Monday, October 1, 2018

పూర్వీకం(అనువాదకథ)


పూర్వీకం(అనువాదకథ)





సాహితీమిత్రులారా!

ఈ అనువాద కథను ఆస్వాదించండి............

ఆ వర్క్‌షాప్‌ని ఫ్రాన్స్‌లోని ఒక మారుమూల గ్రామంలో ఏర్పాటు చేశారు. ఆరు రోజుల వర్క్‌షాప్ అది. నలభై దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. మరేముంటుంది, ప్రపంచాన్ని పునరుద్ధరించడమే లక్ష్యం!

మాకు బుక్ చేసిన రిసార్ట్ ఒక చెరువు వైపుకు ఉంది. ఆ ఒక్క కారణం చేతనే అద్దె ఎక్కువట! ఆ వర్క్‌షాపుకొచ్చిన వాళ్ళలో నలుగురం అక్కడ బస చేశాము.

పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడే హలోలు చెప్పుకుని మొదటిసారి పలకరించుకున్నాం. బాస్నియా దేశంనుండి ఒక యువకుడు వచ్చాడు. వాడు నిర్వహించే పదవికి వాడి వయసు చాలా తక్కువ అనిపించింది. పాత సోవియట్ యూనియన్ నగరమైన కీవ్ నుండి ఒక మగువ వచ్చింది. పేరు అన్నా. ఆమెకు ముప్పై ఏళ్ళుంటాయి. చూడటానికి చాలా అందంగా ఉంది.

మరో వ్యక్తి కెనడానుండి వచ్చిన ముసలాయన. పపుఆ న్యూ గినీ ద్వీపంలో ఆదివాసులకు తాగడానికి యోగ్యమైన నీరు అందించే మహత్తరమైన పని చేస్తున్నాడు

వర్క్‌షాపులో నడుములు పడిపోయేంతలా పనులు. తెల్లవారి మొదలైతే రాత్రివరకు సాగుతాయి. అలసిపోయి వచ్చి పడుకోవడానికి మాత్రమే సమయం సరిగ్గా సరిపోతుంది. వర్క్‌షాప్ అన్న పేరుకు తగ్గట్టే ఇనుమును కొలిమిలో కాల్చినట్టు ఇక్కడ మమ్ముల్ని వేపుతున్నారు అంటే అతిశయోక్తి కాదు.

చివరి రోజు వర్క్‌షాప్ అయిపోయింది; ఇక ఒక రాత్రి మాత్రమే ఉంది. రాత్రి భోజనం లేక్ వ్వ్యూ రెస్టారెంట్లో చేద్దామని మేం నలుగురం నిర్ణయించుకున్నాం. ముగ్గరం అన్నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాము.

ఈ కీవ్ మహిళ గురించి ఆమె వచ్చేలోపు కొంచం పరిచయం చేస్తే మంచిది. ముందుగానే తెలుసుకుంటే మీకూ ఊరటగా ఉంటుంది; నాకూ పని సుళువైపోతుంది. ఎందుకంటే ఆమే ఈ కథకి నాయిక!

తొలిరోజే నేనామెను గమనించాను. ఆమెది హృదయాన్ని కట్టిపడేసే అందం కాదు. అయితే ఆకర్షణీయంగా ఉంటుంది. చిక్కని ఆకుపచ్చ రంగు కళ్ళు. ఆమె ఒంటి ఛాయని మంచు దేశపు మనుషులకుండే తెలుపు ఛాయ అనలేము. ఇలాంటి మేనిఛాయ కోసమే ఐరోపా దేశాల ఆడవాళ్ళు తూర్పు దేశాల సముద్రతీరాలకెళ్ళి గుడ్డపేలికలు చుట్టుకుని మండే ఎండలో అష్టకష్టాలు పడుతుంటారు- అని చెప్తే మీకు అర్థం అవుతుంది, ఈమె మేని ఛాయ ఎటువంటిదోనని. ఇంగ్లీష్, రష్యన్, ఫ్రెంచ్ భాషలు అలవోకగా మాట్లాడుతుంది. ఆమె ఫ్రెంచ్ చాలా చక్కగా, స్పష్టంగా ఉంటుంది. ఈమె సాయం మాకు అప్పుడప్పుడూ కావలసొచ్చిందికూడా అందుకే.

ఇక్కడికొచ్చిన రెండోరోజున ఒక సంఘటన జరిగింది. ఇది పల్లెటూరు కావడంతో బ్యాంకులో కొన్ని సౌకర్యాలు లేవు. ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి మచ్చుకైనా లేడు. నా ట్రావెలెర్స్ చెక్ మార్చుకుందామని అక్కడికి వెళ్ళినప్పుడు ఈమె ఏటీయెమ్‌లో డబ్బులు తీసుకుంటూ కనిపించింది.

నేను ఈ ఏటీయెమ్ మెషిన్‌లను నమ్మను. దానికి ఆకలేసినప్పుడల్లా కార్డుని మింగేసే స్వభావం ఉంది. ఒకసారి అలాగే నా కార్డుని మింగేసింది. అయితే ఈమె గొప్ప నేర్పరిలా ఉంది; డబ్బులు డ్రా చేసుకోవడమేకాకుండా కార్డుని కూడా దక్కించుకుంది.

పరస్పరం చిరునవ్వులు చిందించుకున్నాము. చిరునవ్వు వికసించింది అన్నట్టుగా నవ్వేప్పుడు నిజంగానే ఒక చిరునవ్వు ఈమె పెదవుల్లో వికసించినట్టే ఉంది.

ఈ వర్క్‌షాప్ ముగిసేలోపు ఈమెతో నాకు ఒక సన్నిహితమైన సంఘటన జరుగబోతోందని అప్పుడు నాకు తెలియదు. అందుకనే అతి సాధారణమైన ఒక మారుమూల గ్రామంలో ట్రావెలెర్స్ చెక్స్, డాలర్ కరన్సీలు మార్చడంలో ఉండే ఇబ్బందుల గురించి మాట్లాడుకున్నాము. బ్యాంక్ కార్యదర్శితో నా గురించి చెప్పి, రికమెండ్ చేసి నా ట్రావెలెర్స్ చెక్‌ను మార్చుకోడానికి సాయంచేసింది. థేంక్సయినా ఆశించకుండా క్షణంలో మాయమైపోయింది.

వర్క్‌షాపులో ఎప్పుడూ ఒక బ్యాచ్ ఆమె చుట్టూ కలకలలాడుతూ మూగుతుంటారు. బాస్నియా యువకుడు ఆమె మీద మనసు పారేసుకున్నట్టున్నాడు. ఆమె దృష్టిలో పడాలని, ఆమెతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం కోసం తహతహలాడటం స్పష్టంగా వాడి ప్రవర్తనలో కనిపిస్తుంది.

నాలుగవ రోజు వర్క్‌షాపులో ఒక సంఘటన జరిగింది. ఉక్రెయిన్ దేశంలో స్త్రీల జీవిత విధానాల గురించి, వారి సమస్యల గురించిన వివరాలను అన్నా గ్రాఫులు, బొమ్మల ధ్వారా అందమైన ప్రెజెంటేషన్‌ని స్క్రీన్ మీదకెక్కించింది. ఒక్కో గ్రాఫునీ సమాచారాన్నీ లేసర్ పాయింటర్‌తో హైలైట్ చేసి వ్యాఖ్యానించింది. వచ్చిన ప్రశ్నలన్నిటికీ చమత్కారంగానూ సమాచారపూరితంగానూ జవాబిలిచ్చింది. ఆ సమయానికే ఎ.సి. ఆగిపోవడంతో హాల్‌లో ఉక్కపోత పెరిగింది. కొందరు తమ ఓవర్‌కోట్లను తీసేశారు.

ఈమె కూడా తన ఓవర్‌కోట్ తీసేసింది.

సభ నివ్వెరపోయింది. ఇలా కూడా ఒక స్త్రీ తన అందాన్ని దుర్మార్గంగా దాచుకుంటుందా అని చాలామందికే అనిపించి వుండాలి. ఆ తర్వాత ఆమె మాటల్ని గానీ వివరిస్తున్న గ్రాఫుల్ని గానీ ఎవరూ చూస్తున్నట్టూ వింటున్నట్టూ నాకనిపించలేదు.

రాత్రి ఎనిమిదైనా అస్తమించాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టున్నాడు పడమటి సూరీడు. కాలికి స్కేట్లు కట్టుకుని ఇద్దరు అమ్మాయిలు ఆడుకుంటున్నారు. నీటి గుర్రాల్లా బలిసిన పదిపన్నెండు పశువులు అడుగులో అడుగులేసుకుంటూ వెళ్తున్నాయి. వాటి మెడల్లో గంటలు వేలాడుతున్నాయి. అవి ఒక్కో అడుగుకీ ఒక్కో స్వరం పలుకుతున్నాయి. మనిషి ప్రమేయంతో కల్మషం కాని అపూర్వమైన ఆ సంగీతానికి మనసు పులకించింది.

మేము వైన్ ఆర్డర్ చేసుకుని సిప్ చేస్తూ ఉండగా అన్నా వచ్చింది, పొడవైన దుస్తుల్లో! రాగానే డిన్నర్ టేబుల్ ప్రోగ్రామ్‌తోపాటు ఫ్రెంచ్ భాష లావాదేవీలన్నిటినీ తను చూసుకుంటానంది.

ఫ్రాన్స్ దేశంలో ఏ మూలకెళ్ళినా రెస్టారంట్లలో మూడు గంటలకంటే తక్కువ సమయంలో డిన్నర్ ముగించలేము. ఈ విషయం మాకు అర్థం అయింది. కాబట్టి, అన్నా మా అందరికీ తనే సమయానికి తగినట్టు ఆర్డర్ చేసింది. సన్నటి పొడవు గ్లాసుల్లో సర్వ్ చేసిన వైన్ పొట్టలోకి దిగేకొద్దీ అక్కడి వాతావరణం తేలికపడింది. మనుషుల మధ్య చోటుచేసుకున్న అన్యతా భావం కరిగి అన్యోన్యత పెరిగింది. అన్నా నవ్వుల పువ్వులు అప్పుడప్పుడూ వికసించి చెరువు నీటి అలలమీద తేలియాడాయి.

నా పూర్తి పేరు అడిగి చెప్పించుకుని, “ఓ! మీరు తమిళులా?” అని ఆశ్చర్యపోయింది.

“క్షమించాలి. ఇకమీదట అలాంటి తప్పు చెయ్యను.” అన్నాను.

ఆమె నవ్వుతూ, “తమిళ్ చాలా క్లిష్టమైన భాష కదూ? ఎలా మేనేజ్ చేస్తారు?” అనడిగింది.

“ఏం చెయ్యమంటారు? కష్టమే. అయితే మా ఊళ్ళో ఒక వినూత్నమైన పద్దతి ఉంది. తల్లులు తమ పిల్లలకి పాలతోబాటే భాషని కూడా పట్టిచ్చేస్తారు. అంతే కాదు పుట్టగానే తలదిండు పరిమాణంలో ఉండే నిఘంటువునీ చేతికిచ్చేస్తారు.” అన్నాను.

“మా అమ్మ చాలా స్ట్రిక్ట్. ఇలా ముందూ వెనకా పరిచయంలేని మగవాళ్ళతో కలిసి నేను వైన్ తాగుతున్నానని తెలిస్తే నా పని పడతారు!” అని చెప్పి గలగలమని గట్టిగా నవ్వింది. చుట్టూ ఉన్న టేబుళ్ళవద్ద వున్న పలువురి తలలు మా టేబుల్ వైపుకి తిరిగాయి.

డాన్స్ మ్యూజిక్ మొదలైంది. బాస్నియా యువకుడు ధైర్యం తెచ్చుకుని, “డాన్స్ చేద్దామా?” అనడిగాడు. ఆమె కూడా క్షణమైనా అలోచించకుండా సరేనంటూ లేచివెళ్ళింది.

డాన్స్ ఫ్లోర్‌లో ఎవ్వరూ లేరు. వీళ్ళిద్దరే ఆడారు. దీర్ఘకాల వియోగం తర్వాత కలుసుకున్న ప్రేమికుల్లా ఒకరినొకరు పొదివిపట్టుకుని డాన్స్ చేశారు. ఆమె చన్నులు ఆతన్ని అదుముకున్నాయి. ఆ సంగీతంలో ఒక శోకజీర తొణికిసలాడింది. మైమరచి ఆడుతున్న వారిని మేము కూడా మైమరచి చూస్తు ఉండిపోయాము.

డాన్స్ చేస్తూనే తన సిగ పిన్ను తీసేసి, జుట్టుని స్వేచ్ఛగా కిందికి జార్చింది. జుట్టునలా వదులుగా వదిలేశాక ఆమె అందం మరింత కొత్తగా కనిపించింది. ఆమె కళ్ళలో కవ్వింత హెచ్చినట్టనిపించింది. వారి డాన్స్‌లో ఇప్పుడు కొంచం తడబాటు చోటు చేసుకుంది. ఆమె ఆనందపు నవ్వులు హెచ్చాయి.

మొదటిసారి పెద్దాయన మాట్లాడారు. “ఇక్కడ మేము అనుకోకుండా కలిశాము. బాస్నియాలో పని చేసే వ్యక్తి, సోమాలియా శరణార్ధుల రక్షకుడు, కీవ్ స్త్రీ సేవకి, పపుఅ న్యూ గినీ తాగునీరు నిపుణుడు, ఒక్కచోట కలుసుకోవడం ఒక అపూర్వ సమావేశం కాదూ? ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఈ రోజు ఏ దేశంలోనో వెళ్ళి సేవలు చేస్తున్నాము. ఈ అరుదైన సమయంకోసం వైన్ తాగుదాం…” అన్నాడు. “మా పూర్వీకం కోసం!” అని చెప్పి గ్లాసు అందుకుని పైకెత్తాడు. మేమూ గ్లాసుల్ని పైకెత్తి ఆమోదం పలికాము.

అప్పుడు అన్నా అంది, “అమెరికావాడు ఫిలిపైన్స్ దేశానికెళ్ళి పౌరసత్వం కోరుతున్నాడు. జెర్మనీవాడు కెనడాలో ఉంటున్నాడు. ఇండియావాడు ఆస్త్రేలియా వెళ్తున్నాడు. పూర్వీకం ఎక్కడ అన్నది వెతకడాన్ని ఇంక వదిలేయాలి. ఇంకో వందేళ్ళలో అందరం ఒక్క రేసువాళ్ళమే‌ అయిపోతాం!” అని గ్లాసు పైకెత్తి, “ఒకే రేస్ కోసం!” అని గట్టిగా అంది. ఆమె ఆ మాటన్నందుకు కూడా మేము గ్లాసులు పైకెత్తి ఒక గుక్క తాగాము.

ఇంతలో మా ఆహారాలు వచ్చాయి. ఈ ఫ్రెంచ్ వాళ్ళకి భోజనకళలో జ్ఞానమెక్కువ. ఆహారాన్ని అలంకరించిన తీరు, రుచి ప్రపంచాన్ని మరిపింపజేశాయి. చెరువునీటి అలలమీంచి తేలివచ్చే చిరుగాలి తాకుతుండగా, రెడ్ వైన్ మెల్లగా మత్తెక్కిస్తోంటే, మా మనసులు ఒక కొత్త సంతోషంలో తేలియాడుతున్నాయి.

తరువాయి సంభాషణలు ఏ దిక్కులో వెళుతున్నాయో తెలియదు. ఏనుగులును ట్రెయిన్ చేసేవాళ్ళ గురించి ఒక చర్చ జరిగింది. తర్వాత వాతావరణ కేంద్రాల గురించి. చివరిగా సోప్ కవర్ల గురించిన చర్చలో ఆగింది.

ఉన్నట్టుండి అన్నా మళ్ళీ మాట్లాడింది. “మా అమ్మ చాలా స్ట్రిక్ట్. నా శీలాన్ని కాపాడడానికి తన జీవితకాలంలో సగాన్ని ఖర్చు చేసుకుంది. నా స్నేహితురాళ్ళు వాళ్ళ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళి జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం ఇంట్లో అంట్లు కడుగుతూ, కప్పులు తుడుచుకుంటూ ఉండాల్సొచ్చింది. కాలాన్ని ఎంతలా వృధా చేశానో!”

బాస్నియావాడు కొంచం మందు మత్తులో ఉన్నాడు. ఆ తెగువతో వాడు, ‘అన్నా, బాధపడకు. నేను ఉన్నాను కదా? యూ కెన్ మేకప్ ఫర్ ది లాస్ట్ టైమ్!’ అన్నాడు. అందరూ నవ్వారు. అన్నా నవ్వు మాత్రం హెచ్చుగా దీర్ఘంగా సాగింది. అది సహజమైన నవ్వు కాదు. ఏదో దుఃఖాన్ని దాచుకోడానికి చేస్తున్న ప్రయత్నంలా అనిపించింది.

అన్నా అటూ ఇటూ చూసి సన్నటి గొంతుతో, “మీకొకటి తెలుసా?” అని అడుగుతూ టేబుల్ మీదకి వంగింది.

మేము ఆసక్తిగా మా మెడలను వంచి ఆమె వైపుకి తలలు టేబుల్‌కి తాకేలా పెట్టి చూస్తూ ఉన్నాము. ఆమేమో గలగలమని నవ్వసాగింది. “తనకి అవసరంలేని విషయాన్ని తెలుసుకోడానికి మనిషి ఎంతకైనా దిగజారడానికి వెనుకాడడు!” అంది. మాకు సిగ్గేసింది.

ప్రపంచంలో మరెక్కడా దొరకని, ఫ్రాన్స్ దేశపు ప్రత్యేకమైన తల్ల-కిందుల పుడ్డింగ్ వచ్చింది టేబుల్ మీదకు. ఉడికించిన యాపిల్ పళ్ళతో చేస్తారు దీన్ని. తీపికి కొంచం కింది స్థాయిలో ఉండే ఒక అపురూపమైన రుచి. అన్నా పరిస్థితి చూస్తే కొంచం తడబడుతూ ఉన్నట్టనిపించింది. తూలిపోతూనే వెయిటర్‌ని పిలిచి మరొక వైన్ తెమ్మంది. వాడు అటు వెళ్ళగానే ఒక ఇంగ్లీషు బూతు వాడి మీద విసిరింది. కీవ్ నుండి వచ్చిన అన్నా అనబడే ఈ అందమైన వనిత, డీసెన్సీ పరిధిని మెల్లమెల్లగా దాటిపోతూ ఉంది. ఆమె ఒళ్ళు వణకసాగింది. మాటలు తడబడ్డాయి.

మేము ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాము. బాస్నియా యువకుడు పిచ్చిబట్టినవాడిలా కూర్చుని ఉన్నాడు. పెద్దాయన ఇలాంటొక ఇబ్బందికరమైన పరిస్థితిని ఎప్పుడూ అనుభవించుండడు. ఇబ్బందిపడుతున్నాడు.

‘ఇంకా వైన్ కావాలి’ అని చిన్నపిల్లలా మొండిచేస్తోంది. మాకు ఎక్కువ మోతాదు పోసుకుని ఆమె గ్లాసులో అతి కొంచంగా ఒంపాము. బూతులు తిడుతూ లేచి నిల్చుంది. నిలబడలేక ఒళ్ళు అటూ ఇటూ తూలింది.

ఇప్పుడు ఆ రెస్టారంట్‌లోని పలువురి తలలు మా వైపుకే చూస్తూ ఉన్నాయి.

“మా అమ్మ చాలా స్ట్రిక్ట్. నేను మీకు చెప్తున్నాను. చాలా బాధతో చెప్తున్నాను. దీర్ఘకాలంగా కాపాడుకున్న నా కన్యాత్వాన్ని ఛేదించడానికి మనిషి కావాలి. మీలో ఎవరు సిద్ధంగా ఉన్నారు?” అని గట్టిగా అడిగింది.

పెద్దాయన నేలకేసి చూస్తూ కొయ్యబారి నిల్చున్నాడు. పరిస్థితి విషమించేలా ఉంది. ఆమె తూలిపోతూనే సంచి తీసి భుజానేసుకుని గది తాళం తీసుకుంది.

నేనూ బాస్నియా యువకుడూ లేచి ఆమెను చెరోచేయి పట్టుకుని చిన్నగా మూడో అంతస్తుకి తీసుకెళ్ళాం. కొన్నిసార్లు ఆమె పడిపోబోతుంటే, ఇంకాస్త దగ్గరగా పట్టుకోవలసివచ్చింది. గది తలుపు తీసి ఆమెను పరుపుపైన పడుకోబెట్టాము. ఆమె కాళ్ళకున్న మృదువైన లెదర్ చెప్పులని తీసివేశాము.

ఆరోజుకి కావలసినన్ని షాకులు తగిలాయి అనుకుంటూ వెనుతిరుగుతుండగా, “ధన్యవాదాలు, పిరికి సన్నాసుల్లారా!” అంది.

మా వైపుకి తీక్షణంగా చూసింది. తన కుడి చేయిని గౌనులోకి పోనిచ్చి ఎడమపక్క రొమ్ముని తీసి విసిరేసింది. తర్వాత కుడివైపు రొమ్ముని పీకి నా ముఖాన విసిరింది. దూది సంచిలాంటిదేదో ఎగురుకుంటూ వచ్చి నా ముఖాన్ని తాకి కింద పడింది.

మరసటి రోజు కావాలనే నేను ఆలస్యంగా నిద్రలేచాను. వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వాళ్ళ విమానాలెక్కడానికి వెళ్ళిపోయారని హోటల్ అమ్మాయి వచ్చీరాని ఇంగ్లీషులో చెప్పింది. నా విమానానికి ఇంకా బోలెడు సమయం ఉంది. నెమ్మదిగా బిల్ చెల్లించి ఏర్‌పోర్ట్‌కెళ్ళడానికి సిద్ధమయ్యాను.

ఈ కథ ఇక్కడే ముగిసుండాలి. ఆరునెలల తర్వాత జరిగిన మరొక సంఘటనవల్ల ఇంకొక పారాగ్రాఫ్ రాయాల్సిన అవసరం ఏర్పడింది. ఊసుపోక ఒకరోజు మా ఆఫీసు మంత్లీ మేగజిన్‌ని తిరగేస్తున్నాను. అందులో అన్నా ఫోటో అచ్చయివుంది. ఫోటో కింద ఇలా రాసివుంది…

స్త్రీల జీవనాభివృద్ధికొరకు నిర్విరామంగా కృషిచేసిన కీవ్ మహిళ, గత పదేళ్ళుగా కేన్సర్‌తో పోరాడుతూ చివరికి కన్నుమూశారు. ఆమె పేరు అన్నలక్ష్మి సేరకోవ్.

దూదిపింజె తాకినట్టు ఆమె రొమ్ము నా ముఖాన్ని తాకిన ఆ స్పర్శ తప్ప మరేదీ నాకప్పుడు గుర్తుకు రాలేదు.
----------------------------------------------------------
రచన: అవినేని భాస్కర్, 
మూలం: ఎ. ముత్తులింగం,
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment