Tuesday, October 2, 2018

ఏ మతమూ నీదంటే…


ఏ మతమూ నీదంటే…



సాహితీమిత్రులారా!



ఈ కథను ఆస్వాదించండి..................

సరిహద్దులో మొదలైన గొడవలు అరికట్టేందుకు సైన్యం వెళ్ళడానికి ముందు రోజు కేంప్‌లో ఓ పెద్దాయన హవన్ మొదలుపెట్టాడు. ఇండియన్ ఆర్మీకి ఇది సాధారణమే అయినా వచ్చిన వాళ్ళలో సిక్కులూ, క్రైస్తవులూ, మహమ్మదీయులూ ఉండడం ఆర్మీలో కొత్తగా చేరిన శ్రీవాత్సవకి ఆశ్చర్యం కలిగించింది. ఇంకా పెద్ద ఆశ్చర్యం శ్రీవాత్సవకి తెలిసిన –బాహాటంగా తనకి మతమే లేదని చెప్పుకునే– మేజర్ అబ్దుల్ కరీమ్ రావడం, తిన్నగా అందరితోపాటు హవన్ చేసే చోటుకు వెళ్ళి ఆ మంటలో అందరితో పాటు గరిటతో నెయ్యి వేయటం. అదయ్యాక ప్రసాదం కూడా తిని నవ్వుకుంటూ బయటకి వెళ్ళిపోయేడు అబ్దుల్ కరీమ్. శ్రీవాత్సవతో ఎవరో చెప్పారు తర్వాత అబ్దుల్ కరీమ్ గురించి. మతం అనేది నమ్మకపోయినా కేంప్‌లో జరిగే ప్రతీ పూజకీ హవన్‌లకీ వస్తాడట కరీమ్ భేషజం ఏమీ లేకుండా.

శ్రీవాత్సవకి ఆర్మీలో జేరుతూనే అబ్దుల్ కరీమ్‌కి రిపోర్ట్ చేశాడు. పేరు చెప్పగానే అబ్దుల్ అడిగేడు శ్రీవాత్సవని “కహాసేహో భాయ్?”

“లక్నో,” శ్రీవాత్సవ చెప్పేడు సీనియర్ తనని ఎలా ఏడిపిస్తాడో అనుకుంటూ.

“మీ హిందూమతంలో దేవుళ్ళెంతమందో తెలుసా?” మరో ప్రశ్న.

“సరిగ్గా లెక్క తెలీదు కానీ, మూడు కోట్లమంది అని చెప్పుకోవడం విన్నా,” నవ్వేడు శ్రీవాత్సవ.

“తీన్ కరోడ్! బాప్ రే! నీకు ఆ మూడు కోట్ల మంది పేర్లు తెలుసా?” బిగ్గరగా నవ్వుతూ అడిగేడు అబ్దుల్ కరీమ్.

చుట్టూరా ఉన్న అందరూ పగలబడి నవ్వుతూంటే శ్రీవాత్సవ కూడా నవ్వేడు తెలీదని చెప్పడానికి తల అడ్డంగా ఊపుతూ. తర్వాత శ్రీవాత్సవ ఎప్పుడు కనపడినా కరీమ్ “అరే తీన్ కరోడ్, అఛ్ఛా హై? సబ్ ఠీక్?” అని పలకరించడం మొదలుపెట్టాడు.

మర్నాడు రాత్రి సరిహద్దులో మొహమాటానికి చేసే చిన్న చిన్న కాల్పులు అనుకున్నవి రెండు రోజులు భీకరంగా జరిగేక రెండు వైపులా జవాన్లు చాలామందే పోయారు. కాల్పులు విరమించమని ఆర్డర్ వచ్చి, యుద్ధం దాదాపు అయిపోయేసరికి అబ్దుల్ కరీమ్‌కి కాలులోకి బులెట్లు దిగబడి బాగా గాయాలయాయి. రక్తం మరీ కారిపోకుండా బాషా కరీమ్ గాయాలకు గుడ్డలు ఒత్తిపెట్టి పట్టుకున్నాడు. శ్రీవాత్సవ ట్రాన్స్‌మిటర్‌లో ఆర్మీ మెడిక్స్‌కి సమాచారం అందించేడు. కాసేపట్లో హెలికాప్టర్ పంపుతామన్నారు. అప్పటిదాకా శత్రువులు ఈయన్ని సజీవంగా పట్టుకోకుండా శ్రీవాత్సవ దూరంగా, బాషా దగ్గిరలోనూ ఉండి ఈయనకి కాపలా కాయమని ఆర్డర్లు వచ్చేయి. ‘కాసేపు’ అనేది ఎంతకాలమో ఎవరూ చెప్పలేనిది. ఎందుకంటే ప్రాణం పోయే కేసులు ముందు చూస్తారు. అబ్దుల్ కరీమ్ కంటే ఎక్కువ గాయపడినవాళ్లని తీసుకెళ్ళాక ఈయన వంతు. ఏ పరిస్థితుల్లోనైనా సరే కిందపడిన కామ్రేడ్‌ని ఎప్పడూ ఎక్కడా ఒక్కడినీ వదలకూడదనే రూల్ ఉండనే ఉంది కదా సైన్యంలో!

శ్రీవాత్సవ చేతిలో గన్ పట్టుకుని చుట్టూ గస్తీ తిరుగుతున్నాడు. మాటలు వినిపిస్తున్నయ్.

“బాషా, ఔర్ కౌన్ హై యహా? కితనే బచే హై?”

“సిర్ఫ్ తీన్ కరోడ్.”

“నా ప్రాణం అంత ఊరికే పోదుగానీ పోతే కాలు పోవచ్చు. ఈ లోపున మగతలోకి పోతే…”

“నీకేం కాదు భాయ్, హెలికాప్టర్ వస్తోంది అని చెప్పారుగా?”

“అది రావడానికేంలే కానీ, ఏదైనా కబుర్లు చెప్పు.”

“దేని గురించి భయ్యా?”

“ఏదైనా సరే, లేకపోతే పాటో, పద్యమో ఏదో ఒకటి.”

“నాకు అంత రాదు భాయ్.”

“అరే బేవకూఫ్, నువ్వు కబుర్లూ చెప్పలేవు పాటా పాడలేవు. జా తీన్ కరోడ్‌కో బులా,” అబ్దుల్ కంఠంలో కోపం.

శ్రీవాత్సవ నుంచి కాపలా డ్యూటీ బాషా తీసుకున్నాక అబ్దుల్ కరీమ్ మళ్ళీ మాట్లాట్టం మొదలుపెట్టేడు, “అరే తీన్ కరోడ్, ఏవైనా కాసిని కబుర్లు చెప్పగలవా హెలికాప్టర్ వచ్చేలోపు?”

“సరే. సరిగ్గా, మూడే మూడు మాటల్లో ఓ ఏనుగుని రిఫ్రిజిరేటర్‌లో పెట్టడం ఎలాగో చెప్పగలవా అబ్దుల్ భయ్యా?” శ్రీవాత్సవ కరీంని నవ్వించడానికి ప్రయత్నం చేసేడు.

“ఇదో పాత జోకు, అందరికీ తెల్సినదే, అదొద్దు కానీ ఓ పాట పాడు.”

“ఏవో కొన్ని భజన పాటల్లాంటివే వచ్చు భాయ్. నా గొంతు అసలే గాడిద గొంతు,” నవ్వుతూ చెప్పేడు శ్రీవాత్సవ.

“మరేం ఫర్లేదు, కానీయ్!”

“ఏక్ మంత్ర జపతే రహో శ్యామ్, శ్యామ్ శ్యామ్ శ్యామ్, రాధే శ్యామ్ …”

“కొంచెం గొంతు పెంచి గట్టిగా పాడు.”

“… మన్ వచన్ హృదయ్ సే ఉస్కీ వందనా కరో…. దుఃఖహార్తా సుఖకర్తా కహ్ కరో ప్రణామ్.. శ్యామ్ శ్యామ్ శ్యామ్, రాధే శ్యామ్, శ్యామ్ శ్యామ్ శ్యామ్.”

“పాడుతూ ఉండు!”

“పుత్ర పితా, బంధు మిత్ర స్వార్ధీ సభీ… కోయీ తేరే కామ్ నహీ ఆయేంగే కభీ… ప్రభుకే చరణోంకే తుమ్ బనో గులామ్… శ్యామ్ శ్యామ్ శ్యామ్, రాధే శ్యామ్, శ్యామ్ శ్యామ్ శ్యామ్…”

“అచ్చా హై. ఏ రామ్ శామ్‌కో చోడో. ఔర్ కొయీ గానా ఆతాహై?”

“ఏవో చిన్నప్పుడు స్కూల్లో నేర్పిన హిందీ పాట వచ్చు భయ్యా.”

“సరే కానీయ్. ఏదో ఒకటి హెలికాప్టర్ వచ్చేదాకా.”

“జెండా ఊంఛా రహే హమారా, విజయీ విశ్వ తిరంగా ప్యారా…”

“ఇంకా గట్టిగా…”

“సదా శక్తి సరస్‌నే వాలా, ప్రేమ్ సుధా బరస్‌నే వాలా, మాతృ భూమికి తన్ మన్ సారా, జెండా ఊంఛా రహే హమారా, విజయీ విశ్వ తిరంగా ప్యారా…”

పాట సాగుతూంటే కాలు దెబ్బతిని నేల మీద పడుకునున్నా అబ్దుల్ కరీమ్ కుడి చేయి తలమీదకి తెచ్చి శాల్యూట్ చేయడం చూసి శ్రీవాత్సవ కళ్ళలో నీళ్ళు తిరిగేయి. మరింత బిగ్గరగా పాడడం కొనసాగించేడు.

“ఇస్ ఝండే కే నీచే నిర్భయ్, లే స్వరాజ్ యహ్ అభిచల్ నిశ్చయ్, బోలో భారత్ మాతా కీ జై, స్వతంత్ర హై దేహ్ హమారా, జెండా ఊంఛా రహే హమారా, విజయీ విశ్వ తిరంగా ప్యారా…”

పాట పూర్తయింది. కరీమ్ కళ్ళు చిన్నగా మూతపడసాగేయి. శ్రీవాత్సవ అది గమనించి కరీమ్‌ని మాటల్లో పెడదామని ప్రయత్నం చేసేడు.

“కరీమ్ భాయ్! ఒకటడగనా? బురా మత్ మాన్‌నా.”

“హాఁ, ఏంటి?”

“అవునూ, నువ్వు ముస్లిమ్ కదా, మరి హవన్‌లకూ పూజలకూ వస్తావ్ కదా. నీ మతం ఒప్పుకుంటుందా?”

“అరే తీన్ కరోడ్! క్యా బాత్ కర్‌తాహై తూ! ఆర్మీలో మన మతం ఒకటే. వతన్ హమారా పహ్లా ఔర్ ఆఖరీ మజ్‌హబ్. దేశం తర్వాత ముఖ్యం మన కూడా ఉన్న సోల్జర్. అవన్నీ అయినాకే అల్లా అయినా, రామ్, శ్యామ్, తుమ్హారా ఔర్ తీన్ కరోడ్ భగవాన్. మేరా మక్సద్ బస్ ఏక్ హై. తిరంగాకో లెహరాతే దేఖనా. దేశం కోసం చచ్చిపోయినా గర్వంగా పోతాను. నేను పోతే ఏడవద్దని మా అమ్మీ, అబ్బాలకు చెప్పాను. జెండా ఊంచా రహే హమారా, విజయీ విశ్వ తిరంగా…” ఆవేశంగా మొదలయిన కరీమ్ గొంతు రాను రానూ మూగబోసాగింది.

అదృష్టవశాత్తూ ఇంతలోనే హెలికాప్టర్ చప్పుడు వినిపించింది.

బేస్ కేంప్‌కి వచ్చిన తరవాత శ్రీవాత్సవ కరీమ్ గురించి వాకబు చేశాడు. కరీమ్ కాలు తీసేశాక రెండు మూడు రోజులు బతికాడు. తల్లినీ తండ్రినీ పిలిచారు కూడా కానీ వాళ్ళొచ్చేలోపునే కరీమ్ పోయాడు. అతనికి గన్ శాల్యుట్ చేసే రోజున శ్రీవాత్సవ కూడా వెళ్ళాడు యూనిట్ వాళ్ళందరితో కలిసి.

చూడ్డానికేవుంది? మొహం ఒకటే కనిపించేలా జెండా కప్పారు పేటికలో. అతని పతకాలు అలంకరించారు. పేటిక ముందు నిలబడి సెల్యూట్ చేస్తున్న శ్రీవాత్సవకు కరీమ్‌ను చాపర్ ఎక్కిస్తున్నప్పుడు, ఆ పరిస్థితిలో కూడా “అన్నీ మంచిగౌతయ్. భయపడకు. అరే తీన్ కరోడ్, నీ మూడు కోట్లమందిలో ఒకడికైనా తీరికుండదా భాయ్, నన్ను చూసుకోడానికి!” అంటూ ఆ స్థితిలో కూడా నవ్వడం గుర్తొచ్చి, శ్రీవాత్సవకి ఒక్కసారి గుండె గొంతుకలోకి వచ్చినట్టనిపించింది.
----------------------------------------------------------
రచన: ఆర్. శర్మ దంతుర్తి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment