Tuesday, October 30, 2018

తైల వర్ణ (వి)చిత్రం


తైల వర్ణ (వి)చిత్రం




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి................

న్యూయార్కు నగరం పొలిమేరలో ఉంది మా ఇల్లు. అందువల్ల అర్థరాత్రి అయినా సరే మా ఆవిడతో పాటు లాంగ్‌ ఐలెండ్‌ జ్యుయిష్‌ మెడికల్‌ సెంటరు మీదుగా, లేక్‌వీల్‌ రోడ్డు మీద ఓ రెండు మైళ్ళు అటు ఇటు వాకింగ్‌కు వెళ్ళడానికి వీలవుతుంది. ఆకురాలు కాలం ప్రారంభం అవ్వగానే మారీ మారని ఆకులు వివిధ రంగులు సంతరించుకుంటున్న ఒకానొక రోజు సాయంత్రం తొమ్మిది గంటలకి భోజనం చేసి “వాక్‌”కి వెళ్ళాం. దార్లో ఉన్న ఓ బస్‌ స్టాప్‌ లో ఓ ఆఫ్రో అమెరికన్‌ (వాళ్ళని నల్లవాడు అని అనకూడదని మా వాడికి స్కూల్లో నేర్పింది వాడు మాకు ఇంట్లో నేర్పేడు) భుజానికో సంచి, చేతిలో ఓ చిన్న పెట్టెతో ఒంటరిగా బస్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. మేం మా వాకింగ్‌ పూర్తి చేసుకొని వెనక్కి వస్తుంటే మళ్ళీ అక్కడే కనిపించాడు దూరం నుండే.

“ఆఖరి బస్‌ మిస్సయ్యేడేమో” అంది కరుణ అని పిలవబడే మా ఆవిడ కె. అరుణ.

“అంటే అతన్ని ఇప్పుడు మనింటికి తీసుకెళ్ళి ఈ రాత్రి ఉంచాలనా నీ ఉదేశ్యం?” అన్నాను భాషకి అందని భావాల్ని పదాల మధ్య “స్మగ్లింగ్‌” చేసే మా ఆవిడ తత్వం తెలిసిన నేను. “వద్దన్నానా?” ఆమె సంక్షిప్త, సాధికార సమాధానం  ప్రశ్నగా. “ఇప్పటికే ఇల్లు సత్రం చేసానంటున్నావ్‌” అని ఆగిపోయాను. “అన్నా అనకపోయినా అయ్యేది అదేగా” అంది నవ్వుతూ. ఇంతలో బస్‌స్టాప్‌ దగరికి వచ్చాం.

“లాస్ట్‌బస్‌ మిస్‌ అయ్యారా?” అని అడిగాను ఇంగ్లీషులో. “లాస్ట్‌బస్‌ ఎప్పుడు?” అని వచ్చీరాని ఇంగ్లీషులో ఫ్రెంచియాసతో అడిగాడు.

బహుశా పూర్వం ఫ్రెంచి వాళ్ళు పాలించిన ఏ ఆఫ్రికా దేశస్థుడో అయి ఉంటాడని అనుకొని మనకొచ్చిన ఫ్రెంచిభాష వెలగబెట్టడానికి అవకాశం వచ్చింది కదాని మనసులో సంతోషించి ఫ్రెంచిలో సంభాషణ సాగించాం.

బస్‌ స్టాప్‌లో ఉన్న టైమ్‌టేబుల్‌ చూసాను. లాస్టు బస్‌ వెళిపోయింది. మర్నాడు ఉదయం 530 నిమిషాలకు మొదటి బస్‌ ఉంది. ఇక్కడ టాక్సీ దొరకాలంటే ఫోను చెయ్యాలి అని చెప్పాను. ఇక్కడ నుండి మెన్‌హటన్‌లో ఉన్న పోర్టు అథారిటీ బస్‌ టెర్మినస్‌, (అంటే పై ఊర్లు వెళ్ళే బస్‌ స్టేషన్‌) వెళ్ళాలంటే ఎంతవుతుంది అని అడిగాడు అతను. “సుమారు 50 డాలర్లు అవుతుంది” అని చెప్పాను. “చాలా ఎక్కువే” అని తటపటాయించాడు .

మా ఆవిడ నేత్రావధానంతోనే “మరెందుకు టైమ్‌ వేస్టు, పిలువు, రాత్రి మనింట్లో ఉండి ఉదయం బస్సులో వెళ్ళమను” అంది. అడగ్గానే వెంఠనే ఒప్పేసుకొన్నాడు. కమరూన్‌ అనే ఆఫ్రికా దేశస్థుడట. విజిటర్‌గా అమెరికా వచ్చాడట. క్వీన్స్‌ అనబడే మేం ఉండే ప్రాంతంలో ఉన్న స్నేహితునితో ఉందామని అతని ఎడ్రస్‌ పట్టుకొని వచ్చాడట. తీరా తన దగ్గర ఉన్న ఎడ్రస్‌ ప్రకారం వెళితే ఆ ఫ్రెండ్‌ ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి చాలారోజులైందని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పారట. అంచేత ఇప్పుడు మెన్‌హటన్‌ వెళ్ళి అక్కడ నుండి వాషింగ్టన్‌ (డిసి) అన్న ఊరు వెళ్ళాలిట. ఈ విషయాలు అన్ని చెప్తుండగానే మా ఇల్లు వచ్చేసింది. అతనికో గెస్ట్‌ బెడ్‌రూమ్‌ చూపించి పడుకోమన్నాం.

అలా వచ్చి ఆ రాత్రి ఉన్న వ్యక్తి ఉదయం వెళ్ళిపోతూ ఓ తైలవర్ణచిత్రం ఇచ్చాడు మేం చేసిన సహాయానికి కృతజ్ఞతతో. అది మోడ్రన్‌ఆర్టులా ఉంది. దానిని ఆ రాత్రే మా ఇంట్లోనే వేశాడుట. అది మాకర్థం కాకపోయినా ఇచ్చాడు కదా అని “మర్సి” (ఫ్రెంచిలో కృతజ్ఞతని చూపించే పదం) అని ఆ తైల వర్ణ చిత్రం తీసుకొన్నాను. అతను వెళ్ళిపోయాడు. మేం దాన్ని మా లైబ్రరీ గదిలో ఓ మూల పెట్టి మరిచిపోయాం దాని గురించి.

కొన్ని నెలల తరవాత చాలా మంది అమెరికన్‌ల లాగే “స్ప్రింగ్‌క్లీనింగ్‌” అని ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసిపారేసే కార్యక్రమంలో ఈ అర్థం కాని మోడ్రన్‌ ఆర్టుని ఏం చెయ్యాలి అని ఒక చిన్న చర్చ జరిగింది మా డైనింగ్‌ టేబుల్‌ దగ్గర. మోడ్రన్‌ ఆర్ట్‌ ఫ్రం కమరూన్‌ ఫర్‌ సేల్‌ అని “పెన్నిసేవర్‌” లో ఎడ్వర్‌టైజ్‌మెంట్‌ ఇస్తే అన్న మా అబ్బాయి సలహా అమలుపరిచాం. ఓ ఆదివారం అందరిని రమ్మని చెప్పాం.

వచ్చిన వారి కారు బట్టి, వారు తైల వర్ణ చిత్రం చూసిన తీరు బట్టి, దాన్ని చూడ్డానికి వారు వెచ్చించిన కాలాన్ని బట్టి మా అమ్మాయి ఆ తైల వర్ణ చిత్రం ధర అతి జాగ్రత్తగా పెంచుకొంటూ పోయింది. సాయంత్రం ఐదు అయ్యింది. “ఎంతో కొంతకి అమ్మేయవే, ఇక బయట పార్టీకి వెళ్ళాలి” అని గట్టిగా చెప్పాను. కారుచవకగా అమ్మేస్తున్నానని చెప్తూ ఖరీదైన కారులో వచ్చిన ఒకాయనకి వెయ్యి డాలర్లకి అమ్మేసింది. అతను చెక్కిచ్చి చిత్రం తీసుకొని వెళ్ళిపోయాడు.

తల్లి, “పుత్రిక పుట్టంగ కాదు, ఆ పుత్రిక ..” అని పుత్రికోత్సాహాన్ని ప్రదర్శించితే ఆ చెక్‌ ఎన్‌కేష్‌ అయి డబ్బురానీ అని కొట్టిపారేశాను. నిజంగానే ఆ వెయ్యి డాలర్లు చెక్‌ ఎన్‌కాష్‌ అయ్యింది అని తెలియగానే ముందు ఆశ్చర్యపోయాను తర్వాత అయ్యో ఆ చిత్రకారుని చిరునామా తీసుకోలేదే అని బాధపడ్డాను.

“నల్లవాళ్ళని చూస్తే భయం అనే వాళ్ళకి, ప్రక్కవాడికి సహాయం చేస్తే ప్రిస్టేజ్‌ పోతుందనుకొనే వాళ్ళకి ఈ కథ చెప్పు. దాని వల్ల ఏ ఒక్కరిలోనైనా, ఎంతో కొంతైనా నల్లవాళ్ళ మీద మంచి అభిప్రాయం వస్తే, అటు వెయ్యి డాలర్లు ఉత్తినే వచ్చాయే అన్న బాధ ఉండదంది మా ఆవిడ.

అందుచేత ఈ కథ వేసుకొన్న వారికి, చదివిన వారికి, చదివి వినిపించిన వారికి, విన్నవారికి, విని మరొకరికి చెప్పిన వారికి, స్వంత తైలం (కాలం గట్రా) కొంత పోయినా ఏదైనా ఓ మంచి విచిత్రం జరుగుతుంది!

(1999లో న్యూయార్క్‌ టైమ్స్‌ న్యూస్‌ పేపర్‌లో మెట్రా సెక్షన్‌లో మొదటిపేజీలో వచ్చిన వార్త ఆధారంగా వ్రాసినది.)
-----------------------------------------------------------
రచన: కలశపూడి శ్రీనివాసరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment