Wednesday, October 3, 2018

శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము


శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము





సాహితీమిత్రులారా!

శ్రీకృష్ణదేవరాలవారి పేరు వినని వారుండరంటే
అతిశయోక్తికాదు. ఆయన చేసిన సాహితీసేవ
ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ వారు చేసిన
సేవను మన ఆంధ్రభాషకేకాక ఇతరాలకు కూడ
ఎంత చేశారో చెప్పే వ్యాసం ఇది వీక్షించండి-

పరిచయం
శ్రీకృష్ణదేవరాయలకు మూరురాయర గండ (ముగ్గురు రాజుల అధిపతి – గజపతి, అశ్వపతి, నరపతి), సాహితీ సమరాంగణ సార్వభౌముడు, కన్నడరాజ్యరమారమణ, ఆంధ్రభోజ అనే బిరుదులున్నాయి. దక్షిణ భారతదేశంలో ఇతని రాజ్యపరిపాలనాకాలం ఒక స్వర్ణయుగము అని చెప్పవచ్చును. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశం ఇతని రాజ్యములో ఆంధ్రేతర భాషల కవిత్వవికాసాన్ని పరిశీలించడం. ఇక్కడ రాయలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పరిచయం ఉన్న కవులను గురించి మాత్రమే ప్రస్తావిస్తాను. అతని సామంతరాజుల రాజ్యాలలో ఉండే కవులు, పండితులు, వారి గ్రంథాలను పరామర్శించడం ఈ వ్యాసపరిధిని మించిన విషయం.

రాయలు విజయనగరాన్ని పరిపాలించిన వంశాలలో మూడవదైన తుళువంశానికి చెందినవాడు. ఇతని మాతృభాష తుళు. ఈ భాషను నేటికీ కర్ణాటక రాష్ట్రంలో మంగళూరు ప్రాంత ప్రజలు వాడతారు. కన్నడ భాష తెలిసిన రాయలకి సంస్కృత తెలుగు భాషలలో కవిత్వం వ్రాసేటంత శిక్షణ ఉన్నది. రాయలు సంస్కృత కవితాసాగరాన్ని మథించిన అపరవిష్ణువు. అందుకేనేమో ఆముక్తమాల్యద ప్రతి ఆశ్వాసాంతంలో మిగిలిన కవులలా ఒక గద్యం వ్రాయక ఇది నేను వ్రాసిన ఆశ్వాసమని ఒక మత్తేభవిక్రీడితంలో చెప్పుకొంటాడు. ఆముక్తమాల్యద పీఠికలో, శ్రీకాకుళ మహా విష్ణువు కలలో కనిపించి రాయలిని ఆంధ్రభాషలో కావ్యము రచింపమని అడిగినాడని చెప్పే సందర్భంలో, అతని ఇతర కావ్యాల గురించిన ప్రస్తావన ఇలా ఉన్నది –

సీ. పలికి తుత్ప్రేక్షోపమల జాతి పెంపెక్క
        రసికు లౌనన మదాలసచరిత్ర
     భావధ్వనివ్యంగ్య సేవధి గాఁగఁ జె-
        ప్పితివి సత్యావధూప్రీణనంబు
     శ్రుతి పురాణోపసంహిత లేర్చి కూర్చితి
        సకలకథాసారసంగ్రహంబు
     శ్రోత్రఘచ్ఛటలు విచ్చుగ రచించితి సూక్తి-
        నైపుణి జ్ఞానచింతామణికృతి

తే. మఱియు రసమంజరీముఖ్య మధురకావ్య
     రచన మెప్పించికొంటి గీర్వాణభాష
     నంధ్రభాష యసాధ్యంబె యందు నొక్క
     కృతి వినిర్మింపు మిఁక మాకు బ్రియముఁ గాఁగ

(ఉత్ప్రేక్ష, ఉపమ, స్వభావోక్తి మొదలైన అలంకారాలతో రసికులు ఔనని తల ఊపే విధముగా మదాలసచరిత్రను వ్రాసినావు; భావమునకు, ధ్వనులకు, వ్యంగ్యానికి నిధివలె ఉండే సత్యావధూప్రీణనము అనే కావ్యాన్ని వ్రాసినావు; వేదాలు, పురాణాలు, సంహితలు వీటిని పరిశోధించి సకలకథాసార సంగ్రహమును సంకలన పరిచినావు; విన్నవారి పాపములు పటాపంచలు అయ్యేట్లు మాటల చమత్కారముతో జ్ఞానచింతామణిని వ్రాసినావు; తరువాత రసమంజరిలాటి మధుర కావ్యాలను సంస్కృత భాషలో వ్రాసినావు; అట్టి నీకు ఆంధ్రభాషలో కృతిని వ్రాయడము కష్టమా, మేము ఉప్పొంగిపోవునట్లుగా కృతిని వ్రాయుము.)

రాయల సంస్కృత కావ్యములు
రసమంజరీకావ్యము: రసమంజరీకావ్యము అలబ్ధము. కాని ఈ పద్యము అందులోనిదని నానుడి –

ఉడురాజముఖీ మృగరాజకటి
ర్గజరాజగతిః కుచభారనతా
యది సా రమణీ హృదయే రమతే
క్వ జపః క్వ తపః క్వ సమాధిరతిః

(చంద్రునిలాటి అందమైన ముఖము గలది, సింహములాటి సన్నని నడుము గలది, ఏనుగులాటి మందమైన గమనము గలది, స్తనభారముచేత వంగినది, అట్టి ఆ సుందరి హృదయములో ఆసనము వేసికొని ఉన్నప్పుడు జపమెందుకు, తపమెందుకు, సమాధి ఎందుకు?)

జాంబవతీకల్యాణం: శ్రీకృష్ణదేవరాయలు వ్రాసిన సంస్కృత కావ్యాలు అన్నీ ఇప్పుడు దొరకకపోయినా జాంబవతీ కల్యాణము (పరిణయము), సకలకథాసారసంగ్రహము మనకు అందుబాటులో ఉన్నాయి. జాంబవతీ కల్యాణము వసంతోత్సవ సమయములో ప్రదర్శించబడిన నాటకము అని పేర్కొనబడినది. నాటకాంతములో “సమాప్తమిదం రాజాధిరాజ రాజపరమేశ్వర సకలకలాభోజ రాజవిభవ మూరురాయరగండ శ్రీమత్కృష్ణరాయ మహారాయ విరచితం జాంబవతీకల్యాణం నామ నాటకం” అని ఉండడంవల్ల ఈ నాటకకర్త రాయలు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇందులోని అసంపూర్ణమైన మొదటి పద్యాన్ని, చివరి పద్యాన్ని ఇక్కడ మీకు తెలియబరుస్తున్నాను –

…. శ్రీకృష్ణరాయః కవిః
సూక్తిః కర్ణరసాయనం సుమనసాం శ్లాఘ్యస్వభావా సభా
చారిత్రం యదువంశశేఖరమణేః దేవస్య సర్వోత్తమః
పారంపర్యకృతశ్రమాః పునరపీ నాట్యేనపారా వయం

(దీనికి శ్రీకృష్ణరాయలు కవి. చెవుల కింపైన మాటలతో మనోజ్ఞమైనది, పొగడబడే స్వభావములు గలది. సర్వోత్తముడైన కృష్ణుని కథ యిది. ఈ అపారమైన నాటకాన్ని పూర్వజన్మ సుకృతముచే మళ్లీ వ్రాస్తున్నాను.)

ధర్మం పాదచతుష్టయేన కృతవత్ స్థైర్యం సమాలంబతాం
చాతుర్వర్ణ్యముపైతు కర్మ సతతం స్వస్వాధికారోచితం
శేషక్ష్మాధరనాయకస్య కృపయా సప్తార్ణవీమధ్యగా
రక్షన్గామిహ కృష్ణరాయనృపతిర్జీయాత్సహస్రం సమాః

(స్థిరత్వము ఊతగా ఉండగా ధర్మము నాలుగు పాదాలతో నడుస్తుంది, నాలుగు వర్ణాలవారు వారి వారి ఉచిత కర్మలు తప్పక చేసికొంటూ ఉంటారు, దైవ కృపవలన సప్త సముద్రాల మధ్య ఉండే దేశమును శ్రీకృష్ణరాయ నృపతి వేయేళ్లు జీవించి రక్షించుగాక.)

సకలకథాసంగ్రహసారము: ఆముక్తమాల్యదలో పేర్కొన్న సకలకథాసంగ్రహసారము అనే కావ్యాన్ని తన గురువైన వ్యాసతీర్థుల ప్రేరణచే వ్రాసినానని రాయలు చెప్పుకొన్నాడు. ఈ కావ్యం నుంచి వేటూరి ప్రభాకర శాస్త్రిగారు భారతిలో ప్రచురించిన ఒక పద్యము –

ఉత్సాహం మమ వీక్ష్య మద్గురు రథ శ్రీవ్యాసతీర్థో మునిః
పర్యాలోచ్య పురాణశాస్త్ర వివిధామ్నాయేతిహాసాదికాన్
లబ్ధాస్తత్ర కథాహరేః పశుపతేస్సామ్యం నిరూప్యాధికం
విష్ణుం కీర్తయ సర్వధేత్యుపదిశన్ మహ్యం ముదా దత్తవాన్

(మా గురువుగారైన వ్యాసతీర్థులు నన్ను ఆసక్తితో చూసి ఇలా అన్నారు – పురాణాలను, శాస్త్రాలను, వేదాలను, ఇతిహాసాలను క్షుణ్ణముగా చదివి అందులోని హరి హరుల కథలను చెప్పుము. విష్ణువును నీవలా కీర్తిస్తే మాకు సంతోషము కలిగించినవాడు అవుతావు.)

తుక్కా పంచకము: రాయలను గురించి, ఆ నాటి కవిత్వమును గురించి చెప్పేటప్పుడు తుక్కాదేవి ఉదంతాన్ని మర్చిపోకూడదు. కళింగరాజ్యాన్ని జయించిన పిదప గజపతి కుమార్తెను రాయలు పెళ్లాడుతాడు. ఆమె పేరు సుభద్ర; ఆమెకే తుక్కా అని మరో పేరు కూడ ఉన్నదని వాడుక. కొందరు తుక్కాదేవియే చిన్నాదేవి అని అంటారు. ఈ వివాహము ఓఢ్రరాజుకు రుచించలేదు. ఆమెకు బదులుగా ఆమెనే బోలిన ఆమె అన్నను ఆడ వేషములో పడకటింటికి పంపుతాడు. అప్పుడు ఆమె ఈ పద్యాన్ని వ్రాసి రాయల విడిదికి హెచ్చరికగా పంపుతుంది.

పడకటింటను నో ప్రభూ, పాన్పు వెలితి
పేరటాండ్రు నారులు గారు, వీరకులము
తొందరించిన పనులెల్ల తోవ చెడును
సావధానత నే హాని జరుగబోదు

దానిని చదివిన మహామంత్రి తిమ్మరసు తగిన సన్నాహాలను చేస్తాడు. రాత్రి రాయలు పడకగదికి వెళ్లి మంచమును తట్టగా అది కూలిపోతుంది. వెంటనే ఒక చిన్న యుద్ధమే జరుగుతుంది. ఇటువంటివారితో పొత్తు కుదరదని రాయలు తుక్కాదేవిని తిరిగి పుట్టింటికి పంపుతాడు. కాని ఆమె చెలికత్తెతో ఖమ్మం దగ్గర వాసము ఏర్పరచుకొని, అక్కడ ఒక పెద్ద చెరువు త్రవ్వించి దానధర్మాదులు చేస్తూ, రాయల అనుగ్రహానికి ఎదురుచూస్తూ తుక్కాపంచకము లేక భృంగపంచకము అనే ఐదు పద్యాలను సంస్కృతంలో వ్రాస్తుంది. (మానవల్లి రామకృష్ణకవి ఈ ఉపాఖ్యానము ఒక కట్టు కథ అని అభిప్రాయపడినారు). తుక్కా పంచకములో మొదటి పద్యము –

భ్రమన్వనాంతే నవమంజరీషు
న షట్పదో గంధఫలీ మజిఘ్రత్
సా కిం న రమ్యా స చ కిం న రంతా
బలీయసీ కేవల మీశ్వరేచ్ఛా

క్రొత్త క్రొత్తగ వనిలోన జిత్త మలర
బ్రోవులై పూచె జెలువంపు పూవు లెన్నొ
షట్పద మ్మేల నొల్లదు సంపెగలను
షట్పదికి లేదొ రసికత సరసతయును
గాదొ సంపెగ సుందర గంధవతియు
దైవలీలయె సర్వము దరచి చూడ
ఇతరుల సంస్కృత కావ్యములు
మాలలోని దారానికి పూల సుగంధం అబ్బినట్లు కృష్ణరాయలతో పరిచయము ఉన్నవారికి కూడ కవిత్వం ప్రాప్తించిందేమో? ఏది ఏమైనా మహామంత్రి తిమ్మరసు కూడ కవియే. అగస్త్యుడు వ్రాసిన చంపూభారతానికి తిమ్మరసు వ్యాఖ్యను వ్రాసినాడు. ఆ కావ్యములో ఆశ్వాసాంత గద్యము ఇలాగుంటుంది – ఇతి శ్రీమద్రాజాధిరాజ రాజపరమేశ్వర కర్ణాటేశ్వర శ్రీకృష్ణరాయ శిరఃప్రధాన సకలాగమ పారావారపారీణ సాళ్వతిమ్మయదండనాథ విరచితాయాం బాలభారత వ్యాఖ్యాయాం మనోహరాఖ్యాయాం పంచమ సర్గః.

తిమ్మరసు సహోదరి కృష్ణాంబికకు ముగ్గురు కొడుకులు కోన మంత్రి, అప్ప మంత్రి, గోప మంత్రి. అప్ప మంత్రి తిమ్మరసు అల్లుడు కూడ. ఈ అప్పమంత్రికి అంకిత మివ్వబడిన కావ్యమే మాదయ్యగారి మల్లన రచించిన రాజశేఖరచరిత్రము. నాదిండ్ల గోప మంత్రి కొండవీటికి అధికారిగా ఉన్నాడట. ఇతడు తెలుగులో కృష్ణార్జున సంవాదము అనే ద్విపద కావ్యాన్ని, సంస్కృతములో కృష్ణమిశ్రుని ప్రబోధచంద్రోద్య కావ్యానికి ఒక వ్యాఖ్యను వ్రాసినాడు.

యః కొండవీడునగరీం వినికొండముఖ్యైః
దుర్గైత్సమం సమధిగమ్య మహామహిమ్నా
ప్రాదాన్ముదా సకల భూసురపుంగవేభ్యః
శ్రీరామచంద్రపురముఖ్య మహాగ్రహారాన్

సోऽయం ప్రధానోత్తమమౌలిరత్నం
నాదిండ్లగోపప్రభురాత్మవేత్తా
ప్రబోధచంద్రోదయ నాటకస్య
టీకాం హితార్థే వ్యతనోద్బుధానాం

(కొండవీడు, వినుకొండ మొదలగు దుర్గాలకు అధిపతిగా బ్రాహ్మణులకు సంతోషము కలుగజేస్తూ రామచంద్రపురాది అగ్రహారాలలో ముఖ్యమైన అమాత్యుడిని నాదిండ్ల గోపమంత్రిని ప్రబోధచంద్రోదయ నాటకానికి టీకను వ్రాస్తున్నాను.)

లొల్లా లక్ష్మీధరుడు: ఈ మహాపండితుడు ఓఢ్ర ప్రభువుకు ఆపాదించబడిన సరస్వతీవిలాసము అనే న్యాయశాస్త్ర గ్రంథానికి నిజమైన రచయిత. ఇతని శిష్యుడైన దేసయామాత్యుడు గోపమంత్రికి అనుచరుడు. ఇతడు పంచిక అనే మహిమ్నాస్తవముపై వ్యాఖ్యను లక్ష్మీధరునికి అంకితము చేశాడు.

వల్లభాచార్యులు: కృష్ణాగోదావరి నదుల మధ్య ఉన్న కాకరవాడులో వల్లభాచార్యుల పూర్వీకులు నివసించారు. వల్లభాచార్యుల తండ్రి కాశీలో స్థిరపడి తీర్థయాత్రలు చేస్తూ తిరుపతిలో మరణించారు. వల్లభాచార్యులు మిగిలిన కుటుంబ సభ్యులను విజయనగరములో మేనమామ దగ్గర వదలిపెట్టి తాను తీర్థయాత్రలు చేస్తూ, దక్షిణ దిగ్విజయ యాత్రలో శ్రీకృష్ణదేవరాయల కొలువులో మతసంబంధమైన చర్చలో విజయాన్ని సాధించాడు. అద్వైత, విశిష్ఠాద్వైత, ద్వైత మతావలంబులు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రము, భగవద్గీతలనుండి తమ సిద్ధాంతాలను గ్రహించగా ఇతడు భాగవతపురాణమునుండి కూడ గ్రహించాడు. మురళీధరదాసుడు రచించిన వల్లభాచార్యుల జీవితచరిత్రలో వీటిని గురించిన వివరాలు ఉన్నాయి. వల్లభాచార్యుల దర్శనము చింతలపూడి ఎల్లనార్యునికి రాధామాధవ కావ్య రచనకు ప్రోత్సాహాన్ని ఇచ్చిందేమో? వల్లభాచార్యుని మధురాష్టకము (అధరం మధురం) కృష్ణ స్తోత్రాలలో మధురతరమైనది. అతడు వ్రాసిన కృష్ణప్రేమమయీ రాధా అనే అష్టకము కూడ చాల అందమైనది, భావభరితమైనది. అందులోనుండి ఒక చరణము –

కృష్ణగేహే స్థితాం రాధా
రాధాగేహే స్థితో హరిః
జీవనేన ధనైర్నిత్యం
రాధాకృష్ణ గతిర్మమ

(కృష్ణుని ఇంటిలో (మనసులో) రాధ ఉంటుంది, రాధ ఇంటిలో (మనసులో) కృష్ణుడు ఉంటాడు, అదే జీవనములోని నిత్య సంపద, రాధాకృష్ణులే నాకు దిక్కు.)

వ్యాసతీర్థులు: తత్త్వవాదమని చెప్పబడే ద్వైత సాంప్రదాయ పద్ధతిని ఉద్ఘటించినవారు ముగ్గురు – ద్వైతమత స్థాపకుడైన ఆనందతీర్థులు, ఆనందతీర్థుల అనేక కృతులకు టీకలు వ్రాసి టీకాచార్యులు అని పిలువబడే జయతీర్థులు, తరువాత వ్యాసతీర్థులు. వీరిని ఆచార్యత్రయము అంటారు. వ్యాసతీర్థులు వ్రాసిన గ్రంథములలో ముఖ్యమైనవి న్యాయామృత, తాత్పర్యచంద్రిక, తర్కతాండవ. వీటిని వ్యాసత్రయము అంటారు. వ్యాసతీర్థులు శ్రీకృష్ణదేవరాయలకు ఆస్థాన గురువు. కృష్ణ రాయలకు ఇతనిపై శ్రద్ధాభక్తులు ఎక్కువ. 1521లో దుష్టగ్రహ కూటమివల్ల రాజ్యము కోల్పోయే అవకాశము రాయల జాతకములో ఉన్నదని అందరు ఆందోళన పడినారని (దీనినే కుహూ యోగము అంటారు), ఆ సమయములో (8 జనవరి 1521) వ్యాసతీర్థులు విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించి తాను కప్పుకొన్న కాషాయ వస్త్రముతో కృష్ణరాయలకు కలగబోయే అపాయాన్ని వారించినాడనీ ఒక ప్రస్తావన ఉంది. ఈ వ్యాసతీర్థుని ప్రోద్బలము, ఆశీస్సులతో వ్రాసిన కావ్యమే రాయల సకలకథాసంగ్రహము. ఇతరులను ఖండించేటప్పుడు వ్యాసతీర్థులు సహజంగా, వైషమ్యాలు లేకుండా తర్కించేవాడు. రాజగురువుగా అన్యమతాలను, సిద్ధాంతాలను ఎంతో ఆదరించాడు. గురువులా రాజు, రాజులా గురువు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ద్వైతసారాన్ని ఒకే పద్యములో వ్యాసతీర్థుడిలా వివరిస్తాడు –

శ్రీమన్మధ్వమతే హరిః పరతరః సత్యం జగత్ తత్త్వతో
భేదో జీవగణా హరేరనుచరాః నీచోచ్ఛభావం గతాః
ముక్తిర్నైజసుఖానుభూతిరమలా భక్తిశ్చ తత్సాధనం
హ్యక్షాదిత్రయం ప్రమాణమఖిలామ్నాయైకవేద్యో హరిః

(శ్రీమన్మధ్వ సిద్ధాంతములో శ్రీహరి సర్వోత్తముడు, ప్రమాణప్రమితమైన ఈ జగత్తు సత్యము, జీవగణములో భేదములు ఉన్నవి, అందరు హరికి అనుచరులు, వారందరికి తరతమ భేదములు గలవు, ఆనందానుభవమే ముక్తి, విష్ణుభక్తి ఆ ముక్తికి సాధనము, ప్రమాణములు మూడే, శ్రీహరియే అఖిల సదాగమములనుండి తాత్పర్యపూర్వకమైన ప్రతిపాద్యుడు.)

కన్నడ కావ్య సాహిత్యములు
దాసకూటము: వ్యాసతీర్థులు చేసిన మరొక ఘనకార్యం కొన్ని శతాబ్దాలుగా నిలిచి ఉన్నది. అదే దాసకూటము. పామరులకు వారి భాషలోనే పదాలను అల్లడానికి వ్యాసతీర్థుడు బృహత్ప్రయత్నము చేసాడు. ఇతని శిష్యులయిన పురందరదాసు, కనకదాసులలో కనకదాసు బ్రాహ్మణుడు కాదు. ఆ కాలములో బ్రాహ్మణేతరుని ఒక మతాచార్యుడు శిష్యునిగా స్వీకరించి ఆదరించి ప్రోత్సహించడం ఒక గొప్ప విశేషమే. పురందరదాసు వేలాది దేవరనామగళను (దేవుని పేరులతో కీర్తనలు) వ్రాసి పండిత పామరులను రంజిల్ల జేయడం మాత్రమే కాక, మనకు తెలిసిన కర్ణాటక సంగీత సాధనకు సోపానాలను నిర్మించినవాడు. నేడు సంగీత శిక్షణారంభములో అందరు నేర్చుకొనే మాయామాళవగౌళ రాగము పురందరదాసు ప్రతిపాదించినదే. అందరికీ తెలిసిన అతని భాగ్యద లక్ష్మీ బారమ్మా అనే కీర్తన, అలాగే శ్రీగణనాథ వంటి పిళ్ళారి గీతాలు కూడ ఈయనవే.

కనకదాసు: ఇతను కూడ గొప్ప వాగ్గేయకారుడు. పూర్వజీవితములో యుద్ధం చేసిన వీరుడు.

బాగిలను తెగెదు సేవెయను – పి. బి. శ్రీనివాస్

ఒకప్పుడు పెద్ద దెబ్బ తగిలి చావు నుండి తప్పించుకొన్న తరువాత హరిదాసై శేషజీవితాన్ని సంగీతసాహిత్యాలకు అంకితం చేసాడు. ఇప్పటికీ ఉడుపిలో ఉన్న కనకన కిటికీ అని ఒక గవాక్షం గుండా ఇతడు శ్రీకృష్ణుని దర్శనం చేసుకొనేవాడట. కాగినెలె (ఒక ఊరి పేరు) ఆదికేశవ అనేది ఇతని ముద్ర. ఇతని బాగిలను తెగెదు సేవెయను కొడు హరియే అనే పాట బాగా ప్రసిద్ధి చెందినది.

కనకదాసు దేవరనామగళను మాత్రమే కాక నళ చరిత్రె, మోహన తరంగిణి కావ్యాలను కూడ వ్రాసినాడు. మోహనతరంగిణి నుండి ఒక రెండు పద్యాలు ఇక్కడ ఉదహరిస్తాను. ఇవి సాంగత్య ఛందస్సులో ఉన్నాయి (సీసంలో చివర ఒక సూర్య గణము తప్పిస్తే సాంగత్యం వస్తుంది).

ఆ పర్వతద దక్షిణభాగదొళు జంబూ-
ద్వీపద మధ్యదొళిర్దు
సోపస్కరవెత్త నిఖిల దేశంగళ స్వ-
రూపవనే వణ్ణిసువెను

మాళవ మగధ కాశ్మీర గుజ్జర గౌళ
చోళ కోసల దేశ బోట-
లాళ కన్నడ వంగ చౌట హొయ్సళ మలె-
యాళ దేశంగళొప్పిదువు

ఇంతివు మొదలాద బహు దేశదల్లి శ్రీ-
కాంతంగె తవరూరెనిసి
సంతసవడెదు సౌరాష్ట్ర సకల ది-
గంతక్కె సత్కీర్తి వడెదు

(మేరుపర్వత దక్షిణ దిశలో ఉన్న జంబూద్వీప మధ్య భాగములో ఉన్న వివిధ దేశాలను మీకు చెబుతున్నాను. మాళవాది దేశాలనుండి మలయాళ దేశమువరకు ఉన్నాయి. ఈ దేశాలన్నిటిలో శ్రీకృష్ణుడు ఉండే సౌరాష్ట్ర దేశము దిగంతాలలో కీర్తిని పొందింది.)

ఈ ఇద్దరు గొప్ప హరిదాసులకు గురువైన వ్యాసతీర్థులు కూడ గొప్ప వాగ్గేయకారుడే. అతని కృష్ణా నీ బేగనె బారోఅనే పాట అత్యంత మధురమే.

వాదిరాజు: దాసకూటము లానే ఆ కాలంలో వ్యాసకూటము అని ఉండేది. వ్యాసతీర్థులకు సమకాలీనులయిన వాదిరాజయతి వ్యాసతీర్థులను తమ గురువుగా భావించాడు. అద్వైతమతావలంబులలో శంకరుడు, విశిష్ఠాద్వైతములో వేదాంతదేశికన్, ద్వైతములో వాదిరాజయతి మతప్రచారకులు మాత్రమే కాదు, గొప్ప కవులు కూడ. వాదిరాజయతి వంద సంవత్సరాలకు పైనే జీవించాడు. ఉడుపిలోని అష్ట మఠములు రెండు సంవత్సరాలకు ఒక మారు శ్రీకృష్ణుని పూజ చేస్తారు. ఈ నియమాన్ని ప్రతిపాదించినది వాదిరాజతీర్థులే. ఒకప్పుడు రాయల కోశాగారం కొద్దిగా సన్నగిల్లిందట. దానినెలా నింపాలనే ఆలోచనలో రాయలు సతమతమవుతుండగా, ఆ సమయంలో వాదిరాజతీర్థులు విజయనగరానికి వచ్చాడట. రాయలు అతడిని ఆహ్వానించి తన చింతను తెలిపాడట. ఒక నాడు వాదిరాజు రాయలను వాలీసుగ్రీవుల గుహగా పేరుపడ్డ ఒక గుహకు తీసికొని వెళ్లాడట. అక్కడ ఉండే ఒక రాతిపైన తన కమండలమునుండి నీళ్ళు చల్లగా అది విరిగి అందులో ఒక పెద్ద భోషాణము బయటపడిందనీ, దాని నిండా బంగారం, రత్నాలు, ఆభరణాలు ఉన్నాయనీ, రాజు యతికి వాటిని ప్రసాదించగా వాదిరాజు నాకు ఇవి అక్కరలేదని వాలి పూజించిన విష్ణు విగ్రహాన్ని, సుగ్రీవుడు పూజించిన రాములవారి విగ్రహాన్ని మాత్రం తీసికొన్నాడనీ కథనం. ఆ తరువాత రాయలు ఉడుపికి వెళ్లి అక్కడి ఆలయాల పునరుద్ధరణకు సహాయపడ్డాడు.

వాదిరాజయతి వ్రాసిన స్తోత్రాలు ఈనాటికీ భక్తులు చదువుతున్నారు. ద్వైత సాంప్రదాయములో ఇతని స్తోత్రాలు లెక్కకు లేనన్ని ఉన్నాయి. ఇతడు కూడ కన్నడములో ఎన్నో పాటలు వ్రాసాడు. ఇతని లక్ష్మీ శోభానె నేడు కూడ శుక్రవారమునాడు కర్ణాటకరాజ్యములో ఇంటింటా వినబడుతుంది.

ఇతడు అశ్వధాటి వృత్తంలో వ్రాసిన దశావతారస్తుతి అత్యుత్తమమైనది. సంస్కృత వాఙ్మయంలో దేవీ అశ్వధాటి (కాళిదాసో లేక శంకరులో వ్రాసినది), వాదిరాజుల దశావతారస్తుతి, పళ్ళె పూర్ణప్రజ్ఞాచార్యులు వ్రాసిన రామాష్టకము మాత్రమే ఈ వృత్తంలో దొరుకుతున్నాయి. అదే విధంగా మాఘుని శిశుపాలవధకు పోటీగా వ్రాసిన రుక్మిణీశవిజయ కావ్యం కూడా చక్కనిది. రుక్మిణీశవిజయమునుండి ఒక పద్యము –

హారాధార-మనోహరోరసి లసన్నారీ-కరాంభోరుహం
తారాధీశముఖం విహర-సరసోదార-స్ఫురద్వీక్షణం
స్మేరం చారు-పరార్ఘ్య-భూషణ-ధరం కారుణ్య-వారాంనిధిం
కారాగారమిదం విహాయ భజ తం ధారాధర-శ్యామలం

– వాదిరాజయతి, రుక్మిణీశవిజయము, 9.21

(హారాలచే శోభిల్లు మనోహరమైన వక్షఃస్థలము గలవాడు, అందమైన యువతుల కరకమలములచే ప్రకాశించువాడు, చంద్రముఖుడు, క్రీడలచే అలరారు మంచి చూపులు గలవాడు, సుందరమైన ఆభరణాలను ధరించినవాడు, దయాసాగరుడు, నీలమేఘశ్యాముడు ఐన ఆ కృష్ణుని ఈ కారాగారమువంటి దేహమును మరచి భజించుమా!)

ఈ మధ్యగా శ్రీకృష్ణదేవరాయల రాజ్యాభిషేక మహోత్సవాలు జరిగినప్పుడు కొందరు రాయల బిరుదు కన్నడరాజ్యరమారమణుడైనా అతడు కన్నడ సాహిత్యాన్ని ఎక్కువగా ఆదరించక తెలుగు కవులను సన్మానించాడని నిందించారు. కన్నడ సాహిత్యం తెలుగు సాహిత్యంకన్నా పాతది. నృపతుంగుని కవిరాజమార్గము నన్నయ భారతం కన్నా సుమారు వంద సంవత్సారాలకు ముందే వ్రాయబడినది. అదే విధంగా కన్నడంలోని నాగవర్మ ఛందోంబుధి కూడా. ఇంతకు ముందే కన్నడంలో హరిదాసుల భక్తి గీతాలను గురించి ముచ్చటించాను. ఇప్పుడు రాయల ఆస్థానంలోని ముగ్గురు కన్నడ కవులను పరిచయం చేస్తాను.

తిమ్మణ్ణ: మొట్టమొదట పంపకవి కన్నడములో భారతమును విక్రమార్జునీయము అనే పేరుతో వ్రాసాడు. ఇది జైన పద్ధతులను అనుసరించి వ్రాయబడినది. ఆ తరువాత గదుగిన వీర నారాణప్ప అనే కవి కుమారవ్యాసుడు అనే పేర భారతాన్ని అందరు చక్కగా పాడుకోడానికి అనువుగా ఉండే భామినీషట్పది ఛందస్సులో రచించాడు. ఈ భామినీషట్పదికి ఆరు పాదాలు. మొదటి మూడు పాదాలవలె చివరి మూడు పాదాలు. మొదటి రెండు పాదాలలో (3, 4, 3, 4) మాత్రలు. మూడవ పాదములో (3, 4, 3, 4, 3, 4, 2) మాత్రలు. కాని కుమారవ్యాస భారతాన్ని పది పర్వములు వ్రాసి అది పూర్తికాకముందే చనిపోయాడు.

కుమారవ్యాసుడు మిగిల్చిన ఆ శేష భారతమును ముగించమని రాయలు కర్ణాటక కవిసార్వభౌమ తిమ్మణార్యుని ప్రార్థించాడు. ఆవిధంగా అతడు మిగిలిన ఎనిమిది పర్వాలను వ్రాసి ముగించాడు. ఈ భారతానికి కృష్ణరాజ భారతము అని పేరు. ఇతడు భారత రచనలో తిక్కనసోమయాజిని అనుకరించాడని చెబుతారు. అతడు కృష్ణరాయని పొగడుతూ శాంతిపర్వారంభములో వ్రాసిన ఒక పద్యము –

వర రజత హిమగిరిగళను మొద-
లెరడ నా నిర్మిసిదెనివు బే-
రెరడు జనిసివెయందు వాణీ స్తనగళను నోడి
ఇరదె నలివ విరించ నీయలి
కరుణదలి దీర్ఘాయువను వర
నరస నరపాలక కుమారక కృష్ణరాయనిగె

వర రజత హిమగిరుల రెంటిని
వఱల నే నిర్మించితిని మఱి
గిరులు రెండెటులొ యని వాణీ స్తనములను జూచి
హరుస మొందెడు బ్రహ్మ యొసగును
కరుణతో దీర్ఘాయువును వర
నరస భూపతి తనయు డగు శ్రీకృష్ణరాయనికి

మల్లణార్య: రాయల ఆస్థానములో ఉన్న మరొక కన్నడ కవి గుబ్బి మల్లణార్యుడు. ఇతడు ఒక శివకవి. భావచింతారత్న, వీరశైవామృతపురాణ అనే కావ్యాలను రచించాడు. భావచింతారత్నమునకు సత్యేంద్రచోళుని కథ అని కూడా పేరు. ఇతడు ఈ కావ్యాన్ని వార్ధకషట్పది ఛందస్సులో వ్రాసాడు. వార్ధకషట్పదికి మొదటి రెండు పాదాలలో నాలుగు పంచమాత్రలు, మూడవ పాదములో ఆరు పంచమాత్రలు. అందులోని పద్యము ఒకటి –

త్రిణయణుగం తిరుజ్ఞాని సంబంధీశ
నణియరది జినమతవిదారణగైదు ధా-
రిణియల్లి తిరుపాట పదినారు సావిరనొరెయుత కులచ్చరియగె
ప్రణవ పంచాక్షరియ మహిమెయ తిళిపె స-
ద్గుణియప్ప సత్యేంద్ర చోళ భూపన కథా
భణితెయం ద్రావిడాదొళోదిదం కన్నడది పేళ్దె నలిసె సుజనరు

(శివజ్ఞాని సంబంధీశుడు జైనమతమును నిర్మూలించి, పదహారువేల శివనామములను కులచ్చయ అనే ఆమెకు చెప్పుతూ పంచాక్షరీమంత్రపు మహిమను వివరించే సందర్భముగా తమిళములో సత్యేంద్రచోళుని కథను చెప్పాడు, దానిని నేను కన్నడములో మళ్లీ చెబుతున్నాను.)

వీరశైవామృతమునుండి స్త్రీలను వర్ణిస్తూ ఒక పద్యము –

ఇవర నుడి యతివరర బాయ హుడి భావిస-
ల్కివర బాహుగళు సజ్జనర బేహుగళు బళి-
కివర చెల్విన తురుబు సుజ్ఞానిగళ సదాచారిగళ మనద బిరుబు
ఇవర నల్పిన దేహ వుత్తమర దాహవిం-
తివర నడెయనఘరసుగళిగివే కడెయెంబ
యువతియరు బందరా దేవదేవేశనం నోడె తమతమగె కూడె

(వారి పలుకులను విన్న యతివరులు నోరు తెరచి చూస్తున్నారు; వారి బాహువులు సజ్జనులను ఆకర్షిస్తున్నాయి; వారి సౌందర్యము జ్ఞానులను, సదాచారులను సవాలు చేస్తున్నయి; వారి కోమల శరీరాలు కామపిపాసను కల్గిస్తున్నాయి; వారి నడకలు చివరి క్షణాలు అన్నట్లు యువతులు వచ్చారు.)

చాటు విట్టలనాథ: శ్రీకృష్ణదేవరాయలు, ఆయన తదుపరి అచ్యుతదేవరాయలు పోషించిన మరొక కన్నడ కవి నిత్యాత్మశుక చాటు విట్ఠలనాథుడు. ఇతడు భాగవతాన్ని భామినీషట్పది ఛందస్సులో వ్రాసినాడు. ఇందులో కొంత భాగము మాత్రమే ఇప్పుడు లభ్యము. అందులోనుండి ఒక రెండు పద్యాలు. ఇవి శ్యమంతకమణి ఉపాఖ్యానములోనిది –

ఇత్త నాతను బళిక తన్నయ
పుత్రియను జాంబవతి యెంబళ
నత్యధిక గుణరూపసంపన్నెయను మణిసహిత
మత్తె బహువిధ వస్తుగళ నొలి-
దిత్తు పూజిసిదను పరాత్పర
వస్తువను వేదాంతవిశ్రుత కీర్తియను నలిదు

గుణము రూపము నందు మించిన
తనయ యగు జాంబవతి కన్నెను
అనఘు కొసగెను ఘనత కెక్కిన మానికముతోడ
మనము నిండగ బ్రీతి వస్తువు
లను త నెన్నియొ పూజ సేయుచు
దనర నిడె వేదాంతవిశ్రుతకీర్తి కలరారి

రత్నవరవను కొండు కన్యా
రత్నసహి తానందదలి గుణ-
రత్నమూరుతి పురకె బిజయంగైయ్యుతిరె
యత్నదలి పురవాసిజన నవ-
రత్నమయ తొడిగెగళ లెసెయలు
నూత్ననవ నెందిదిరుగొండరు వివిత విభవదలి

రత్నమును తా దాల్చి కన్యా
రత్న సహితుడు రమణతో గుణ
రత్నమూర్తియు రాణతో నగరమును జేరెనుగా
రత్నరాశుల ప్రజలు జల్లిరి
నూత్న దంపతు లిఱువురకు స-
ద్యత్నమున నాహ్వానమిచ్చిరి వైభవము మీఱ

తమిళ కవులు: రాయల రాజ్యములో నేటి తమిళనాడు, కేరళ ప్రాంతాలు భాగంగా ఉన్నా, ఆ ప్రాంతాలలోని కవులు ఎక్కువగా రాయల కొలువులో లేరు. హరిదాసర్ అనే ఒక తమిళ కవి రాయల ఆస్థానములో ఉన్నాడు, అతడు ఇరు సమయ విళక్కం (రెండు మతాల – వైష్ణవ, శైవ – వివరణ) అనే ఒక కావ్యాన్ని వ్రాసినాడు. రాయలను గురించిన పద్యమొకటి ఆ కావ్యమునుండి అందజేస్తున్నాను –

కిరిపోల్ విళంగి క్కిళరుం పుయక్కిట్ణరాయన్
తరైమీదు శింగాత్తిరియిల్ శెయత్తంబం నాట్ట
వరం ఆదరవాల్ అళిత్తే వడకూవం మేవుం
కరుమామణివణ్ణనై నీడు కరుత్తిల్ వైప్పోం

(గిరివలె శోభించి చెలరేగే ఉప్పెనలాటి కృష్ణరాయలు సింహాచలములో జయస్తంభాన్ని ప్రతిష్టించగా, దయతో వరములను ప్రసాదించి కాపాడే నీలమేఘశ్యాముని ధ్యానింతము.)

ముగింపు
రాజ్యభారము, యుద్ధాలు వీటితోబాటు ఈ మహారాజుకు కావ్యాలు వ్రాయడానికి, వీణ వాయించడానికి (ఇతనికి వీణ నేర్పిన గురుపరంపరకు చెందినవాడే మంత్రాలయ రాఘవేంద్రస్వామికి వీణ నేర్పిన గురువు) సమయం ఎలా దొరికిందో? రాయలు రాజ్యభారముల ఒత్తిడి లేక, ఒక కవిగా మాత్రమే ఉండి ఉంటే ఎన్నెన్ని గొప్ప రచనలను చేసి ఉండేవాడో అనే విషయం ఊహించవలసిందే. సంగీతములో, సాహిత్యములో, సంగ్రామములో సవ్యసాచియే ఈ సార్వభౌముడు. రాయలకు పృథ్వీవృత్తము (జ-స-జ-స-య-ల-గ, 8,9) అంటే ఇష్టమట. పృథ్వీశ్వరునికి పృథ్వి ప్రియమే గదా! క్రింది పృథ్వీవృత్తముతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.

కవిత్వ జగదీశ్వరా ఘన కవీంద్ర మిత్రాగ్రణీ
సువర్ణయుగ చేతనా సుమధురాంధ్ర వాగీశ్వరా
ప్రవృద్ధధరణీపతీ రమణ తుంగభద్రప్రియా
నవీనరవవాదనా నతుల కృష్ణదేవేశ్వరా
-----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment