సంసారంలో బేతాళ ప్రశ్న?
సాహితీమిత్రులారా!
ఇది స్వగతం అనే శీర్షికలో కూర్చబడినది
ఆస్వాదించండి..........
ఇంతకుముందు విష్ణువాళ్లు పాలు వేసినప్పుడు వ్యవహారం సాఫీగా ఉండేది. ఎన్ని లీటర్లు వేశారో లెక్క రాసుకునేవాళ్లు; ఒక రోజు కాడ పోతే నోట్ చేసుకునేవాళ్లు; ‘రేపు లీటర్ బదులు హాఫ్ లీటర్ చా’లంటే ఒకటే వేసేవాళ్లు; అంతెందుకు, ‘వచ్చే ఆదివారం, సోమవారం ఉండమూ… మళ్లీ మంగళవారం నుంచి వేయండి,’ అంటే సరిగ్గా అట్లానే గుర్తు పెట్టుకునేవాళ్లు. లేదంటే, మనం సోమవారం ఏ రాత్రో ఊరి నుంచి వస్తాం… మంగళవారం వాళ్లు వేయపోతే మళ్లీ మనం రోడ్డు మీదకు పోవాలి. లేదా, వాళ్లు పొద్దున కాలనీలో వేసే సమయానికి నిద్ర పాడుచేసుకుని మరీ కాపు కాయాలి!
కానీ ఎప్పుడైతే విష్ణువాళ్ల నుంచి యాదయ్య ఈ పంపకాన్ని ‘బదిలీ’ చేసుకున్నాడో అప్పట్నుంచీ ఇబ్బంది మొదలైంది. ఈయన ముందు ‘టైము’కు వేయడు; లెక్క రాసుకోడు; రేపు వద్దన్నదీ గుర్తుండదు, ఎల్లుండి అర లీటర్ చాలన్నదీ గుర్తుండదు. అందుకే, కేలండర్ మీద నేనే ‘మైనస్ హాఫు’లూ, ‘నో మిల్కు’లూ రాసిపెడుతూ వుంటాను.
సాధారణంగా మా దగ్గర ఈ నెల పది నుంచి వచ్చే నెల తొమ్మిది తారీఖు దాకా లెక్క. మేము మామూలుగా రోజూ లీటర్ వేయించుకుంటాం. పదో తారీఖు నాడే ఆ నెల డబ్బులు మొత్తం ముందే ఇచ్చేస్తాం; ఎన్ని లీటర్లూ ఇంటూ లీటరు ధర ప్లస్ వేసిందానికి ఛార్జీ! అందులో గనక మనం ఏమైనా ఊళ్లో ఉండకో, ఇంకేదైనా కారణం వల్ల వద్దనుకుంటేనో తగ్గిపోయే లీటర్ల ధరను వచ్చే నెల ఎడ్వాన్సులో మినహాయించుకోవచ్చు. (ఈ విధానంలో– అద్దింటివాళ్లం చెప్పాపెట్టకుండా ఇల్లు ఖాళీ చేసినా వాళ్లు నష్టపోయేది ఏమీవుండదు.)
ఈ పాలు వేయడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటేమో ప్రహరీ గోడకు ఉన్న దీగుట్లో వేసెళ్లడం; రెండోదేమో మా పోర్షన్ గేటుకు కట్టి వున్న బుట్టిలో వేయడం. మామూలుగా మా ఓనరంకుల్ పొద్దున ఐదింటికల్లా మెయిన్ గేటు తాళం తీస్తాడు. ఆయన అలా తీయలేదంటే, బలమైన కారణం ఏదో వుండాలి! పాలతను ఐదు తర్వాతే వస్తాడు కాబట్టీ, అప్పటికి మెయిన్ గేటు తెరిచేవుంటుంది కాబట్టీ, కచ్చితంగా లోపలికి వచ్చి, తొంబై తొమ్మిది శాతం మా గేటుకు కట్టి వున్న బుట్టీలోనే వేసెళ్తాడు. ఇక, ఆ ఒక్క శాతం కేసు, అంటే పొరపాటున మెయిన్ గేటు తీయని సందర్భంలో– పాలతను బయటనుంచే ప్రహరీ గోడ మీదినుంచి బాగా వంగి, లోపలి దీగుడు తలుపును చేత్తో తడిమి తీసి, అందులో వేస్తాడు.
విష్ణువాళ్లు వేసినప్పుడు– విష్ణు‘వాళ్లు’ అని ఎందుకు అంటున్నానంటే, వీళ్లు ముగ్గురు. మరో ఇద్దరు భరత్, విహారి. డిగ్రీ చేస్తున్న లేదా చేసిన యువకులు. ముందు విష్ణు వచ్చేవాడు కాబట్టి, నాకు అతడి పేరే గుర్తుండిపోయింది. తర్వాత చాలా రోజులు భరత్ వేశాడు. లెక్కకు మాత్రం ఎక్కువగా విహారి వస్తాడు. (ఈయన పేరు నేను చాలా రోజులు విజయ్ అనుకున్నాను; పాల పేకెట్లు వేసే యువకుడికి విహారి అనే పేరు ఉంటుందన్న ఊహ లేకపోవడం వల్ల! తొలి పరిచయంలో అతడు తన పేరు సరిగ్గానే చెప్పినా- నా పిచ్చి కాకపోతే, సరిగ్గా చెప్పడా!- నేను విజయ్‌గానే విన్నాను.) ఎప్పుడైనా, ఇంత లేటైంది; పాలు ఇంకా రాలేదేమా అనుకుని, ఠక్కున గుర్తొచ్చి ఆ దీగుట్లో గనక చూస్తే కచ్చితంగా అందులో పేకెట్లు ఉండేవి. అంటే, మా ఓనర్ గేటు తీయకముందే వేసెళ్లినట్టు! ఈ ఏడేళ్లలో యాదయ్య వచ్చాక అలా జరిగిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. (వేళ్ల మీద లెక్క పెట్టడం అనే మాటను నేను నా జీవితంలో తొలిసారిగా వాడినట్టున్నాను!)
మొన్నొక రోజు యాదయ్యకు ఏం చెప్పాం: “రేపు, ఎల్లుండి ఊరెళ్తున్నాం; రెండ్రోజులు పాలు వేయొద్దు; మంగళవారం నుంచీ మామూలుగానే వేయండీ.”
మళ్లీ మేము సోమవారం రాత్రికి వచ్చేశాం. మంగళవారం నుంచీ యాదయ్య యథావిథిగా పాలు వేయడం మొదలుపెట్టాడు. ఇంతా చేస్తే ఇదా నేను చెప్పే విషయం!
మంగళవారమో, బుధవారమో సాయంత్రం మా పిల్లలు ఆడుతూ ఆ దీగుడు తలుపు తెరిచారు. అందులో రెండు అరలీటర్ పేకెట్లు కనబడినై, జున్నయిపోయి! అంటే, యాదయ్య ఆదివారం నాడు మాకు పాలు వద్దని చెప్పిన విషయం మరిచిపోయి వుంటాడు కాబట్టి వేశాడు. పైగా ఖర్మకొద్దీ ఆ రోజున ఓనరంకుల్ గేటు తీయకముందే వచ్చివుంటాడు. లేదంటే, మా ఓనర్ వాళ్లయినా చెప్పివుండేవాళ్లు. మరి రెండో రోజు ఎందుకు వేయలేదు? అంటే, తెల్లారి గుర్తొచ్చి వుండొచ్చు. లేదా, చెప్పింది ముందురోజే కాబట్టి, ఆదివారానికి మాత్రం బలంగా గుర్తుపెట్టుకుని వేయకుండా వుండి, సోమవారానికి తనదైన మతిమరుపుతో వేసి వుండొచ్చు కూడా!
ఎలా జరిగినా ఇప్పుడు నా సమస్య ఇదీ: యాదయ్య ఎటూ లెక్క చేయడు కాబట్టీ, నేనే చేసిస్తాను కాబట్టీ, ఎటూ మేము వాడుకోని ఈ లీటర్ పాల డబ్బుల్ని వచ్చే నెల ఎడ్వాన్సులో మినహాయించుకోవాలా? లేక, మేము వాడినా వాడుకోకపోయినా, పాపం ఎటూ వేసేశాడు కాబట్టి, ఆ లీటర్‌ను కలుపుకొని ఇవ్వాలా?
----------------------------------------------------------
రచన: పూడూరి రాజిరెడ్డి,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment