Wednesday, October 24, 2018

బల్లి ఫలితం


బల్లి ఫలితం




సాహితీమిత్రులారా!

ఆదివారం. మధ్యాహ్నం. వేళ రెండున్నర. గదిలో టెలిఫోను మోగింది.

“మీ కోసం ఇద్దరు వచ్చేరు. పైకి పంపమంటారా?”

“పంపండి.”

వారం రోజులబట్టీ హొటేలు గదిలో ఉంటున్నాను. ఊళ్లో ఉన్న కళాశాలలో అతిథి ఆచార్యుడిగా పాఠాలు చెప్పటానికి వచ్చేను. తరగతిలో విద్యార్థులు హొటేలు గదికి రాత్రి పది లోపు ఎప్పుడైనా, అభిసారం లేకపోయినా, వచ్చి కలుసుకుని సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని ప్రోత్సాహ పరచేను. కాబట్టి గదిలో ఉన్నంత సేపు వచ్చే పోయే విద్యార్థులతో నాకు కాలం గడవకపోవటం, తోచకపోవటం అంటూ లేదు.

ఇద్దరు వ్యక్తులు తెరచి ఉంచిన తలుపు దగ్గర నిలబడి లోపలికి రావటానికి తటపటాయిస్తున్నారు. లోనికి రమ్మని ఆహ్వానించేను. వయస్సు లోనూ, వాలకం లోనూ నా తరగతిలో ఉన్న విద్యార్థులులా లేరు. ప్రశ్నార్థకంగా చూసేను.

“అయ్యా! ప్రొఫెసర్ దివాకర్‌గారి కోసం వచ్చేం.” అన్నాడు ఆగంతకులలో చిన్నవాడు.

“నేనే దివాకర్‌ని, లోపలికి రాండి.”

“నన్ను చంద్రం అంటారండి. నేను ఇక్కడ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగులో పిఎచ్. డి. పట్టా కోసం పరిశోధనా పత్రం రాస్తున్నాను – ‘మన మూఢనమ్మకాల వెనక ఉన్న శాస్త్రీయత’ అన్న అంశం మీద. దిశా నిర్దేశం చెయ్యటంలో మీ సహాయం కోరి వచ్చేను.”

“నేను ఆ రంగం వాడిని కాదే. మీకు నేను ఏ విధంగా సహాయం చెయ్యగలను?”

“మీరు రాసే వైజ్ఞానిక కల్పనలంటే నాకు చాల ఇష్టం.” పక్కనున్న పెద్దాయన అందుకున్నారు. “నన్ను డాక్టర్ రవిచంద్ర అంటారు. చంద్రం వరసకి నాకు మేనల్లుడు అవుతాడు. ఇతని పరిశోధనకి మీరే మంచి దిశానిర్దేశకులన్న నమ్మకంతో – మీరు ఈ ఉళ్లో ఉన్నారని తెలిసి – తీసుకువచ్చానండి.”

నేను రాసిన ఒక కథలో తిరుపతిని కేంద్ర బిందువుగా వాడుకున్నాను. ఆ కథని ఉదహరించి, ఆ కథ వైద్యపరంగా తనకి ఎందుకు నచ్చిందో టూకీగా వివరించి, నాకు చేతనయిన సహాయం చెయ్యమని అడిగేరు, డాక్టర్ రవిచంద్ర.

“నమ్మకం అనేది సాపేక్ష భావం. శాస్త్రీయమైన రుజువు దొరకనంతసేపూ అన్నీ మూఢనమ్మకాలే! అవునా?” అని సమాధానం కోసం ఆగకుండానే, “ఒక గంటలో మరొకరు వస్తున్నారు. వారొచ్చే లోగా నా చిన్ననాటి సంఘటన ఒకటి చెబుతాను. విన్న తరువాత ఆ కథనంలో మూఢం ఏదో, శాస్త్రం ఏదో ఆలోచించండి. ఏమంటారు?”

“చెప్పండి!” ఇద్దరూ ఏకకంఠంతో అన్నారు.

జీడిపప్పు పకోడీలు, కాఫీ పైకి పంపమని హొటేలు వారికి టెలిఫోనులో చెప్పి, “అయితే చెబుతాను, అలా కూర్చోండి. ఇది ఎప్పుడో 1950 దశకపు ఉత్తరార్ధంలో జరిగిన సంఘటన,” అని మొదలెట్టాను.

సూర్యం, గోపాలకృష్ణ, నాగముని గిండీ కాలేజీ హాస్టల్లో కలిసి ఉండేవారు. చదువు పూర్తి చేసి ఎవరి ఇళ్లకి వారు వెళ్లేరు. వాళ్లు ఇళ్లు చేరేరో లేదో వెనువెంటనే ఉద్యోగంలో చేరమని ప్రభుత్వం వారి నుండి ఉత్తరాలు వచ్చేయి.

బళ్లారి దగ్గర హొళగొంది అనే కుగ్రామం వచ్చి ఉద్యోగంలో చేరమని విశాఖ ప్రాంతాల్లో నివసించే సూర్యాన్ని అడిగేరు. తుంగభద్ర డ్యామ్‌కి కాలువలు తవ్వించవలసిన పని. ఇంట్లో ఉన్న అట్లాసు తీసి చూస్తే బళ్లారి కనిపించింది కాని హొళగొంది కనపడలేదు. ప్రభుత్వం వారు ఉద్యోగం ఇస్తూ రాసిన ఉత్తరంలో ఆ హొళగొంది ఎక్కడ ఉందో చెప్పలేదు కాని బళ్లారిలో రైలు దిగి, అక్కడ డివిజనల్ ఇంజనీరు ఆఫీసుకి వెళితే వారు దారి చెపుతారని మాత్రం ఉంది. ఇటువంటి దైవోపహతమైన ప్రదేశాలనే మనం తెలుగులో వెటకారానికి ‘శంకరగిరి మన్యాలు’ అంటాం. బొద్దింకలు, తేళ్లు, మండ్రగబ్బలు వగైరాలు వీరవిహారం చేసే ప్రదేశం అది. గోపాలకృష్ణది కృష్ణా జిల్లా. అతని ఉద్యోగం డుడుమా జలపాతం దగ్గర కడుతూన్న జలవిద్యుత్ డ్యామ్ దగ్గర. విశాఖపట్నంలో రైలు దిగి, పాడేరు, చింతపల్లి మీదుగా మాచ్‌ఖండ్ చేరుకోమని అతనికి వచ్చిన ఉత్తర్వులో ఉంది.

పోతే నాగమునిది బళ్లారి. అతనిని డెహరాడూన్‌లో భారతీయ వాయుదళాలలో ఇంజనీరుగా ఎంపిక చేసేరు. తునిలో రైలెక్కి మదరాసులో దిగటం వరకే తెలుసున్న సూర్యానికి బళ్లారి నైసర్గిక స్వరూపం తెలియదు. కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగిన గోపాలకృష్ణ విశాఖ జిల్లా వైపు ఎప్పుడూ రాలేదు. నాగమునికి రాయలసీమ సంగతే పూర్తిగా తెలియదు. వీరు ముగ్గురూ ఉత్తరాల ద్వారా ఒకరినొకరు సంప్రదించుకున్నారు.

“ముందు మా ఇంటికి వచ్చి మకాం పెట్టేవంటే ఇక్కడ నుండి మన్యప్రాంతమైన మాచ్‌ఖండ్ వెళ్లటంలోని సాధకబాధకాలు మావాళ్లు నీకు చెబుతారు,” అంటూ గోపాలకృష్ణకి సూర్యం ధైర్యం చెప్పి, మూటా, ముల్లె సర్దుకుని బళ్లారి ప్రయాణం అయేడు. నాగముని, విధవరాలైన తల్లిని బళ్లారిలో ఒంటరిగా వదిలేసి, డెహరాడూన్ వెళ్లిపోయేడు.

సూర్యం ఇలా వెళ్లేడో లేదో, గోపాలకృష్ణ పెట్టె, పరుపుచుట్టతో హౌరా మెయిల్‌లో దిగి, బండి కట్టించుకుని ఇంటికి చక్కా వచ్చేడు. మంచి కలుపుగోలు మనిషేమో ఇంట్లో ఉన్న ఇంటిడు పిల్లలకి ఆప్తుడయిపోయేడు. రామయ్యగారికీ, సీతమ్మగారికీ బళ్లారి వెళ్లిపోయిన కొడుకు సూర్యం స్థానంలో గోపాలకృష్ణ కనిపించేడే తప్ప ఏమీ భారం అనిపించలేదు. సీతమ్మగారు పుట్టి, పెరిగిన ఊరు మాడుగుల అవటంతో ఆ మన్యపు ప్రాంతాల గురించి ఆమెకి బాగా తెలుసు.

“మరిగించకుండా నీళ్లు తాగొద్దు. మన్యంలో దొరికే పళ్లు – ఘుమఘుమలాడుతూ ఎంత ఆకర్షణీయంగా కనిపించినా సరే – తినొద్దు. దోమతెర వేసుకోకుండా పడుకోవద్దు,” అని తీసుకోవలసిన ఎన్నో జాగ్రత్తలు చెబుతూ, ఒక్కొక్క పొట్లంలో చిటికెడు పసుపు పొడి వేసి పొట్లాలు కట్టి, “ప్రతి రోజూ, వేడి అన్నం పట్టెడు తీసుకుని, పిడచకట్టి, అందులో పొట్లం పసుపు వేసి, దానిని తిన్న తరువాతే మిగతా భోజనం చెయ్యి నాయనా. మన్యపు జ్వరం నీ దరిదాపులకి రాదు,” అంటూ రెండు నెలలకి సరిపడా పసుపు పొట్లాలు, దినుసులు మూటలు కట్టి అతనిని సాగనంపింది.

“ఇప్పుడంటే పసుపు ఆరోగ్యానికి మంచిదనీ, కేన్సరు రాకుండా అడ్డుకుంటుందనీ అమెరికాలో ఒప్పుకుంటున్నారు కాని, అప్పుడూ, ఇప్పుడూ పసుపు తినటానికి, మలేరియాకి సంబంధం ఏమిటో ఎవ్వరూ పరిశోధనలు చేసినట్లు లేదండి,” అన్నారు డాక్టర్ రవిచంద్ర.

సూర్యం స్పురద్రూపి. దబ్బపండు లాంటి శరీర ఛాయ. విశాలమయిన నుదురు. తీర్చి దిద్దినట్లున్న కనుముక్కు తీరు. గిండీ కాలేజి హాస్టల్ భోజనం బాగుండేదేమో, పిల్లాడు నిగనిగలాడుతూ, చూడముచ్చటగా ఉండేవాడు. ఇటువంటి ముక్కుపచ్చలారని కుర్రాడిని రాయలసీమ రాళ్ల మధ్య, ఆ హొళగొందిలో, తిండీ తిప్పలు లేని అడవిలో, మండుటెండలో సర్వే చెయ్యమని పంపితే ఎలా తాళుకోగలడు?

ఉద్యోగం రాటుపోట్లకి అలవాటు పడ్డాడు కాని తిండి సదుపాయం లేక ఇబ్బంది పడేవాడు. తల్లి సంరక్షణలోనూ, అప్పచెల్లెళ్ల చాటున పెరిగినవాడు కాబట్టి కనీసం కాఫీ కాచుకోవటం కూడ నేర్చుకోలేదు. హొళగొందిలో హొటేలు సదుపాయాలు కూడ లేవు. బళ్లారి వచ్చినప్పుడు మాత్రం ఏ డాక్ బంగళాలోనో పడుక్కుంటే లాస్కర్ కేరేజీతో భోజనం పట్టుకొచ్చేవాడు. అందుకని ఆఫీసు పని కల్పించుకుని తరచు బళ్లారి వచ్చేవాడు – భోజనం కోసం.

ఒక రోజు నాగముని తల్లి ఆ ఊళ్లోనే ఉంటున్నాదని జ్ఞాపకం వచ్చి ఆమెని ఒకసారి పలకరించటానికి వెళ్లేడు. అప్పుడు కాని ఆమె విధవరాలన్న విషయం సూర్యానికి తెలియలేదు. నాగముని ఒక్కడే కొడుకుట. నాగమునికి అయిదేళ్లయినా నిండకుండానే ‘ఆయన’ గుండె పోటు వచ్చి పోయారుట. ఈమెకి ఎంతకాదన్నా నలభయి అయిదు మించి ఉండవని సూర్యం అంచనా వేసేడు. అందుకని ‘పిన్నిగారూ’ అని వరస పెట్టి పిలచి, ఆమె ఇచ్చిన కాఫీ తాగి, బయలుదేరబోయేడు.

“భోజనం చేసి వెళ్లు బాబూ! దూరం నుండి వచ్చేవు.”

“పరవాలేదండి. మళ్లా వస్తాను.”

“ఇంటిదగ్గర ఎవ్వరైనా ఎదురుచూస్తూ ఉంటారా? అటువంటప్పుడు బలవంతం చెయ్యను.”

“ఎవ్వరూ లేరండి. నేనే వండుకు తింటాను. బళ్లారి వచ్చినప్పుడు కేరేజీ తెప్పించుకుంటున్నాను.”

“సరే! ఈ పూట నువ్వు ఇక్కడ భోజనం చెయ్యకుండా వెళ్లడానికి వీలు లేదు. అలా ఆ పంచపాళీలో ఉన్న మంచం వాల్చి ఒక్క కునుకు తీశావంటే, చిటికెల మీద వంట చేసి పెడతాను. తిని వెళుదువుగాని.”

సూర్యం మరీ హఠం చెయ్యకుండానే ఒప్పుకున్నాడు. నాగముని తల్లి పార్వతమ్మ, పక్కన కూర్చుని, కొసరి కొసరి వడ్డించి తినిపించింది.

“ఊళ్లోకి వచ్చినప్పుడు వస్తూ ఉండు నాయనా. మా నాగుని నీలో చూసుకుని సంతోషపడతాను. ఎక్కడో ఉత్తరాదిన ఉన్నాడు. ఎలా ఉన్నాడో, ఏమో!”

సూర్యం హొళగొంది నుండి బళ్లారి వచ్చినప్పుడల్లా కాకపోయినా నెలకో తడవ ఈమెని పలకరించటానికి వీరింటికి వెళ్లటం, ఆమె బలవంతం చేసి ఇతనికి భోజనం పెట్టి పంపటం రివాజుగా జరుగుతూ వచ్చేయి.

నాలుగు నెలలు గడిచేసరికి సూర్యం ఆరోగ్యం కుంటు పడింది. కాలేజీలో ఉన్నప్పుడు వారానికొకసారి చేసే సర్వే ఇప్పుడు రోజూ చెయ్యవలసి వస్తోంది. ఎండలో తిప్పట. పోషణ సరిగ్గా లేదు. మనిషి చిక్కిపోయాడు. సాయంకాలం అయేసరికి పక్కలు వెచ్చబడేవి. తిరగటానికి ఓపిక ఉండేది కాదు. కొత్త ఉద్యోగం. ఇంటికి వెళ్లటానికి సెలవు దొరకటం కష్టం. ఈ పరిస్థితులలో సూర్యం మేనమామ రవణ బళ్లారికి బదిలీ అయి రావటం కేవలం కాకతాళీయం.

సూర్యాన్ని చూడగానే పరిస్థితి బాగులేదని పసికట్టిన రవణ వెంటనే బళ్లారిలో ఉన్న ప్రభుత్వపు ఆసుపత్రికి తీసుకెళ్లేడు. వైద్యులు చాంతాడంత పొడుగున్న జాబితా రాసిచ్చి ఆ పరీక్షలన్నీ చెయ్యాలన్నారు. పరీక్షలు అయిన తరువాత మందుల జాబితా రాసిచ్చి, అవి కొని ఓ నెల్లాళ్లపాటు వేసుకుని తిరిగి రమ్మన్నారు. మందులు పని చెయ్యలేదు. మరికొన్ని పరీక్షలు చేసి, రక్తంలో ఏదో దోషం కనిపిస్తోందనిన్నీ, ఇసనోఫిల్స్ అనే ఒక రకం తెల్ల కణాలు మోతాదుకి మించి ఉండటమే నీరసానికి కారణమనీ, కాని ఆ జాతి తెల్లకణాల పెరుగుదలకి కారణం ఇదమిత్థంగా తేల్చి చెప్పటానికి, కొన్నాళ్లపాటు ఆసుపత్రిలో చేర్పిస్తే వైద్యుల పర్యవేక్షణలో అసలు కారణం తేలవచ్చనీ సిఫార్సు చేసేరు.

“ఈ పరిస్థితికి కారణం ఏమై ఉంటుందని మీరు ఊహిస్తున్నారు?” అంటూ రవణ వాకబు చేసేడు.

“అలవాటు లేని ప్రదేశంలో, అనారోగ్యమైన పరిసరాల్లో ఉండే పరాన్నభుక్కులు కావచ్చు, ఎలర్జీ కావచ్చు. అంటే పడని పదార్థం శరీరంలో ప్రవేశించినప్పుడు శరీరం దానిని ఎదుర్కుని పోరాడినప్పుడు తెల్లకణాల జనాభా పెరగొచ్చు. ఏ పదార్థం పడలేదో తెలియాలంటే ‘నేతి, నేతి’ (ఇది కాదు, ఇది కాదు) అంటూ ఒకటీ, ఒకటీ మినహాయించుకుంటూ పోతే తప్ప అసలు దోషం ఎక్కడుందో బోధ పడదు,” అని చెప్పి పరీక్షల నిమిత్తం వైద్యులు సూర్యాన్ని ఆసుపత్రిలో చేర్పించేరు.

ఆసుపత్రిలో చేర్పించేసరికి ఇదేదో మొండిరోగం అన్న అనుమానం రవణ బుర్రలో నాటుకుపోయింది. జరిగిన విషయాలన్నీ తన అక్క సీతమ్మకి వివరంగా రాసి, తను దగ్గర ఉండి చూసుకుంటూన్నంత సేపు ఎవ్వరూ కంగారు పడవలసిన అవసరం లేదని ధైర్యం చెబుతూ ఉత్తరం టపాలో పడేసేడు రవణ.

పకోడీలు, కాఫీ పట్టుకొచ్చి, బల్ల మీద సర్ది, వెళ్లిపోయేడు ఉపచారాలు చేసే హొటేలు కుర్రాడు. ఆ పళ్లేలని, కప్పులని అతిథులిద్దరి వైపు తోసి, కథ చెప్పటం కొనసాగించేను.

బళ్లారి వెళ్లిన నాలుగు నెలలకే కుర్రాడికి సుస్తీ చేసిందన్న వార్త ఊళ్లో – చిన్న గ్రామం కనుక – నలుగురికీ నాలుగు ఘడియలలో తెలిసిపోయింది.

“బళ్లారిలో ఎవరింట్లోనైనా భోజనం చేసేడా?” అని ఒక శ్రేయోభిలాషి ఆత్రుతగా వాకబు చేసేరు.

“అక్కడ పార్వతమ్మ అని మా వాడి స్నేహితుడి తల్లి ఉంది. వారింట రెండు, మూడు సార్లు భోజనం చేసినట్లు రాసేడు మా వాడు.”

“కొంపతీసి ఆవిడ విధవావిడ కాదు కదా?”

“ఆ విషయం మీకు ఎలా తెలుసు?” సీతమ్మ గారి గొంతులో ఆశ్చర్యం కంటె ఆతృత ఎక్కువగా ప్రస్పుటమైంది.

“మీరు బళ్లారి అనే సరికల్లా భయం వేసిందమ్మా. ఆ ప్రాంతాల వితంతువులలో ఒక మూఢనమ్మకం ఉంది. తాము వండిన వంటలో విషం కలిపి బ్రాహ్మణ బ్రహ్మచారులకి భోజనం పెట్టి బలి ఇస్తే ఆ విధవ స్త్రీకి మరుసటి జన్మలో మరి వైధవ్యం రాదుట. ఏ ఉల్లిపాషాణమో వాడితే చావు హఠాత్తుగా వచ్చి పట్టుబడిపోటానికి అవకాశాలు ఎక్కువ. అందుకని అతి నెమ్మదిగా పని చేసే విషాలని ఈ రకం విషప్రయోగాలకి వాడతారు. అందుచేత ఆ ప్రాంతాలలో వితంతువుల ఇళ్లల్లో ఎవ్వరూ భోజనం చెయ్యరుట.”

సీతమ్మగారికి కంగారు ఎక్కువయింది. ఆమె మనస్సు పరిపరి విధాల పరిగెట్టింది. కాకపోతే ఈ కరువు రోజుల్లో ముఖపరిచయం కూడ లేని సూర్యాన్ని చేరదీసి భోజనం పెట్టవలసిన అవసరం ఏముంది పార్వతమ్మకి? ఛ! తప్పు. తను ముక్కు, ముఖం ఎరగని గోపాలకృష్ణని చేరదీసి, భోజనం పెట్టి, మంచిచెడ్డలు చూసి మాచ్‌ఖండ్ పంపలేదూ. సాటి స్త్రీని ఇలా అమానుషంగా అనుమానించటమా? కాని కీడెంచి మేలెంచమన్నారు. ఈ మూఢ నమ్మకంలో వీసమెత్తు నిజం ఉంటే? అనుమానం పుట్టాలే కాని, పుట్టి పెనుభూతమై కూర్చుంది. ఈ విషయం అంతా పూసగుచ్చినట్లు ఆమె రవణకి ఉత్తరంలో, ఈ విషయం వైద్యులతో చెప్పి ఆ విషానికి విరుగుడు ఉందేమో చూడమని రాసేరు.

ఇది ఉత్తరాలతో తెమిలే పని కాదని రామయ్యగారు తన హోమియోపతీ మందుల పెట్టెని చంకన పెట్టుకుని బళ్లారి ప్రయాణమై వెళ్లేరు. రవణ బావగారిని వెంటేసుకుని పెద్దాసుపత్రికి వెళ్లేడు. రామయ్య గారు కొంచెం జంకుతూనే విష ప్రయోగం ఏదైనా జరిగిందేమో చూడమని వైద్యులని అడిగేరు.

తాగుతూన్న కాఫీ కప్పుని కింద పెట్టి, డాక్టర్ రవిచంద్ర అందుకుని అన్నారు: “మనిషిని చంపటానికి సవాలక్ష విషపదార్థాలు ఉన్నాయి. ఫలానా విషం పేరు చెప్పి, ఈ విషం శరీరంలో ఉందేమో నిర్ధారించమని అడిగితే ఆధునిక వైద్య పరికరాలతో సమాధానం చెప్పొచ్చు. కాని ‘ఏ విష ప్రయోగం జరిగింది?’ అని ప్రశ్న అడిగితే సమాధానం అన్ని వేళలలోనూ తేలికగా దొరకకపోవచ్చు. ఆర్సెనిక్, సయనైడ్, బెల్లడోనా, పాము గరళం వంటి తీవ్ర విషాలు కాని శరీరంలోకి వెళితే వాటి ప్రభావం కొట్టొచ్చినట్లు వెనువెంటనే కనిపిస్తుంది. కాని అతి నెమ్మదిగా పని చేసే విషాల ప్రభావం ప్రయోగం జరిగిన కొన్ని నెలల తరువాత కాని కనిపించకపోవచ్చు. రైసిన్ అనే విషం ఉంది. దానిని ఆముదపు గింజలనుండి తీస్తారు. అది సూది ద్వారా శరీరం లోకి ఎక్కిస్తే మరణం ఖాయం. కాని రైసిన్ అవశేషాలు శవపరీక్షలో కనిపించటం కష్టం కనుక ఇటువంటి విష ప్రయోగాలు జరిగినప్పుడు వాటిని గుర్తించటం చాల కష్టం. కనిపించిన లక్షణాలని చూసి వైద్యులు ఏవో మందులు ఇస్తారు.”

అవును, డాక్టరుగారూ! మీరు చెప్పినట్లే బళ్లారిలో వైద్యులు కూడ ఇదే మాట చెప్పి రవణతో, “మీకు ఏ విషం మీద అనుమానం ఉందో చెపితే రక్తంలో ఆ విషం అవశేషాలు ఉన్నాయేమో చూస్తాం,” అన్నారుట. అది కనిపిస్తే పోలీసుల చేత దర్యాప్తు చేయించవచ్చని కూడ చెప్పేరుట. అప్పుడు రామయ్యగారు తాను ఎప్పుడో విన్న ఒక విషయం రవణతో చెప్పేరు.

“రవణా! చూడు. నన్ను ఒక అనుమానం పట్టుకు పీడిస్తోంది. ఇంటి దగ్గర బయటకి ఏమైనా అంటే మీ అక్క గాభరా పడుతుందని మౌనంగా ఊరుకుని వెంటనే బయలుదేరి వచ్చేసేను. వైధవ్యం పొందిన ఆడవారు ఒక బ్రహ్మచారిని అమ్మవారికి బలి ఇస్తే తరువాత జన్మలో వైధవ్యం రాదనే మూఢ నమ్మకం ఈ బళ్లారి ప్రాంతాలలో ఉంది. అమ్మవారికి పూజ చేసి ‘నైవేద్యం’ అవకాశం వెంబడి పెట్టుకుంటామని మొక్కుకుంటారు. అవకాశం చూసుకుని నెమ్మదిగా, నిదానంగా పని చేసే విషాన్ని భోజనంలో కలిపి పెడతారు. దాని ప్రభావం కొద్ది నెలలు పోయిన తరువాత కాని కనబడదు.”

“అయితే ఆ విషం సంగతి మనం వైద్యులకి చెప్పొచ్చు కదా, బావా! ఆ విషం మచ్చు ఒకటి సంపాదిస్తే వైద్యులకి ఇవ్వచ్చు కదా!”

“అది ఎలా తయారు చేస్తారో వినికిడిగా తెలుసు. నిజానిజాలు తెలియవు. అందుకనే తటపటాయిస్తున్నాను. నీకు చెబుతా, విను. ఒక జాతి బల్లిని పట్టి, దాని తోకకి దారం కట్టి, దానిని తలకిందులుగా వేలాడగడతారుట. ఆ బల్లి నోటికి అందీ అందని దూరంలో పత్తి గింజల పిండి కొద్దిగా జల్లిన పళ్లెం పెడతారుట. పళ్లెంలో ఉన్న పిండి కోసం బల్లి నాలిక చాచినప్పుడల్లా నోటినుండి నురగ జారి పిండిలో పడుతుందిట. అప్పుడు ఆ పిండిని బాగా కలియబెట్టి, చిటికెడు పిండిని ఏ పప్పులోనో, పులుసులోనో కలిపి వడ్డిస్తారుట. నాలుగైదు మోతాదులు పడ్డ తరువాత ఫలితం కనిపించటం మొదలుపెడుతుందిట. ఎవ్వరు, ఎప్పుడు ఈ విషప్రయోగం చేసేరో పట్టటం ఎవరి తరం?”

“ఇది మూఢ నమ్మకమో, కాదో తేల్చడం ఎంతసేపండీ? ఒక బల్లిని పట్టుకుని, ఆ బల్లి చేత చొంగ కార్పించి, దానిని పరీక్ష చేస్తే పోలా?” ఇంతవరకూ మెదలకుండా కూర్చున్న చంద్రంలో కొంచెం కదలిక కనిపించింది.

“ఏ బల్లిని? అంటే ఏ జాతి బల్లిని? ఆ విషయం మనకి తెలియదు కదా. అయినా అలాంటి ప్రయోగం చేసి చూడాలంటే డబ్బు ఉండాలి, వనరులు ఉండాలి, నిజం తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉండాలి. ఈ రోజుల్లో, ఈ దేశంలో అటువంటి స్పూర్తి ఎవ్వరికి ఉందోయ్? ఏ అమెరికావాడో, ఇంగ్లీషువాడో కనుక్కుంటే ‘మా వేదాల్లో ఉందిషా!’ అనటం అంటాం.”

రవణ ఈ బల్లి కథని బళ్లారిలో వైద్యులకి చెప్పి, ఆ బల్లి విషం సూర్యం శరీరంలో ఉందేమో చూడమని అడిగితే, “బల్లి విషం ఏమిటోయ్? ఎక్కడా వినలేదు” అని పరిహాసం చేస్తారేమోనని ఒక పక్క భయపడుతూనే, వైద్యుల దగ్గర రహస్యాలు ఉంచకూడదనే నియమానుసారం అడగనే అడిగేడు. వైద్యులు వీరి మాటలు వినేసి, భయపడవలసినది లేదని చెప్పి వాళ్లు చెయ్యదల్చుకున్న వైద్యం చేసి సూర్యాన్ని గట్టెక్కించేమని అనుకుని ఇంటికి పంపించేసేరు.

రోజులు గడుస్తూన్నకొద్దీ సూర్యం కడతేరా గట్టెక్కలేదేమో అన్న అనుమానం రామయ్యగారిని పట్టుకుంది. బల్లి కథనంలో కొంత బలం ఉందేమో? ఎందుకంటే, ఇంగ్లీషు వైద్యులు ఏ మందులు వాడేరో కాని దబ్బ పండు రంగులో ఉన్న సూర్యం శరీరం మీద – ప్రత్యేకించి మెడ మీద, ఛాతీ మీద, లేత నీలం రంగులో మచ్చలు కనిపించేయి. బళ్లారి ఆసుపత్రిలో వైద్యులు ఆర్సెనిక్‌ట్రైఆక్సైడియం మందు వాడినట్లు ఆయనకి చూచాయగా జ్ఞాపకం ఉంది. అంటే పాషాణ త్రికభస్మం. ఈ మందులో ఉన్న లోహాన్ని కాలేయం కాని, మూత్రపిండాలు కాని పరిపూర్ణంగా విసర్జించలేని సందర్భాలలో అది చర్మంలో పేరుకొని నీలి మచ్చలుగా ప్రస్ఫుటం అవుతున్నాయని ఆయన అనుమానం. కాలక్రమేణా వాటి పర్యవసానం ఎలా ఉంటుందో? వైద్యశాస్త్రంలో ప్రావీణ్యం లేని మనిషి కనుక అంతకంటే లోతుగా చూడలేకపోయేరు.

“ఒకప్పుడు ఆర్సెనిక్‌ట్రైఆక్సైడ్ రక్తపు కేన్సరుని – అంటే, లుకీమియాని – కుదర్చటానికి వాడేవారు. ఇసనోఫీలియాని చూసి లుకీమియా అనుకున్నారో లేక లుకీమియాకి వాడే మందుని ఇసనోఫీలియా మీద ప్రయోగాత్మకంగా వాడేరో! ఇప్పుడు కొత్త మందులు వచ్చేక ఆర్సెనిక్ జాతి మందుల వాడకం తగ్గింది కాని, మదరాసు జనరల్ హాస్పిటల్ వారు 1950 దశకంలో ప్రచురించిన ఔషధకోశంలో చూస్తే ఈ మందు పేరు కనబడవచ్చు.” అంటూ డాక్టర్ రవిచంద్ర బళ్లారి డాక్టర్లు ఆ మందుని ఎందుకు వాడేరో ఊహించేరు. తల ఊపి కథ కొనసాగించేను.

ఎల్లోపతీ మందులు గుణం చేసినా చెయ్యకపోయినా హాని చెయ్యగలవని నమ్మే వారిలో రామయ్యగారు ఒకరు. ఎల్లోపతీలో గుణం కనిపించినట్లే కనిపించి రోగం తిరగబెడుతూ ఉంటుందనిన్నీ, అంతేకాకుండా ఎల్లోపతీ మందుల వాడకం వల్ల అవాంఛనీయ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయనిన్నీ ఆయన ఆక్షేపణ.

“సూర్యం ఒంటి మీద మచ్చలకి కారణం పార్వతమ్మ చేసిన విషప్రయోగం వల్ల వచ్చిన మచ్చలయినా కావచ్చు, లేదా ఇంగ్లీషు వైద్యులు ఇచ్చిన మందులలో ఉన్న విషపదార్థాలైనా కావచ్చు కదా? విషపూరితమైన మందులు ఎన్నో ఉన్నాయి కదా?” రవిచంద్ర మరొక అభిప్రాయం వెలిబుచ్చేరు.

రామయ్యగారి భయం అదే! సూర్యం శరీరం మీద మచ్చలు ఇంగ్లీషు మందుల ప్రభావమైనా కావచ్చు లేదా బల్లి విషం వల్ల అయినా కావచ్చు అని ఆయన అనుమానం. నిజంగా బల్లి విషప్రయోగమే జరిగి ఉంటే? దాని ఫలితంగా ఈ నీలి మచ్చలు శరీరం అంతా వ్యాపించి, ప్రాణానికే ముప్పు తెస్తే?

“ఆరోగ్యంగా ఉండే కుర్రాడు నీరసం, నీరసం అంటున్నాడు. ఇవి హోమియోపతీలో ‘లేఖసిస్’ లక్షణాలు. ఈ మందుని పాము గరళం నుండి తయారు చేస్తారు. పాములు, బల్లులు సరీసృపాలే కదా. పాము గరళం విషం అయినప్పుడు బల్లి చొంగ ఎందుకు విషం కాకూడదు?” అని రామయ్యగారు తర్కించుకుని “ఒక వేళ బల్లి విషం శరీరంలో ఉంటే దానికి విరుగుడుగా ఇది పని చేస్తుంది!” అనే నమ్మకంతో లేఖసిస్-30తో వైద్యం మొదలు పెట్టేరు.

“కొమోడో డ్రేగన్ అనే ఒక జాతి బల్లి ఉంది. దీనినే మానిటర్ లిజర్డ్ అని కూడ అంటారు. దీని చొంగలో ఉన్న విషం ఉపయోగించి మధుమేహానికి, అంటే డయబెటీస్‌కి, మందు కనిబెట్టేరనిన్నీ, ఆ మందుని వాడటానికి అమెరికా ప్రభుత్వం అంగీకరించిందనిన్నీ ఈ మధ్యనే ఒక పత్రికలో చదివేను. కనుక బళ్లారి బల్లుల చొంగలో ఏదో విషమో, ఔషధమో ఉందంటే నేను నమ్ముతాను కాని, హోమియోపతీ పద్ధతి శాస్త్రీయమైనదని మీరంటే నేను ఒప్పుకోలేను. ఆ రోజులలో లుకీమియాని కుదర్చటానికి సరి అయిన మందులు లేవు. సూర్యానికి వచ్చినది ఇసనోఫీలియా అయితే దానికి ఆర్సెనిక్‌ట్రైఆక్సైడ్ వాడటం అనేది పిచిక మీద బ్రహ్మాస్త్రం. కాదు, అది నిజంగా లుకీమియా అయినట్లయితే ఆ మందుకి ఆ రోగం కుదిరిందంటే అది కేవలం కాకతాళీయం అని నా నమ్మకం!” అన్నారు డాక్టర్ రవిచంద్ర.

“మీరే కాదు. ఆధునిక వైద్యులంతా చెప్పేది కూడ ఇదే. కాని నెమ్మది మీద సూర్యం ఆరోగ్యం కోలుకుంది. శరీరం మీద మచ్చలు పూర్తిగా పోడానికి పదేళ్లు పైనే పట్టింది. తన హోమియోపతీ వైద్యం వల్లనే సూర్యం పూర్తిగా కోలుకున్నాడని రామయ్యగారి నమ్మకం.”

“ఇలా గుణం కనిపించిన సందర్భాలని మేము ‘ప్లసీబో ఎఫెక్ట్’ అంటాం. అంటే, నమ్మకం ఉన్నప్పుడు పంచదార మాత్రలు కూడ పరమౌషధంగా పని చేస్తాయి.” డా. రవిచంద్ర మరో సారి తన నమ్మకాన్ని వెలిబుచ్చేడు.

“నమ్మకం అంటారా? మూఢ నమ్మకం అంటారా?”

“ఈ ఉదంతం జరిగిన తరువాత సూర్యం ఎన్నేళ్లు బతికేడు?”

“అతను ఇప్పటికీ ఆరోగ్యంగానే తిరుగుతున్నాడు!”

“ఆయనతో కూడ ఒక సారి ముఖాముఖీ జరిపితే నా పరిశోధనా పత్రానికి సాక్ష్యాధారాల మద్దత్తు ఉంటుంది. ఆయనకి సిఫార్సు చేసి ఒక ముఖాముఖీ ఏర్పాటు చేసిపెట్టగలరా…?”

వేళ మూడున్నర దాటింది. గదిలో టెలిఫోను మోగింది.

“మీకు కేటాయించిన సమయం అయిపోయింది. మీ సిద్ధాంత వ్యాసం విజయవంతం అవాలని ఆశిస్తున్నాను.” అంటూ అర్ధగర్భితమైన చిరునవ్వుతో నేను లేచి నిలబడ్డాను.
----------------------------------------------------------
రచన: వేమూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment