఉన్నపుడే పోల్చుకోవచ్చు. అయితే ఏమిటిది?

“నేను వెడతాను.” అన్నాడు మాధవరావు నిట్టూరుస్తూ.

రమణి దిగాలుపడి అతనికేసి చూసింది.

“ఎటన్నా వెడితే చాలా పొద్దుపోతుంది కదా, అంతకన్నా ఇక్కడ కూచోరాదూ?” అన్నది రమణి బ్రతిమాలుతున్నట్టు.

“ఇవాళ కాదు.” అన్నాడతను బెరుకుబెరుగ్గా.

రమణి మరేమీ మాట్లాడలేదు.

“రేపు__” అని కాసేపు ఆలోచించాడు మాధవరావు. “హోటల్‌కెడదాం. ఓ గది తీసుకొందాం. అక్కడిలాంటి గొడవలేమీ ఉండవు, సరేనా?”

రమణి ముఖం విప్పారింది.

“రాత్రి ఎనిమిదింటికి నువ్వక్కడికి రా. నేనూ వస్తాను. మరచిపోకు.” అన్నాడు మాధవరావు.

“నేను మరిచిపోవాలన్నా మీ కళ్ళు మరచి పోనివ్వవులెండి. మీరు పొగడ్త అనుకోనంటే చెబుతాను. మీ కళ్ళు- చాలా అందంగా ఉంటాయండీ!” అన్నది రమణి, దాదాపు అతనికే వినిపించేటంత మెల్లగా.

మాధవరావు పొంగిపోయాడు. ఈల వేసుకుంటూ బయటికొచ్చాడు. రమణి గడప దాటిందాకా అతనికేసి చూసి, ఆ తరువాత కుర్చీలో కూలబడి భోరుమని ఏడ్చింది.

3
ఆ రాత్రి నిజంగా మాధవరావుకు నిద్రపట్టలేదు. రేపు తను అనుభవించనున్న ఆనందాన్ని తలచుకొని తన్మయుడయిపోయాడు. ఆ తన్మయత్వంలో అతనికి భార్య రూపం ఎబ్బెట్టుగా కనిపించింది. రమణికీ సుజాతకూ కావిళ్ళు వేసి చూసి పెదవి విరిచాడు. ఉన్నంతలో సుజాత అందగత్తె అనటంలో సందేహం లేదు. కానీ రమణి ముందు ఈమె ఎందుకూ కొరగానిదే! అదీగాక సుజాత అందం పదేళ్ళుగా తాను ఎరిగిందే. తన నుండి సుజాత దాచుకున్నదీ దాచుకోవాలనుకున్నదీ కూడా ఏమీ లేదు. బహుశా ఈ ‘అలవాటు’ వల్లనే కావచ్చు, తనకు సుజాతమీద మోజు తగ్గిపోయింది.

మాధవరావు నిద్రపోతున్న భార్యకేసి చూశాడు. చటుక్కున తల తిప్పుకొన్నాడు. అలా రమణి పడుకొని ఉంటే, తనిలా ఉట్టినే ఉండగలడా? తను ఉండటం కాదు; రమణి సౌందర్యం ఉండనీయదు. ఎదుటివారిని కవ్వించి ఏడిపించే గుణమేదో రమణిలో ఉంది. ఆ గుణమే తనను ఆవిడ చుట్టూ తిప్పుకొంటోంది. రమణి కూడా తన అభిప్రాయాన్ని గమనించింది.

సుజాత అన్నట్టు, బహుశా తన కళ్ళే ఆవిణ్ణు ఆకర్షించి ఉంటాయి. కానీ ఏం లాభం? చేతికి వచ్చిన ఫలితం అనుభవంలోకి రానేలేదు. వచ్చినట్లయితే…

ఏమయ్యేదో చెప్పలేం. గోపీ గగ్గోలుపెడుతూ లేచి కూచున్నాడు.

“నిద్దర్లో కలవరిస్తున్నాడండీ! కాస్త చిచ్చికొట్టకూడదూ…” అన్నది సుజాత లేస్తూనే.

“అలాగే.” అన్నాడు మాధవరావు.

“మీరింకా పడుకోలేదేం?” అన్నాది సుజాత.

“నిద్దర్రావటం లేదు.” అన్నాడతను.

“అదేమిటండీ! వర్సగ్గా రెండుమూడు రాత్రుల్నుంచీ మీరిలా మేలుకొంటున్నారు. ఆఫీసులో ఏమన్నా గొడవలుగానీ జరిగాయా?”

“లేదు.”

“మరి ఎన్నడూ లేనిది ఇవాళ ఇలా ఉంటున్నారేం?”అన్నది సుజాత.

“ఏమీ లేదు. నన్నరిపించకు, నువ్వెళ్ళి పడుకో.” అని కసిరాడు మాధవరావు.

ఆ తెల్లవారికూడా మాధవరావు ఆఫీసులో చిరాగ్గా ఉన్నాడని గుమాస్తాలు అనుకొన్నారు. ఆ టైపిస్టు ఉద్యోగం ‘ప్రభాకరం’ అనే అతనికొస్తుందనీ, అతనెక్కణ్నించో రికమెండేషన్ పట్టుకొచ్చాడనీ కూడా వారనుకొన్నారు. అంతేగానీ రమణి పేరు ఒక్కరికీ తట్టలేదు.

ప్రతి ఆఫీసులోనూ కొంతమంది లుచ్ఛాలుంటారు. వాళ్ళ పని, యజమానినో పై అధికారులనో భజన చేయటం. ఆఫీసులో ఎవరేమనుకొనేదీ ఏం పనిచేసేదీ కూడా ఈ లుచ్ఛాలు ఎప్పటికప్పుడు చేరవేస్తుంటారు. అందుకు అదనంగా వీరికాట్టే ముట్టదు. కానీ అప్పుడప్పుడూ యజమాని లేదా పై అధికారి భుజంమీద చెయ్యివేసి తనతోబాటు కారు దాకా తీసికెడతాడు.

ఇటువంటి లుచ్ఛాలు మాధవరావు ఆఫీసులో కూడా ఉన్నారు. సాయంత్రానికల్లా గుమాస్తాలనుకొన్న మాటలన్నీ మాధవరావుకు తెలిశాయి.

‘ఇదీ కొంత మేలే! రేపా రమణికి నేను ఉద్యోగం ఇస్తే ఈ గొడవలన్నీ పైకిరాకుండానన్నా ఉంటాయి.’ అనుకొన్నాడతను.

పొద్దు కుంకుతున్నకొద్దికీ అతనిలో ఆరాటం హెచ్చసాగింది. ఎనిమిదింటికి హోటలుకు రమ్మన్నవాడు కాస్తా ఆఫీసు నుండి సరాసరి రమణి ఇంటికొచ్చాడు. చిత్రమేమిటంటే, రమణి కూడా అప్పటికి అన్నీ తీర్చుకొని సిద్ధంగా ఉంది.

“అప్పుడే తయారయ్యావేం?” అన్నాడు మాధవరావు చాలా చొరవగా ఆమె బుగ్గమీద చిటికె వేస్తూ.

“అబ్బా! చాలా చురుకండీ మీ దెబ్బ!” అన్నది రమణి బుగ్గను వేళ్ళతో తడుముకొంటూ.

ఈ మాటతో మాధవరావు అక్షరాలా పిచ్చివాడయ్యాడు. రమణి అందంలోనే కాదు. మాటల్లో కూడా రెచ్చగొట్టే లక్షణాలున్నాయని అతనిప్పుడు తెలుసుకున్నాడు. రమణి ఏ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ మాటలన్నదో తెలిశాక, అతనికి నిలువునా దహించుకుపోయినంత పనయింది.

రమణి ఈ సంగతి ఇట్టే గ్రహించింది. చప్పున పక్కకు తప్పుకొంటూ, “ఇప్పుడు కాదు… ముందు సినిమాకు పోదాం పదండి.” అంటూ బయలుదేరింది.

“పోదాంగానీ చిన్నమాట, ఇలా రా!” అన్నాడు మాధవరావు తలుపుచాటున నిలబడి.

రమణి సరిగ్గా వీధివాకిలికి ఎదురుగా నిలబడి ఉంది.

“చెప్పండి, ఇక్కడికి వినిపిస్తుంది.” అన్నది విశాలంగా నవ్వుతో.

“ఆఁహ, అలా కాదు. నువ్వు దగ్గరకొస్తేగానీ చెప్పను.” అన్నాడు మాధవరావు.

“మీరు చెప్పేదేమిటో నాకు తెలుసు. అయినా అంత దూకుడెందుకు? ఈ సంగతులు చెప్పుకొనేందుకు మనకు బోలెడంత టైం ఉంది. మీరాట్టే తొందరపడకండి. బుద్ధిమంతుడైన పిల్లకాయలా చెప్పినమాట వినండి.” అన్నది రమణి,
బద్ధకంగా ఓసారి చేతులు రెండూ వెనక్కు చాపి విరుచుకొంటూ.

మాధవరావు అక్కడ నిలబడలేకపోయాడు. శరీరం విరుచుకొన్నప్పుడు పొంగిన రమణి అందం అతన్ని మరోసారి కల్లోలపరిచింది.

“నన్ను నిలువునా చంపేస్తున్నావు రమణీ! అదేదీ కాదంటే వినిపించుకోవేం? చిన్నమాట. ఓ క్షణం ఇలా విని అలా వెళ్ళిపోదువు.” అన్నాడు మాధవరావు బతిమాలుతున్న ధోరణిలో.

రమణి రెండడుగులు ముందుకేసి తలుపును పట్టుకొని నిలబడి, “ఊఁ, ఏమిటో ఇప్పుడు చెప్పండి.” అన్నది.

మాధవరావు వొడుపుగా రమణి చేతులు పట్టుకొని తనకేసి లాక్కున్నాడు. ఒక్క ఉదుటున వచ్చి అతనిమీద పడిపోయింది రమణి.

“ఎందుకు నన్నిలా చంపుతున్నావ్?” అన్నాడు మాధవరావు రమణి చెవిలో.

రమణి ఏదో అనబోయింది కానీ అనలేదు. తేలుకుట్టినదానిలా చప్పున ఇవతలికి దూసుకొచ్చింది. ఎవరో వస్తున్నట్లుగా మెట్లమీద అడుగుల చప్పుడులయ్యాయి. నీడలు కూడా అటూ ఇటూ మెత్తగా కదిలాయి.

మాధవరావు ఉద్రేకం యావత్తూ తక్షణమే దిగిపోయింది.

“బావుందండీ ఇల్లు… ఇరవైరెండు రూపాయలన్నమాట… వానా నీరూ వస్తే కురవదుగదా?” అంటూ సందర్భాన్ని మార్చాడు.

“అబ్బే అదేం లేదులెండి,” అంటూనే రమణి కూడా ఇవతలికొచ్చింది. ఆ కబురూ ఈ కబురూ చెబుతూ మెట్లమీదికొచ్చి, అటూ ఇటూ చూసింది. ఎక్కడా ఎవ్వరూ కనిపించలేదు.

“ఎవ్వరూ లేరుగదూ?” అన్నాడు మాధవరావు, గుండె దడను తగ్గించుకొంటూ.

“ఊఁహూ.” అన్నది రమణి తల అడ్డంగా తిప్పుతూ అతనికేసి ప్రశ్నార్థకంగా చూసి.

“కానీ ఎవరో వచ్చారు రమణీ! అడుగుల చప్పుడు వినటమే కాదు, నేను నీడ పడటం కూడా చూశాను.”

కాస్సేపు నిశ్శబ్దంగా ఒకరి కళ్ళలోకి చూసుకున్నారు.

“రా పోదాం__ ఇప్పుడప్పుడే ఈ మాటలు వద్దు. ముందుగా సినిమాకెళ్ళి___” అన్నాడు మాధవరావు.

“బ్రతికించారు. కనీసం కొంతసేపయినా హాయిగా సినిమా చూడొచ్చు.” అన్నది రమణి నవ్వుతూ.

సినిమాకయితే వెళ్ళారు. కొనడానికి ‘బాక్స్’ టిక్కట్లే పుచ్చుకొన్నాడు మాధవరావు. కానీ రమణి పక్కనుండగా సినిమా చూడటం కాదుగదా, ఆఖరికి ఊపిరి పీల్చడం కూడా పడదని తేల్చుకున్నాడు. దురదృష్టవశాత్తూ అదేదో అమెరికన్ పిక్చరయిపోయింది. అందులోని హీరో, హీరోయిన్ కోసం చాలాసేపు వెంటబడి తరిమి ఆఖరుకు ఓ కొండమలుపులో పట్టుకుంటాడు. ఆ హీరోగారు ఆవిణ్ణి అమాంతం చేతులమీద ఎత్తుకొని, చిన్న గడ్డి మైదానం మీద పడుకోబెట్టి ఆవిడమీదకి వాలిపోయాడు. వాళ్ళిద్దరూ ముద్దెట్టుకోవడాన్ని కెమెరా క్లోజప్‌లో చూపించింది.

అసలే మాధవరావు తపనతో సతమతమవుతున్నాడు. ఈ సినిమా ఆ తపనను ఇంకా రెచ్చగొట్టింది. తను హీరో అయినట్టూ రమణి హీరోయిన్ అయినట్టూ ఆవిడలా పరుగెడుతుంటే తను వెంబడించి పట్టుకున్నట్టూ మాధవరావుకు భావన కలిగింది. అతనిక స్థిమితంగా కూచోలేకపోయినాడు. ‘పోదాం పద’మంటూ రమణిని గీమారం పెట్టసాగాడు.

“అలాగే! ఇదిగో ఈ సీనయ్యాక వెడదాం. అబ్బ! ఈ షాట్ చూడండి ఎంత బావుందో! మరీ అమెరికావాళ్ళు అలా వొళ్ళంతా కనపడేలా గుడ్డలు కట్టుకొంటారేం?”

ఈ ధోరణిలో రమణి మాటాడసాగింది. కానీ మాధవరావుకిది బొత్తిగా నచ్చలేదు. అతని లోపల అగ్నిజ్వాలలు రేగుతున్నాయి. ఆ జ్వాలలకు ఇంత ఉపశాంతి జరిగితే తప్ప లాభంలేదు.

“ఇప్పుడప్పుడే వెళ్ళి ఏంచేద్దాం?” అన్నది రమణి, ఏం చేయవలసిందీ అతని నోటే చెప్పించాలనుకొన్నదానిలాగా.

“ఏంచేదామా? అంత తెలియదేం నీకు?” అన్నాడు మాధవరావు గుటకలు మింగుతూ.

“ప్చ్. తెలీదు.” అని మెత్తగా నవ్వేసింది రమణి.

“అయితే చెబుతాను పద. ఊఁ, లే మరి.” అని చిన్నగానే, గట్టిగా అన్నాడు.

“ఇంకా తొమ్మిదన్నా కాలేదు. ఇప్పుడప్పుడే వెళ్ళిమాత్రం ఏం లాభం? మనకోసమని చుట్టుపక్కలవారు అప్పుడే నిద్రపోతారా మరి?” అన్నది రమణి.

“పోకపోతేనేం? హాయిగా మాట్లాడుకొందాం!” అన్నాడతను.

“అదేమిటో ఇక్కడే అనుకొందాం పట్టండి!” అన్నది రమణి, కేవలం అతన్ని ఏడిపించాలన్న ఉద్దేశంతో.

“ఎంత పెంకిఘటానివి!” అన్నాడు మాధవరావు చేసేదేమీలేక.

“లేకపోతే నన్ను బురిడీ చెయ్యాలని చూస్తారా? ఇంతమంది మధ్యలో ఉంటేనే నా ప్రాణాలు తోడేస్తున్నారు గదా, తీరా హోటలుకెళ్ళాక… నేను నమ్ముతాననే!” అన్నది రమణి, అతని చెంపకు తన చెంప ఆన్చి చెవులో చెబుతున్నట్టుగా.

“ఈ రాత్రి జాగారం ఎటుకూడీ తప్పదనుకోండీ! ఈ సినిమా చూశాకనే దాన్ని ప్రారంభిద్దాం, ఏం?”

“నీ ఇష్టం.” అన్నడు మాధవరావు విసుగ్గా.

రమణి అతనికేసి ఓ క్షణం చూసి, మునిపంట పెదవి కొరుకుతూ “అంత కోపమైతే ఎలానమ్మా! నేనుమాత్రం ఏమన్నాననీ? కాకపోతే వెడదాం పదండి, ఊఁ…” అన్నది.

“ఆనక నన్నని లాభంలేదు. ఇప్పుడే చెబుతున్నాను; ఆ కళ్ళు రెండింటిని నేను తాగేస్తాను. మీ ఆవిడకు ఏం చెప్పుకొన్నా మాబాగే!” అన్నది కుర్చీలోంచి లేస్తూ.

ఇంతకు ముందే రిజర్వు చేసుకొన్న గదిని చూపించి కుర్రవాడు వెళ్ళిపోయాడు. పోతున్నప్పుడు ఆ వెధవ తనలో తను నవ్వుకున్నట్టు మాధవరావుకు లీలగా అనిపించింది. కానీ దాన్ని తను లెక్కచేయదలుచుకోలేదు. గదిలోకొస్తూనే అతను తలుపు గడియపెట్టాడు. ఫాన్ వేశాడు. అప్పటికప్పుడే దీపం ఆర్పేసి, డిమ్మర్ వేస్తానంటూ కూచున్నాడు.

రమణి లుంగలు చుట్టుకుపోయేలా నవ్వింది. ఆ నవ్వులో హేళన ఉందో, జాలే ఉందో అతను గమనించదలుచుకోలేదు. పడి నవ్వాక, రమణి పొట్ట చేత్తో పట్టుకొని మంచంమీద కూచుంది.

“ఏమిటా వెర్రినవ్వు?” అన్నాడు మాధవరావు.

“మీ ఇల్లు బంగారంగాను. ఎంత తొందరపాటు మనుషులండీ మీరు! గదిలోకి రాగానే తలుపులేస్తే పక్క గదులవారు ఏమనుకుంటారోనని గూడా ఆలోచించరేం?”

“ఏమనుకోడానికైనా, మనం పరాయి వాళ్లం కాదుగా? మొగుడూ పెళ్ళాలమాయె! ఏదో పనుండి ఈ వూరొచ్చాం. ఈ రాత్రి ఇక్కడ ఉంటాం, ఉదయం వెళ్ళిపోతాం. ఇందులో తప్పేంలేదే!” అన్నాడు మాధవరావు.

అతనలా చెప్పే హోటల్లో ఈ గదిని బుక్ చేశాడు.

“అయితే మాత్రం!” అన్నది రమణి.

మాధవరావు పలకలేదు. వస్తూ వస్తూ తెచ్చిన మిఠాయి కొంచం తను తిని మిగతాది రమణికిచ్చాడు. తాంబూలం తను వేసుకొని ఆవిణ్ణు కూడా వేసుకోమన్నాడు.

“నాకు సయించదు.” అన్నది రమణి. “అయితే చూడండీ…” అంటూ కబుర్లలోకి లాగింది.

ఈ పంపిణీమీద దాదాపు పదకొండింటిదాకా అతన్ని దరి చేరకుండానే ఉంచగలిగింది రమణి. ఆ తరవాత ఆవిడవల్ల కూడా కాలేదు. రమణి తల్లోంచి పూలచెండు తీసి మాధవరావు పక్కనిండా విదిపాడు. ఆవిడ భుజమ్మీద చెయ్యి వేశాడు. ఆ వేళ్ళలోనించి అతనిలోకి విద్యుత్కణాలు ప్రవహించినట్లయింది. శరీరమంతా తియ్యని మంటలతో నిండిపోయినట్లయింది. ఆసరికి రమణి కూడా దాదాపు అదే స్థితిలోకొచ్చింది. ఆవిడ కళ్ళు కాంతితో నిండిపోయాయి. పెదవులు చలిస్తున్నాయి. గుండె కొట్టుకునే చప్పుడు స్పష్టంగా వినపడుతోంది. గాజులు మోచేతులదాకా లాక్కుంది. వెల్లికితలా తిరిగి మాధవరావు ముఖాన్ని తన గుండెలకేసి తీసికొని అదుముకొంది. మరొక్క క్షణంలో మాధవరావు ఆవిణ్ణు ‘జయించి’ ఉండును.

కానీ అతనికా అదృష్టం లేదు. ఎవరో వరండాలోంచి బరువుగా అడుగులు వేసుకుంటూ వస్తున్నారు. మాధవరావు నిర్విణ్ణుడయ్యాడు. రమణి దాదాపు కొయ్యబారిపోయింది. అంతే! ఆ చప్పుడు మరి వినిపించలేదు.

“ఇద్దరం భయపడ్డాం. అబ్బే, ఏం లేదులే.” అన్నాడు మాధవరావు తనకు తను ధైర్యం చెప్పుకొంటూ.

రమణి పమిటచెంగుతో చెమటను తుడుచుకొని నిట్టూర్చింది.

“అలా తుడుచుకోకు. లైటు కాంతి పడి నీ ముఖమంతా మెరవనివ్వు.”అన్నాడు మాధవరావు ఆవిణ్ణు ఆలింగనం చేసుకుంటూ.

ఈసారి అడుగుల చప్పుడు తలుపు వెనకాతల వినిపించింది. అయినా మాధవరావు లక్ష్యపెట్టదలచలేదు. రమణిని వెర్రిగా కౌగలించుకొని ముఖం కోసం వెదుకుతున్నాడు.

ఈసారి తలుపుమీద దడదడమని చప్పుడయింది. తలుపు కంపించడం కూడా వారు చూశారు.

“ఎవరది?” అన్నాడు మాధవరావు బిగ్గరగా.

“తలుపు తియ్యండి.” అవతలినుంచి.

“మీకెవరు కావాలి?”

“పదమూడో నంబరు గదిలో ఉన్నవారు కావాలి. మీ పేరు మాధవరావుగదూ?”

“అవును.” అన్నాడు మాధవరావు.

“మీతోనే పనుంది. తలుపు తియ్యండి.”

“తియ్యను.” అన్నాడు మాధవరావు చాలా కోపంగా.

“అవసరముంటే రేపు ఆఫీసులో కలుసుకోండి. వెళ్ళండి.”

“ఇప్పుడు నువ్వేం చేస్తున్నావ్?” అన్నది అవతలి గొంతు.

మాధవరావు ఉక్కిరిబిక్కిరయ్యాడు. అతనికి దిగచెమటలు పోశాయి. రమణి నిలువునా వణికిపోతూ ఓ మూలగా నిలబడింది.

“చెప్పు! నువ్వేం చేస్తున్నావ్?”

“ఆఫీసు పని. ఆఫీసులో బొత్తిగా తెమలడంలేదు. ఇంటిదగ్గర పిల్లల గోల. అర్జెంటుగా వెళ్ళవలసిన కాయితాలున్నాయి. అందుకని హోటల్లో గది తీసుకొన్నాను.” అన్నడు మాధవరావు.

“నేనిప్పుడే హోటల్ రిజిస్టర్ చూసి వస్తున్నాను. అందులో నువ్విలా రాయలేదు. పనిచెయ్యడానికొచ్చేవాడివి రమణినెందుకు తీసుకొచ్చావ్?”

మాధవరావు కుప్పకూలిపోయాడు.

ఆ తరవాత బైటనుంచి కూడా మరే మాటలూ వినిపించలేదు. చాలాసేపటిగ్గానీ వారు తేరుకోలేకపోయారు. ఇద్దరి ముఖాలూ పాలిపోయాయి. మాధవరావు గాలిలో ఈదుతున్నవాడిలాగా వెళ్ళి దీపం వేశాడు. మెల్లిగా తలుపులు తీశాడు. వరండాలోకి చూశాడు. అంతా నిర్మానుష్యంగా ఉంది. పక్క గదుల్లో తిరుగుతున్న ఫాను చప్పుళ్ళు తప్ప మరే ధ్వనీ లేదు.

రమణి ముఖం పాలిపోయింది. ఆ ఉద్రేకం, పొంగు, చురుకుదనం సర్వమూ నాశనమయిపోయాయి. సగం చిక్కిపోయినదానిలాగా ఊగిసలాడుతోంది. ఆవిడ కళ్ళు నీటితో నిండిపోయాయి.

“వెడతాను.” అన్నది రమణి.

మాధవరావు పలకలేదు. ఇద్దరూ తూలిపడిపోయినట్లుగా ఎవరో గెంటుతున్నట్లుగా మెట్లు దిగి బయటికొచ్చారు. ఆ చీకట్లోంచి వెనకగా నవ్వినట్లయి తిరిగి చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. నవ్వు మాత్రం వినిపిస్తోంది.

4
“ఇప్పటిదాకా ఏం చేస్తున్నారండీ?” అన్నది సుజాత, తలుపు గడియ పెడుతూ.

“ఆఫీసు పనిమీద ఉండిపోయాను.” అన్నాడు మాధవరావు ముక్తసరిగా.

“వేణ్ణీళ్ళు చల్లారిపోయాయో ఏమిటో! ఓ నిమిషం అలా కూచుంటారా, చప్పున వెచ్చ చేసుకొస్తాను?”

“వద్దు. నాకు వంట్లో ఏం బాగోలేదు. ఈ పూటకు నన్ను పలకరించకు. పడుకోనీ,” అంటూనే మాధవరావు వెళ్ళి మంచంమీద పడుకున్నాడు. దుప్పటి తలదాకా లాక్కున్నాడు.

సుజాతకీ గొడవలేమీ అర్థంకాలేదు. భర్త అలా నీరసంగా వడదెబ్బ తిన్నట్టుగా కనిపించేసరికి ఆవిడ నవజీవాలు కుంగిపోయినట్లయింది. గుడ్లనీరు గుడ్ల కుక్కుకొంటూ వంటిమీద చేయివేసి చూసింది. అతని శరీరం నులివెచ్చగా ఉంది.

“పులిక తగిలింది.” అనుకొన్నది సుజాత.

“ఈ పూటకిలా పడుకోండి. ప్రొద్దుటే లేచి ఇంత మిరియాలపొడి కొడతాను. వేడి వేడి అన్నంలో చిటికెడు వేసుకు తింటే అన్నీ సర్దుకుంటాయి.” అన్నది సుజాత.

మాధవరావుకీ మాటలు వినిపించాయో లేదో తెలీదు. అతను మాత్రం పలకలేదు.

సుజాత దీపం మలిపి డిమ్మర్ వేసి పడుకొంది. పడుకొన్న కాస్సేపటికల్లా ఆమెకు హాయిగా నిద్రపట్టింది.

మాధవరావుకు మాత్రం నిద్రపట్టడం లేదు. కానీ అది మెలకువా కాదు. సందిగ్ధ స్థితిలో అతను కొట్టుమిట్టాడుతున్నాడు. గత నాలుగైదు రోజులుగా జరుగుతున్న సంఘటనలన్నీ ముసిరి అతనికి ఊపిరి తిరగనివ్వటంలేదు. రమణి పట్ల
అతనికి తన ప్రవర్తన కోడెత్రాచయి బుసలుకొడుతూ మీదికి దూకుతున్నట్లు ఫీలయ్యాడు. ఆ పాపం నుండి తప్పుకోవటానికి అటూ ఇటూ పరుగెత్తుతున్నాడు. నీడలాగే అది కూడా మాధవరావును వెన్నాడుతూనే ఉంది. అతను కుర్చీ పైకి ఎక్కాడు. అదికూడా కోడు మీదుగా కుర్చీ అంచుమీదికి పాకుతోంది. అతను చటుక్కున బల్లమీదికి దూకాడు. పడగవిప్పి బుస్సుమంటూ బల్లమీదికి దూకింది. అతను నిండా ముసుగు పెట్టుకొని మంచం మీద ముడుచుకు పడుకున్నాడు. అతని పాదాలకు రెండంగుళాల దూరంలో దాని పడగ కనిపించింది.

మాధవరావు ప్రాణాలు నిలువునా ఎగిరిపోయాయి. దిగచెమటలు పోశాయి. గాలికోసం ఆము తిన్న గొడ్డులాగా గిజగిజా గిజగిజా తన్నుకొన్నాడు. పెద్దగా అరిచాడు. ఆ అరుపు ఎవ్వరికీ వినపడలేదు. గోపీ నిశ్చింతగా పడుకునే ఉన్నాడు. సుజాత చంటివాణ్ని రొమ్ములకదుముకొని హాయిగా నిద్రపోతూనే ఉంది. అతను మాత్రం ఊపిరాడక తన్నుకొంటున్నాడు. అతని కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. పాము మెల్లగా అతని మీదకు పాకుతోంది. తోకను గొంతు చుట్టూ తిప్పి క్షణక్షణానికీ బిగించిపారేస్తోంది. మెడ నరాలు ఉబికాయి. చేతులు కొంకర్లు పోతున్నాయి. లేచి ఓపికంతా తెచ్చుకొని మెడకు చుట్టుకొన్న పామును ఊడలాగటానికి ప్రయత్నిస్తున్నాడు. పట్టుకోసం గదంతా కలియతిరుగుతున్నాడు.

సుజాత ఉలిక్కిపడి లేచింది. గోపీ నడిమంచంమీద కూచుని గగ్గోలుగా ఏడుస్తున్నాడు. తన భర్త రెండు చేతులనూ గొంతుకు చుట్టి, నీరసంగా గోడకి చేరగిలబడి ఉండటం సుజాత చూసింది. అతని కళ్ళు మూసుకుపోయాయి. శరీరం చల్లగా ఉంది.

“అయ్యోరామ, ఏమిటిది! ఏం చేస్తున్నారు?” అంటూనే భర్తను కావలించుకొని భోరుమని ఏడ్చింది సుజాత. బలవంతాన చేతుల్ని విడదీసింది. మెల్లగా పక్కమీద పడుకోబెట్టింది.

నాలుగు రోజులదాకా మాధవరావు మామూలు మనిషి కాలేదు.

ఆఫీసుకి వెళ్ళబోతూ, అతనోసారి అద్దంలో చూసుకొన్నాడు. మునుపటికన్నా కళ్ళు ఎంతో అందంగా కనిపించాయిప్పుడు.

‘ఆ పాడుపనే చేసివుంటే ఈ జన్మలో నన్ను నేను చూసుకోగలిగేవాణ్ని కాదు.’ అనుకొన్నాడు మాధవరావు.


ఇప్పుడతని మనస్సూ శరీరమూ కూడా చాలా హాయిగా తేలికగా నిర్మలంగా ఉన్నాయి. రమణి ఆర్థిక పరిస్థితులను తన స్వార్థం కోసం వాడుకోనందుకు తనను తానే అభినందించుకొన్నాడు. డబ్బు- పాపిష్టి డబ్బు- మనుషుల చేత ఎంత అమానుష కార్యాలు చేయిస్తుందో మాధవరావుకిప్పుడు తెలిసివచ్చింది. రమణికే గనుక ఏపాటి ఉపాధి ఉన్నా, తనలాంటివాడి ముఖాన్ని కనీసం చూడనన్నా చూసి ఉండేది కాదని అతను రూఢిగా నమ్మాడు. ఇప్పుడతను రమణిని తప్పుపట్టబోవటం లేదు. శరీరాలకాశించి ఉద్యోగాలిచ్చే వ్యక్తులుండాలేగాని ఈ దరిద్ర దేశంలో శరీరాలిచ్చుకునేవారు చాలామంది ఉన్నారు. అయినప్పుడు రమణిది తప్పనటంలో అర్థంలేదు. తనిప్పుడా ఉద్యోగం ఇవ్వకపోతే, ఇచ్చేవాడికి తన శరీరాన్ని నిస్సందేహంగా రమణి అప్పగిస్తుంది. ఇది తప్పే కావచ్చు. కానీ ఇంతకన్నా రమణి చేయగలిందేమీ లేదు. ఆవిడకున్న పెట్టుబడీ ఇన్‌ఫ్లుయన్సూ ఆ శరీరమే!

మాధవరావు ఆఫీసుకొస్తూనే రమణిని వెంటనే వచ్చి పనిలో చేరవలసిందిగా ఉత్తరం రాశాడు. దాంతోపాటు చిన్న కాగితం మీద క్షమాపణలు కూడా చెప్పుకొన్నాడు.

“మంచిపని చేశావు. చాలా మంచిపని చేశావు.” అని ఎవరో అతని చెవి దగ్గర అన్నారు.

మాధవరావు తలెత్తి చూశాడు. ఆ గదిలో తను తప్ప మరెవ్వరూ లేరు.
----------------------------------------------------------
రచన: రావూరి భరద్వాజ, 
ఈమాట సౌజన్యంతో, 
ఒకనాటి యువకథ 

No comments:

Post a Comment