పందెం ఎలకలు(కథ)
సాహితీమిత్రులారా!
ఈ కథను ఆస్వాదించండి.................
అనిల్ కుమార్!
ఆఫీసులో స్టాక్‌మార్కెట్ గురించిన చర్చలన్నిట్లో అతనే లీడర్!
కంపెనీ సియీవో దగ్గర్నుంచి గెరాజ్‌లో జానిటర్ల వరకు అతని సలహాలు తీసుకోని వాళ్ళు పాపాత్ములు!
అతను అనర్గళంగా స్టాక్ మార్కెట్ బిహేవియర్‌ని విశ్లేషిస్తూ ఎప్పుడెప్పుడు ఎలా వుండబోతుందో, ఎప్పుడు ఎంతెంత కరక్షన్లు రాబోతున్నాయో ఏయే స్టాక్‌లు ఎప్పుడెప్పుడు ఎలా పెరగబోతున్నాయో ఉపన్యసిస్తుంటే అందరూ చెవులప్పగించి వింటూ నోట్స్ రాసుకుంటూ ఉంటారు.
స్టాక్‌ల లాంగ్‌లు, షార్ట్‌లు, ఆప్షన్ల కాల్స్, పుట్స్ వాటిని కొనటాలు, రాయటాలు, వీటన్నిటి కాంబినేషన్స్,వాటిని వాడే స్ట్రాటజీలు అతను వర్ణించి చెప్తుంటే అందరూ భక్తి భావంతో అరమోడ్పు కన్నుల్తో ఆనందంగా వింటూ వుంటారు.
సిస్కో, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, యాహూ, క్వాల్‌కాం లాటి ఆకాశసంచారుల చార్టులు, వాటిలో ఎత్తుపల్లాల తేదీలు, కారణాలు అతని బుర్రలో సదా ఆనందనాట్యాలు చేస్తూంటాయి.
రోజులో సగం సమయం అతను స్టాక్‌ల వెంట తిరుగుతూ గడుపుతాడు.
రోజుకు కనీసం అరడజను ట్రేడ్స్ చెయ్యకపోతే అతనికి ఆనందం కలగదు.
క్రితం అర్నెలల్లోనూ కలిసి తన నిర్విరామ స్టాక్ మార్కెట్ కార్యకలాపాలకు గాను అతనికి వచ్చింది
యాభై వేల డాలర్ల
నష్టం!
అతను కొన్న వెంటనే యాహూ నలభై పాయింట్లు పడిపోయింది.
దాంతో తిక్కరేగి దాన్ని అక్కడికక్కడే అమ్మేసి షార్ట్ చేసిన ఈబే యాభై పాయింట్లు పెరిగింది.
ఈలోగా యాహూ కూడా ఓ నూట డెబ్భై పాయింట్లు పెరిగిందనుకోండి, అది వేరే విషయం.
అతను కొన్న నాలుగు నెల్ల పాటు ఎటూ వెళ్ళకుండా చదికిల పడి కూర్చున్న సన్ మైక్రో అమ్మిన మర్నాటి నుంచి ఏదో పూనకం వచ్చినట్టు పెరిగి యిప్పటికి అతను అమ్మిన కన్నా డెబ్భై మూడు పాయింట్ల ఎత్తున ఉంది.
ఇవేళ పొద్దున అతను కొన్న ఓ ఇంటర్‌నెట్ ఐపీవో అక్కడి నుంచి ఓ పాతిక పాయింట్లు పెరిగి అమ్ముదామా అని ఆలోచిస్తూండగానే ఆ పాతికా గాక మరో ముప్ఫై పాయింట్లు పడిపోయింది. అదింక కొన్న చోటికి యీ జన్మలో వస్తుందో రాదో!
ఇవన్నీ తల్చుకుంటూ అతను చిరాగ్గా ఉండగా
స్టాక్‌బ్రోకర్ నుంచి మార్జిన్‌కాల్ వచ్చింది!
మూడు రోజుల్లో పదిహేను వేలు అందకపోతే తన ఇష్టం వచ్చిన వాటిని అమ్మేసి సొమ్ము చేసుకుంటానని బెదిరించాడు వాడు!
అనిల్‌కుమార్‌కి దేవుడి మీద నమ్మకం లేదు!
ఎవరైనా తన ముందు విధి గురించి మాట్టాడితే విరుచుకు పడిపోతాడు!
స్వయం కృషిని మించింది లేదని, మనిషి తన జీవిత గమనానికి తనే బాధ్యుడని బల్లలు విరగ్గొట్టి మరీ వాదిస్తాడతను!
ఐతే
ఈ మధ్య అతనికి గుడికి వెళ్ళక తప్పటం లేదు.
అభిషేకాలు, గ్రహశాంతులు హడావుడిగా చేయించక తప్పటం లేదు.
ఏ దేవుడిలో ఏ మహత్యం ఉందో అని అనుమానించక తప్పటం లేదు.
ఎందుకంటే
అతనికి పట్టలేనంత నవ్వూ ఏడుపూ ఒకేసారి వస్తున్నాయి తన పరిస్థితి తల్చుకుంటోంటే!
తనకి తెలియని శక్తులేవో తనకి వ్యతిరేకంగా పనిచేస్తుంటే తప్ప, తనంత నాలెడ్జ్ ఉన్న వాడు ఇంతగా ఎలా డబ్బు పోగొట్టుకోగలడో అర్థం కావటం లేదు, ఎంత బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించినా.
తన సలహాలు విన్న వాళ్ళంతా బాగుపడుతుంటే తనకి మాత్రం ఈ శని ఎందుకో ఏ మాత్రం ఊహకందటం లేదు!
ఓ వైపు మార్కెట్ నక్షత్రాల కేసి దూసుకుపోతుంటే తన లైఫ్ సేవింగ్స్ పాతాళానికి పరుగులు తియ్యటం ఏమిటి?
తనకేదో ప్రత్యేకత ఉంటే తప్ప యిలా తను చెయ్యి వేస్తే అలా అది భస్మాసుర హస్తం కావటం అసాధ్యం!
ఇంకా ఎవరికీ తన అసలు కథ తెలీదు గాని తెలిస్తే ఈ పాటికి ఎన్ని జోకులు తయారయ్యేవో! జీవితం ఎంత దుర్భరమై పొయ్యేదో!
ఏమైనా, ఇవేళ శుక్రవారం కావటం కొంతలో కొంత మేలు రెండు రోజుల పాటు యీ స్టాక్‌మార్కెట్ గొడవల నుంచి కొంచెం విశ్రాంతి (ఆ మార్జిన్‌కాల్ సంగతి ఒకటి మాత్రం చూడాల్సుంది).
రాత్రికి నరేన్ యింట్లో పార్టీ. వాడు తనకి కాలేజ్‌మేట్.
ఎనిమిదేళ్ళ పాటు యిండియాలో బాంక్ ఆఫీసర్‌గా పనిచేసి ఇలా కాదని మూడేళ్ళ క్రితం భార్యా, తనూ ఓరకిల్ ఫైనాన్సియల్స్ కోర్సులు చేసి యిక్కడికి వచ్చిందగ్గర్నుంచి ఇద్దరికిద్దరూ రెండు చేతులా సంపాయించేస్తున్నారు వాళ్ళు వర్క్‌లోనూ స్టాక్ మార్కెట్లోనూ.
అనిల్‌కుమార్ అక్కడికెళ్ళేసరికి usual suspects అందరూ అప్పటికే వచ్చేశారు. రంగనాథం, కృష్ణమాచారి,రవీంద్ర, మదన్, పశుపతి ముఖ్యులంతా ఓ చోట చేరి ఇండియా రాజకీయాల్ని చుట్టబెట్టేస్తున్నారు. ఇంటర్‌నెట్ పుణ్యవా అని ఆఫీసుల్లో అంతగా పనిలేని వాళ్ళంతా నడుస్తున్న న్యూస్‌పేపర్లే కదా!
అక్కడ తనకి తెలీని వ్యక్తి ఒక్కడే డాక్టర్ శేఖర్‌ట. దాదాపుగా యాభై వయసు. జుట్టంతా తెల్లబడిందప్పుడే. ఈ దేశం వచ్చి ఇరవై ఏళ్ళ పైగా ఐందట. అందరి మాటలూ వినటం తప్ప సొంతగా ఏమీ మాట్టాడేట్టు లేడు. నరేన్‌కి అతన్తో ఏదో దూరపు చుట్టరికం వుండటంతో ఈ పార్టీకి పిలిచాడతన్ని.
అలా రాజకీయాలు మాట్టాడుతూ ఉండగా దుమారంలా దూసుకొచ్చాడు శ్రీనివాస్.
“ఇవేళ ఐపీవో వచ్చిన సికమోర్ నెట్‌వర్క్స్ ఎలా పెరిగిపోయిందో చూశారా! దాంట్లో నేను పాతిక వేలు సంపాయించా!” గావుకేక పెట్టాడు లోపలికి అడుగుపెడుతూనే.
“కంగ్రాచ్యులేషన్స్! మీకు దొరికిందా అది? నేనెంత ట్రై చేసినా మంచి ప్రైస్‌కి దొరకనే లేదు” అందుకున్నాడు అనిల్‌కుమార్ (అమ్మ గాడిద కొడకా! సుడంటే నీదేరా! నేనూ కొందామనుకున్నా గాని మార్జిన్ కూడా పూర్తిగా వాడేసుకుని అన్నిట్టో ఇరుక్కుపోయి ఉంటిని!)
“శ్రీనివాసంటే ఏమనుకున్నారు మరి? నూట యాభైకి కొన్నా. చూస్తుండగానే యాభై పెరిగింది. లాభం తీసుకుని బయటికొచ్చేశా. అరగంట పనికి పాతిక వేలు. నాట్ బేడ్ ” తృప్తిగా గర్వంగా చెప్పాడు శ్రీనివాస్.
“అదసలు నూట యాభైకి వచ్చినట్టు లేదే! దాని రేంజ్ అంతా రెండొందల్లోనే ఉందని గుర్తు.” (కట్టింగ్ కొడుతున్నావా ఏంటి బాబూ? మేం మరీ అంత చెవుల్లో పూలు పెట్టుకుని కనపడుతున్నామా?)
“అబ్బే, వొచ్చిందొచ్చింది. ఇలా వచ్చింది, అలా వెళ్ళిపోయింది.. ఇంతకీ ఏ వెబ్‌సైట్‌లో చూశారు మీరు?”
“యాహూలో” (నాబొంద. నా గోలతో నేను చస్తుంటే దాన్ని చూసే తీరిగ్గూడానా?)
“అదీ విషయం. యాహూలో ఇన్ఫర్మేషన్ యాక్యురేట్‌గా ఉండదు”
“నిజమే, నాకోసారి ఏవైందంటే …” (ఇంక దొరికావ్ చూడు!)
అంత తేలిగ్గా దొరకటానికి శ్రీనివాస్ తక్కువ తిన్నాడా! తన ప్రతాపాన్ని వర్ణించి చెప్పటానికి కాస్త అవతల ఉన్న ఇంకో గ్రూప్ దగ్గరికెళ్ళాడు. అక్కడ కొత్తగా వచ్చిన హిందీ సినీ తారల శృంగార లీలల్ని గురించిన రసవత్తరమైన చర్చ తీవ్రంగా జరుగుతున్నా అతన్నాపలేకపోయిందది!
ఇక్కడ కూర్చున్న గ్రూప్ కూడ అప్పటి దాకా మాట్టాడుతున్న రాజకీయాల్ని వొదిలి స్టాక్‌మార్కెట్‌లోకి వచ్చేసింది.
“డెల్ స్టాక్ ఎలా ఉందండీ, యీ మధ్య నేను ఫాలో కావటం లేదు?” అంటూ మొదలెట్టాడు పశుపతి, వచ్చే ముందే చూసుకుని వచ్చినా.
“నలభై ఒకటో నలభై రెండో ఉన్నట్టుంది” టక్ మని చెప్పేశాడు తనకి స్టాక్ మార్కెట్‌తో ఎలాటి సంబంధమూ లేదనీ తన డబ్బంతా కేవలం మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఉండి బ్రహ్మాండంగా పెరుగుతుందనీ బల్లగుద్ది చెప్పే రంగనాథం.
“స్టాకంటే డెల్ స్టాకండీ.మూడేళ్ళలో ముప్ఫై రెట్లు పెరిగింది. అప్పుడు ఎందుకు రెండొందలే కొని ఊరుకున్నానా అని ఎప్పుడూ బాధపడుతుంటా” అంటూ ఆ సంభాషణలోకి గెంతేడు అనిల్‌కుమార్ (వెర్రి వెధవని కాకపోతే అలా పెరిగే స్టాక్‌నా షార్ట్ చేసేది? చేసినా యాభై పాయింట్లు పెరిగే దాకానా కవర్ చెయ్యకుండా కూర్చోవటం? మిగిలిన వాళ్ళంతా కొంటున్నప్పుడు షార్ట్ చెయ్యటం, అది బోలెడు పెరిగాక వాళ్ళు అమ్మేటప్పుడు కవర్ చెయ్యటం. ఇదేగా మన డెల్ అనుభవం!)
“అప్పట్నుంచీ అమ్మలేదా మీరు దాన్ని?” అసూయని వినిపించనివ్వకుండా తిప్పలు పడుతూ అడిగాడు మదన్.
“అది అమ్మటవే, ఇంకేవన్నా ఉందీ! వచ్చే రెండు మూడేళ్ళలో కనీసం ఇంకో పదిరెట్లు పెరిగితే రిటైర్‌మెంట్ గురించి ఆలోచించొచ్చని చూస్తున్నా” (నాలాటి వాళ్ళు షార్ట్ స్క్వీజుల్లో పోగొట్టుకున్న డబ్బుతో యిప్పటికి ఎంతమంది మిలియనీర్లై రిటైరయ్యారో!)
“అసలు, డబ్బులు సంపాయించాలంటే ఇంటర్‌నెట్ స్టాక్‌లండీ అసలైన దారి! ఒక్కొకటి ఎట్లా పెరుగుతుందో చూశారా? నేను పోయిన ఏడు యాభైకి కొన్న యాహూ రెండు స్ప్లిట్‌ల తర్వాత యిప్పుడు మళ్ళీ నాలుగొందలు ఉంది. దాన్లోనే ఓ హండ్రెడ్ తౌజెండ్ లాభం వొస్తుంది నాకు” అంటూ మళ్ళీ వచ్చి జాయినయ్యాడు శ్రీనివాస్.
తను ముప్ఫై మూడుకు కొన్న ఓరకిల్ ఎలా వంద దాటిందో కృష్ణమాచారి వర్ణిస్తోంటే సన్ మైక్రోలో తనకి ఎంత లాభం వచ్చిందో పైకే లెక్కేస్తున్నాడు రవీంద్ర. ఇంటెల్‌లో తనెంత సంపాయించిందీ చెప్పటానికి ప్రయత్నిస్తూ చాన్స్ దొరక్క నోరు తెరుస్తూ మూస్తూ ఉన్నాడు మదన్.
ఇదంతా వింటూ కూర్చున్న డాక్టర్ శేఖర్‌కి మతిపోతోంది. తను కొన్న స్టాక్‌లన్నీ కంపెనీలు దివాళా తియ్యటమో కొన్న ధరకి సగానికి సగం పడిపోవటమో తప్ప ఒక్క దాన్లో కూడ ఒక్క డాలర్ లాభం వచ్చిన పాపాన పోలేదు గత పదేళ్ళలోనూ.
పార్టీ ఐపోయి అందరూ ఇళ్ళకి బయల్దేరుతున్నారు.
శ్రీనివాస్ కారెక్కటంతోటే వాళ్ళావిడ అందుకుంది “అదేమిటి, నేను ఇందాక అడిగితే సికమోర్ కొంటానికి కుదర్లేదన్నావ్, ఇప్పుడిక్కడ అందరికీ దాంట్లో పాతిక వేలొచ్చినయ్యని చెప్తున్నావ్! నాకు తెలీకుండా ఏవన్నాకథలు నడుపుతున్నావా ఏంటి? ఇంటికెళ్ళటంతోటే యీ రోజు ఎకౌంట్ యాక్టివిటీ ఏమిటో చూస్తా. దాన్లో సికమోర్ కనపడిందో, నిన్నింటోకి రానీను”.
దిమ్మతిరిగింది శ్రీనివాస్‌కి. “వాళ్ళకి చెప్పింది నువ్వూ నమ్మావా? అబ్బే ఉత్తినే, ఊరికినే! లేకపోతే ప్రతివాడూ నాకు దాంట్లో అంతొచ్చిందీ దీంట్లో ఇంతొచ్చిందీ అని కొయ్యటమే కదా! నేనూ నోటికొచ్చింది చెప్పా. వాళ్ళంతా ఎలా ఏడ్చుకుంటున్నారో చూశావా! హహ్హహ్హ..”
“మరి ఆ యాహూ సంగతేవిటి? అదీ ఇట్లాటి కథేనా?”
“మరీ పూర్తిగా కథ కాదు. నూట డెబ్భైకి కొని నూట యెనభైకి అమ్మా. కాస్త తగ్గితే మళ్ళీ కొందామని రోజూ చూస్తూనే ఉన్నా గాని అది అలా పైకే పోతుంది ఇంతవరకూ” నీళ్ళు నవుల్తూ అన్నాడతను.
“ఎవరికెన్ని కథలు చెప్తే నాకేం గాని నాకు నిజం చెప్పకపొయ్యావా నీ బతుకు కుక్క బతుకే!” ఆఫీసులోని తన అధికార దర్పాన్ని ఎప్పట్లాగే మొగుడి మీద ప్రదర్శించింది సుభాషిణి.
“నీ మీదొట్టు. నీకెప్పుడూ స్టాక్‌ల గురించి అబద్ధం చెప్పను” గబగబా అనేశాడు శ్రీనివాస్ స్టాక్ బ్రోకరేజ్ ఎకౌంట్ జాయింట్ ఎకౌంట్ ఐనందుకు మరో సారి జుట్టు పీక్కుంటూ. ఐతే తనకొచ్చిన లాభాలూ నష్టాలూ అన్నీ కలిపి చూసుకుంటే ప్లస్ సైడ్ పెద్దగా వుండకపోయినా పార్టీల్లో మిగిలిన వాళ్ళందర్ని జెలసీతోచంపుతున్నందుకు తనని తను కంగ్రాచ్యులేట్ చేసుకుంటూ తృప్తిగా ఇంటి దారి పట్టాడు శ్రీనివాస్.
అనిల్‌కుమార్ కూడ ఆ రోజు హాయిగా నిద్రపోయాడు. సికమోర్ విషయంలో శ్రీనివాస్ కోతలు కోశాడని అర్థమై పోయిందతనికి. అంతేకాదు. మూడు నెలల క్రితం మరో పార్టీలో ఎప్పట్నుంచో యాహూ కొనాలని ఎదురుచూస్తున్నట్టు శ్రీనివాస్ చెప్పిన విషయం మర్చిపోలేదు అనిల్‌కుమార్! కనక తనే కాదు, ఇంకా చాలా మంది తనలాగే పైకి ఇకిలించుకుంటూ స్టాక్ మార్కెట్లో బోలెడు సంపాయిస్తున్నట్టు కబుర్లు చెప్తున్నారన్న మాట!
ఇక మిగిలింది ఒక్కటే తన ప్లాన్ ప్రకారం తొందర్లో ఎలాగోలా అప్పుచేసి ఓ మాంచి బి.ఎం.డబ్య్లూ. కారు కొంటే తను నిజంగానే బోలెడంత సంపాయిస్తున్నా డనుకుని వాళ్ళు ఏడిచే ఏడుపుకి అంతుండదు. అప్పుడు గాని తనకి పూర్తిగా హాయిగా తృప్తి కలగదు!
ఇల్లు చేరిన డాక్టర్ శేఖర్ పరిస్థితి మాత్రం చాలా అధ్వాన్నంగా తయారైంది. అతనికి ఆ రాత్రంతా నిద్ర పట్టనే లేదు.తను నానా తిప్పలూ పడి జీవితంలో సగం కాలం కాలేజీల్లోనే గడిపి ప్రాక్టీసులో కూడ రోజుకి పదహారు గంటలు పనిచేస్తూ malpractice insurance కీ ఆఫీస్ ఖర్చులకీ, టాక్సులకీ బోల్డంత వదిలించుకుని నెలంతా చచ్చీ చెడీ సంపాయిస్తున్నంత డబ్బు నిన్న గాక మొన్న ఏదో కంప్యూటర్ కోర్స్ చేసి వచ్చిన వాళ్ళు ఒక్క రోజులో స్టాక్ మార్కెట్‌లో సంపాయించేస్తున్నారు!
ఇన్నాళ్ళూ ఎంత పరువుగా బతికాడు తను?
తెలుగు కమ్యూనిటీలో ఎంత గౌరవం ఉండేది తనకి?
అదివరకు తను పార్టీలోకి నడిస్తే ఒక్కసారిగా అందరూ వచ్చి తన చుట్టూ మూగిపోయే వాళ్ళు!
వాళ్ళ కళ్ళలోంచి గౌరవం పొంగి ప్రవహించేది తన కాళ్ళ వైపు!
ఈ స్టాక్‌మార్కెట్ దెబ్బతో అంతా ఊడ్చిపెట్టుకు పోయింది!
మొన్నటి దాకా తనని గౌరవించిన వాళ్ళంతా ఇప్పుడీ స్టాక్‌రాక్షసుల చుట్టూ మూగిపోతున్నారు!
ఆఖరుకి యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడ తనని పట్టించుకోవటం లేదిప్పుడు!
దేశం నాశనం ఐపోతోంది!
ఏమిటీ జీవితం?
ఎన్నాళ్ళిలా ఎవరికీ పట్టకుండా బతకటం?
తెల తెల వారుతుండగా ఓ ముఖ్యమైన నిర్ణయానికి వచ్చాక గాని అతనికి కాస్త కునుకు పట్టలేదు.
మర్నాడు డాక్టర్ శేఖర్ వర్క్ కి ఫోన్ చేసి తను ఆర్నెల్లు వెకేషన్ తీసుకుంటున్నానని, తన పేషంట్స్‌ని మిగిలిన పార్న్టర్స్ చూసుకోవాలని చెప్పేశాడు!
ఆ రోజే వెళ్ళి Day-Trading Training లో చేరి పోయాడు!
………………………………………………………
తొందర్లో డే ట్రేడర్ శేఖర్‌ని కూడా టీవీలో చూడబోతున్నామా?!
-----------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment