Saturday, October 27, 2018

1998(కథ)


1998(కథ)



సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి.........

ఆమె వెళ్ళిపోతోంది.
పుట్టింటికి వెళ్ళిపోతోంది.
భాస్కర్ని విడిచి వెళ్ళిపోతోంది.
అందుకు రేపే ముహూర్తం !

పద్మ పుట్టిల్లు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్ళపై తను అర్ధంతరంగా వాలిపోవడం ఆర్ధికంగా ఇబ్బంది వ్యవహారం అయినప్పటకీ కూతురిని బరువుగా తలచే తల్లితండ్రులు కారు.

జీవితాంతం వాళ్ళకి బరువు కాకుండా తనకి ఉన్న డిగ్రీ చదువుకి ఏదో చిన్న ఉద్యోగం దొరక్కుండా పోదు. వాళ్ళకి కూతురుకన్నా ఏడేళ్ళ మనవరాలు సుస్మిత, అయిదేళ్ళ సమీర్‌ అంటే పంచప్రాణాలు.

ఆమె పుట్టింటికి వెళ్ళిపోతున్న విషయం భాస్కర్‌ కి తెలీదు. తెలియజేయడం కనీస ధర్మం. ఆమె అతనితో మాటాడదు. మాటాడ బుద్ధికాదు. అంచేత కూతురు సుస్మిత చేత తెలియపరచింది. తను పక్కనే ఉండి గమనిస్తోంది. భాస్కర్లో చలనం ఆమెకు కనిపించలేదు. మరోసారి సుస్మిత చెప్పింది. అయినా లేదు చలనం. “వెళితే వెళ్ళండి” అన్లేదు. “వెళ్ళడానికి వీల్లేదు” అని కూడా అన్లేదు. ఒక చిన్న నిట్టూర్పు కూడా లేదు. నిర్ఘాంతపోయింది పద్మ. అతడు అవుతాడనుకొన్న షాక్‌ ఆమెకే తగిలినట్టయింది .

ఏంమనిషి ? పదేళ్లబంధం ఒక్కసారిగా తెంచేసుకొవడం సామాన్యమైన విషయమా ? మనిషి అన్నాక పోజిటివ్‌ గానో, నెగిటివ్‌ గానో ఏదో వల్లకాడు గానో స్పందించాలికదా!

అతనిలో ఏ స్పందనా లేకపోవడం ఆమెను ఇంకా వెర్రెత్తించింది. మరింత అశాంతికి గురి చేసింది.

ఇతనితోనా ఇన్నాళ్ళుగా కాపురం చేసింది.

అవును. చేయగలిగింది. ఆమె కాబట్టి చేయగలిగింది.

మరో ఆడదయితే అతనితో పట్టున పదిమాసాలు కూడా కాపురం చేయలేదని పద్మ ప్రగాఢ అభిప్రాయం.

అది సరే!

భాస్కర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పటికి అతని సర్వీసు పదిహేనేళ్ళు !

భాస్కర్ని అతను పనిచేస్తున్న కంపెనీ ఎలా భరిస్తుందనేది ఆమెకి అందని విషయం. ఈపాటికే అతను సర్వీసునించి టెర్మినేటు చేయబడి ఉండాలి !

భాస్కర్‌ ఒక అసమర్ధుడు. ఏ పనీ చేతా వాతా కాని వాజమ్మ. దద్దమ్మ. అతడు వంటింట్లోకి చొరబడి స్టవ్‌ వెలిగించలేడు. వెలిగించి ఇస్తే పాలు కూడా మరిగించలేడు. ఇల్లు శుభ్రం చేయాలి. వంట చేయాలి. అదే సమయంలో పిల్లలు ఇద్దరినీ స్కూలికి తయారు చేయాలి … ఇంట్లో సవాలక్ష పనులతో పెళ్ళం ముండ ఒక్కతే గింజుకు ఛస్తుంటే చూస్తూ ఊర్కుంటాడు తప్ప తనుకూడా చేయి వేసి సహకరించడు. హూషారుగా ఏ పనిలోకి చొరబడడు. చాకిరీకి ఆమె రెండు చేతులూ చాలక, పిలిచి ఏదైన పని చెబితే ఖర్మ ! పనికి రెండు పనులవుతాయి. మళ్ళీ ఆమే చావాలి.

చిన్న సంసార నావకి చుక్కాని కాలేని భర్త, ఏట్లో తెడ్డు వేయడం చాతకాని భర్త, నావ ఎలా నడపాలో చెప్పినా నడపలేని భర్త, అంత పెద్ద కంపెనీలో ఎలా నెగ్గుకు వస్తున్నాడనేది ఆమెకు అర్ధం కాని విషయం.

అతను పనిచేస్తుండగా తనివి తీరా చూడాలని ఆమె ముచ్చట. తన ముచ్చట తీర్చమని చాలాసార్లు బతిమాలుకొంది పద్మ.

నవ్వేస్తాడు భాస్కర్‌ . అదొకటొచ్చు ! ఆమె రెట్టిస్తే “రా! వచ్చి చూడు” అంటాడు. ఎలా చూస్తుంది? తీసుకెళ్ళాలి కదా ! ఆ పని కూడా చేత కాదు.

నవ్వేస్తూ, ఆమెను దగ్గరకు తీసుకొని అంటాడు ” ఏదో పోనిద్దూ! నీ లాగే మా కంపెనీ కూడా చూసీ చూడనట్టు వదిలేస్తోంది. పాపం నీవు భార్యగా భరిస్తుంటే, కంపెనీ కన్న తల్లిగా నన్ను సాకుతోంది. అయితే ఒకటే తేడా ! భార్య భరిస్తున్నాననుకొని నొప్పులు పడిపోతోంది. తల్లికి భరిస్తున్నట్టే తెలియదు !”

“చాల్లెండి! మీ అమ్మే మిమ్మల్ని పాడు చేసింది. ఎందుకూ పనికిరాకుండా పెంచి, నా మీదకి ఆంబోతులా వదిలేసింది” అంటుంది పద్మ.

అక్కడితో వదలకుండా అతని మిత్రుల వద్ద కదుపుతుంది. ” ఈ చేతకాని మనిషి ఉద్యోగం ఎలా వెలగబెడుతున్నాడయ్యా బాబూ” అని సాగదీస్తుంది.

“అమ్మమ్మమ్మా ! భాస్కర్ని అలా తీసిపారేయకండి మేడాం ! అతడు డ్యూటీలో రెచ్చిపోతాడండీ బాబూ! అతనికి సరిరారు ఎవరూ ! మా బాస్‌ కి భాస్కరంటే ప్రాణం”

“నేను నమ్మను. మీ స్నేహితుడు కదా! వెనకేసుకొస్తున్నారు”

“అంత దారుణంగా మమ్మల్ని తీసి పారేయకండి మేడాం ! అతని పనితనం గురించి మీకు ఒకటే ఉదాహరణ … మాకు ఇన్‌ టైములో రాని ప్రమోషన్లు మీశ్రీవారికి ప్రత్యేకంగా అవుటాఫ్‌ టర్న్‌ లో వస్తున్నాయి. ఇంతకన్నా గుర్తింపు ఏముంటుంది?”

“ప్రమోషన్లకీ, పనికీ సంబంధం లేదు. మీ మిత్రుడు కాకా మాష్టారు! వాళ్ళ బాస్‌ ని పాలిష్‌ చేసి, మస్కా కొట్టి ప్రమోషన్లు కొట్టేస్తాడు. కాదంటారా ?”

“కుండ బద్దలు కొట్టినట్టు మీరంత గట్టిగా చెబుతుంటే .. ఎలా కాదనగలం మేడాం ? కాని మాకిది న్యూడిస్కవరీ”

“నోర్ముయ్యండ్రా స్టుపిడ్స్‌ ” నవ్వేస్తాడు భాస్కర్‌. స్టుపిడ్స్‌ నోర్ముయ్యలేదు.

“మేడం ! మీవారి పాలిష్‌, మాలిష్‌ వ్యవహారం మేం అణుమాత్రం కూడా పసిగట్టలేనిది మీరెలా కనిపెట్టేశారు ?” ఉత్సాహంగా అడిగేరు.

“బాబూ ! నాకు ఆయనతో పదేళ్ళ అనుభవం ! నాకు తెలీకపోవడం ఏమిటీ ? దయచేసి వివరాలు అడక్కండి”

అడగలేదు వాళ్ళు. భాస్కర్‌ మాత్రం అడక్కుండా ఉండలేకపోయాడు. అడిగిన సమయం చిక్కని రాత్రి. బెడ్‌ రూం లో ఆమెతో సరసం. శృంగారం. “నీ అనుభవం నుంచి నా పాలిష్‌ వివరాలు చెప్పవా పద్మా !” అడిగేడు. “ఇది మరీ బాగుంది. మీ గురించి మీకే చెప్పడం ఏమిటి ?” “నాకు తెలీదు కనక” “తెలీకుండానే పాలిష్‌ కొడతారా ? గొప్ప కళే ?” “నీ పదేళ్ళ అనుభవంనుంచి నేను ప్రదర్శించిన ఆ కళగురించి చిన్న ఇన్సిడెంటు చెబుతే సంతోషిస్తాను”

“చాల్లెండి. నంగనాచి కబుర్లు. తెలీనట్టు నాపకాలు. మీరు ఇప్పుడు చేస్తున్నది ఏమిటీ ? నాపై అప్లయ్‌ చేస్తున్నది అదికాదా !”

ఆమె నగ్న శరీరంపై అతని చేతులు చేస్తున్న విన్యాసాలు క్షణకాలం ఆగిపోయాయి. “దీన్ని పాలిష్‌ అంటారా !” అన్నాడు తెల్లబోతూ.

“నన్ను నిద్రపోనివ్వకుండా మెత్తగా దువ్వి నన్ను రంగంలోకి దింపడాన్ని ఏమంటారు ? మీబాస్‌ కి పాలిష్‌ తో ప్రమోషన్‌. నాకు పాలిష్‌ తో మీకు అమర సుఖం !”

“సెక్సు ప్రిపరేషన్‌ కి నీవు పెట్టిన పేరా ఇది ! నీ ఉద్దేశ్యం ఏమిటీ ? నీ దగ్గరే కాకుండా మాబాస్‌ దగ్గర పడుకొంటున్నానా ? హోమో సెక్సు మాకు అంటగడుతున్నావా ?”

“ఛీఛీ. చెత్త మాటలు మాటాడకండి”

“పాలిష్‌, మాలిష్‌ అంటూ కొత్త విషయాలు చెప్పి చెత్త అంటావేమిటి ? సరే. నేను పాలిష్‌ కొట్టి నీదగ్గర సుఖాన్ని దోచుకొంటున్నాను. మరి నీ సంగతి ఏమిటి ? పాపం ! నీకిందులో సుఖం లేదా ?”

“ఆ మాట నేను అనలేదు. నాకూ సుఖమే. కాని ఇక్కడ తేడా ఉంది” “చెప్పు ”

“మీరు నాదగ్గర చేరేది నాకు సుఖాన్ని ఇవ్వడానికి కాదు. మీరు తీసుకోవడానికి. అందులోకి దింపేక, రగిలించేక ఏం చేస్తుందీ ఆడది ? స్త్రీ నుంచి మగాడికి కావల్సింది సుఖం. ఆ సుఖం కోసం ప్రేమిస్తాడు. స్త్రీకి కావాల్సింది ప్రేమ. ఆ ప్రేమకోసం ఇస్తుంది తన శరీరం. సుఖం. కాదంటారా ?”

“ఇదేదో కొటేషన్‌ ఏ పుస్తకంలోనో చదివి పాలిష్‌ మాలిష్‌ అని నా ప్రేమను శంకిస్తున్నావు” అన్నాడు.

అతనికి ఆమె అంటున్నది కొత్త విషయంగా తోచింది. పూర్తిగా ఏకీభవించలేక ఆమెతో ఆరాత్రి వాదన పెట్టుకొన్నాడు కాసేపు.

ఆమె చెప్పిన దాంట్లో స్త్రీ యొక్క త్యాగ గుణం, పురుషుడిలో జంతు స్వభావం కనిపించి జీర్ణించుకో లేకపోయాడు. అయితే

అప్పటికా విషయం ఆ రాత్రి ఆమె ఇచ్చిన సుఖంలో మర్చిపోయాడు.

గత నాలుగైదు రోజులుగా

అతను ఆమెనుంచి ఆ సుఖం పొందటంలేదు. ఆమె అతని నించి తీసుకోవటం లేదు.

రోజూ రాత్రి ఇద్దరూ బెడ్‌ రూం లో డబుల్‌ కాట్‌ పైకి చేరుతున్నప్పటికీ ఒకరి శ్వాస మరొకరికి తగలనంత దూరంగా నిశ్శబ్దం మధ్య మంచం అంచుల వైపు అటు ఆమె ఇటు అతడు.

రేపటినించి ఆ రకం పడక గూడా ఉండదు. ఇక ఇంటోనే ఉండదు పద్మ. అతనికి దూరంగా పుట్టింటికి పయనం. ఇద్దరి మద్య గొడవ కారణంగా ఆ పయనం. ఇంతాచేస్తే అంతగొడవకీ కారణం చిన్న ఉల్లిగడ్డ !  1998 ఉల్లిపాయికి అంత పవరు లేదని ఎవరూ అనలేరు.

నెలరోజుల క్రిందట ఉల్లిపాయలు అయిదు కేజీలు పద్మ ఒక్కసారిగా కొనబోతూంటే వద్దని వారించేడు భాస్కర్‌.

చిచ్చు అక్కడే రగులుకొంది.

సాధారణంగా బజారుకి భాస్కర్‌ పద్మతో వెళతాడు. సరదాగా, తోడుగా మాత్రమే వెళతాడు. అతడు ఆమె పక్కనే ఉన్నప్పటికీ బజారులో కూరగాయలు బేరమాడుట, ఎంపిక చేయుట సమస్తం పద్మ మాత్రమే చూసుకొంటుంది.

అందుకు బలవత్తరమైన కారణం ఉంది.

భాస్కర్‌ ఒక్కసారి సాయంత్రం డ్యూటీనుంచి వస్తూ కూరగాయలు కొని తెచ్చాడు. ఆమె తెమ్మంటేనే తెచ్చాడు. తీరా తెచ్చాక ఒకటీ, ఒకటీ గెలికి పుచ్చుకొని, చచ్చువి, ముదరవి అంటూ ప్రతి కూరగాయికీ వరుసగా రకరకాల పేర్లు పెట్టింది. ఆమే కాదు చదువుకొంటున్న ఇద్దరు పిల్లలనూ పిలిచి వింత వస్తువులను చూపించినట్లు చూపించింది. పిల్లలతోపాటు ఆమె ఆ రోజంతా పకపక నవ్వింది. ఆమె అక్కడితో ఆగకుండా అతని నిర్వాకాన్ని మరుసటి రోజు ఇరుగు పొరుగు ఆడవాళ్ళ మధ్య్య ఒక చోద్యంగా చూపించి వినోదాన్ని పంచింది.

మరోసారి భాస్కర్‌ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగర్తగా తెచ్చాననుకొంటే పద్మ ఆ కూరగాయలను సీరియస్‌ గా కోపంగా గబగబా బయటకు తీసుకువెళ్ళి పెంటకుప్పపై విసిరేసింది. అతని మనస్సు చివుక్కుమంది. ఆమె తననే మూట కట్టి పెంటపై పడేసినట్టు ఫీలయ్యాడు. ఆ రోజునుంచీ తను బజారు తీసుకు రావటంలేదు. ఆమె తెమ్మనటం లేదు.

అప్పటి నుంచీ భాస్కర్‌ ఆమెకు తోడుగా మాత్రమే వెళతాడు. కూరగాయల వ్యవహారం మొత్తం పద్మే చూసుకొంటుంది. పొరపాటున ఆమె చచ్చువి, పుచ్చువీ తను చూస్తుండగా ఏరినా, చూస్తూ ఊర్కొంటాడు తప్ప మాటాడడు. అంతేకాదు ఆమె సెలక్షన్‌ లో పుచ్చులను ఎత్తిచూపి ఎద్దేవా చెయ్యడు. “ఇపుడేమంటావ్‌ ?” అని రెచ్చగొట్టడు. పుచ్చులను ఆమె సైలెంటుగా ఏడుచుకొంటూ పారేయటం చూస్తాడు. బయటకి కనపడనివ్వని ఆమె ఏడుపుని చూసి, ఆమెకు కనపడకుండా, వినపడకుండా అతను నవ్వుకుంటాడు. అంతే తప్ప దొరికింది ఛాన్సు కదా అని ఓపెన్‌ గా ఏడిపించడు.

ఏదైన సరే వినియోగవస్తువుల కొనుగోలు విషయంలో తలదూర్చకుండా జాగర్తలు పాటించే భాస్కర్‌ … ఆ రోజు అతనికేమయిందో తెలీదు … ఉన్నపాటున దభీమని ఉల్లిగడ్డ ఊబిలో పడిపోయాడు.

ఉల్లి సలహాతో అడ్డంగా దొరికి పోయాడు.

కత్తిపీట తగలకుండానే పద్మకి కళ్ళనీళ్ళు రప్పిస్తున్నాయి ఉల్లిపాయలు.

పక్కింటి సరోజ సలహాపై హోల్‌ సేల్‌ కొట్లో కొనాలని బయల్దేరింది. అలా కొంటే కేజీ దగ్గర రెండు రూపాయల తేడా ఉంది. అంచేత పద్మ సంచితో బాటు భర్తను కూడా వెంటేసుకొని హోల్‌ సేల్‌ కొట్టుకి పరుగున వెళ్ళింది.

అక్కడ ఉల్లిపాయలు మినిమం అయిదు కేజీలు కొనాలి. లేకుంటే అమ్మడు. తర్వాత అవి సగానికి పైగా కుళ్ళిపోయి బయటకు పారేయవలసి వస్తుందని భాస్కర్‌ కి ఎందుకో అనిపించింది. తన భయాన్ని ఆమె ముందు వెలిబుచ్చలేదు. డైరెక్టుగా దుకాణుదారునే అడిగేసాడు. “ఉల్లిపాయలు స్టాకు ఉంటే పాడవ్వవు సార్‌” అన్నాడు. “మీకా భయం ఉంటే రెండు రోజులు ఎండబెట్టి, గాలి తగిలేలా స్టోర్‌ చేస్తే కుళ్ళకుండా కావల్సినంత కాలం ఉంటాయి” అన్నాడు.

అంతవరకూ బాగానే ఉంది. ఆ తర్వాతే పప్పులో అతని కాలు పడింది ! ఏ కొట్టులో నయినా బేరమాడకుండా కొనదు పద్మ. బేరమాడిందని కాబోలు కేజీపై రూపాయి పెంచేడు షావుకారు. పద్మ నివ్వెర పోయింది. గాభరాతో ఆమె మాట తడబడింది. “అదేమిటండీ మాపక్కింటి ఆవిడ మీ దగ్గర గంట క్రితమే కొంది” అన్నది. “అది గంట క్రితం రేటు తల్లీ ” అన్నాడు షావుకారు. ఆమె బ్రతిమిలాడింది. “ఇక్కడ బేరాలు ఉండవమ్మా. మీకు అనుమానం ఉంటే బయట మార్కెట్‌ రేటు ఎంత ఉందో కనుక్కోండి ” ముందుగానే ఆమె అక్కడకి వచ్చేముందు మార్కెట్‌ రేటు కనుక్కొనే వచ్చింది. కేజీ 16 రూపాయలు. హోల్‌ సేల్‌ రేటు 14 రూపాయలు. పక్కింటి సరోజ అదృష్టవంతురాలు. 13 రూపాయలకే కొన్నది. హుషారైన మొగుడు కాదు భాస్కర్‌ . సరోజలా అదృష్టాలు ఎలా తగుల్తాయి తనకి !

పక్కన చెట్టంత మగవాడు ప్రేక్షకుడిలా ఉండిపోతే, ఆడకూతురు అరగంట సేపు ప్రాధేయపడిందని కాబోలు షావుకారు … ఏదో స్పెషల్‌ కేసుకింద కిలోపై ఒక అర్ధరూపాయి తగ్గిస్తానన్నాడు.

“ఏంచేద్దాం ” అన్నట్టు భర్త వైపు చూసింది పద్మ. చూడక పోయినా బావుణ్ణు. “వద్దు. కొనద్దు” అన్నాడు భాస్కర్‌ . రెండు రోజులాగి చూద్దాం అన్నాడు. “మీ ఇష్టం” అని పద్మ ఉల్లిపాయలు కొనే ప్రపోజల్‌ ని విరమించుకుంది. మాటాడకుండా భర్త అడుగులో అడుగువేస్తూ ఇంటి ముఖం పట్టింది. ఇంటి వ్యవహారాల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో భాస్కర్‌ తలదూర్చి సరైన నిర్ణయాలు తీసుకొన్న అరుదైన సందర్భాలు లేకపోలేదు.

“నా మంచి మొగుడు. సమయానికి ఎంత గొప్ప నిర్ణయం తీసుకొన్నాడు ” అని పద్మ ఏనాడు కొనియాడలేదు. అందుకు భాస్కర్‌ బాధపడలేదు. అది ఆమె స్వభావంగా భావిస్తాడు.

భాస్కర్‌ మాత్రం ఆమె ఏ పని చేసినా అభినందిస్తాడు. “అది నిజంగా నీకే సాధ్యం పద్మా !” అంటాడు. “వండర్‌ ఫుల్‌ ! నీకు నీవే సాటి ! అంటాడు. అతని పొగడ్తలకి పడిపోతుంది. పడగొట్టటంలో భాస్కర్‌ ఘనుడు. దానినే అతనిలో “కాకా” గుణంగా గుర్తించింది. ఆ రోజు భాస్కర్‌ ఉల్లిపాయలు కొనవద్దు అన్నది కేవలం సలహా మాత్రమే. “కొనేద్దాం అంటే అతను కాదంటాడా ?” కాదనడు. వద్దు అన్నది కూడా రెండు రోజుల్లో ఉల్లి ధర తగ్గుతుందనే నమ్మకంతో అన్నాడు. అతను ఆ ముందురోజే పేపర్లో చదివాడు.

“ఎప్పుడూ లేని విధంగా నిత్యావసర సరకుల ధరలు దేశం మొత్తాన్ని గజగజ వణికించేస్తున్నాయి. ఉల్లిపాయల ధరలైతే అందుబాటులో లేకుండా పోయాయి. ఒకటీ, రెండు నెలల్లో ఎన్నికలను ఎదుర్కోవలసి ఉన్నందు వలన ప్రభుత్వం కళ్ళు తెరిచింది. ధరలు తగ్గేలా తగిన చర్యలు చేపట్టింది. ఓట్ల బ్యాంక్‌ దిగువ తరగతితో ముడిపడి ఉండడంచేత ఆ స్థాయికి ధరలు మరి రెండు రోజుల్లో కిందకి దిగేలా ముమ్మరం చేసింది. ”

భాస్కర్‌ పేపర్లో వచ్చిన వార్త నమ్మేడు.

అతని మిత్రుల మధ్య టీ కబుర్లలో వేడి వేడి రాజకీయాలు దొర్లేయి. వాళ్ళు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు తగ్గటం అనివార్యం అని అభిప్రాయ పడ్డారు. భాస్కర్‌ అభిప్రాయం కూడా అదే అయ్యింది.

పద్మకి ఇంటి సమస్యలు తప్ప దేశ రాజకీయాలు పట్టవు. ఉల్లిగడ్డ ధర ఎందుకు పెరిగి ఎందుకు తగ్గుతుందో, అందులో అసలు రాజకీయం ఉందా, ఉంటే ఏ మేరకు ఉంది అనేది ఆమెకు అందదు. సంసారం ఒడుదొడుకులు లేకుండా హాయిగా పూలపడవలా సాగాలని భగవంతుని ప్రార్ధించుట, భర్త పిల్లలను ప్రేమగా చూచుకొనుట, ఉన్నంతలో మానేజ్‌ చేస్తూ ఇల్లుని చక్కబరచుకొనుట అవి మాత్రమే ఆమెకు తెల్సు. ఆమెది చాలా చిన్న ప్రపంచం.

రెండు రోజుల తర్వాత

ధరలు అదుపులోకి రాలేదు. సరికదా కళ్ళేలు తెంచుకొని ఏ తరగతికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాయి.

కేజీ ఉల్లిపాయలు విశ్వ రూపం దాల్చి పాతిక రూపాయలు పలికింది. హోల్‌ సేల్‌ రేటు, రిటైల్‌ రేటు ఒకటే అయింది.

పేపర్లో ప్రభుత్వం తన తప్పు లేదని ప్రకటించుకొంది

ధరలు పెరగడానికి కారణం ప్రభుత్వం కాదు, బ్యూరో క్రాట్లు అంది. బ్లాక్‌ మార్కెటీర్లను నిందించింది. ధరలు పెరగకుండా చూసుకోవలసిన బాధ్యత ఆయా రాష్ట్రాలదే అంది. మరో వైపు వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ యొక్క ప్రభావం లేకపోలేదు అంది. సందేహంలేదు, ఇందులో విదేశీ హస్తం ఉందనే రహస్యం ఒకటి బహిరంగ పరచింది ప్రభుత్వం.

వీళ్ళంతా గవర్నమెంటుకి అతీతులు. కాదుకాదు గవర్నమెంటోళ్ళే. ఆ శక్తులకి తొత్తులు అని భాస్కర్‌ కి జ్ఞానోదయం అయ్యేటప్పటికి ఆలస్యమయిపోయింది.

ఉల్లి బోనులో దోషిగా నిలబడ్డాడు. పద్మ పదమూడున్నర రూపాయలకి కొనబోయిన కేజీ ఉల్లి రేటు అతని కారణంగా కేజీ పాతిక రూపాయలకి కొనవలసిన పరిస్థితి దారి తీసింది.

పద్మ ఏమి శిక్ష విధించింది ? అందులో భాస్కర్‌ తప్పు ఎంతవరకు ఉంది ? ఈ మాత్రానికే ఆమె అతణ్ణి విడిచి వెళ్ళిపోవడానికి సిద్ధపడిందా ? సిద్ధపడితే ఆమెదే తప్పు. అసలు భాస్కర్‌ భర్తగా లభించడం ఆమె ఎంతో అదృష్టంగా భావించాలి. ఈ రోజుల్లో భాస్కర్‌ లాంటి అమాయకులు అరుదుగా కనిపిస్తారు. అతడు సకల సద్గుణ సంపన్నుడు. సరదాకికూడా మందు కొట్టడు. సరసానికి మరో స్త్రీకి కన్ను కొట్టడు. అంతేకాదు నెలాఖరులో మొత్తం జీతం కవర్‌ తో సహా పెళ్ళం చేతిలో పెడతాడు. జీతమంతా ఆమె చేతికిచ్చేసి నెలనెల పాకెట్‌ మనీ అడగడానికి మొగమాటపడతాడు. ఆమె పాకెట్‌ మని ఎంత ఇస్తే అంత కిక్కురుమనకుండా తీసుకుంటాడు.

ప్రతినెల బుద్ధిగా జీతం ఇచ్చేసే భాస్కర్‌ ని “నా మంచి మొగుడు” అని ముద్దులతో ముంచెత్తేయదు.

వచ్చే జీతం ఎక్కువ, ఇంట్లో ఖర్చు తక్కువ అయితే ఆమె అంతపని తప్పక చేయగలదు. ముద్దు చేదు కాదుకదా !

వచ్చే జీతం గొర్రె తోక. ఖర్చులు చూస్తే హనుమంతుని తోక.

బుద్ధిగా జీతమంతా తన చేతిలో పెట్టేసి ఎంచక్కా భాస్కర్‌ చేతులు దులిపేసుకోవడం ఒక కుట్రగా, అతని గడుసుదనంగా ఆమె భావిస్తుంది. ఎవరైనా అతను అమాయకుడు అంటే ఇదే సమాధానం చెబుతుంది.

జీతం కవరు అనే చిన్న కొరడా చేతిలో పెట్టి సమస్యల పులి బోనులోకి తనని చాకచక్యంగా నెట్టేసి తప్పుకు తిరిగే తెలివితేటలున్నవారిని అమాయకులంటారా ?

అతన్ని ఎన్నోసార్లు సంసారం చేయమంది. చేతులెత్తి నమస్కారం పేట్టేస్తాడు. అది తప్ప ఇంకేంపనైనా చెప్పు చేస్తాను అంటాడు. చేయడానికి ఇంకేముంటుంది ?

పెళ్ళాం పెట్టింది వేడి వేడిగా రుచి రుచిగా తినడం, పెళ్ళాం పక్కలో వెచ్చ వెచ్చగా హాయి హాయిగా “సుఖం” జుర్రుకొని చల్లగా నిద్ర పోవడం. అంతకన్నా ఇంకేం పని చేస్తాడు ?

అంత సుఖాన్ని పొందే అదృష్టం ఎంతమందికుంటుంది ? అంచేత అదృష్టవంతులు ఆమె కాదు అతడే ! నిజమేనని ఒప్పుకుంటాడు భాస్కర్‌.

పద్మ తలపగల కొట్టుకునేలా ఆలోచిస్తూ, ఆదాయానికి తగ్గట్టు ప్రతి నెలా బడ్జెట్‌ రూపొందిచేటప్పుడు గెడ్డం తీసేసి చీరె చుట్టుకున్న మన్‌ మోహన్‌ సింగులా సీరియస్‌ గా కనిపిస్తుంది. అయితే జోక్‌ గా కూడా ఆమెతో ఆ మాట ఆ సమయంలో అనడు. ఆ మాటే కాదు. ఏ మాటా అనడు. పలకరించడు. పిల్లలనుకూడా వెళ్ళనీయడు ఆ పరిసరాలకి. ( ఆ రాత్రిమాత్రం సింగ్‌ జోకులు కురిపిస్తాడు. ) అప్పుడామెను చూస్తే ఎనలేని గౌరవం కలుగుతుంది. బడ్జెట్‌ రచన సామాన్యమైనది కాదని అతనికి తెల్సు. పాపం ఈ మధ్య ఆమె ఎంత పకడ్బందీగా బడ్జెట్‌ ప్లాన్‌ చేస్తున్నా తరచుగా బెడిసి కొడ్తోంది. గమనిస్తున్నాడు తను. ఏం చేయగలడు ? రాబడిని బట్టి ఆమె ప్రయారిటీస్‌ నిర్ణయించడంలో రిక్రియేషన్‌ కి సంబంధించిన అంశాలు ఒక్కొకటీ కలంపోటుకి విలవిల్లాడుతూ బడ్జెట్‌ నుంచి నేలరాలిపోతున్నాయి. పద్మకి పెళ్ళికాకముందు ఎన్నెన్నో సరదాలు …

కాలేజీ లైఫ్‌ లో ఆమెకు సినిమా అంటే మహా పిచ్చి. ఇప్పటికీ ఆ సరదా ఉంది. సరదా ఒకటే ఉంటే సరిపోదు. పిల్లలతో కలసి సినిమాకి వెళ్ళాలంటే వంద చాలదు. సినిమాలకు వందలు వేసే శక్తి లేదు ఆమెకు.

అంచేత పిల్లలను ఇంట్లో ఉంచి బయట తాళం వేసి భాస్కర్‌ తో రెండు, మూడు సినిమాలు చూసింది. అయితే ఏమాత్రం ఎంజాయ్‌ చేయలేకపోయింది. తెరమీద బొమ్మలు బదులు పిల్లలు కనిపించే వారు. హాలులో ఉన్నంత సేపు పిల్లలు ఇంట్లో ఎలా ఉన్నారో, ఏమి చేస్తున్నారో అని ఒకటే దిగులు అదే ధ్యాస. పిల్లలు ఇద్దరకీ ఒక్క క్షణం పడదు. కొట్టుకొని, కలియబాడి ఇల్లుని ధ్వంసం చేయడం లేదు కదా ! వంట గదిలో గ్యాస్‌ సిలిండర్‌ తో పిల్లలు ఆడుతున్నట్టు పిచ్చి పిచ్చి ఆలోచనలు. సినిమా చూడలేక పోయింది. ఆట మధ్యలోనే భర్తతో ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత సినిమా సరదాలు పూర్తిగా మానుకుంది. టీవీ సినిమాలతోనే తృప్తి చెందుతోంది.

ఆదివారం సాయంత్రాలు సినిమా బదులు సముద్ర తీరానికి భర్తా పిల్లలను బయలు దేరతీస్తోంది. అక్కడ పడి లేచే కెరటాలను చూసి ఆనందిస్తోంది. భర్త సరసన ఇసుక తిన్నెపై కూర్చొని సాయం సంధ్యలో ఎర్రటి సూర్య బింబాన్ని పలకరించి పరవశించి పోతోంది. ఆమె పిల్లలు కాసేపు కెరటాలతోనూ, తర్వాత ఇసుక గూళ్ళతోనూ ఆట. ఈ రిక్రియేషన్‌ కి సినిమా ఖర్చులో నాల్గవ వంతు చాలు !

సరదాలంటే ఇంకా చాలా ఉన్నాయి. చీరలూ, నగలూ చాలా మంది స్ర్తీలకి మల్లే ఆమెకూ ఇష్టం. సరదా పడి అవి కొనాలంటే బడ్జెట్‌ అరలో ఇమడవు. అలాంటి సరదాలు క్రమక్రమేణ మర్చిపోవడం అలవర్చు కుంటోంది. గుర్తు చేసుకోంటే దిగులు తప్ప సుఖం ఏముంది ?

ఆమె సరదాలు ఏమీ తీర్చలేకపోతున్నాననే బాధ అతనికి ఎంతో ఉంది. ఏమి చేయగలడు ? ఏమైనా చేయాలనుకోంటే అతని జీతం వెక్కిరిస్తుంది.

ధరలు అనూహ్యమైన పెరుగుదలముందు అతని జీతం వెలవెల బోతున్నది. కొనుగోలు శక్తి రోజు రోజుకీ క్షీణించి పోతున్నది. రూపాయికి విలువలేదు. ఇలా వంద తీస్తే మంచు గడ్డలా మరుక్షణం కరిగిపోతున్నది.

జీవన వ్యయంతో సమంగా అతని జీతం పెరగడం లేదు. జీతాలు నాలుగేళ్ళ కొకసారి పెరుగుతాయి. ఆ పెరుగుదల మహా ఉంటే మూడు నాలుగు వందలు. ఏడాదికొక ఇంక్రిమెంటు. అంటే జీతంలో మరో ఏభై చేరుతుంది. ఏ మూలకొస్తుంది ఆ పెరుగుదల !

పెరిగే ధరలముందు అతని జీతం పెద్ద గీతముందు చిన్న గీతలా వెలవెల బోతున్నది.

ఈ మధ్య బజారుకు వెళ్ళాలంటే గుండెలు దడదడ మంటున్నాయి.

నిత్యావసర సరుకులూ, కూరగాయలపై చేయి వేయబోతే కాటేస్తున్నాయి. ఉల్లి గడ్డలు ముట్టుకోబోతుంటే నాటు బాంబుల్లా భయ పెడుతున్నాయి.

ఉల్లిధర ఒక్కసారిగా పాతిక రూపాయలు అయిన తర్వాత

పద్మకి దుఃఖమే వచ్చింది. ఇంట్లో భర్త పిల్లలు లేనప్పుడు కళ్ళనీళ్ళు వచ్చేలా ఏడ్చిన రోజులున్నాయి.

భాస్కర్‌ రాంగ్‌ గైడెన్సు ఇచ్చి అయిదు కేజీల ఉల్లిపాయలు చవగ్గా కొననీయలేనందుకు ఆమెకు కోపం వచ్చింది.

ఒక్క అయిదు కేజీలకి అతన్ని నిందించగలదు. తర్వాత ఎవరిని నిందిస్తుంది ?

మరి రెండు రోజుల్లో ఉల్లి ధర పాతిక నుంచి ముఫ్ఫైరెండు వరకూ వెళ్ళింది. ఇప్పుడెవరిని నిందిస్తుంది ?

ఉప్పెనలా వచ్చిన ఈ విపరీత పరిణామాలకి హడలి పోయిన పద్మ ఇంటో ఎమర్జన్సీ విధించింది. అన్నిటిపై కఠినంగా ఆంక్షలు.

సెల్ఫ్‌ రేషనింగు అమలులో పెట్టింది.

భాస్కర్‌ కి ఉల్లికి సంబంధించిన కూరలూ, పులుసులూ ఇష్టం. అవి పూర్తిగా నిషేధించ బడ్డాయి. భాస్కర్‌ కి ఇది శిక్షే !

ఎవరూ పుట్టిన రోజున కూడా ఉప్మా, ఉల్లి పెసరట్లు కోరరాదు.

మసాలా కూరలు ఉపసంహరింప బడ్డాయి. రసం, పచ్చడి, పెరుగు. పెట్టింది తినడమే. మరేమీ అడగ రాదు.

అంతే కాదు

రొటీన్‌ దినచర్యలో చాలా మార్పులు ప్రవేశించాయి.

రాత్రులు భాస్కర్‌, పిల్లలూ నిద్రపోయేముందు పాలు తాగే అలవాటు ఇక సాగదు. పాలు బదులు చల్లటి నీళ్ళు గడగడ తాగి పడుకోవాలి.

పద్మ రోజుకి అయిదారు సార్లు టీ తాగే అలవాటుని ఉదయం ఒక కప్పుతోనే సరిపెట్టుకుంటోంది. భాస్కర్‌ టీ పూర్తిగా మానేసాడు. అంతేకాదు. అతని పాకెట్‌ మనీ కూడా సగానికి సగం కత్తిరించ బడింది.

ఇంత చేసినా రోజులు నెగ్గుకు రావడం కష్టమవుతోంది.

భాస్కర్‌ ఏమి వండినా తింటున్నాడు. ఏమి చెప్పినా వింటున్నాడు. ఏది వద్దన్నా చిత్తం మహా రాణీ అంటున్నాడు.

అయితే మహారాణితో పువ్వుల దగ్గర పేచీ వచ్చింది.

భాస్కర్‌ డ్యూటీనుంచి వచ్చేటప్పుడు రోజూ గుర్తుగా మూడు రూపాయల పూలపొట్లం తీసుకొని వస్తున్నాడు.

పద్మ … పూలుకొనడం మానేయమని ఆదేశించింది.

భాస్కర్‌ స్పష్టంగా అది కుదరదు అన్నాడు. మరేదైనా చెప్పు వింటాను. పూల దగ్గర రాజీ పడేది లేదు అని నిక్కచ్చిగా తేల్చేసాడు. నెలనెల ఆమె ఇచ్చే పాకెట్‌ మనీలో సమస్తం వదులుకొని పూలు కొని తెస్తున్నాడు.

పూలు ఇంతకు మునుపు పద్మే కొనేది. రోజూ వీధిలోకి పూల కుర్రవాడు వాడుకగా ఇచ్చి వెళ్ళిపోయేవాడు. ఆ వాడుక మానిపించేసింది.

అయినప్పటికీ ఆమె జడలో పూలు గుభాళిస్తున్నాయి.

“పూలు లేకుండా నా పక్కన పడుకోరా ” పద్మ.

“పూలు లేకుండా ఎందుకు పడుకోవాలి అనేది నా పాయింటు” భాస్కర్‌.

నెలనెలా బడ్జెట్‌ లోటు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరి సల్ప నివ్వకుంటే మల్లెపూలకోసం అతని మంకు ఏమిట్ట ! అర్ధం చేసుకోడు గదా మనిషి !

రోజూ మూడు రూపాయల ఖర్చు ఆమెను బాధిస్తున్నప్పటికీ పూల పరిమళంలో, మత్తులో భాస్కర్‌ స్పర్శ ఆమెను శాంతింప చేస్తున్నాయి. పువ్వులు కొనవద్దని గట్టిగ అనలేకపోతోంది.

ఇంటి పెరట్లో మల్లె, సన్నజాజి, విరజాజి వేసింది. అవి పెరిగి పూలు విరగ పూసినపుడు తప్పక కొనడం మానేస్తానని ప్రామిస్‌ చేసాడు. “సంతోషం ” అని వెక్కిరించింది పద్మ.

భాస్కర్‌ ప్రేమలో కృత్తిమత్వం లేదు. అతని ప్రేమ రోజూ తెచ్చే పువ్వుల్లా స్వచ్ఛ మైనది. ఆ విషయం ఆమెకి తెల్సు. ఇంటి సమస్యలనుండి, ఇంటి చాకిరీ నుండి అతని ప్రేమే ఆమెను సేద తీరుస్తోంది. అలసటనీ, దిగులుని రేపు ఎలా గడుస్తుందనే భయాన్ని అతని బాహువుల మద్య అల్లుకు పోయి సమస్తం మర్చి పోతోంది. సరదాలు, సినిమాలు, షికార్లు లేవనే దిగులు అతను అందిస్తున్న సుఖంలో మర్చిపోగల్గుతోంది. ఆ సుఖమే లేకుంటే ఈ పాటికి తను పిచ్చెక్కి పోయి ఉండేది. లేదా చచ్చిపోవాలనుకునేది.

సాయంత్రాలు భాస్కర్‌ డైరెక్టుగా డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. స్నేహితులూ, సరదాలూ మరో వ్యాపకం పెట్టుకోడు. పద్మ అలా ఆదేశిస్తుంది. అందులో ఆమె ప్రేమనే చూస్తాడు. ఒక్కోసారి అతనికి చిరాకు, కోపం వస్తుంది. ఏమిటీ ఆవిడ జులుం ? మగవాడు బయటకు వెళ్ళేక ఎన్నో పనులుంటాయి. అర్ధం చేసుకోకుండా ఆర్డర్లు జారీ చేయడం ఏమిటీ అనుకొనే సందర్భాలు లేకపోలేదు.

పద్మ పుట్టింటికి పిల్లల సెలవులకి వెళ్తుంది. ఇంటి నుంచి ఆమె పిల్లలతో వెళ్ళిపోగానే ఎంతో స్వేచ్ఛ వచ్చినట్టు ఎగిరి గంతేసేవాడు. అయితే కావాలని స్నేహితులతో చేసే కాలక్షేపం మజా లేకుండా చప్పగా ఉందేది. కాళ్ళీడ్చుకొని ఇంటికి వస్తే భార్యా, పిల్లలూ లేని ఇల్లు భూతాల గృహంలా భయపెట్టేది. రెండు రోజులకే అతను బోరెక్కిపోయి, పిచ్చెక్కిపోయి రైలెక్కేసి పద్మను తీసుకొచ్చేసేవాడు. పిల్లలూ వచ్చేస్తే సంతోషం. రాకుంటే ఇంకా సంతోషం. ఆమెతో కావల్సినంత ఏకాంతం. అడ్డూ ఆపూ లేని ఆనందం.

ఒక రకంగా పద్మ స్వార్ధపరురాలు. ఉదయం తనని విడిచి వెళ్ళి సాయంత్రం వరకూ రాని భర్త, సాయంత్రం వచ్చేక పిల్లలతో ఆడుతూనో, చదువు చెబుతూనో సమయం అంతా వాళ్ళతోనే గడిపేస్తే ఆమె చిత్రంగ అలుగుతుంది. పిల్లలతో గొడవపడి అతన్ని ఏకాంతానికి లాక్కెళ్ళిపోతుంది. అతని భుజంపైనో, గుండెలపైనో వాలి అతను చెప్పే ఖబుర్లు, కాకమ్మ కధలు వింటుంది. అది ఆమెకు ఆనందం. లేదా సోఫాలో అతని తొడని దిండుగా చేసుకొని, అతని చేయిని తన చేతుల్లోకి తీసుకొని ఎదురుగా టీవీ చూస్తూ గడుపుతుంది. నగరంలో ఆడే చిత్రాలను డబ్బుపోసి ఎలానూ చూడ లేదు. టీవీలో కావాల్సినన్ని సినిమాలు. నగరంలో ఆడే చిత్రాలు ఎంత మంచివి అయినా ఏదొక రోజు అవి టీ వీ సముద్రంలో కలవక మానుతాయా !

భాస్కర్‌ ఉద్యోగ రీత్యా ఏ ఊరు అయినా కాంప్‌ వెళితే భరించలేదు. అతన్ని వదిలి ఉండలేదు. ఆమెలో విపరీతమైన భయం చోటు చేసుకొంటుంది. అతను లేకుండా ఇంట్లో ఉండలేదు. అతను లేని ప్రపంచం ఆమెకు శూన్యం. అంతకన్నా ముఖ్యంగా ఆమెకి అలజడి కలిగించేది ఆ జిడ్డు మనిషి మాయాప్రపంచంలోకి ఎలా వెళ్తాడో, ఏం తింటాడో, ఎలా తిరిగి వస్తాడో అని దిగులు.

ఆమె అభిప్రాయం ఏమిటంటే భాస్కర్‌ కి ఏమి కావాలో భాస్కర్‌ కే తెలియదు. తెలిసినా చేసుకోలేని అమాయకుడు. అతని గురించి ఆమెకు మాత్రమే తెల్సని ఆమె నమ్మకం. అంచేత అతన్ని ఒక్కోసారి చంటి పిల్లాడిలా సాకుతుంది. ఆమె గైడెన్సు లేకుంటే ఖచ్చితంగా తప్పడిపోయే, పాడైపోయే పిల్లవాడుగా భాస్కర్‌ ని భావిస్తుంది.

“ఈ నెల జీతం ఎంత అందింది” అని అడిగితే అతను వెంటనే సమాధానం చెప్పలేడు. సమాధానంగా జేబులో డబ్బు, పే స్లిప్పూ ఆమె చేతిలో పెట్టేస్తాడు.

అవును. అతనికొచ్చే జీతంలో బేసిక్‌ పే ఎంతో అతనికి గుర్తు ఉండదు. డి. ఎ. పాయింట్లు ఎంత పెరిగిందో తెలీదు. ఏ లోను ఎంత కటింగు అయి, నెట్‌ ఎంత వస్తున్నదీ చెప్పలేడు.

విశేషం ఏమిటంటే అతని సేలరీ స్లిప్పుని ఆమే స్టడీ చేస్తుంది. జీతం గ్రాసూ, నెట్టూ పరీక్షగ చూస్తుంది. నెలనెలా ఎంత రావాలనేది ఆమెకి లెక్కే. లోన్‌ కటింగ్‌ లో ఏదైన తిరకాసు వస్తే, అదేమిటో అతనికి వివరంగ చెప్పి ఆ సంగతి ఏమిటో చూడమంటుంది. ఆ తప్పుని కంపెనీ ఒప్పుకొని సరిదిద్దేవరకూ భాస్కర్‌ ని నిద్ర పోనీయదు.

భాస్కర్‌ ని సడెన్‌ గా రెండో ఎక్కం చెప్పమంటే తడబడతాడు. అతను ఏదైనా లెక్కచేసినా, చేసింది కరెక్టే అనే కాన్ఫిడెన్సు తక్కువ. నిదానంగా చేయనీయకుండా, గాభరా పెడితే అంకెలు అతనికి గొంగళి పురుగుల్లా కనిపిస్తాయి. అదృష్టవశాత్తు అతను చేస్తున్న ఉద్యోగం అంకెలతో అంత సంబంధం లేనిది.

పద్మ ఒకసారి కిరాణా దుకాణంలో సరుకులు కొంటున్నప్పుడు కేజీ పప్పు పదహారున్నర అయితే మూడు కేజీలు ఎంత అని అడిగింది.తను బియ్యం కొనడానికి తెచ్చిన డబ్బుల్లో ఏమైన మిగిలితే పప్పులు కూడా కొందామని ఆమె తాపత్రయం. ఆమె ఒక్కసారిగా లెక్క అడిగే సరికి అతని మెదడు బ్లాంక్‌ ! అతని ముఖం చూడగానే ఆమెకు వెంటనే అర్ధమయి పోతుంది. అతను చెప్పే లెక్కకోసం చూడకుండా తనే మూడు పదిహేనులు, మూడు రూపాయలు, మూడు అర్ధలు అని లెక్క వేసుకొని (అతను లెక్కకట్టే లోగ) పప్పులు పాక్‌ చేయించేసింది.

ఆమె సాధ్యమైనంత వరకూ లెక్కలు, సలహాలు అడగదు. అడిగితే ఉల్లిపాయల సలహాలాగే ఉంటుంది !

పద్మకి తలనొప్పి ఏమిటంటే చెప్పిన పని కూడా ఏదీ సరిగా చేసుకురాలేడు. చివరికి కరెంటు బిల్లు కూడా ఆమే వెళ్ళి కడుతుంది.

ఇంట్లో కావల్సినవన్నీ ఆమె చూసుకోవాలి. ఆమే ప్లాన్‌ చేసుకోవాలి.

ఆమె అతని చేత పి. యఫ్‌. లోను పెట్టించి సీజన్‌ లో కొన్నిరకాల పప్పులూ, చింతపండు లాంటి స్టాక్‌ అయిటంస్‌ ఏడాదికి సరిపడా కొనేస్తుంది. పెరుగుతున్న ధరలతో ఏ నెలకానెల కొనుక్కోవాలంటే ఆ జీతం లో సాధ్యమయ్యేపని కాదు. బోనస్‌ ని పిల్లల యూనీఫాం, పుస్తకాలకీ వినియోగిస్తుంది. ఫెస్టివల్‌ అడ్వాన్సుతో తన చీరతో సహా అందరకీ బట్టలు కొంటుంది. ప్రతి నెలా జీతం లో ఎంతోకొంత మిగిల్చి ఇన్స్టాల్‌మెంట్లలో ఇంటి వస్తువులు కొంటుంది. ఈ పదేళ్ళలో డైనింగ్‌ టేబుల్‌, సోఫా, ఫ్రిజ్‌, టీ. వీ, ఆ విధంగా కొన్నవే !

భాస్కర్‌ కి ఇదంతా అద్భుతమే !

చిన్న జీతంతో ఇంటిని చక్కదిద్దుతున్న ఆమె పనితనానికి, కష్టానికి, ప్లానింగ్‌ కి అభినందనలతోనే సరిపెట్టకుండా, ఆమె కోరుకొనే చిన్న చిన్న సరదాలు తీరేలా ఏదైన కొని బహూకరించాలని అతని మనస్సు ఉవ్విళ్ళూరుతుంది. కాని డబ్బుల పెత్తనం ఆమెది కాబట్టి అతని రిక్వెస్టుని నిర్దాక్షిణ్యంగా తోసి పారేస్తుంది. అది అతనికి బాధిస్తుంది. కోపాన్ని రప్పిస్తుంది. భర్తగా తనకి ఆ మాత్రం అధికారం లేదా ?

భాస్కర్‌ కొన్ని సార్లు మొండి. అతనిలో ఆవేశం వస్తే ఏమైనా చేస్తాడు. అప్పుడా ఇంట్లో పెద్ద గొడవే ! …. ఒకసారి ఏమయిందంటే

ఆమె పుట్టిన రోజుకి కొత్తచీర కొని తీరాలని భీష్మించుకు కూర్చున్నాడు. ఆ నెల బడ్జెట్‌ లో కొంత చీరకి కేటాయించమన్నాడు. కేటాయించకపోతే ఒప్పుకోన్నాడు.

“కుదరదు” అంది పద్మ. “కుదరాలి” అన్నాడు. “కుదిరే పని కాదని చెబుతున్నాకదా !” ఆమె గొంతు పెంచింది. “అయినా నిన్ను అడిగే దేమిటి ? నేనే కొంటాను ?” “ఎలా కొంటావ్‌ ?” నిలదీసింది. “ఎందుకు కొనలేను. ఆ మాత్రం అప్పు పుట్టదా !”

“అప్పా !” ఆమెకు అప్పు అంటే హడలు. వడ్డీలు కట్టి డబ్బులు తేవడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె సహించదు. ఒప్పు కోదు. ఆ విషయం చాలా సార్లు అతనికి స్పష్టం చేసింది.

“మీరామాట ఎత్తటానికి మీకెంత ధైర్యం ! అప్పు అనే మాట మరో సారి ఎత్తితే వీపు చీరేస్తాను.”

“నీ చీర కోసం నా వీపు చీరించు కొంటాను.”

ఆమె మెత్తబడి పోయింది. “ఏమిటండీ మీరు .. నన్ను అర్ధం చేసుకోరు గదా ”

” నేనెప్పుడూ నిన్ను అర్ధం చేసుకోవాల్సిందే తప్ప నన్ను కూడా అర్ధం చేసుకోవాలనే సంగతి నీకు స్ఫురించదు.”

“అమ్మో ! అయ్యగారికి కోపం వచ్చింది. మీ కోపం రాత్రికి తీర్చేస్తాను మిమ్మల్ని చీరలా చుట్టేసుకొని ” అంది పద్మ అతని చేతులను తన నడుం చుట్టూ వేసుకోంటూ.

ఆ రోజు పద్మ అతని చేతిలో మూడు వందల రూపాయలు పెట్టింది. చీరకోసం కాదు. బియ్యం కోసం..

నెల వాడుక కొట్టులో ఎప్పుడూ వాడే బియ్యం ఇరవై కేజీలు తెమ్మంది. తనేం మోసుకు రానక్కరలేదు. సాయంత్రం తను డ్యూటీ నుంచి తిరిగి వస్తున్నప్పుడు బియ్యం షావుకారుకి డబ్బులు ఇవ్వడమే అతని పని. ఒక గంటలో బియ్యం డోర్‌ డెలివరీ చెయ్య బడతాయి.

ఆ సాయంత్రం భాస్కర్లో ఒక మొండి ధైర్యం ప్రవేశించింది.

బియ్యం కొట్టుకి బదులు బట్టల కొట్టుకి వెళ్ళి మూడు వందలతో తనకు నచ్చిన చీర కొనేసాడు.

చీరను చూసి నిశ్చేష్టురాలయింది పద్మ.

ఆమె వేసే కేకలకీ, చీవాట్లకీ సిద్ధపడే ఆ పని చేసాడు భాస్కర్‌. ఆమె కేకలు వేయలేదు. చీవాట్లు పెట్టలేదు. గంభీరంగా మారిపోయింది. ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం.

ఆమె ముఖం అప్పుడు చూస్తే అది రాబోయేతుఫాను తాలుకు ప్రశాంతత అని ఆ ఇంట్లో చిన్న పిల్లడు సమీర్‌ కి కూడా అర్ధమయిపోతుంది.

పద్మ తీరుబడిగా కూర్చొని వార పత్రిక తిరగేస్తోంది. పిల్లలు ఇద్దరికీ మినప దోసెలు వేసి తినిపించి పడుకోమంది. అతను లేచాడు. చేతులు కడుక్కొని వచ్చి డైనింగ్‌ టేబుల్‌ వద్ద భోజనానిక్‌ ఇ కూర్చొన్నాడు. ఆమె విసురుగా వచ్చి కంచం అతని ముందు పెట్టి కమ్మగా తినమంది. ఆమె పుట్టిన రోజు స్పెషల్‌ ! కంచం నిండుగా చీర. అతను ప్రేమగా కొని తెచ్చిన చీర.

“అలా మిడిగుడ్లు వేసుకు చూస్తారేం ! తినండి. నా పుట్టిన రోజు స్పెషల్‌. తినండి. మస్తుగా తినండి. నెమరు వేసుకు తినండి.”

చీరని తినమనడమే కాదు. ఇంకా చాలా మాటలు అంది. భాస్కర్‌ చీరను తినలేదు. ఎదురు తిట్లు తిట్టలేదు. తను చేసిన తప్పుకి “సారీ” చెప్పేడు. ఆమె మళ్ళీ రయిజయ్యింది. “మీరు తెచ్చిన చీర, మీరు చెప్పిన సారీ ఈ నెల రోజులు మనకి అన్నం పెడతాయా ? చెప్పండి ? ఎంతకని నేను చచ్చేది. మీ ఇష్ట ప్రకారం మీరు చేసేయడమే తప్పా ఇంటి పరిస్థితిని అర్ధం చేసుకోరు” అని ఆమె ఏడ్చింది.

పద్మ అక్కడితో ఊర్కోలేదు.

“మీకో నమస్కారం బాబూ ! నేను ఇక సంసారం చేయలేను దేవుడోయ్‌ ! నాకు పిచ్చెక్కి పోతోంది దేవుడోయ్‌ ! ఇక నావల్ల కాదు నాయినా, మహానుభావా. నేను చేయలేను. నాకు చేత కాదు.” అని బీరువా తీసి జీతం డబ్బులు మొత్తం అతని చేతిలో పెట్టేసింది. జీతం అతను క్రితం రోజే ఇచ్చాడు.

“నీ డబ్బులు. నీ ఇష్టం. నీ పెళ్ళానికి చీరలే కొంటావో, నగలే చేయిస్తావో నీ ఇష్టం.” అంది. రేపటినించి సంసారాన్ని అతణ్ణే ఎత్తమంది.

“నా కెందుకొచ్చిన బాధ ! ఏ రోజుకారోజు ఇంట్లోకి ఏ సామాన్లు కావాలో చెప్పి ఏడుస్తాను. కావాల్సినవి తెచ్చి తగలెట్టండి. వంట, పెంట నీ కెలాగూ రాదు కాబట్టి నీకూ, నీ పిల్లలకు ఇంతింత వండి పడేస్తాను.”

ఇంటి భాధ్యత మొత్తం అతని నెత్తిన పడేసి చేతులు దులుపుకుంది.

అతని కాళ్ళ కింద నేల కంపించి, అమాంతం పాతాళంలోకి దిగి పోయేడు.

తను చేసిన పనికి చీవాట్లు ఊహించాడు తప్ప, ఇలా రియాక్ట్‌ అవుతుందనుకోలేదు. ఆమె చర్య తట్టుకోలేక చలి జ్వరం వచ్చినట్టు వజ వజ వణికి పోయాడు.

అతని చేతులో జీతం కవరు పర్వతమంత బరువయింది. ఇంటి ఖర్చులు సమస్యలూ తలచుకొంటే వాయుగుండాలు, ఉప్పెనలు గుర్తుకొచ్చి గడగడ లాడించేయి.

ఆమె రెచ్చగొట్టినా, పౌరుషానికయినా ఒకనెల ఇంటి బాధ్యత స్వీకరించడానికి సిధ్ధంగా లేడు.

మరేమీ ఆలస్యం చేయకుండా, మరో ఆలోచన చేయకుండా ఆ రాత్రి ఆమె కాళ్ళను పట్టేసుకొన్నాడు. తను చేసిన పనికి ఆ శిక్ష తప్పించి మరే శిక్షయినా విధించమన్నాడు. క్షమించేవరకూ ఆమె కాళ్ళు వదలనన్నాడు.

“అయ్యో ! కాళ్ళు పట్టుకుంటారేమిటండీ ?” అనలేదు పద్మ.

“మీరు కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన మీరు చేసిన వెధవ పనులు చక్కబడతాయా. పోయిన మూడు వందలూ వెనక్కి వస్తాయా. చెప్పండి. బాబూ ! నేనే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇక మీదట ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయకండి. ఇలాటి పని మరోసారి చేశారంటే ఈ సారి మీకూ మీ ఇంటికీ నమస్కారం పెట్టేసి పుట్టింటి కెళిపోతాను ” అంది పద్మ.

హమ్మయ్య ! తుపాను తీరం దాటింది.

ఆమె చెప్పిన ప్రతి మాటకి బుధ్ధిగా గంగిరెద్దులా తలాడించేడు భాస్కర్‌. వెంటనే యమా స్పీడులో తన జీవితాన్ని ఆమె చెంగుకి ముడి వేసి ఇంటి బాధ్యతలని యధావిధిగా ఆమె నెత్తిపైకి నెట్టేసి తేలికైన మనసుతో నిద్రలోకి వెళ్ళిపోయేడు.

ఆమె లేపితే తుళ్ళిపడి లేచేడు. ఇది కలా! నిజమా ! ఎదురుగా కొత్త చీరలో ధగధగా మెరిసి పోతోంది పద్మ. తనకోసం వచ్చిన దేవతలా ఉంది. ఆమె అతని పైకి వంగి అధరాలను చుంబించింది. ఏదో మధురాను భూతి. కల కాదు. నిజమే. అతని నిద్ర మత్తు, మనసు బరువు వదిలిపోయింది. ఆకలితోనే నిద్రపోయిన సంగతి అతనికి గుర్తు లేదు. దేవత చేతిలో పళ్ళెం ఉంది. అందులో వేడి వేడి మినప దోశెలున్నాయి. ఆమె అతన్ని పసివానిలా దగ్గరకి తీసుకొంది. దోశెలు అతనికి తినిపించింది. ఆమెకి అతను తినిపించాడు. “మీరు నా పుట్టిన రోజు బహుమతిగా తెచ్చిన ఈ చీర ఎంతో బాగుందండీ. నా కెంతగా నచ్చిపోయిందో” అతణ్ణి ముద్దులాడింది. పద్మని అర్ధం చేసుకోవడం కష్టమే అనుకొన్నాడు. ఆమె అతని కౌగిలిలో ఉంది. కాదు ఆమె కౌగిలిలో అతను ఉన్నాడు. ఆమె ముచ్చటగా కట్టుకొన్న కొత్త చీర విప్పేవరకూ అతను ఒప్పుకోలేదు. చీర నలిగి పోతుందని కాదు. ఆ సమయంలో ఆమె శరీరంపై గాని, తన శరీరంపై గాని చిన్న నూలు పోగు కూడా ఉండటానికి వీల్లేదు.

ఖచ్చితంగా ఆ నియమం పాటించవలసిందే. “కొత్త చీర కట్టుకున్న పుట్టిన రోజు కూడానా !” “ఏ రోజైనా సరే” “ఏమిటీ అల్లరి ! వద్దు అంటే చీర కొన్నారు. కట్టుకొంటే విప్పేయమంటున్నారు. ఆంతా మీ ఇష్టమేనా ?” “అవును. అంతా నా ఇష్టం.” మంచంపై అతని ఇష్టప్రకారమే ఆమె నడవాలి. ఆ సమయంలో అతనికి ఎక్కడలేని హుషారు. అక్కడ అతనిదే పై చేయి. అక్కడ అతనిదే పెత్తనం. అతని ఇష్టాన్ని ఆమె తీర్చింది. కావాల్సినంత సుఖాన్ని ఇచ్చింది. “సుఖం కోసం స్త్రీని ప్రేమించే పురుషుడు పురుషుని ప్రేమ కోసం సుఖాన్ని అర్పించే స్త్రీ” పద్మ అన్న మాటలు అతనికి గుర్తుకు వచ్చాయి. సుఖం కోసం ఆమెను కలియని రోజు లేదు. కలిసేక ఆ కొటేషన్‌ గుర్తుకి రాని రోజు లేదు. అతని అనుభవం అది అక్షరాల నిజమేనని చెబుతోంది. మనుసు మాత్రం అంగీకరించకుంటోంది. ఏమైతేనేం ఆ రాత్రి సుఖాంతం అయినప్పటికీ ఆమెను కాదని చీరకొనడం లాంటి పొరపాట్లు ఇక జన్మలో చేయలేనంతగా అతణ్ణి కుదిపేసింది.

ఆ తర్వాత ఉల్లిగడ్డల వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి స్కేప్‌గోట్‌ అయ్యేడు. ఒక ఉల్లిపాయ చిత్రంగా ప్రియాతిప్రియమైన పద్మని తనకు కానీయకుండా చేస్తోంది. ఆమెను తననుంచి నిర్దాక్షిణ్యంగా వేరుచేసి పుట్టింటికి తరిమేస్తోంది. ఆ రోజు హోల్‌సేల్‌ కొట్లో ఆమెను ఉల్లిపాయలు కొనవద్దు రెండు రోజులు ఆగమన్నాడు. రెండు రోజుల తర్వాత పాతిక రూపాయలకు పాకింది. తర్వాత కొండెక్కి నన్ను ముట్టుకుంటే ముప్ఫయిరెండు రూపాయలంది. పద్మ ఆ తర్వాత ఇంట్లో ఎమర్జెన్సీ విధించింది. సెల్ఫ్‌ రేషనింగ్‌ అమలుజరిపింది. అతన్ని ప్రత్యేకంగా నిందించలేదు. నిందిస్తే ఆమె కాళ్ళపై మళ్ళీ పడిపోవటానికి అతను సిద్ధం. అక్కడితో ఉల్లిసరసం ముగిసేది.

అంతలో ఢిల్లీలో ప్రకంపనలు! ఉల్లిపాయ అధికారపీఠం పునాదులను కుదిపేస్తుంటే ఇక్కడ తెలుగు ప్రభుత్వం గభాల్న నిద్ర లేచింది. తెలుగు బిడ్డకి కోపం రాదు. వచ్చిన కోపం పోదు. కోపం ప్రభంజనమై, తుపాను అలజడిగా పరిణమిల్లి విప్లవాలకే దారితీస్తుందని నేతలకు తెల్సు.

అధికారులు వెంటనే స్పందించి ధరల అదుపు కార్యక్రమాలు సిన్సియర్‌గా మొదలుపెట్టారు. అందులో భాగంగా ఉల్లిపాయలను తక్కువ రేటుకి అనగా 12 రూపాయలకే కేజి త్వరలో విక్రయించ బోతున్నట్టు ప్రకటించింది. ఎక్కడ? సూపర్‌ బజార్‌లో వెంటనే పద్మ భాస్కర్‌ని ఆదేశించింది. అతను ఏరోజు కారోజు వెళ్ళి సూపర్‌ బజార్‌లో ఎప్పుడు ఉల్లిపాయలు వస్తాయో తెల్సుకోవాలి. తెల్సుకొని ఉల్లిపాయల లోడు లారీలనుంచి దిగీ దిగగానే వాటిని కొనే మొదటి వ్యక్తి భాస్కరే అవ్వాలి.

కొడుకు సమీర్‌కి యూనిఫారం వేసి, వీపు వెనుక స్కూల్‌ బ్యాగ్‌ తగిలించి, చేతికి క్యారేజు ఇచ్చి జాగ్రత్తగా పంపినట్టు భర్త చేతికి రేషన్‌ కార్డు, చేతిసంచీ, వందరూపాయల నోటు ఇచ్చి రోడ్డు మీదికి తోసేసింది. “దయచేసి ఈ పనైనా సవ్యంగా చేసుకురండి. ఈ పని నేనే చేసుకుందును. సూపర్‌ బజార్‌ దగ్గర్లో ఉంటే” అంది. అవును సూపర్‌ బజార్‌ దగ్గర్లో లేదు. భాస్కర్‌ ఆఫీసుకి వెళ్ళే తోవలో ఉంది. అతను ఆఫీసుకి సిటీబస్‌పై వెళ్తాడు. రోజూ బస్‌ ఎక్కుతాడు గనుక ప్రతినెలా బస్‌ పాస్‌ తీసుకుంటాడు. అంచేత అతను ఏ బస్‌ అయినా, ఏ రూట్‌ అయినా, ఎన్ని సార్లయినా పట్టణపరిమితుల్లో నిరభ్యంతరంగా తిరగవచ్చు. ఆఫీసు పని తర్వాత సాయంత్రాలు ఇంటి దగ్గర అతను చేసే రాచకార్యాలు ఏమీ లేవు గనక, బస్‌ పాస్‌ వుంది గనక ఉల్లిపాయలు సూపర్‌ బజార్‌కి వచ్చేవరకూ, వచ్చేక కొనేవరకూ అదే పనిపై ఉండమని హుకుం జారీ చేసింది పద్మ. భాస్కర్‌ తు. చ. తప్పకుండా రోజూ సూపర్‌ బజార్‌ చుట్టూ తిరుగుతున్నాడు. రోజుకు రెండుసార్లు ప్రదక్షిణం చేస్తున్నాడు. ఆఫీసుకి వెళ్ళేటప్పుడు, ఆఫీసునుంచి వచ్చేటప్పుడు.

అతను అక్కడికి ఏ రోజు వెళ్ళినా ఉల్లిపాయలుగాని, దానికి సంబంధించిన సమాచారం గాని లభించేది కాదు. ఎవరిని అడగాలో అర్ధమయ్యేది కాదు. ఎవరినైనా అడిగితే పెదాలు విరిచేవారు.

భాస్కర్‌ కి గొప్ప చికాకుగా, న్యూసెన్సుగా ఉంది.

ఏమిటీ బతుకు ఇలా అయిపోయింది.

ఆమె తిరగమండం ఏమిటి ? తను గానుగెద్దులా తిరగడ మేమిటీ.. ? ఛఛ.

ఆమె పోరుపడలేక ఇలా రోజూ తిరుగుతున్నాడు తప్ప మనస్ఫూర్తిగా కాదు.

నాలుగు రోజులు వరుసగా సూపర్‌ బజార్‌ కి వెళ్ళేడు.

అయిదోరోజు ఉదయం వెళ్ళేడు. ఆ రోజు సాయంత్రం పని ఒత్తిడి ఎక్కువయి ఇంటికి ఒక గంట ఆలస్యంగా వెళ్ళేడు. కాస్త నీరసంగా ఉంది.

భాస్కర్‌ ఇంటి గుమ్మం ఎక్కుతుండగానే అతని చేతిలో ఉల్లిపాయల సంచి కోసం వెదికింది. కనిపించలేదు.

“ఉల్లిపాయలు తెచ్చారా ?”

ముందుగా భర్తని ఇంట్లోకి రానిచ్చి, గ్లాసుడు మంచినీళ్ళిచ్చి, లఘుశంక వగైరా ఏమైనా ఉంటే తీర్చుకోనిచ్చి, కాళ్ళూచేతులూ కడుక్కోనిచ్చి, సోఫాలో రిలాక్స్‌ అయ్యేక చేతికి టీ కప్పు ఇచ్చి అడిగితే ఎంత బాగుంటుంది !

“ఉల్లిపాయల గురించి మాట్లాడరేం ?” ఆమె రెట్టించింది. అతనికి ఇమిడియట్‌ గా బాత్రూం కి వెళ్ళవలసిన అవసరం ఉంది పద్మతో గొప్ప చికాకు. చిరాకు కనపడనీయకుండా “ఉల్లిపాయలు ఇంకా రాలేదు పద్మా. ఎప్పుడొస్తాయో సూపర్‌ బజార్‌ అధికారులకే తెలియదట” అన్నాడు. “ఆహా! అలాగటా!” నీ వెటకారాలు తర్వాత. ముందు నన్ను బాత్రూంకి వెళ్ళనీయ్‌ తల్లీ. ఒంటేలుకి కూడా వెళ్ళనీయకుండా ఉల్లిపాయల గోల. నీతో గొప్ప చిక్కు వచ్చింది. “మీరు నిజంగా సూపర్‌ బజ్జర్‌కి వెళ్ళేరా?” సూటిగా అడిగింది. “వెళ్ళేను” అతనికి తెలీకుండానే చిన్న అబద్ధం. అయినా సాయంత్రం వెళ్ళకపోయినా ఉదయం వెళ్ళేడుగా. అతనిలో స్థితిస్థాపక శక్తి అద్భుతంగా పనిచేస్తుండటం వల్ల యూరిన్‌ కంట్రోల్‌ చేసుకోగల్గుతున్నాడు. “మీరు వెళ్లలేదు. వెళ్ళాననడం పచ్చి అబద్ధం. ఉల్లిపాయలు ఇస్తున్నారక్కడ” బిక్కచచ్చిపోయేడు భాస్కర్‌. ఆడే అబద్ధాలు అతి చిన్నవి అయినా అప్పుడప్పుడు కొంపలు కూల్చును. అది నిన్ను కోలుకోని విధముగానూ, అతి పెద్దగానూ దెబ్బతీయును. అతనికి ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టేయి. బాత్రూం అర్జెన్సీ ఆవిరైపోయింది. “ఎవరు చెప్పారు నీకు ఉల్లిపాయలు ఇస్తున్నారని?” “మీరు చెప్పకపోతే నాకు తెలీదనుకున్నారా ? పక్కింటి వాళ్ళు తెచ్చుకున్నారు. ఇపుడేమంటారు ? ఎందుకండీ నన్నిలా మాయ చేస్తారు ? ఈ ఒక్క పనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయమన్నాను. మీరు చేయలేక కాదు. అది చెప్పితే ఎందుకు చేయాలి అనే నిర్లక్ష్యం ! నేను చేసిన పొరపాటు ఏమిటంటే ఈ పనికి నేనే తగలడకుండా బుద్ధి తక్కువై మీకు అప్పజెప్పడం.”

పక్కింటి వాళ్ళు ఉల్లిపాయలు తెచ్చుకోగలిగి, భర్త నిర్వాకం వల్ల తాము తెచ్చుకోలేకపోవడం ఆమెను మరింతగా బాధించింది.

పద్మ ఉన్నపాటున సూపర్‌ బజార్‌ కి కట్టుబట్టలతో పరిగెట్టింది. ఆమె భాస్కర్‌ ని వెళ్ళమనలేదు. అతనిపై విశ్వాసం, నమ్మకం పోయింది. అతని ముఖమే చూడాలని అనిపించటం లేదు. ఆమె ఒక్కర్తే వెళ్ళిపోతుంటే భాస్కర్‌ కి ఏమిచేయాలో తోచలేదు. ఆమె పిలవలేదు కాబట్టి తను వెళ్ళక్కరలేదు. వంటరిగా వెళ్తుంది కాబట్టి తోడుగా వెళ్ళడం ధర్మం. బాత్రూం కి వెళ్ళడం అంతకన్నా అవసరం. అవసరాన్ని త్యాగం చేసి ధర్మ నిర్వహణకి పరిగెట్టేడు. అతనిని పద్మ గమనించి గమనించనట్టే ఊరుకొంది. సిటీ బస్‌ ఎక్కి సూపర్‌ బజార్‌ వద్ద దిగేరు. తోవలో ఆమె ఏమీ మట్లాడ లేదు. అతను కూడా. ధైర్యమేది ? సమయం ఏడు గంటలు. పద్మ అదృష్టం ! సూపర్‌ బజార్‌ లో ఉల్లిపాయలు ఇంకనూ ఇవ్వబడుతున్నాయి. అయితే ఉన్నపాటున ఆమెకి వెంటనే ఉల్లిపాయలు ఇచ్చేయడానికి వీలు లేకుండా ఆమె కన్నా ముందు వచ్చి వాళ్ళ వంతుకోసం వెయిట్‌ చేస్తున్నారు చాలా మంది. ఒక పెద్ద లైను వంకర్లు తిరిగి ఆమెను వెక్కిరించింది.

ఆమె అంత లైను చూసి బెంగపడిపోలేదు. ధైర్యంగా లైన్లో నించుంది. ఎలాగైనా ఉల్లిపాయలు తీసుకొనే ఆమె ఇంటికి బయల్దేరుతుంది.

లైన్‌ లో నించొని ఆమె షిరిడి శాయిని ప్రార్ధించింది. కనక మహలక్ష్మిని తలచుకొంది. ఆమెకు ఉల్లిపాయలు దొరుకుతాయనే నమ్మకం బలంగా ఏర్పడి పోయింది.

మగవాళ్ళ లైను, ఆడవాళ్ళ లైను రెండు పట్టాల్లా ఉన్నాయి. రెండు లైన్లూ పొడవుగానే ఉన్నాయి. పద్మ వెనుక అప్పుడే పది మంది చేరేరు.

భాస్కర్‌ ఆమె దగ్గరకి వెళ్ళి “పద్మా ! నేను లైను కడతాను. నీవు అక్కడ కూర్చో ” అన్నాడు భాస్కర్‌.

పద్మ వినిపించుకోలేదు. అతను ఇంకెవరినో అడుగుతున్నట్టు ఆమె ఉండిపోయింది. పద్మకి ముందు, వెనక ఉన్న స్త్రీలు అతని వైపు చూసేరు. అతను సిగ్గు పడి తర్వాత చిరాకు పడి విసురుగా, దూరంగా మగవాళ్ళ వైపు వచ్చేశాడు.

ఉల్లిపాయల కోసం లైన్లోనించున్న వాళ్ళ మధ్య ఉల్లిపాయల మీదే కబుర్లు దొర్లుతున్నాయి.

“రూపాయికి ఆపిల్‌ వస్తోంది గాని ఉల్లిపాయ రావడం లేదు.”

“జగదాంబ సెంటర్‌ లో ఒక బట్టల షాపువాడు రెండు వందల రూపాయల బట్టలు కొంటే కేజీ ఉల్లిపాయలు గిఫ్టుగా ఇస్తున్నాడు. జనాలు విరగబడి కొంటున్నారట. అయితే ఉల్లిపాయలు సప్లయి చెయ్యలేక, స్టాకు లేక ఆ స్కీము ఎత్తేశాడట. ”

“ఉల్లిపాయలు ఎగుమతి ఆపేసి, దిగుమతి చేసుకొంటున్నారని మనం పేపర్లో వినడమేగాని నిజంగా అమలు పరిస్తే ఉల్లి ధర తగ్గదా !”

“అదంతా బోగస్‌. ఉల్లిపాయల ఎగుమతి వల్ల రైతుకి గిట్టుబాటు ధర పెరిగింది లేదు. ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందం వల్ల పప్పులూ, నిత్యావసర సరకులూ దిగుమతి అవుతున్నాయి. అంచేత గిట్టుబాటు ధర రైతుకి పెరగక చిక్కిపోయి బక్కగా మిగులుతున్నాడు. పోనీ దిగుమతులవల్ల ధరలు తగ్గి వినియోగదారుని శాంతింపచేసింది అంతకన్నా లేదు.”

“ధరలు తగ్గితే మనకీ పడిగాపులు ఎందుకు సార్‌ ! కేజీ పాతిక రూపాయలకి తక్కువకి ఏ కూరగాయలు వస్తున్నాయి చెప్పండి. ఈ పరిస్థితి ఎప్పుడైనా ఉందా ?”

“ధరల పెరుగుదలకు ఆస్మానీ కారణం తప్ప సుల్తానీ కాదని వాజ్‌పాయిగారు ఉల్లిపాయి మీద కవిత్వం చెబుతున్నారు తీరుబడిగా ఫిడేలు వాయిస్తూ.”

“ప్రభుత్వం మారాలండి.”

“మారవలసింది ప్రభుత్వాలు కాదండీ. ఈ దళారీ దోపిడీ వ్యవస్థ మారాలి. అందుకు విప్లవాలే శరణ్యం.”

అంతలో అక్కడ గొడవ ! గుంపులు గుంపులుగా జనం.

సమయం ఎనిమిది గంటలు కావడంతో సూపర్‌ బజార్‌ మూసివేసే ప్రయత్నం చేస్తుంటే జనం తిరగబడ్డారు. మరుసటి రోజు అమ్మకాలు కొనసాగిస్తామంటే ప్రజలు రెచ్చి పోయారు. ఒప్పుకో లేదు. రాత్రంతా ఉల్లిపాయలు అక్కడే ఉంటాయని ప్రజలకి నమ్మకం లేదు. అంతే కాదు రేపు ఉదయం మళ్ళీ లైనులో నించునే ఓపికల్లేవు. నించున్నా ఛాన్సు తగులుతుందనే గ్యారంటీ లేదు. ప్రజలు మీదు మిక్కిలి ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఉల్లిపాయల కౌంటర్‌ మూసివేస్తే మొత్తం సూపర్‌ బజార్‌ అన్ని స్టాల్‌ లను లూట్హీ చేసేసి, తగలబెట్టి అడ్డుతగిలే అధికారుల కీళ్ళువిరిచి చంపేసేలా ఉన్నారు.

ఆ ఉద్రిక్త వాతావరణంలో సూపర్‌ బజార్‌ డైరెక్టరూ, జాయింట్‌ కలెక్టరూ రంగ ప్రవేశం చేయక తప్పలేదు. వాళ్ళు ప్రజలని శాంతించమన్నారు.

మీరు కోరిన ప్రకారమే టైముతో నిమిత్తం లేకుండా మొత్తం ఉల్లిపాయల స్టాకు

అయిపోయేవరకూ అమ్మకాలు కొనసాగుతాయన్నారు.

ఆ విధంగా ఆర్డరు జారీ చేసి అక్కడ నుంచి జారుకొన్నారు అధికారులు.

ఉల్లిపాయల కౌంటర్‌ మళ్ళీ తెరవబడింది. లైను పెరుగుతోంది. ఉల్లిపాయలు తరుగు తున్నాయి. జనం ఎక్కువ పెరిగి ఉల్లిపాయలు తరిగిపోతుండటం చేత మనిషికి అయిదు కేజీలనుంచి మూడు కేజీలకు, తర్వాత రెండు కేజీలకు కోటా తగ్గిపోయింది. రాత్రి పదవుతోంది. పద్మ వెనుక చాలామంది ఉన్నారు. పద్మ ముందు పది మంది కూడా లేరు. ఆమె తపస్సు ఫలించి ఉల్లిగడ్డలు దొరకబోతున్నాయి. అంతలోనే ఆమె అదృష్టం పై పిడుగు పడ్డట్టు కౌంటర్‌ షట్టర్స్‌ బర్రున కిందకి దిగిపోయాయి. ఉల్లిపాయలు మొత్తం అయిపోయేయి. వందలాది జనం అలాగనే ఉన్నారు. గొడవ చేయడానికి ఉల్లిపాయలు ఉంటే కదా ! అరవడానికి ఒంట్లో శక్తి ఏదీ ? జనంలో నిరాశ, నిస్పృహలు. నీరసాలు, నిట్టూర్పులు. పద్మ కాళ్ళల్లో పీకు. కళ్ళల్లో నీళ్ళు. ఆ సమయంలో పద్మను చూడడానికి భయపడ్డాడు భాస్కర్‌. ఆమె సరదాగా సినిమాకి లైన్లు కాయడం ఎప్పుడో మానుకొంది. రేషన్‌ షాపుల్లో గంటా, అరగంటా లైన్‌ లో నించోడం అలవాటు ఉంది. అయితే రెండు కేజీల ఉల్లిపాయలకోసం చాంతాడు లైను కట్టి పడిగాపులుపడే రోజులు ఉంటాయని ఆమె ఏనాడూ ఊహించలేదు. పడిగాపులు పడినా ఫలితంలేదు.

నీరసంగా వేలాడిపోయి, స్పృహ కోల్పోయేలా ఉంది పద్మ స్థితి. భాస్కర్‌ ఆమెను కిళ్ళీ బడ్డీ వద్దకు తీసుకువెళ్ళి ఐస్‌సోడా కొట్టించేడు. ఆమె గబగబా తాగింది. మరో సోడా కావాలని సౌంజ్ఞ చేసింది. రెండో సోడా కొంత తాగి, మిగతాది ముఖం మీద జల్లుకున్నది. పద్మ కొంత స్వాధీనం లోకి వచ్చింది. ఇంటికి చేరిన తర్వాత అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు పద్మ భాస్కర్‌పై విరుచుకు పడింది. ఉల్లి దొరికి ఉంటే తుస్సుమని పోయే బాంబు భాస్కర్‌పై ధన్‌మని పేలింది. అతను దెబ్బ తిన్నాడు. ఉల్లిపాయలు ఆమెకు అందినట్టు అంది దొరక్కుండా పోయేయి. భాస్కర్‌ తన బాధ్యతను గుర్తెరిగి ఆఫీసు నుంచి డైరక్టుగా సూపర్‌ బజార్‌ వెళ్ళి వుంటే తప్పక దొరికి ఉండేవి కదా!

ఇంటికి వచ్చేక తిండి లేదు. తిప్పలు లేవు.
ఆరాత్రి ఇద్దరి మధ్య పెద్ద రగడ. యుద్ధం.

అతణ్ణి నిందిస్తూ ఆమె అదే పనిగా అరుస్తుంటే అతడు సహనం కోల్పోయేడు. ఒక్కసారిగా ఆమెకన్నా హెచ్చు స్థాయిలో అరవడం మొదలెట్టేడు. పిల్లలు నిద్రలేచి ఏడుపు ముఖాలతో నిలబడ్డారు. అతనిలో నిక్షిప్తమైన శాంతస్వభావం ఆమె అరుపులకి ఆవిరైపోయి మాటకి మాట విసిరి మానసికంగా ఆమెను గాయపరచి తను గాయపడ్డాడు. అంతేకాదు అతని కోపం తారస్థాయికి ఎగసి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఫడేల్మని ఒక లెంపకాయ ఆమెకి తగిలింది. ఆమె నిర్ఘాంతపోయి నోట మాట రాక అలా ఉండిపోయింది. తుపాను సద్దుమణిగింది.

పదేళ్ళలో ఏనాడూ జరగని సంఘటన!

భాస్కర్‌ ఈ పదేళ్ళ సంసారంలో ఏనాడూ ఆమెపై చేయిచేసుకోలేదు. ఆమెపై అంత రోతగా, బ్రూటల్‌గా విరుచుకుపడలేదు. ఆమె మంచంపై పిల్లలు మధ్య నిశ్శబ్దంగా ఏడ్వసాగింది. తల్లితోబాటు పిల్లలు కూడా. తనుకొట్టేడా? అప్రయత్నంగా ఆమె పైకి చేయి దూసుకుపోయింది! అతని ప్రవర్తనకి సిగ్గుపడ్డాడు. ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చా లనిపించలేదు. ఆమెకు క్షమాపణలు చెప్పాలనిపించలేదు. ఆమె కనిపించకుండా, ఆమె ఏడుపు వినిపించకుండా పక్క గదిలోకి వెళిపోయి తలుపులు వేసుకున్నాడు భాస్కర్‌.

తనకు తెలిసీ ఏనాడూ పురుషుడిగా తన అహం ఆమెపై ప్రదర్శించలేదు. పైగా ఆమెను తృప్తి పరచడానికి, ఉత్సాహపరచడానికి ఆమె కన్నా తను ఒక మెట్టు దిగువనే ఉన్నట్టు ప్రవర్తించేడు. ఆమెకు ఇంట్లో పెద్ద పీట వేసి మహారాణిని చేశాడు. ఆమె అధికారాన్నీ, ఆధిపత్యాన్నీ ఆనందంగా శిరసావహించేడు. ఆమె పెత్తందారీ తనాన్ని మనస్ఫూర్తిగా ఆమోదించేడు. పద్మ ఎన్నోసార్లు తనపై అనవసరంగా, అకారణంగా అరిచేటప్పుడూ, విరుచుకుపడేటప్పుడూ, విసుక్కున్నప్పుడూ, నోరు జారేటప్పుడూ తనది తప్పు అన్నట్టుగా ఒప్పుకోవడమో, తప్పుకోవడమో, లేదా నిశ్శబ్దంగా భరించడమో తను చేసిన పొరపాటా? తను లోకువ అయ్యేడా? ఆమె శ్రుతి మించడం వల్లే ఏనాడూ లేనిది కొట్టేడా? తన పాశవిక ప్రవర్తనకి కారణాలు వెదుకుతున్నాడా?

కారణాలు, పరిస్థితులు ఏమైనా కొట్టడం తప్పని అతనికి తెలుస్తోంది. స్త్రీలను తిట్టి, కొట్టి, హింసించే ఏ మగాళ్ళనయితే అసహ్యించుకుంటాడో తను కూడా అచ్చంగా అలాగే ప్రవర్తించేడు. ఎంతగానో ప్రేమిస్తున్న పద్మను కొట్టగలిగేడు. అతని మనసు వికలమయింది. కొట్టడం తప్పే కావొచ్చు. కాని ఆమె తనను భర్తగా గౌరవించకపోవడం, ఒక మనిషిగా నైనా చూడకపోవడం, ఉల్లిపాయ కన్నా హీనంగా చూడటం తను భరించలేక పోతున్నాడు.

ఆమెను క్షమించలేక పోతున్నాడు.
ఆరాత్రి నిద్ర పట్టలేదు అతనికి.
మరుచటి రోజు నుంచి పద్మది కొత్త అవతారం!
వింతగా కొత్తగా ప్రవర్తించడం మొదలుపెట్టింది.

దినచర్యల్లో విపరీతమైన, విలక్షణమైన మార్పులు. వంటగదిలో ధన్‌ ధన్‌ చప్పుళ్ళు. కొత్తరకం వంటలు. రుచి పచిలేని భయంకరమైన వంటలు. అవసరమైన కూరలోనైన ఒక్క ఉల్లిపాయ ముక్క కూడా వెయ్యని వంటలు!

“ఏమిటీ వంట? ఎందుకిలా తగలెట్టావ్‌. కుక్కలు కూడా తినవు” అని ముఖంపై కంచాన్ని గిరాటు వెయ్యటం లేదు. తనూ, పిల్లలూ రసంతో, పెరుగుతో ఏదో తిన్నాం అనిపించుకొని కంచాల నుంచి లేస్తున్నారు. వడ్డించేటప్పుడు డైనింగ్‌ టేబుల్‌పై కంచాల చప్పుడు విపరీతం. పద్మ ఏమి తింటున్నదో అతనికి తెలీదు. అతనికి అక్కర లేదు. ఆమెను పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. ఇద్దరి మధ్య మాటలు లేవు. పడకలు లేవు. ఎడమొగం. పెడమొగం. నాలుగైదు రోజులుగా ఇదే సీను. ఇన్నాళ్ళూ చిన్నచిన్న అలకలు, గిల్లికజ్జాలు వాళ్ళ మధ్యకి వచ్చి వెళ్ళేయి తప్పా ఇంత భారీ ఎత్తున ఎడబాటు లేదు లేదు. పద్మకి దుఃఖం ఆగటం లేదు. అతనిపై కసికసిగా ఉంది. బతుకుపై రోతగా, విరక్తిగా ఉంది. ఎందులోనైనా పడి చావాలనిపిస్తోంది. పిచ్చెక్కి పోతోంది.

పద్మ అన్నివిధాల ఆలోచించుకొని ఒక నిర్ణయానికొచ్చింది. భాస్కర్‌కి దూరంగా పుట్టింటికి వెళ్ళిపోవడం ఉత్తమం, తక్షణ కర్తవ్యంగా భావించింది. అతణ్ణి విడిచి వెళిపోతున్న సంగతి ఆమెకు చెప్పాలనిపించలేదు. చెప్పక తప్పదు గాబట్టి కూతురు సుస్మిత ద్వార తెలియజేసింది. ఆరాత్రే సూట్‌కేస్‌లూ, ఇతరత్రా పట్టుకెళ్లవలసిన వస్తువులన్నీ సర్దుకొని ఓపిగ్గా ప్యాక్‌ చేసుకొంది.

ఇన్నాళ్ళు ఎంతో చక్కగా, తన అభిరుచికి అనుగుణంగా తీర్చి దిద్దుకున్న ఆ గృహముతో రేపటి నుంచి బంధం తెగిపోతుంది. ఈ పదేళ్ళు ఏమీ కాకుండా సాగిపోయేయి. ఈరాత్రి తెల్లవారడం ఎంతసేపు. ఇల్లు నిశ్శబ్దంగా రోదిస్తోంది. పిల్లలు వాళ్ళ గదిలో హాయిగా నిద్రపోతున్నారు. అంతే హాయిగా రేపు అమ్మమ్మ ఇంటిలో కూడా నిద్రపోగలరు. అదృష్టవంతులు.

నిద్రపోవడానికి ప్రయత్నిస్తోంది పద్మ.
ఆ మంచంపై భాస్కర్‌ కూడా ఉన్నాడు.
డబల్‌ కాట్‌ పై .. అటు పద్మ ఇటు భాస్కర్‌ నాలుగైదు రోజులుగా ఇదే తంతు.

ఆ మంచానికి ఈ అనుభవం కొత్తగా ఉంది. చెత్తగా ఉంది. చప్పగా ఉంది. భరించలేకపోతోంది.

మంచంపై భాస్కర్‌ ఆమెకి పొరపాటున కూడా తగలకుండా అటూ, ఇటూ దొర్లుతున్నాడు. రేపటి నుంచి ఆ జాగర్తలు అతనికి అవసరం లేదు. ఆమె వెళిపోతోంది.

ఆమె తనను విడిచివెళ్ళడం అనే సీను ఒకటి అతని జీవితంలో ఎదురవుతుందని ఏనాడు ఊహించలేదు. జీవితం కొంత కొంత అతని కిపుడిపుడే అర్థమవుతున్నట్టుగా ఉంది. ఎడబాటు పాఠాలు నేర్పుతోంది.

భార్య ప్రేమానురాగాలతో అతని జీవితం పెనవేసుకుపోయి చల్‌ మోహనరంగా అని హాయిగా హాయిగా సాగిపోతుందనుకున్నాడు తప్పా ఇలా ఉల్లిపాయలు, ఉప్పుపొప్పులూ మరొకటీ మరొకటితో అదే జీవితం ముడిపడి ఉంటుందనుకోలేదు.

అతనికి అర్థమవుతోంది. ఎగుడుదిగుడుగా ముళ్లకంపలతో రాళ్ళు రప్పలతో వికృతంగా, లోపభూయిష్టంగా వ్యవస్థే ఉన్నప్పుడు మన జీవితాలు, దాంపత్యాలు చలువరాతి గచ్చులా నున్నగా, సాఫీగా సాగాలనుకుంటే ఎలా సాగుతుంది? భార్యాభర్తల మధ్య ఎంత అండర్‌స్టాండింగ్‌ ఉన్నా జీవితాన్ని గిరిగీసుకొని ఎంత పకడ్బందీగా ప్లాన్‌ చేసుకున్నా, వాళ్ళు తప్పనిసరిగా సామాజిక పరిస్థితులకు కీలుబొమ్మలు. వాళ్ళ బతుకులపై సామాజిక ప్రభావం మంచికో చెడుకో, శాంతికో అశాంతికో గురిచేస్తూనే ఉంటుంది. ఈ సంవత్సరం ఆ దంపతులను అశాంతికే గురి చేసింది.

పద్మ అయితే తల్లడిల్లి పోయింది.
ఆమెపై జాలి వేస్తోంది అతనికి.

ఆమెది చాలా చిన్న ప్రపంచం. ఇల్లు, భర్త, పిల్లలు. అంతే. ఆ చిన్న ప్రపంచాన్ని గాజుబొమ్మలా చూసుకుంటుంది. ఆమె తెలివైనది. ఇంటిలోపల ఎంతైన ఆమె మానేజ్‌ చేయగలదు. ఇంటి బయట ఆమె అశక్తురాలు. ఆమె అధీనంలో లేని శక్తులే ఆమెను శాసిస్తున్నాయి. గాజు ఇంటిపై రాళ్ళు రువ్వుతున్నాయి. కనబడని రాయి ఎవరు విసిరిందో తెలియక, అర్థం కాక ఎదురుగా ఉన్న భర్తపై తన ఆక్రోశం, భయం వెళ్లగక్కుతోంది. ఆమె అర్థమవుతోంది. ఆమెను కొట్టిన చేయిని నరికివేసుకోవా లనిపిస్తోంది. అతని మనసెందుకో తేలికవుతోంది. అతడు నిద్రకి ఉపక్రమించేడు.

……………………….

అతను నిద్రపోతున్నాడు.
ఆమె నిద్రపోతోంది.
సమయం రాత్రి పావు తక్కువ పన్నెండు అవుతోంది.
ఆరాత్రి
నాలుగురాత్రుల ఎడబాటు తర్వాత .. ఒక అద్భుతమైన క్షణాన .. ఒకరి శరీరం మరొకరికి తగిలింది.

ఎవరి శరీరం ఎవరికి తగిలిందో చెప్పడం కష్టం. ఆ రెండు శరీరాలు తగలాలని తగిలేయా, అనుకోకుండా తగిలాయా మన్మథుడిక్కూడా తెలియదు. కరెంట్‌ షాక్‌ తగిలినట్టు అంటుకుపోయేయి. వంటిమీద బట్టలు విడిచేసి త్రాచుపాముల్లా చుట్టుకుపోయేయి. పోట్లగిత్తల్లా దొర్లేయి. మంచమంతా పొర్లేయి. సుఖాన్ని పొందేయి.

ఆ శరీరాల వేడి రాపిడిలో అహాలు, కోపాలు, స్పర్థలూ బాధలూ ఒక్కసారిగా చల్లబడిపోయేయి. సెక్సు వాళ్ళతో మధ్యవర్తిత్వం నెరిపి రాజీ కుదిర్చింది.

చిత్రంగా ఎవరికి వాళ్ళు తప్పు నాదంటే నాదన్నారు. ఎవరికి వాళ్ళు నన్ను క్షమించమంటే నన్ను క్షమించమన్నారు. “ఏదో కోపంలో ఏదో అంటే నన్ను నాలుగు రోజులు దగ్గరకు తీసుకోకుండా ఎలా ఉండగలిగారు. నాకు చాలా కోపం వచ్చింది తెల్సా” అంటూ అతని గుండెలపై వాలిపోయి ఏడ్చింది పద్మ “ఏదో పిచ్చిదాన్ని ఏ చికాకులోనో ఏదో అంటాను. మిమ్మల్ని కించపరచాలని కాదు. ఏవండీ నేనెలా ప్రవర్తించినా నన్ను దగ్గరకు తీసుకోడం మానకండి. ఇంటి చాకిరీతో విసిగివేసారి పోయిన నన్ను మీరు దగ్గరకి తీసుకుంటే ఆ సుఖంలో అన్నీ మర్చిపోతాను. ఏవండీ దయచేసి నాకు ఎడంగా ఉండకండి. నాకున్నది ఈ సుఖమే. మీ సుఖమే”

ఆమె అతన్ని పూర్తిగా హత్తుకుపోయింది. అతని పొందులో ఏదో తన్మయత్వం. ఎంతో ఓదార్పు. మగవాడు సెక్సు కోసం స్త్రీని ప్రేమిస్తే, స్త్రీ ప్రేమకోసం, మగవానికి సెక్సు ఇస్తుందనే సూత్రం అక్కడ చెల్లలేదు. ఇద్దరిదీ ప్రేమే. ఏకకాలంలో రెండు శరీరాలు స్పందించి సెక్సు సుఖాన్ని పొందేయి. సెక్సు వాళ్ళని సామాజిక, శారీరిక, మానసిక వత్తిడిల నుంచి రిలీవ్‌ చేసి సుఖాన్ని, శాంతినీ ఇచ్చిందనేది ఇద్దరిలోనూ స్పష్టంగా తెలుస్తోంది. …………………….

మరుచటి దినం హుషారుగా తెల్లవారింది. ఆమె పుట్టింటికి బయల్దేరలేదు! భాస్కర్‌ ఆఫీసుకి బయల్దేరుతుండగా ఆగమంది పద్మ ఆగేడు అతని చేతికి యాభై రూపాయల నోటు చేతికిచ్చింది

“ఎందుకు?”
“ఆఫీసు నుంచి వచ్చినపుడు నాలుగైదు సాల్టు పేకెట్లు తీసుకురండి.” తెల్లబోయి .. చూసేడు
ఏం మనిషి! ఈ రోజు పేపరు చూడలేదా!
ఉప్పుగాలి పేకెట్‌కి అరవై రూపాయల చొప్పున వీస్తోంది ఆ గాలి ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడం ఎంతసేపు?
“పద్మా! నిజంగా నీకు మతిపోయింది”
పద్మకి కోపం వచ్చింది
ఆ కోపానికి అదిరేడు భాస్కర్‌.

అతనికి తెల్సు ఆడది అలిగితే మగవాడికి మతి తప్పుతుంది. ప్రభుత్వాలకి గతి తప్పుతుంది. ఎగిసే ధరలను నేలకు చచ్చినట్టు దిగివచ్చేల కళ్ళెర్ర జేస్తుంది.
                                                                                                   ఆ విషయం చరిత్ర చెబుతోంది.
----------------------------------------------------------
రచన: అర్నాథ్‌, 
ఈమాట సౌజన్యంతో 

No comments:

Post a Comment