Saturday, October 20, 2018

తెలుగులో యాత్రాసాహిత్యం


తెలుగులో యాత్రాసాహిత్యం




సాహితీమిత్రులారా!


ఆధునిక తెలుగు సాహిత్యం మొదలయి ఎన్నాళ్ళయింది? మొట్టమొదటి రచన ఏది?

ఒక్క కథ విషయంలో తప్పిస్తే నవల, నాటకం, ఆత్మకథల్లాంటి ప్రక్రియల విషయంలో ఇదేమంత చర్చనీయమైన అంశం కాదు. రాజశేఖర చరిత్రము, కన్యాశుల్కం ఆ మొదటి రచన హోదాని పెద్ద అభ్యంతరాలు లేకుండానే సంతరించుకొన్నాయి. కానీ కథ విషయంలో నిన్నమొన్నటి దాకా మొట్టమొదటి కథగా మనం భావించుకొన్న ‘దిద్దుబాటు’ను దాటుకొని మరో పదీపదిహేను ఏళ్ళు వెనక్కువెళ్ళి ‘ధనత్రయోదశి’ ముందుకొచ్చింది. దిద్దుబాటుకు ముందు వచ్చిన కథలతో దిద్దుబాటలు అన్న పెద్ద పుస్తకమే ఈమధ్య వచ్చింది.

కానీ పైన వేసుకొన్న ప్రశ్న మరోసారి- తెలుగులో మొట్టమొదటి ఆధునిక రచన ఏది?


ముందుగా ప్రశ్న అర్థం కాదు. అర్థమయ్యాక సమాధానం కథానవలలను దాటి వెళ్ళదు. నవల కన్నా ముప్ఫైనాలుగేళ్ళు ముందుగా, నాటకం కన్నా యాభైనాలుగేళ్ళు ముందుగా, కథకన్నా కనీసం అరవై ఏళ్ళు ముందుగా 1838లో వచ్చిన ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర చరిత్ర గుర్తుకురాదు.

మొట్టమొదటి ఆధునిక రచన అన్నపుడూ కాశీయాత్ర చరిత్ర అన్నపుడూ ఒకటిరెండు మౌలికమైన ప్రశ్నలు వస్తాయి- కనీసం తెలుగులో.

ఏవో ప్రయాణాలు చేసి, వాటి గురించి కాసిన్ని వివరాలు గుదిగుచ్చినంత మాత్రాన అది సాహిత్యమవుతుందా? చెప్పుకోదగ్గ రచనలు పట్టుమని పాతికైనా లేని యాత్రాసాహిత్యానికి ‘మొట్టమొదటి ఆధునిక రచన’ అన్న హోదా కట్టబెట్టడం సరైన పనేనా? అసలు యాత్రాసాహిత్యమూ ఒక సాహిత్యమేనా?



ఈ విషయం గురించి ఎంతైనా చర్చించవచ్చు.

సంచారమన్నది మనిషి సహజ ప్రవృత్తి అయినపుడు; తాము చేసిన ప్రయాణాల అనుభవాలను అక్షరరూపంలో నిక్షిప్తం చేయడమన్నది రెండువేల సంవత్సరాలుగా సాగిపోతున్నపుడు; మార్కోపోలో, రాహుల్‌ సాంకృత్యాయన్‌ లాంటివాళ్ళ రచనలను సాహిత్య ప్రియులు తరతరాలుగా ఆసక్తితో చదువుతున్నపుడు; శరత్‌ లాంటి రచయిత జీవిత చరిత్రకే ద్రిమ్మరి – ప్రవక్త అన్న పేరు ఉన్నపుడు ఈ ప్రశ్న అవసరమా అనిపిస్తుంది. మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ తమిళ, మళయాళాల్లోనూ వచ్చిన యాత్రాసాహిత్యానికి అకాడమీ ఎవార్డుల వంటివి రావటం సమీప సాహితీ చరిత్ర. నిజానికి వాటి ఉనికి అంతగా తెలియకపోయినా తెలుగులోనూ విలక్షణ యాత్రారచనలు ఉన్నాయి.


నూట ఎనభై ఏళ్ళ తెలుగు యాత్రాసాహితీ గమనంలో సుమారు రెండు వందల యాత్రాగ్రంథాలు వచ్చాయని ఒక అంచనా. అప్పటి ఏనుగుల వీరాస్వామి నుంచి 2016లో నా ఐరోపా యాత్ర రాసిన వేమూరి రాజేశ్‌ వరకూ ఓ వందమంది యాత్రాగ్రంథకారులు మనకు ఉన్నారు. పుస్తకాల రూపంలోనే కాకుండా వ్యాసాలుగా కొన్ని వేల యాత్రారచనలు వచ్చాయి; కొన్ని వందలమంది తమ తమ యాత్రల గురించి వ్యాసాలు రాశారు, రాస్తున్నారు. ఆ వందలాది యాత్రారచనాకారుల్లో దాదాపు సగంమంది మన మధ్యన ఈనాడు జీవించి ఉన్నారన్న విషయం ఆశ్చర్యం కలిగించినా ఒక చక్కని వాస్తవం. యాత్రాసాహిత్యం ఒక పరిణత దశకు చేరుకొంటుందన్న మాటకు ఒక నిదర్శనం.

మెయిన్‌ స్ట్రీమ్‌ తెలుగు సాహిత్యంలో ఉన్నట్టే యాత్రాసాహిత్యంలోనూ అనేకానేక ధోరణులు ఉన్నాయి. అక్కడ పాపులర్‌ సాహిత్యం ఉన్నట్టే ఇక్కడా కాస్తంత సమాచారం దట్టించిన కాలక్షేపం ట్రావెలాగ్స్‌ ఉన్నాయి. అక్కడ సమాజ హితం కోసం తపించే సాహిత్యమున్నట్టే ఇక్కడా అనుభూతీ అనుభవాలూ మానవ సంబంధాలూ ప్రధానంగా సాగే యాత్రా రచనలు ఉన్నాయి. అలాగే ప్రయాణాలు చేసే వాళ్ళలో కూడా స్థూలంగా రెండు రకాలవాళ్ళు కనిపిస్తారు- సందర్శకులు (టూరిస్టులు), యాత్రికులు (ట్రావెలర్లు).

టూరిస్టులు ప్రదేశాలు చూడ్డానికి వెళితే యాత్రికులు ప్రపంచాన్ని చూడడానికి వెళతారు. విసుగు కలిగించే అనుదినపు జీవన సరళి నుంచి పారిపోవటం టూరిస్టుల ధ్యేయమయితే అనంతకోిటి అనుభవాలకు అవకాశం వున్న ప్రపంచాన్ని కౌగలించుకోవడానికి యాత్రికులు ఇల్లు వదులుతారు. సుఖసౌఖ్యాలకోసం టూరిస్టులు వెదుకులాడితే సంతృప్తీ సంతోషాల కోసం యాత్రికులు ప్రయాణాలు చేస్తారు. టూరిస్టులకు అంతోకొంతో ప్రపంచజ్ఞానం కలిగితే యాత్రికులకు లభించేది ఆత్మజ్ఞానం. టూరిస్టులు తమ అనుభవాలు రాస్తే అది సమాచార దర్పణం అవుతుంది; ఆహ్లాదకరమైన రచన కూడా అయ్యే అవకాశం ఉంది. అదే యాత్రికులు రాసినపుడు అది పాఠకుల మనసులతో ఊసులాట అవుతుంది.

తెలుగులోని అనేకానేక ప్రముఖ రచయితలు తమతమ యాత్రల గురించి పుస్తకాలో వ్యాసాలో రాశారని చెపితే నమ్మటం కష్టమేగానీ అది వాస్తవం. ఒక ప్రత్యేక వ్యాసంగానో, తమ ఇతర అనుభవాల్లో భాగంగానో, ఏకంగా యాత్రాగ్రంథంగానో సుప్రసిద్ధ రచయితలందరూ తమ యాత్రల గురించి రాశారు.

ఏనుగుల వీరాస్వామికన్నా ఎనిమిదేళ్ళు ముందుగా, 1822లో వెన్నెలకంటి సుబ్బారావు తాను చేసిన కాశీయాత్ర గురించి తన ఆత్మకథలో రాశారు. అది 1873లో ఇంగ్లీషులోనూ 1976లో తెలుగులోనూ వెలుగు చూసింది. అలాగే చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి తన 1889 నాటి కాశీయాత్రను 1934లో గ్రంథస్థం చేశారు. కందుకూరి వీరేశలింగం, కాళోజీ నారాయణరావులు తమ జ్ఞాపకాలలో తమ తమ బొంబాయి ప్రయాణాల గురించి రాశారు. శ్రీశ్రీ, రావూరి భరద్వాజ, ఆరుద్ర, సోమసుందర్‌, అక్కినేని నాగేశ్వరరావు, సినారె, ఎన్‌. గోపి, వాసా ప్రభావతి, ఎండ్లూరి సుధాకర్‌, అంపశయ్య నవీన్‌, కవనశర్మ, మధురాంతకం నరేంద్ర, వాడ్రేవు చినవీరభద్రుడు, పరవస్తు లోకేశ్వర్‌, ఎమ్‌. ఆదినారాయణ, మల్లాది వేంకటకృష్ణమూర్తి లాంటివాళ్ళు తమ విదేశీ యాత్రల గురించి పుస్తకాలు రాశారు. గురజాడ, చలం, బుచ్చిబాబు, అడవి బాపిరాజు, ఆచంట జానకిరామ్‌, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, దాశరథి, ఉప్పల లక్ష్మణరావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, దర్శి చెంచయ్య, ఆదిభట్ల, పర్వతనేని ఉపేంద్ర, ఆలూరి భుజంగరావు, తిరుమల రామచంద్ర, అందెశ్రీ, సంజీవదేవ్‌ లాంటి ప్రముఖులు తమ స్వీయ చరిత్రలలోనూ డైరీలలోనూ యాత్రల గురించి హృద్యంగా రాశారు. భానుమతి, మాలతీచందూర్‌, టంగుటూరి సూర్యకుమారి, షేక్‌ నాజర్‌, త్రిపురనేని లాంటివాళ్ళూ తమ యాత్రానుభవాలను అక్షరబద్ధం చేశారు.


ఇక్కడ తెలుగు యాత్రారచనల విషయంలో ఒక విశేషం గురించి చెప్పుకోవాలి. యాత్రల గురించి వ్యాసమో పుస్తకమో రాయడం, తమ జ్ఞాపకాలూ ఆత్మకథల్లో ఆ వివరాలు చెప్పడం మామూలు బాణీ అయితే వాటిని కథలు, నవలలు, కవితల రూపంలో చెప్పిన తెలుగు రచయితలూ చాలామంది కనిపిస్తారు. నలభై ఏళ్ల క్రితమే పరిమళా సోమేశ్వర్‌ పిల్లలతో ప్రేమయాత్ర అన్న యాత్రా నవల రాశారు. కవనశర్మ నవలలు కొన్నిటికి ఆయన ప్రయాణాలే మూలాధారం. అంపశయ్య నవీన్‌ ప్రయాణంలో ప్రమదలు, అమెరికా అమెరికా లాంటి యాత్రా నవలలు రాస్తే, మధురాంతకం నరేంద్ర ఆమ్‌స్టర్‌డామ్‌లో అద్భుతం అన్న నవల రాశారు. ఎండ్లూరి సుధాకర్‌ ఆటా జని కాంచె అంటూ తన అమెరికా యాత్రానుభవాలను కవితారూపంలో చెప్పారు. అంతకుముందే జె.బాపురెడ్డి, ఎన్‌.గోపి తమ యాత్రలను కవిత్వరూపంలో వ్యక్తీకరించారు.

తెలుగు యాత్రాసాహిత్యం గురించి చెప్పుకునేటపుడు ఆ దారిలో తటస్థపడిన మైలురాయి రచనల గురించి చెప్పుకోవడం అవసరం.

కథాసాహిత్యానికి గురజాడ ‘దిద్దుబాటు’ ఎలాంటిదో యాత్రాసాహిత్యంలో ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర చరిత్ర అలాంటిది.

మద్రాసు సుప్రీంకోర్టు ఉద్యోగి వీరాస్వామి 1830లో వందమంది పరివారంతో బయల్దేరి ఇప్పటి రాయలసీమ, తెలంగాణ, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల మీదుగా కాశీ చేరుకోవడం, తిరిగి బీహార్‌, బెంగాల్‌, ఒరిస్సా, కళింగాంధ్ర, కోస్తాంధ్రల మీదుగా పదిహేను నెలల తర్వాత మద్రాసు చేరుకోవడం– ఎంతో సూక్ష్మమైన వివరాలతో చెప్పుకొచ్చిన పుస్తకం కాశీయాత్ర చరిత్ర. ఆనాటి సాంఘిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వివరాలు పుస్తకం నిండా పుష్కలంగా ఉండటం వల్ల అది ఒక కాలాతీత గ్రంథమయింది.

కాశీయాత్ర జరిగిన నూటయాభైమూడేళ్ళకు మానససరోవర యాత్ర చేసిన పీవీ మనోహరరావు ఆ వివరాలను 1986లో వచ్చిన కైలాస దర్శనం అన్న పుస్తకంలో చెప్పారు. తెలుగువారికి అంతగా పరిచయం లేని మధ్య, ఎగువ హిమాలయ పర్వత శ్రేణుల గురించీ ఆయా పుణ్య ప్రదేశాల గురించీ అనేకానేక వివరాలతో వున్న ఈ పుస్తకం చెప్పుకోదగ్గది.

1960లలో అమెరికా ప్రభుత్వం మన దేశంలోని ప్రముఖ కళాకారులను అమెరికాకు ఆహ్వానించి రెండు నెలలపాటు తమకు ఇష్టమయిన పద్ధతిన పర్యటించే అవకాశం కల్పించింది. అలాంటి ఆహ్వానాన్ని అందుకొని పర్యటించిన అక్కినేని నాగేశ్వరరావు తన అనుభవాలను నేను చూసిన అమెరికా అంటూ 1965లో పుస్తకంగా ప్రచురించారు. తాను అమెరికాలో చూసిన వింతలు, విశేషాలు, స్టూడియోలూ; కలసిన నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల గురించే కాకుండా ఒక రైతుబిడ్డగా అక్కినేని అమెరికాలోని ఒక రైతు కుటుంబంతో నాలుగు రోజులు గడపాలనే అభిలాష వ్యక్తపరిచారు. ఆ కోరిక తీర్చుకోవడం, ఆ అనుభవాలు రాయడం- మట్టి వాసన నిండిన ఓ యాత్రా చరిత్ర అక్కినేనిది.


తన కాలేజీ పిల్లలను 1967లో కాశ్మీరు వరకూ విహారయాత్రకు తీసుకువెళ్ళి నాయని కృష్ణకుమారి ఆ అనుభవాలను కాశ్మీర దీపకళిక పేరిట పుస్తకంగా ప్రచురించారు. స్వతహాగా కవి, భావుకురాలు అయిన కృష్ణకుమారి తన పరిశీలనను ఉపరితల పరామర్శకే పరిమితం చేయకుండా ఆయా ప్రదేశాలతోనూ ప్రకృతితోనూ మనుషులతోనూ మమేకమైపోయి ఆ అనుభవాలను చక్కగా చెప్పడం వల్ల ఆమె యాత్రారచన ఇప్పటికీ ఒక రసగుళికగా నిలుస్తోంది.

ప్రముఖ రచయిత మల్లాది వేంకటకృష్ణమూర్తి గత పాతిక ముప్ఫై ఏళ్ళుగా ప్రపంచమంతా టూరిస్టుగా తిరుగాడుతూ ఆ వివరాలను ట్రావెలాగ్స్‌గా ప్రచురిస్తున్నారు. సవివరంగా సచిత్రంగా భావి టూరిస్టులకు బాగా పనికొచ్చేలా రాసుకొస్తోన్న పుస్తకాలివి. ప్రయాణాలంటే ఆసక్తి వుండీ విదేశాలకు వెళ్ళాలంటే సంకోచించే సగటు తెలుగు మనుషులకు ఉపయోగపడిన రచనలివి. అప్పటికే ఆయన పాపులర్‌ రచయితగా బాగా ప్రఖ్యాతి పొంది ఉండటం వల్లా ఆయన ఏది రాసినా అందులో ఆహ్లాదనం పుష్కలంగా ఉండటంవల్లా మల్లాది ట్రావెలాగ్స్‌ తెలుగు యాత్రా రచనలను ఒక పెద్ద ముందడుగు వేయించాయి. అదే ఒరవడిలో ఈమధ్య ముత్తేవి రవీంద్రనాథ్‌ మా కేరళ యాత్ర, మా కాశ్మీరు యాత్ర అనే పుస్తకాలు ప్రచురించారు. టూరిజం అంటే ఆసక్తి మెలమెల్లగా పెరుగుతోన్న తెలుగు నేలమీద ఈ పుస్తకాలకు ఆదరణ పెరుగుతోంది.

యాత్రారచనలను వింతలూ విశేషాలకే పరిమితం చెయ్యకుండా అనుభవాలూ అనుభూతులూ మనుషుల చుట్టూ తిప్పే ప్రక్రియకు ముందు చెప్పిన కాశ్మీర దీపకళిక నాంది పలికితే ఆ ఛాయలు మళ్ళా 1990లలో వచ్చిన దాసరి అమరేంద్ర మూడు నగరాలు, స్కూటర్లపై రోహతాంగ్‌ యాత్రలలో కనిపిస్తాయి. గత ఇరవై పాతికేళ్ళలో ఈ ధోరణి విరివిగా కొనసాగి ఇపుడు ఓ పరిణత రూపం సంతరించుకొంది. ఆ పరిణత రూపపు తొలికిరణాలు 1999 నాటి ఎమ్‌. ఆదినారాయణ భ్రమణ కాంక్షలో కనిపించగా ఆ నేపథ్యంలో పరవస్తు లోకేశ్వర్‌ 2009లో స్కూటర్‌పై ఛత్తీస్‌గఢ్‌ యాత్ర రాశారు. 2012లో సిల్క్‌రూట్‌లో సాహసయాత్ర చేశారు. వర్తమాన కాలంలో నిర్విరామంగా యాత్రలు చేస్తూ ఆయా ప్రయాణాలను టూరిస్టు కోణం దాటుకొని వెళ్ళి యాత్రికుని కోణంలోంచి కొనసాగిస్తూ ఆయా వివరాలను మానవీయ బాణీలో పాఠకులకు అందించేవారి సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతోంది.


ముందు చెప్పుకొన్నట్టు, 1999లో వచ్చిన ఎమ్‌. ఆది నారాయణ భ్రమణ కాంక్ష తెలుగు యాత్రాసాహిత్య చరిత్రలో ఒక మైలురాయి. మూడు యాత్రల ముచ్చటైన ముప్పేట ఈ భ్రమణ కాంక్ష. భారతదేశపు యాత్రికులకు తలమానికమైన రాహుల్‌ సాంకృత్యాయన్‌ శత జయంతి సందర్భంగా 1993లో ఆదినారాయణ విశాఖపట్నం నుంచి సాంకృత్యాయన్‌ సమాధి వున్న డార్జిలింగ్‌ వరకూ చేసిన ‘పాదయాత్రాంజలి’ ఈ ముప్పేటలోని మొదటి పాయ. తాను చిన్నప్పుడు ఆడిపాడిన గుండ్లకమ్మ నది మూలాల అన్వేషణలో ఆ నది ఒడ్డునే చేసిన మూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర ‘ఏటి ఒడ్డున ప్రయాణం’ రెండవ పాయ. అకాల మరణం చెందిన చెల్లి కోటేశ్వరి జ్ఞాపకార్థం స్వంత ఊరు చవటపాలెం నుంచి ఆమె సమాధి వున్న ఢిల్లీ నగరం వరకూ రెండువేల మూడువందల కిలోమీటర్లు నడచిన వైనం, ‘ప్రార్థించే పాదాలు’ ముచ్చటగా మూడో పాయ. ఈ మధ్యనే భ్రమణ కాంక్ష మరో ముద్రణ పొంది పాఠకులకు అందుబాటులోకి వచ్చింది.


రెండున్నరవేల సంవత్సరాల గతం నుంచి పదమూడో శతాబ్దంలో సముద్రమార్గాలు కనిపెట్టేవరకూ ఆసియా ఐరోపాల మధ్య వాణిజ్య వారధిగా, నాగరిక వాహినిగా నిలిచిన సిల్క్‌రూట్ ఉజ్వల చరిత్ర సందర్శన కోసం పరవస్తు లోకేశ్వర్‌ 2012లో రెండు నెలలపాటు ఆ దారి వెంబట తిరిగివచ్చి ఆ అనుభవాలను తనదైన కవితాత్మతో సిల్క్‌రూట్‌లో సాహసయాత్రగా తీసుకువచ్చారు. యాత్రికులనూ సాహసికులనూ సాహితీ ప్రియులనూ ఆకట్టుకొన్న ఈ పుస్తకం తెలుగు సాహితీ చరిత్రలో మరో మైలురాయి.


విరివిగా యాత్రల గురించి రాయకపోయినా ఒకానొక యాత్ర తమ మనసుల్ని రాగరంజితం చేసినపుడు ఆ అనుభవాలను పుస్తకంగా అందించే రచయితలు మనకున్నారు. అదేకోవకు చెందిన మనిషి దేవులపల్లి కృష్ణమూర్తి. భావుకుడు, కవిత్వమంటే ఆసక్తీ రచనా శక్తీ పుష్కలంగా వున్న వ్యక్తి అయిన కృష్ణమూర్తి తాను తన కుటుంబ సభ్యులతోనూ ఇతర మిత్రులతోనూ ఓ బస్సు మాట్లాడుకొని నాలుగయిదేళ్ల క్రితం చేసిన ఒక మామూలు ఉత్తర దేశ యాత్ర గురించి మా యాత్ర అనే పుస్తకం రాశారు. అన్నమయ్య నుంచి శ్రీశ్రీ వరకూ తనకు అందిన కవితావేశంతోనూ తనకు స్వాభావికం అయిన మానవతా పరిమళంతోనూ రాసిన ఈ పుస్తకం స్పందనాపరంగానూ రచనాశిల్పపరంగానూ యాత్రా రచనను ఒక ముఖ్యమైన మెట్టు ఎక్కించింది.


పదేళ్ళ క్రితం అజిత్‌ హరి సింఘానీ అన్న వ్యక్తి తానుండే పూనా నగరం నుంచి ఉన్నత హిమాలయ శ్రేణులలోని లేహ్ నగరం దాకా మోటార్‌ సైకిల్‌ మీద వెళ్లి వచ్చి వన్‌ లైఫ్‌ టు రైడ్‌ అన్న పుస్తకాన్ని ఇంగ్లీషులో ప్రచురించారు. ఒక సాహసయాత్రకు తాత్త్వికతను జోడించి ఆత్మజ్ఞాన అన్వేషణ స్థాయికి తీసుకువెళ్లిన ఈ పుస్తకాన్ని 2014లో కొల్లూరి సోమశంకర్‌ ప్రయాణానికే జీవితం అన్న పేరిట అనువదించి ప్రచురించారు. శరత్‌, ప్రేమ్‌చంద్‌ లాంటివాళ్ళ అనువాదాలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినట్లుగానే ఈ ప్రయాణానికే జీవితం కూడా తెలుగు యాత్రాసాహిత్య చరిత్రలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచే అవకాశం వుంది.

అండమాన్‌ ద్వీపాలలోని వింతలూ విశేషాలను చిన్నచూపు చూస్తూ, ప్రకృతీ పర్వతాలను పక్కచూపు చూస్తూ, మనుషులూ జీవితం వేపే తన దృష్టిని ప్రముఖంగా నిలిపి రాసిన యాత్రాగాథ, దాసరి అమరేంద్ర 2016లో ప్రచురించిన అండమాన్‌ డైరీ. వందపేజీల చిన్న పుస్తకంలో పదీపదిహేనుమంది వ్యక్తులను సజీవంగా పరిచయం చేసిన వైనం పాఠకులను ఆకట్టుకుంది.

తెలుగు యాత్రాసాహిత్య చరిత్రలో ఉజ్వల ఘట్టాలు అని చెప్పుకోదగ్గ సంఘటనలు 2016లో రెండు జరిగాయి. ఆ సంవత్సరం మొదట్లో వచ్చిన తెలుగువారి ప్రయాణాలు అన్న పుస్తక ప్రచురణ; చివరిలో వచ్చిన భూభ్రమణ కాంక్ష పుస్తకం.


1838 నాటి ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర చరిత్ర నుంచి ఇప్పటి నల్లవారి గౌతమ్‌ రెడ్డి సిల్క్‌రూట్ అన్వేషణ వరకూ అరవైనాలుగు మంది తెలుగువారు రాసిన ప్రయాణాల రచనా శకలాలను సేకరించి ఆదినారాయణ వెలువరించిన యాత్రా సంకలనం తెలుగువారి ప్రయాణాలు. తెలుగు యాత్రా సాహిత్యం గురించి ఒక విలక్షణ అవగాహన కలిగించే శక్తి ఉన్న అపురూపమైన పుస్తకమిది.

ఆదినారాయణ ఈమధ్య ప్రచురించిన భూభ్రమణ కాంక్ష పుస్తకంలో తాను చేసిన పద్నాలుగు దేశాల ప్రయాణాల వివరాలనే కాకుండా యాత్రల గురించి అనేకానేక మౌలిక భావాలను నిర్వచించి వివరిస్తారు. ‘తన గ్రామాల్లో తిరిగినంత స్వేచ్ఛగా సహజంగా ప్రపంచమంతా తిరగాలని ఉంది’ అనే ఆదినారాయణ ఆ పని చేసి చూపించారీ పుస్తకంలో. ఒక ప్రపంచ స్థాయి యాత్రికుడు తాను చేసిన ప్రపంచ స్థాయి ప్రయాణాల గురించి రాసిన పుస్తకం ఈ భూభ్రమణ కాంక్ష.

నిన్నమొన్నటిదాకా తెలుగువారిలో యాత్రాసక్తి చాలా పరిమితంగానే ఉండేది. బాగా డబ్బున్నవాళ్ళు తప్ప మామూలువాళ్ళు విస్తృత యాత్రలకు పూనుకునేవారు కాదు. ఒకవేళ వెళ్లినా అవి తీర్థయాత్రలకే పరిమితమయ్యేవి. యాత్రలంటే ఖర్చుతో కూడిన పని అని, ఇబ్బందులూ అగచాట్లూ కొనితెచ్చుకోవడమేనని, రక్షణా భద్రతా అతి స్వల్పమని, కుటుంబ ఉద్యోగ బాధ్యతల మధ్య యాత్రలకు ఉపక్రమించడం బాధ్యతారాహిత్యమని, యాత్రలవల్ల క్షణికానందమే తప్ప పెద్ద ప్రయోజనం ఉండదనీ అపోహలు అసంఖ్యాకం.

నిజానికి సందర్శకులుగా వెళ్ళేవాళ్లకి ఇవన్నీ వాస్తవ పరిమితులే. యాత్రికుల విషయంలో ఇవేవీ అడ్డం రావు.


యాత్రలకు ధనమూ సమయమూ అవరోధాలు గావని భ్రమణ కాంక్ష, భూభ్రమణ కాంక్ష చెపుతాయి. రక్షణ, భద్రత, అధిగమించలేని సమస్యలు కావని సిల్క్‌రూట్‌లో సాహసయాత్ర చెపుతుంది. ఉద్యోగ, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే తమ భ్రమణ కాంక్షను తీర్చుకోవచ్చునని మూడు నగరాలు, స్కూటర్లపై రోహతాంగ్‌ యాత్ర చెపుతాయి. యాత్రల వల్ల ప్రపంచ జ్ఞానమే కాదు, ఆత్మజ్ఞానమూ సిద్ధిస్తుందని ప్రయాణానికే జీవితం చెపుతుంది. అతి మామూలు మిత్రులతో కూడా మనసును శ్రుతి చేసుకొని జీవనసారాన్ని ఆస్వాదించే అవకాశం వుందని కాశ్మీర దీపకళిక, మా యాత్ర చెపుతాయి.

నిజానికి గత పదీపదిహేను సంవత్సరాలలో యాత్రల విషయంలో తెలుగువారి దృక్పథాల్లో చక్కటి మార్పులు వస్తోన్న సూచనలు కనిపిస్తున్నాయి.

అనుభవాలూ అనుభూతులూ మానవ సంబంధాలూ ప్రముఖంగా వుండే యాత్రారచనలకు విశేష ఆదరణ లభిస్తోంది. తెలుగు సాహిత్యంలో అరుదుగానే సంభవించే పునర్ముద్రణ భాగ్యం ట్రావెలాగ్స్‌కూ లభిస్తోంది. అలాగే యాత్రాపద్ధతుల మీదా చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తోంది. అమెరికా యూరప్‌లకే పరిమితమయిన కౌచ్‌ సర్ఫింగ్‌ లాంటి పద్ధతుల్లో ఈమధ్య ఓ తెలుగు యువకుడు ప్రయాణం చెయ్యటం, తాను వెళ్ళి ఇరాక్‌ లాంటి దేశాల్లో అపరిచితుల ఆతిథ్య మాధుర్యాన్ని పొందటమే కాకుండా ఆ అనుభవం మీరూ పొందండి అని తన తలిదండ్రులకు చెప్పడం, వాళ్ళు వెళ్ళి ఆ హోతల మధ్య విహరించి రావడం, దానిని వ్యాసరూపంలో పదిమందికీ చెప్పడం- ఒక కొత్త ముందడుగు. ‘ఆడవాళ్లు ఒంటరిగా ప్రయాణం చెయ్యడం ప్రమాదకరం’ అన్న భావాన్ని పూర్వపక్షం చేస్తూ స్వంత వాహనాలు నడుపుకుంటూ వేలాది మైళ్ళు దేశమంతా తిరిగిరావడం, ఆ అనుభవాలను ఇంటర్నెట్ లాంటి సోషల్‌ మీడియాలో పదిమందితో పంచుకోవడం సంతోషించదగ్గ వర్తమాన పరిణామాలు. అయితే ఇప్పటికీ ఆధునిక తెలుగు సాహిత్యానికి నూట ఎనభై ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టిన యాత్రారచనలకు సరి అయిన గుర్తింపూ గౌరవం లభించడంలేదనే చెప్పాలి.

– భ్రమణ కాంక్ష లాంటి పుస్తకాలు ఒకటికి నాలుగు ముద్రణలు పొంది పదో తరగతి పాఠ్యాంశాలుగా చోటుచేసుకున్న మాట నిజమే.

– స్కూటర్లపై రోహతాంగ్‌ యాత్రలూ ఛత్తీస్‌గఢ్‌ యాత్రలూ మరికొంత మందిని అలాంటి యాత్రలకు పురికొల్పిన మాట నిజమే.

– మల్లాది ట్రావెలాగ్‌లు, ముత్తేవి యాత్రాగ్రంథాలూ మరికొంత మందిని అలాంటి ప్రయాణాలకు ప్రోత్సహించిన మాట నిజమే.

కానీ యాత్రాసాహిత్యపు ఉనికి ఇప్పటికీ తెలుగులో ప్రశ్నార్థకంగానే ఉంది. కథ, నవల, కవిత లాంటి ఇతర సాహిత్య ప్రక్రియలతో సహపంక్తి స్థాయి ఇప్పటికీ యాత్రారచనలకు లభించలేదన్నది వాస్తవం. 1990లలోనే యాత్రాచరిత్రల మీద పరిశోధన చేసి మచ్చ హరిదాసు డాక్టరేట్ పుచ్చుకొన్నా ఇప్పటికీ యాత్రాసాహిత్యం విషయంలో జరగవలసిన చర్చగానీ విశ్లేషణగానీ విమర్శగానీ పరిశోధనగానీ జరగలేదు. 2016లో తెలుగు యాత్రాసాహిత్యం గురించి ఢిల్లీలో ఓ ఐదారు గంటల సెమినారు జరిగింది. కుప్పం, రాజమండ్రి, అనంతపురాల్లో ఈ విషయం మీద ఎమ్‌ఫిల్ స్థాయిలో పరిశోధన చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వినబడుతోంది.

యాత్రలు ఇపుడు తెలుగువారిలో సామాన్యమైపోతున్నాయి. యాత్రావిశేషాలు రాయడం, ప్రచురించడం వారానికి పదీపదిహేనుసార్లు తెలుగు పత్రికల్లో కనిపిస్తోంది. యాత్రాగ్రంథాలు సగటున ఏడాదికి నాలుగయిదు వస్తున్నాయి. యాత్రల మీద ఇదివరలో వున్న భావధోరణిలో ఆరోగ్యకరమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ఒక పరిణతి చెందిన ఉత్సాహం కనిపిస్తోంది.

ఇప్పటివరకూ నిరాసక్తతా విస్మృతులకు గురి అయిన యాత్రాసాహిత్యానికి ఒక ఉనికీ గౌరవం లభించే సమయం త్వరలోనే వస్తోందనిపిస్తోంది.
-----------------------------------------------------------
రచన: దాసరి అమరేంద్ర, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment